హర్యానాలోని నూప్‌ా జిల్లాలో గత అర్థరాత్రి చెలరేగిన మతోన్మాద చర్యలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్తు చేపట్టిన శోభ యాత్ర సమయంలో కలహాలు చెలరేగాయి. ఈ కలహాల్ల్లో ఒక మసీదులోని ఇమాం తో సహా నలుగురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు హోం గార్డులున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ శోభా యాత్ర ప్రతి ఏటా జరిగేదే కానీ ఎప్పుడు అతి కలహాలకు దారి తీయలేదు. ఈ ఏడాది అక్కడ పనిగట్టుకుని మతబీజాలు నాటే పని ప్రయత్న పూర్వకంగా జరిగింది. పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి కూడా ఆ ఊరేగింపు కోసం జనాన్ని తరలించారు. అందులో కొంతమంది చేతిలో ఆయుధాలు ఉన్నాయి. నూప్‌ా లో రగుల్కొన్న మత విద్వేషం గురుగ్రాంలోని సెక్టర్ 57 కూడా పాకింది. ఊరేగింపులో పాల్గొన్న వారు కాల్పులు జరిగారు. సాధారణంగా మతకలహాల సమయంలో తుపాకులు వాడడం అరుదు. అక్కడ గుమిగూడిన జనంలోని కొందరు మసీదులోకి కాల్పులు జరిపారు. ఆ తరవాత ఆ మసీదు తగుల బెట్టారు. మసీదు పూర్తిగా ధ్వంసం అయింది. అందులో ఉన్న మత గ్రంథాలు కూడా కాలి బూడిదై పోయాయి. ఈ విధ్వంస కాండలో గాయపడిన దాదాపు 30 మందిలో పదిమంది పోలీసులున్నారు. కనీసం 120 వాహనాలకు నిప్పు పెట్టారు. ఇందులోనూ దాదాపు 50 వాహనాలు పోలీసులవే. నూప్‌ా జిల్లాలో ముస్లింల జనసంఖ్య ఎక్కువ. ఈ వార్త తెలియగానే సోహ్నాలో నాలుగు వాహనాలకు, ఒక దుకాణానికి నిప్పు పెట్టారు. నూప్‌ాలోనూ, ఇతర కీలక ప్రాంతాలలోనూ కర్ఫ్యూ విధించడం, 144వ సెక్షన్ అమలు చేయడం, సాయుధ దళాలను నియోగించడం యాంత్రికంగా జరిగిపోయాయి. ఇలాంటి సంఘటనలు నివరించడానికి హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈ సంఘటన జరిగిన చోట కేవలం లాఠీలు మాత్రమే చేతబూనే అవకాశం ఉన్న హోం గార్డులు మాత్రమే ఉన్నారు. పోలీసుల జాడ లేదు. విశ్వహిందూ పరిషత్ ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేసి అక్కడి పోలీసు సూపరింటెండెంట్ ఆ ప్రాంతం నుంచి వెళ్లి పోయారు. ఆయన ఏం పని మీద వెళ్లినా సంఘటన జరిగిన చోట లేరన్నది వాస్తవం. జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న రైలులో ఒక రైల్వే భద్రతా జవాను నడుస్తున్న రైలులోనే తన పై అధికారిని కాల్చి చంపిన సంఘటనను కూడా దేశంలో అలుముకున్న విద్వేష వాతావరణంతో విడదీసి చూడడానికి వీలులేదు. ఆ జవాను మరో ముగ్గురిని కూడా హతమార్చాడు. ఆ ముగ్గురూ ముస్లింలే కావడం, పై అధికారి గిరిజనుడు కావడం ప్రత్యేకంగా గమనించదగిన అంశాలే.
ఈ సంఘటనల వరస క్రమాన్ని చూస్తే ఎన్నికలు దగ్గర పడ్తున్న కొద్దీ మత కలహాలను రెచ్చగొట్టడం మొదలైందని తేలిపోతోంది. రాజకీయ పరమపద సోపానపటంలో మతవిద్వేషం అన్న పెద్ద నిచ్చెన ఎక్కి బీజేపీకేంద్రంలోనూ, కొన్ని రాష్ట్రాలలోనూ అధికారం సంపాదించిన మాటను కాదనలేం. దేశంలో వాతావరణం విష పూరితం అయినప్పుడు మతం ఆధారంగా రాజకీయాలు నడపడానికి అలవాటు పడ్డవారు కలహాలను రెచ్చగొట్టడంలో ఆశ్చర్యం లేదు. నూప్‌ా జిల్లాలో శోభా యాత్ర సాగుతుండగా ఒక మందిరం దగ్గర కొంతమంది ముస్లిం యువకులు నిలబడి ఉన్నారు. అప్పుడు బిట్టూ బజరంగీ నేను మీ బావను వచ్చాను మర్యాద చేయరా అన్నారు. దీనితో కలహం ప్రారంభమైంది. నూప్‌ా లో కలహం చెలరేగడానికి ముందు దేవాలయంలో అయిదువేల మందిని పోగేశారు. ఆ గ్రామంలో ఊరేగింపు ప్రతి ఏటా జరుగుతుంది. కానీ ఈసారి చాలా భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. ఇది కూడా పనిగట్టుకుని చేసిన పనిలాగే కనిపిస్తోంది. నూప్‌ాలో ఉన్న ముస్లింలకు గుణపాఠం చెప్పాలనుకున్నారు. గుజరాత్‌లో రెండు దశాబ్దాల కింద ఒక వర్గం వారికి గుణపాఠం నేర్పినందువల్ల అక్కడ ఇప్పుడు మతకలహాలు జరగడంలేదని కేంద్ర హోం మంత్రి బాహాటంగానే ప్రకటించారు. ఆ ఒక వర్గం వారెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగతా చోట్ల కూడా ఇదే పని చేసి పబ్బం గడుపుకోవాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్టు స్పష్టం అవుతోంది. మణిపూర్‌లో కూడా క్రైస్తవుల పని పడ్తున్నాం కనక హిందువులు కిమ్మనకుండాఉండాలన్న సందేశం ఇస్తున్నారు. హర్యానాలో డబుల్ ఇంజన్ సర్కారు ఉందని గమనించాలి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అధికారం సంపాదించగలమన్న విశ్వాసం బీజేపీకి ఎటూ లేదు. రాజస్థాన్‌లో గెలవొచ్చునన్న ఆశ బీజేపీలో మిణుకు మిణుకుమంటోంది. రాజస్థాన్ లో చెదురుమదురుగా చిన్న స్థాయిలో మత కలహాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నూప్‌ాకు రాజస్థాన్ నుంచి జనాన్ని తరలించడం కూడా గమనించాల్సిన అంశమే. మోనూ మానేసర్ అనే వ్యక్తి కూడా రూప్‌ా సంఘటనలు రెచ్చగొట్టా రంటున్నారు. ఆయన గోరక్ష దళం ఏర్పాటు చేశారు. ఆయన ఆయుధాలతో ఫొటోలు ప్రచారంలో పెడ్తూ ఉంటాడు. ఈ ఘటన జరగడానికి రెండు రోజుల ముందు నేను వస్తున్నాను సిద్ధంగా ఉండండి అని ఒక వీడియో ప్రచారంలో పెట్టాడు. సంఘటన జరిగిన చోట ముస్లింల జనాభా ఎక్కువ. ఇంతకు ముందు ఎదుర్కొన్న బెదిరింపులు, అనుభవించిన అవమానాలు వారిలో సహజంగానే ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. వారు ప్రతీకారేచ్ఛతో రగిలి పోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా, ట్విట్టర్, అనుకూలమైన పత్రికల ద్వారా, వీడియోల ద్వారా ఉద్వేగాలు రెచ్చగొట్టే పని కొద్ది రోజులుగా కొనసాగుతూనే ఉంది. విద్యావంతుల, వివేకంగల వారు అనుకున్న వారి మెదళ్లలో కూడా విషబీజాలు నాటారు. ఆ విషం తలకెక్కించుకున్న వారు ముస్లిం వ్యతిరేకులుగా మారుతున్నారు. ఉత్తర భారతంలో ముస్లింల మీద, ఈశాన్య భారతంలో క్రైస్తవుల మీద సంఫ్‌ు పరివార్ గురి పెట్టినట్టు అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. నిష్పక్షపాతంగా వ్యవహరించే పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నారు. బదిలీ చేస్తున్నారు. హర్యానా ముఖ్యమంత్రి తన పాలనా కాలంలో చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదు. గురుగావ్ పేరు గురుగ్రాంగా మార్చడం తప్ప. సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించి మతకలహాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం బీజేపీకి అలవాటైన వ్యవహారమే. ఆర్.పి.ఎఫ్. జవాను ప్రవర్తన కూడా మతోన్మాదం రెచ్చగొట్టడంలో ఒక వినూత్న పద్ధతిలా కనిపిస్తోంది. విద్వేష వాతావరణం సృష్టించడానికి దేశమంతా ప్రయత్నం జరుగుతోంది. సఫలం కాని చోట ఏదో ఒక పద్ధతిలో మత విద్వేషం రెచ్చగొడ్తున్నారు. కలహాలను ఆపలేని అదుపు చేయలేని అధికారులను బదిలీ చేయవచ్చు. సస్పెండ్ చేయవచ్చు. కానీ ఈ విద్వేషాన్ని పెంచి పోషించడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వాలకు ఎవరు గుణపాఠం నేర్పాలి. అధికారం ఉన్న ప్రజలు ఆలోచించవలసిన అంశం ఇది.