Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

ఖడ్గే కర్తవ్యాలు

దాదాపు రెండున్నర దశాబ్దాల తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి సోమవారం ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖడ్గే నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా దాదాపు మూడేళ్ల నుంచి కొనసాగిన సోనియా గాంధీ ఆ స్థానం నుంచి తప్పుకోవడం అంటే కాంగ్రెస్‌ మీద ఆమె కుటుంబం పట్టుసడలిపోతుందని కాదు. కానీ పరిమితంగా నైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోగలిగామన్న సంతృప్తి కాంగ్రెస్‌ శ్రేణులకు మిగులుతుంది. దాదాపు 96 శాతం మంది ఏ.ఐ.సి.సి. సభ్యులు ఓటు వేశారు. ఊహించినట్టుగానే 7,897 ఓట్లు అంటే 84.14 శాతం ఓట్లు సాధించిన మల్లికార్జున ఖడ్గే విజయం సాధించారు. శశీ థరూర్‌ 1,072 ఓట్లు అంటే 11.42శాతం ఓట్లు సాధించారు. అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన వెంటనే కేరళ నుంచి ఎంపీగా ఉన్న శశీ థరూర్‌ రంగంలోకి దిగారు. గెలిచి తీరుతానన్న నమ్మకం ఆయనకు ఎన్నడూ లేకపోవచ్చు కానీ ఎన్నిక పైకి కనిపించడానికైనా ప్రజాస్వామ్య పద్ధతి ఉందని నిరూపించడానికి ఆయన పోటీ బాగా ఉపకరించింది. అలాగని ఆయన పోటీ నామ మాత్రమైంది కాదు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలను కున్నప్పటి నుంచి ఆయన తన ప్రణాళిక విడుదల చేయడం, ప్రచారం చేయడం లాంటి ప్రక్రియలన్నీ అనుసరించారు. మార్పు కోసమే తాను పోటీ చేస్తున్నానని అనేక సార్లు చెప్పారు. అదే సమయంలో పోటీలో ఉన్న మల్లికార్జున ఖడ్గే తనకు ప్రత్యర్థే తప్ప విరోధి కాదని శశీ థరూర్‌ పదే పదే చెప్పారు. కాంగ్రెస్‌లో సంస్థాగత సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ సోనియా గాంధీకి లేఖ రాసిన 24 మంది కాంగ్రెస్‌ నేతల బృందంలో శశీ థరూర్‌ కూడా ఉన్నారు. అయితే ఆయన ఈ అసమ్మతి బృందం అభ్యర్థిగా పోటీ చేయలేదు. ఆ బృందంలోని వారిలో ఎవరూ ఆయనకు ఓటు వేసిన దాఖలాలు లేవు. ఈ 24 మంది సాహసించి సోనియాకు లేఖ రాయడం సంస్థాగత సంస్కరణల ఆకాంక్ష వ్యక్తం చేయడానికి ఉపకరించింది. ఈ నేతలందరితో సోనియా గాంధీ విడివిడిగా మాట్లాడారు. ఆ ఒక్క కారణంతోనే కాక పోయినా శశీ థరూర్‌ మినహా మిగతా 23 మంది సోనియాకు మద్దతుదార్లుగా ఉండిపోయారు. ప్రజాస్వామ్య విధానాలు అమలుచేయాలన్న ఆకాంక్ష దిశగా ఇది మొదటి అడుగు అయితే సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం రెండో అడుగు. శశీ థరూర్‌ పోటీని ఆశామాషీ వ్యవహారంగా కాకుండా వ్యవహరించడం మూడో అడుగు. కాంగ్రెస్‌ మీద ఆధిపత్యం చెలాయిస్తున్న సోనియా గాంధీ కుటుంబం అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించడానికైతే సిద్ధమైంది. శశీ థరూర్‌ పోటీ చేయడాన్ని వ్యతిరేకించలేదు. కానీ మల్లికార్జున ఖడ్గేను అధికారిక అభ్యర్థి అని అందరు అనుకునే రీతిలో బాహాటంగా వ్యవహరించారు. ఈ ఎన్నికలలో తటస్థంగా ఉంటానని ప్రకటించిన సోనియాగాంధీ తటస్థంగా ఉన్న దాఖలాలు లేవు. మొదట రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ పోటీ చేస్తారనుకున్నప్పుడు ఆయనకు సోనియా ఆశీస్సులు ఉండడం బహిరంగ రహస్యమే. తరవాత పోటీ చేయాలన్న సంకల్పాన్ని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ వదులుకోవడమూ సోనియా కనుసన్నల ప్రకారం నడిచిన వ్యవహారమే. మల్లికార్జున ఖడ్గే సోనియా కుటుంబం చలవతో పోటీకి దిగితే శశీ థరూర్‌ సంపూర్ణమైన ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించారు. సోనియా కుటుంబం తటస్థంగా ఉంటామని ప్రకటించినా, ఖడ్గే ఎన్నికైన తరవాత తాను ఏ పాత్ర పోషించాలో పార్టీ అధ్యక్షుడే నిర్ణయిస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించడం ప్రజాస్వామ్య ప్రవర్తన ప్రదర్శించే లాంఛనాన్ని పూర్తి చేయడానికి మాత్రమే ఉపకరించాయి.
కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సమర్థుడు, అనుభవజ్ఞుడు, మృదు స్వభావి. ఆయన కాంగ్రెస్‌ నావను ఏ దిశగా నడిపిస్తారన్న ఉత్కంఠ కేవలం కాంగ్రెస్‌ వాదుల్లో మాత్రమే కాకుండా మొత్తం రాజకీయ రంగంలో వ్యక్తమవుతూనే ఉంటుంది. ఆయన ముందు ఉన్న సవాళ్లు చిన్నవేం కావు. సోనియా కుటుంబాన్ని కాదని వ్యవహరించే అవకాశం ఆయనకు లేదు. ఆయన ఆ ప్రయత్నమైనా చేయరు. అధ్యక్షుడిగా తనబాధ్యతల నిర్వహణలో నైనా కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికి ఎలాంటి కృషి చేస్తారో ఇప్పుడే చెప్పలేం. ఆయన ముందున్న తక్షణ సవాలు ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉన్న రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో 2023లో జరిగే ఎన్నికలలో అధికారాన్ని నిలబెట్టుకునేట్టు చేయడం. 2024 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ ఏ మేరకు ముందుకెళ్లగలుగుతుందో ఈ రెండు రాష్ట్రాలలో విజయం స్పష్టమైన సంకేతంగా ఉంటుంది. అన్నింటికన్నా ప్రధానమైంది కాంగ్రెస్‌కు జవసత్వాలు కల్పించడం. కాంగ్రెస్‌ అనుసరించవలసిన సైద్ధాంతిక దృక్పథాన్ని తడబడకుండా కొనసాగించడం. స్వల్పమైన ప్రయోజనాలను ఆశించి హిందుత్వ పరిభాషను అలవర్చుకోకుండా, వినియోగించుకోకుండా ఉండడం మరో కర్తవ్యం. శశీ థరూర్‌ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలలో తనతో పోటీపడ్డా ఆయన ప్రత్యర్థే తప్ప శత్రువు కారు అన్న అవగాహన ఖడ్గేకు ఉండదు అనుకోలేం. కానీ ఆచరణలోనూ అది కనిపించాలి. శశీ థరూర్‌ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. థరూర్‌ నవయువకుడు కాకపోయినా యువత ఆకాంక్షల ప్రతినిధి. కాంగ్రెస్‌ దిశ మారడం ఎలాగో ఆలోచించగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడు. అందువల్ల ఆయనకు ఎలాంటి పాత్ర లేకుండా పక్కకు తోసేయకుండా వర్కింగ్‌ కమిటీలో థరూర్‌కు స్థానం కల్పించడం ఖడ్గేకే అనుకూలమైన అంశం. అన్నిటికన్నా ముఖ్యమైంది ఖడ్గే స్వతంత్రంగా, ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరించాలి. సోనియా గాంధీ కుటుంబానికి ఆ మహా సంస్థపై ఉన్న అభిమానాన్ని వ్యక్తి ఆరాధనా తత్వంగా మిగిలిపోకుండా పార్టీని బలోపేతం చేయడానికి స్ఫూర్తినిచ్చే దిశగా సోనియా కుటుంబం ఉపకరించేలా ఖడ్గే చూసుకోవాలి. 2024 ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని బీజేపీని గద్దె దించవలసిన అగత్యం ఏమిటో కేవలం కాంగ్రెస్‌ అనుయాయులకే కాకుండా ప్రజాస్వామ్య ఆకాంక్ష ఉన్న వారందరికీ స్పష్టమయ్యేలా ఖడ్గే నడుచుకోవాలి. అధికారం సంపాదించడమో, నిలబెట్టుకోవడమో కాంగ్రెస్‌ ప్రాభవాన్ని పెంచవు. మోదీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కోగలిగిన శక్తి, ప్రత్యామ్నాయ దృక్పథాన్ని దేశం ముందుంచగలిగిన సత్తా కాంగ్రెస్‌కు ఉందని ఖడ్గే నిరూపించగలగాలి. ఈ లక్ష్యాల సాధ్యన కష్ట సాధ్యం కావచ్చు కానీ అసాధ్యమైతే కాదు. మోదీని గద్దె దించడంలో ఇతర ప్రతిపక్ష పార్టీల సామర్థ్యాన్ని సైతం ఖడ్గే గుర్తించాలి. ఆ రాజకీయ శక్తుల్ని ఏకం చేయడానికి కృషి చేయాలి. ఈ పనుల్లో ఏవీ శక్తికి మించినవి కావు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అన్న బీజేపీ లక్ష్యాన్ని భగ్నం చేసే దిశగా ఖడ్గే ఎంత బలమైన అడుగులు వేస్తారన్నదే అసలు సవాలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img