Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు

దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో ఏదో ఒక అంశంపై నిరసన ప్రదర్శనలు జరుగుతుంటాయి. అన్నా హజారే నాయకత్వంలో అవినీతి వ్యతిరేకోద్యమం అక్కడే జరిగింది. ఒకే ర్యాంకు, ఒకే పింఛన్‌ కావాలని మాజీ సైనికులు అక్కడే ఉద్యమించారు. నిర్భయ మీద మూకుమ్మడి అత్యాచారం జరిగినప్పుడూ జంతర్‌ మంతర్‌ నిరసనోద్యమ కేంద్రమైంది. గత బుధవారం చాలా విచిత్రంగా జంతర్‌మంతర్‌లో అపూర్వమైన నిరసన వ్యక్తం అయింది. టోక్యో ఒలంపిక్స్‌లో మల్లయుద్ధంలో కాంస్య పతకం సాధించిన బజ్‌రంగ్‌ పునియా, ప్రపంచ చాంపియన్‌షిప్‌ సాధించిన వినేష్‌ ఫొగాట్‌తో పాటు భారత మల్లయుద్ధ సమాఖ్య అధ్యక్షుడికి వ్యతిరేకంగా అనేకమంది మల్లయోధులు, క్రీడాకారిణులు నిరసన ప్రదర్శనకు దిగారు. భారత మల్లయుద్ధ సమాఖ్య అధ్యకుడు బ్రిజ్‌భూషణ్‌ శరన్‌సింగ్‌ తమను లైంగికంగా వేధించినందుకు ఈ మహిళా మల్ల యోధులు నిరసన వ్యక్తం చేయవలసిన దుస్థితిలో పడిపోయారు. ఆ సమాఖ్యలోని అనేకమంది కోచ్‌లు కూడా లైంగికంగా తమను వేధిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 29 మంది కోచ్‌లమీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఇందులో వివిధ క్రీడలకు, రాష్ట్రాలకు చెందిన కోచ్‌లు ఉన్నారు. ఫిర్యాదులు వచ్చినా ఎంతమందికి శిక్షపడిరదో తెలియదు. అంతా రహస్యమే. ఈ క్రమంలో అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ క్రీడాకారుణులూ ఉండొచ్చు. ఆరోపణలు వచ్చినప్పుడు ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలయ్యాయా, ఒకవేళ దాఖలైతే ఎవరినైనా అరెస్టు చేశారా అన్న ప్రశ్నలకూ సమాధానం ఏ దిశనుంచీ వినిపించదు. అరుదుగా అరెస్టులు జరిగితే జరిగి ఉండవచ్చు, కానీ తప్పు చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్న వారికి శిక్షపడ్డ సందర్భాలు ఉదాహరణ ప్రాయంగానైనా కనిపించవు. నిరసన తెలియజేస్తున్నవారి ప్రతినిధులకు, క్రీడాశాఖమంత్రికి మధ్య గురువారం పొద్దుపోయేదాకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ బ్రిజ్‌భూషణ్‌ మాత్రం రాజీనామా చేయలేదు. తాను ఎన్నికై వచ్చినవాడినంటున్నారు. ఆయన మూడోసారి బీజేపీ పార్లమెంటు సభ్యుడు. అందుకని ఆయనను ముట్టుకోవడానికి క్రీడా సంఘాల అధిపతులు, కడకు క్రీడాశాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా జడుస్తారు. పైగా నేను నోరువిప్పితే సునామీ వస్తుందని బ్రిజ్‌ భూషణ్‌ బహిరంగంగానే ప్రకటించారు. అంటే చట్టం లాంటివి అధికారపార్టీకి చెందిన రాజకీయ నాయకులకు వర్తించే పరిస్థితి లేనట్టేకదా! ఒకవేళ ఏవో కొన్ని సందర్భాలలో ఎఫ్‌.ఐ.ఆర్‌.లు దాఖలై విచారణ జరిగినా ఆ మహిళా క్రీడాకారులు తమ అసలు పనివదిలేసి న్యాయస్థానాల మెట్లెక్కి దిగడంతోనే సరిపోతుంది. లైంగికవేధింపులకు గురైన మహిళలు ఎంత ప్రసిద్ధులైనా, ఏదో ఒకరంగంలో నిష్ణాతులైనా తాము వేధింపులకు గురయ్యామని చెప్పడానికి జంకుతారు. ఫిర్యాదుచేస్తే మరోసారి పరువుపోతుందని భయపడతారు. వేధింపులకు గురైన మహిళా క్రీడాకారులు ఇండియన్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆ సంస్థకు అధ్యక్షులు ప్రఖ్యాత క్రీడాకారిణి పి.టి.ఉష అయినా బాధితులకు దక్కిన రక్షణ ఏమీలేదు. దీనిపై ఓ దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేశారు. టోక్యో ఒలంపిక్స్‌లో పతకం చేజారినందువల్ల బ్రిజ్‌ భూషణ్‌ తనను వేదించుకు తిన్నారని వినేశ్‌ ఫోగట్‌ అనే క్రీడాకారిణి ఆరోపించారు. ‘‘నీవు చెల్లని నాణానివి’’ అని బ్రిజ్‌ భూషణ్‌ ఏడిపించుకు తిన్నారు. వినేశ్‌ ఫోగట్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకునేదాకా పరిస్థితి విషమించింది. ఈ ఫిర్యాదుమీద ఫోగట్‌తోపాటు మరో నలుగురు మహిళా క్రీడాకారులు కూడా సంతకాలు చేశారు. బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్‌, రవి దయ్యా, దీపక్‌ పునియా సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. ఈ ఫిర్యాదు తరవాత శుక్రవారం ఇండియన్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం జరిగింది. ఈ ఫిర్యాదులకు ఏ గతి పడుతోందో పరిశీలిస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం అవుతుంది. మహిళా హాండ్‌బాల్‌ క్రీడాకారిణి 2022 మార్చిలో ఆనందీశ్వర్‌ పాండే తనమీద అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. పాండే 2013 నుంచి 2020 దాకా భారత హాండ్‌బాల్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఫిర్యాదుపై ఏ చర్యాలేదు. ఆయన ఇండియన్‌ ఒలంపిక్‌ అసోసియేషన్‌ కోశాధికారిగా కూడా ఉన్నారు. సాధారణంగా లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగాయన్న ఆరోపణలువస్తే వెంటనే ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలుచేస్తారు. నిందితుణ్ని అరెస్టు కూడా చేస్తారు. కానీ మహిళా క్రీడాకారులు ఫిర్యాదుచేస్తే చాలావరకు మధ్యేమార్గం గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప ఆరోపణ తీవ్రత ఆధారంగా భారత శిక్షాస్మృతిని అమలు చేయనేచేయరు. అందుకే బ్రిజ్‌భూషణ్‌ శుక్రవారం సాయంత్రందాకా నేను నిందకు గురై రాజీనామా చేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. మార్చిలో తన పదవీకాలం అయిపోతే అప్పుడు తప్పుకుంటాననీ ఆ తరవాత ఈ పదవికి పోటీపడను అని చెప్తే ఆయన మొండివైఖరిని ప్రశ్నించే సాహసం చేసిన వారేలేరు. క్రీడాకారుల ధర్నాను ఆయన షాహీన్‌బాగ్‌ ధర్నాతో పోల్చారు. జంతర్‌ మంతర్‌లో జరుగుతున్న నిరసన కాంగ్రెస్‌ ప్రోత్సాహంతో బీజేపీ మీద జరుగుతున్న దాడిగా అభివర్ణించి ఈ ఉదంతానికి కావలసినంత రాజకీయ రంగు పులిమారు. 

శుక్రవారం రాత్రి చాలా పొద్దుపోయేదాకా క్రీడాశాఖమంత్రి జరిపిన చర్చల తరవాత బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ను రాజీనామా చేయమని కోరారు. క్రీడాకారుల ఆరోపణపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇవన్నీ వ్యవహారాన్ని సాచి వేయడానికి అనుసరించే విధానాలే. బ్రిజ్‌ భూషణ్‌ రాజీనామా చేసినా బాధితులకు దక్కే న్యాయం శూన్యమే. ఎంత మంది ఫిర్యాదుచేసినా ఇంతవరకు ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్న ఆనవాలే లేదు. చర్య తీసుకోకపోతే మహిళా క్రీడాకారుల నెత్తిమీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. క్రీడారంగంలో ఈ చేదు అనుభవాలు వెన్నాడుతూనే ఉంటాయి. సమాజం వారిని చిన్నచూపే చూస్తుంది. కానీ నిజజీవితంలో రాజకీయ మల్లయోధులను చూస్తే అసలు మల్ల యోధులకు, పతకాలు సాధించిన మల్లయోధులకే ఒణుకు పుడ్తుంది.
క్రీడలతో ఏమాత్రం సంబంధం లేనివారు క్రీడా సంఘాలమీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. దేశ రాజకీయాలలోనే కనికరం తక్కువ. ఎవరినైనా తమ కుటిల రాజకీయాలద్వారా చిత్తుచేసే సామర్థ్యం మన రాజకీయాలకు ఉంది. సహజంగానే రాజకీయాలలో పురుషాధిక్యత మెండు. క్రీడారాజకీయాలలో కూడా ఈ పురుషాధిక్యత మరింత వికృతంగా, కరకుగా బహిర్గతం అవుతోంది. తమమీద పురుషులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసినా ఎన్నాళ్లకు న్యాయం దక్కుతుందో తెలియదు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి అని ప్రశ్నిస్తే సాక్షాత్తు క్రీడాశాఖమంత్రి నిండు పార్లమెంటులో 49 ఫిర్యాదులు వచ్చాయని సెలవిచ్చారు. వీటిలో 19 ఫిర్యాదులను ఇంకా పరిశీలించనే లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img