Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఖడ్గేకు రెండు పరీక్షలు

ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్‌ ఖడ్గే ముందు రెండు ప్రధాన సమస్యలున్నాయి. రాజస్థాన్‌లో సచిన్‌ పైలెట్‌ ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవడానికి మళ్లీ పావులు కదుపుతున్నారు. ‘‘200మంది సభ్యులుగల శాసనసభలో కాంగ్రెస్‌లో ఉన్న 102మందిలో ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయొచ్చు కానీ ద్రోహి, అసమర్థుడు అయిన సచిన్‌ పైలెట్‌ను మాత్రం ముఖ్యమంత్రిని చేయడానికి వీలు లేదు’’ అన్నది రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అభ్యంతరం. గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించిన సమయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం గెహ్లోత్‌ను కాంగ్రెస్‌ అధ్యక్షుడిని చేయాలనుకుంది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొనసాగాలను కున్నారు. జోడు పదవులు నిర్వహించకూడదన్న నియమం ఉంది కనక కాంగ్రెస్‌ అధిష్ఠానం అనుమతించలేదు. గెహ్లోత్‌ అధ్యక్ష స్థానానికి పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. చివరకు మల్లికార్జున్‌ ఖడ్గే పోటీచేసి గెలిచారు. ఖడ్గే తమఅభ్యర్థి అని సోనియాగాంధీ కుటుంబంలో ఎవరూ అనకపోయినా ఖడ్గేకే వారి మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యమే. రాజస్థాన్‌ శాసనసభకు ఎన్నికలు జరగడానికి మరోఏడాది గడువు ఉంది. 2018లో రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌కు అధికారం దక్కడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. అందువల్ల తనకు ముఖ్యమంత్రి స్థానం దక్కాలని ఆశించడంలో ఆశ్చర్యమూ లేదు. తప్పూలేదు. అయితే అధిష్ఠానవర్గం గెహ్లోత్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అప్పటినుంచి సచిన్‌ పైలెట్‌ గుర్రుగానే ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి గెహ్లోత్‌ పోటీ చేస్తారనుకున్నప్పుడు మరో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడానికి అధిష్ఠానం ఇద్దరు ప్రతినిధులను రాజస్థాన్‌కు పంపింది. అందులో ఖడ్గే కూడా ఉన్నారు. కానీ గెహ్లోత్‌ ముఖ్య మంత్రిగా కూడా కొనసాగాలని ఉవ్విళ్లూరారు కనక శాసనసభాపక్ష సమావేశానికి ఆయన వర్గం వారు హాజరు కాలేదు. ఇదంతా గెహ్లోత్‌ ప్రోద్బలంతోనే జరిగిందని చెప్పడానికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. ఇప్పుడు సచిన్‌ పైలెట్‌ మళ్లీ ముఖ్యమంత్రి పదవిమీద ఆశలు పెంచుకున్నారు. ససేమిరా ఆయన ముఖ్యమంత్రి కాకుండా చూడాలన్నది గెహ్లోత్‌ పంతం. అందుకని ఆయన సచిన్‌ పైలెట్‌ మీద తీవ్ర విమర్శలకు దిగారు. పైలెట్‌ ద్రోహి అని, అసమర్థుడని నిందించారు. ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడానికి పైలెట్‌ చాలా కాలం కిందటే ఓ ప్రయత్నం చేశారు. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను గుర్‌గావ్‌ తీసుకెళ్లారు. ఇలా శిబిరాలు నిర్వహించడం ప్రస్తుత రాజకీయాల్లో మామూలే. ఆ ఉదంతాన్ని గెహ్లోత్‌ ఇప్పుడు మళ్లీ లేవనెత్తారు. బీజేపీతో కుమ్మక్కై తిరుగుబాటు చేశారు కనక పైలెట్‌ ద్రోహి అని నిందించారు. పైలెట్‌ తిరుగుబాటు వెనక కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హస్తం ఉందనీ, పైలెట్‌కు అనుకూలురైన ఎమ్మెల్యేలు నెలరోజులకు పైగా గుర్‌గావ్‌లో ఉన్నప్పుడు కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ వారిని తరచుగా కలుసుకునే వారనీ పైలెట్‌తో సహా ఒక్కో ఎమ్మెల్యేకి పది కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్టు తన దగ్గర రుజువులున్నాయని గెహ్లోత్‌ వాదిస్తున్నారు. రుజువులున్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న గెహ్లోత్‌కు ఈ విషయంపై చర్య తీసుకోవడానికి అడ్డంకేమిటో తెలియదు. సచిన్‌ పైలెట్‌ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చో పెడ్తారన్న సమాచారం ఉంది కనకే తన మద్దతుదార్లు కేంద్ర ప్రతినిధులను కలుసుకోలేదని గెహ్లోత్‌ అంటున్నారు. ఆ సమయంలో పైలెట్‌ అనేకమంది ఎమ్మెల్యేలకు ఫోన్‌చేసి కొత్త శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకునే అంశం అధిష్ఠానానికి వదిలేయాలని చెప్పారని కూడా గెహ్లోత్‌ అంటున్నారు. ఇందులో విచిత్రం ఏమీలేదు.
శాసనసభాపక్షం తమ నాయకుడిని ఎన్నుకునే పద్ధతి కాంగ్రెస్‌లో అంతమై దశాబ్దాలు గడుస్తోంది. ఇందిరాగాంధీ హయాంలో అయితే సీల్డ్‌ కవర్లో తమకు ఇష్టుడైన నాయకుడి పేరు పంపేవారు. అధిష్ఠానం ప్రతినిధులు ఆ పేరు ప్రకటించగానే నాయకుడి ఎన్నిక పూర్తి అయిపోయేది. లేకపోతే నాయకత్వానికి పోటీ ఉందనుకున్నప్పుడు శాసనసభాపక్ష నాయకుడిని ఎంపికచేసే బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం ఆమోదించేవారు. ఈ రెండు సందర్భాల లోనూ జరిగేది ఒకటే. అధిష్ఠానం ఇష్టానుసారమే శాసనసభాపక్ష నాయకుడెవరో తేలుతారు. ఈ తతంగం సీనియర్‌ నాయకుడైన గెహ్లోత్‌కు తెలియక కాదు. ఆరునూరైనా సచిన్‌ ముఖ్యమంత్రి కాకూడదన్నది ఆయన పంతం. ఇప్పుడూ అందుకే పైలెట్‌మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు పదిమంది కూడా లేరంటున్నారు. 80శాతం కాంగ్రెస్‌ శాసనసభ్యుల మద్దతు పైలెట్‌కే ఉందని ఆయన మద్దతుదార్లు వాదిస్తున్నారు. శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఎవరికి ఎంత బలం ఉందో తేల్చుకోవచ్చు. కానీ అంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్‌ సంప్రదాయం కాదు. పైలెట్‌ మద్దతు లేకపోతే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో రాజస్థాన్‌లో అధికారం నిలబెట్టుకోవడం సాధ్యంకాదని ఆయన గ్రహించడం లేదనుకోలేం. ఈ సమస్యను పరిష్కరించడం ఖడ్గే నాయకత్వ ప్రతిభకు పెద్ద పరిక్షే.
దీనికి తోడు రెండో సమస్యా ఉంది. సుదీర్ఘకాలం తరవాత అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన వెంటనే సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు శశీ థరూర్‌ పోటీకి సిద్ధమయ్యారు. తాను గెలుస్తానన్న నమ్మకం ఆయనకు లేదు కానీ కాంగ్రెస్‌లో మళ్లీ సంస్థాగతంగా ప్రజాస్వామ్య విధానం వేళ్లూనుకుంటోందని చెప్పుకోవడానికి ఆయన పోటీ వీలుకల్పించింది. ఖడ్గే అధ్యక్షుడైన తరవాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ స్థానంలో సారధ్య సంఘాన్ని నియమించారు. అందులో శశీ థరూర్‌కు స్థానంలేదు. ఇప్పటికీ అధిష్ఠానం థరూర్‌ను పరాయివాడిగానే చూస్తోంది. ఓటమి ఎదురై నప్పటికీ శశీ థరూర్‌ కుంగిపోలేదు. ఇప్పుడు ఆయన దృష్టి కేరళ మీద ఉంది. కేరళలో 2026లో తప్ప శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 2021లో జరిగిన ఎన్నికలలో వామపక్షఫ్రంట్‌ రెండోసారి వరసగా అధికారంలోకివచ్చి రికార్డు సృష్టించింది. 2026లో జరిగే ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.డి.ఎఫ్‌. అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ అంచనా. అందుకే శశీ థరూర్‌ ఇప్పటినుంచే ముఖ్యమంత్రి పదవి అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయనకు ఓ ప్రధాన సమస్య ఉంది. కాంగ్రెస్‌ కేరళ విభాగంలో థరూర్‌కు ఉన్న మద్దతు నామమాత్రం. అయినా థరూర్‌ ప్రయత్నం మానుకోదలుచు కోలేదు. అందుకే మలబార్‌ యాత్రచేసి వచ్చారు. థరూర్‌ వ్యవహారాన్ని పరిష్కరించడమూ ఖడ్గేకు పరీక్షే. వెరసి ఆయన రెండు పరీక్షలు ఎదుర్కోవలసి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img