Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

ఖడ్గే ఆహ్వానాన్ని మన్నిస్తారా?

సెప్టెంబర్‌ ఏడున కన్యాకుమారి నుంచి రాహుల్‌ గాంధీ ప్రారంభించిన భారత్‌ జోడోయాత్ర మరో పక్షంరోజుల్లో ముగింపు దశకు వచ్చేస్తోంది. ఇది రాజకీయయాత్ర కాదని, అది విద్వేషానికి వ్యతిరేకంగా, అహింసా విధానాలు అనుసరించడానికి అను కూలంగా నిర్వహించిన యాత్ర అని కాంగ్రెస్‌ చెప్తోంది. రాహుల్‌ గాంధీ యాత్ర పొడవునా అనేక అంశాలు లేవనెత్తుతున్నారు. వాటన్నింటికీ రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఈ యాత్ర క్రమంలో రాహుల్‌ కొన్ని అంశాలను దృఢంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా లేవనెత్తారు. మహారాష్ట్ర ద్వారా యాత్ర కొనసాగినప్పుడు జాతీయపోరాటంలో సావర్కర్‌ పాత్రను, బ్రిటిష్‌ వారికి క్షమాపణ చెప్పడమేకాకుండా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనబోమని లిఖితపూర్వకంగా తెలియజేయడాన్ని రాహుల్‌ చాలా గట్టిగా ప్రస్తావించారు. జాతీయ పోరాటంలో సావర్కర్‌పాత్ర గురించి అనేక దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోఉండగా హిందుత్వ సిద్ధాంతకర్త అయిన సావర్కర్‌ను విమర్శించడానికి రాహుల్‌గాంధీ సాహసించారు. ముఖ్యంగా మోదీ హయాంలో హిందుత్వ సిద్ధాంతకర్త జోలికివెళ్లడం అంటే తీవ్రమైన ప్రతిదాడులకు సిద్ధం కావడమేనన్న అభిప్రాయం బలంగాఉండేది. జనవరి 30వతేదీన భారత్‌ జోడోయాత్ర శ్రీనగర్‌లో ముగుస్తుంది కనక ఈ సమాపనోత్సవానికి హాజరు కావాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే భావసారూప్యతగల 21 రాజకీయపార్టీల వారిని ఆహ్వానించారు. ఖడ్గే ఆహ్వానించిన పార్టీలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సహా డి.ఎం.కె., జె.డి.(యు), జె.డి.(ఎస్‌), టి.డి.పి., ఆర్‌.జె.డి, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌పార్టీ, శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ, ఐ.యు.ఎం.ఎల్‌., నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ, ఎం.డి.ఎం.కె., ఆర్‌.ఎస్‌.పి., తృణమూల్‌ కాంగ్రెస్‌ లాంటివి ఉన్నాయి. సెక్యులర్‌ పార్టీలనే ఆహ్వానించామని ఖడ్గే అంటున్నారు. ఆహ్వానం అందిన పార్టీలో అనేక పార్టీలు ఇదివరకు బీజేపీతో కలిసి కేంద్రప్రభుత్వంలో భాగస్వాములైనవీ ఉన్నాయి. మమతాబెనర్జీ రాహుల్‌యాత్రపై ఇంతవరకు పెదవే విప్పలేదు. ఈ పార్టీలలో కొన్ని ఏమేరకు సెక్యులర్‌పార్టీలో అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. చాలా ప్రాంతీయ పార్టీలు అనువైనప్పుడు సెక్యులర్‌గా ఉంటూ, రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందను కున్నప్పుడు బీజేపీతో కలిసిపోవడం మామూలైపోయింది. ఇలాంటి పార్టీలు రాహుల్‌గాంధీ చెప్తున్న రాజ్యాంగ పరిరక్షణకు ఏమేరకు కట్టుబడిఉన్నాయో కూడా చర్చనీయమే. సెక్యులర్‌పార్టీలు శ్రీనగర్‌లో జరిగే సమాపనోత్సవానికి హాజరైతే ఈ యాత్ర ఇవ్వదలచుకున్న సందేశానికి మరింత బలంచేకూరుతుందని ఖడ్గే భావిస్తున్నారు. 3,800 కి.మీ. మేర సాగవలసిన ఈ యాత్రలో 3,300 కి.మీ. యాత్ర పూర్తయింది. ఈ యాత్ర ఇంతవరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల ద్వారా సాగింది.
భారత్‌ జోడోయాత్ర ఉత్తరప్రదేశ్‌ ద్వారా సాగడానికి ముందు కూడా రాహుల్‌గాంధీ నుంచి అనేక రాజకీయపార్టీలను ఈ యాత్రలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కానీ అప్పుడు రాజకీయ పార్టీలనుంచి అంతగా ఉత్సాహం కనిపించలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి, డి.ఎం.కె.నాయకుడు స్టాలిన్‌, మహారాష్ట్రలో శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే మాత్రమే ఈ యాత్రకు అనుకూలంగా స్పందించారు. కొద్ది రోజుల విశ్రాంతి తరవాత దిల్లీ నుంచి మళ్లీ యాత్రప్రారంభం అయినప్పుడు ప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్‌ మాత్రం రాహుల్‌తో కలిపి అడుగులు వేశారు. ఆయన సినీనటుడే కాక ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కూడా. అందువల్ల ఆయన పాత్రధారి కావడానికి ఓ ప్రత్యేకత ఉంది. వివిధ రంగాలలో లబ్ధ ప్రతిష్ఠులైనవారు అనేకమంది ఈ యాత్రలో భాగస్వాములయ్యారు. వారి భాగస్వామ్యం ఈ యాత్రకు కొత్త శోభ తీసుకొచ్చిన మాట వాస్తవమే. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీపార్టీ ఆహ్వానం అందిందా లేదా అన్న విషయం మీదే బోలెడు సందిగ్ధత వ్యక్తంచేసింది. అఖిలేశ్‌ ఈ యాత్రలో పాల్గొనలేదు కాని తరవాత మనసు మార్చుకుని ఈ యాత్రకు మద్దతు ప్రకటించారు. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖడ్గే ఆహ్వానించినా వివిధ రాజకీయపార్టీలు ఈ యాత్రలో భాగస్వాములు కాకపోవడానికి నిర్దిష్ట కారణం ఉంది. ఇది కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ ప్రారంభించిన యాత్ర. ఇది సంపూర్ణంగా కాంగ్రెస్‌ వ్యవహారం. అందువల్ల ఒక రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో ఇతర రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనకపోవడంలో ఆశ్చర్యం ఏమీలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత విద్వేష రాజకీయాలు పెరిగిపోయిన అంశాన్ని అనేక రాజకీయ పార్టీలు అంగీకరిస్తూ ఉండవచ్చు. ఈ యాత్ర లక్ష్యాలతో విభేదం లేక పోయినా కాంగ్రెస్‌ చేపట్టిన యాత్రలో తామెందుకు భాగస్వాములం కావాలి అని రాజకీయపార్టీలు భావించడంలో తప్పుపట్టవలసింది ఏమీ లేదు. కశ్మీర్‌లోని ఫరూఖ్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ శ్రీనగర్‌ లో రాహుల్‌తో కలిసి అడుగేస్తామని చెప్పాయి. కశ్మీర్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌తో కలిసి కాంగ్రెస్‌ను వీడివెళ్లి, ఆయన నెలకొల్పిన పార్టీలో చేరిన వారిలో దాదాపు 20మంది మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో సకల పదవులూ అనుభవించిన గులాంనబీఆజాద్‌ కాంగ్రెస్‌నువీడి వెళ్లడానికి కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఆయన ఏర్పాటుచేసిన కొత్తపార్టీ కశ్మీర్‌లో పెద్ద ప్రభావం చూపలేక పోయిందన్నది మాత్రం నిజం. ఆయన దాదాపు ఒంటరిగా మిగిలిపోయారు.
ఖడ్గే ఆహ్వానించిన జాబితాలో ఎ.ఐ.యు.డి.ఎఫ్‌., మజ్లిస్‌, బిజూ జనతాదళ్‌, అన్నాడి.ఎం.కె., టి.ఆర్‌.ఎస్‌., ఆమ్‌ఆద్మీ పార్టీలను మినహాయించడం ప్రత్యేకంగా గమనించదగిన అంశం. వీటిని సెక్యులర్‌ పార్టీలుగా ఖడ్గే భావించలేదు అనడంకన్నా ఆ పార్టీల వ్యవహారసరళే ఆహ్వానించకపోవడానికి ప్రధాన కారణం అనుకోవాలి. 2024లో మోదీని నిలవరించడానికి ప్రతిపక్షాల ఐక్యత గురించి అనేక ప్రయత్నాలు జరిగాయి. ప్రతిపక్షాలలో అతి పెద్దపార్టీ అయిన కాంగ్రెస్‌ ఈ ప్రయత్నాలను సమర్థించిన సందర్భమే లేదు. ఇక చొరవ తీసుకోవడం ఎక్కడ ఉంటుంది. కానీ ఇటీవలే రాహుల్‌ గాంధీ హఠాత్తుగా ప్రతిపక్షాల ఐక్యత గురించి ప్రస్తావించారు. ఇందులో ఆంతర్యాన్ని ప్రతిపక్షపార్టీలు గ్రహించలేదని ఎలా అనుకోగలం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img