Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

గంగా స్నానం చేయకపోతే వైతరిణి దాటాల్సిందే

అవినీతి ఆరోపణలు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌, ఆదాయపు పన్నుశాఖ లాంటి కేంద్ర ప్రభుత్వంలోని వ్యవస్థల దాడులకు గురైనవారు బీజేపీలో చేరితో వారు గంగాస్నానం చేసినంత పునీతులు అయిపోతారు. లేకపోతే వారు గరుడ పురాణంలో పేర్కొన్న వైతరిణీ నదిని దాటుకుని నరకంలో ప్రవేశించవలసిందే. మోదీ ప్రభుత్వం సకల రాజ్యాంగ వ్యవస్థలను స్వప్రయోజనాలకోసం దుర్వినియోగం చేస్తోందన్నది పాత మాట. రాజకీయ ప్రత్యర్థులను బెదరగొట్టడానికి, వారిని అపఖ్యాతి పాలుచేయడానికి ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందన్నది వర్తమాన చరిత్ర. మోదీ మాట విననివారు ఎంతటి వారైనా ఇదే పద్ధతి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థల దాడులకు గురికాకుండా తప్పించుకున్న బీజేపీయేతర పార్టీల నాయకులు ఎవరో తెలుసుకోవాలంటే వెయ్యి కాగడాలు పట్టి వెతకవలసిందే. నితీశ్‌కుమార్‌ నాయకత్వంలో బిహార్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకులు లాలూప్రసాద్‌ యాదవ్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ మీద సీబీఐ దాడులు చేయించి మహాఘట్‌ బంధన్‌ ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలని బీజేపీ కంకణం కట్టుకున్నట్టుంది. లాలూప్రసాద్‌ యాదవ్‌ యు.పి.ఏ. సర్కారులో రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేలలో ఉద్యోగ నియామకాల కోసం భూములు తీసుకున్నారని ఆరోపిస్తూ లాలూ, ఆయన కుమారుడు తేజస్వి, ఇద్దరు కూతుర్లు – ఇలా మొత్తం 16మంది మీద సీబీఐ కేసులు మోపింది. ఈ ఆరోపణల్లో చాలా రుజువు కాలేదు. అయినా ఇప్పుడు మళ్లీ అవే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం లాలూను, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగార్థుల నుంచి సమకూరిన అక్రమ సంపాదనతో తేజస్వీ యాదవ్‌ గురుగ్రాంలో అర్బన్‌ క్యూబ్స్‌ అనే పెద్ద మాల్‌ నిర్మించారని సీబీఐ ఇంతకు ముందు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను సీబీఐ రుజువు చేయలేక పోయినందువల్ల తేలిపోయాయి. ఈ మాల్‌ వైట్‌ లాండ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెందిందని, అందులో బీజేపీ ఎంపీ పెట్టుబడి ఉందని తేజస్వి ఎదురు దాడికి దిగారు. ప్రస్తుతం ఈ మాల్‌ యజమాని కృష్ణ కుమార్‌ అని కూడా తేజస్వి వెల్లడిరచారు. పైగా ఈ మాల్‌ ప్రారంభోత్సవం హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేతుల మీదుగా జరిగింది. ఈ వివరాలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఇప్పుడు సీబీఐదే. ఆ మాల్‌ అసలు యజమాని ఎవరో కూడా చెప్పాల్సింది కూడా సీబీఐనే. తేజస్వి గట్టిగా సమాధానం చెప్పిన తరవాత కొంతకాలం సీబీఐ నోరు మెదపలేదు. ఉద్యోగాలు ఇచ్చినందుకు లాలూ యాదవ్‌ కుటుంబం వారికి 1458 మంది తమ భూములు ఇచ్చేశారని సీబీఐ కొత్త రాగం ఎత్తుకుంది. ఈ సమాచారం తమకు దొరికిన కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లో ఉందని సీబీఐ అంటోంది. ఇంతకు ముందు సీబీఐ దాడుల్లో ఈ డిస్క్‌ దొరకలేదట. గత నెల జరిగిన దాడుల్లో ఈ డిస్క్‌ సీబీఐ చేతికి చిక్కిందట. తమ వలలో పెద్దచేప పడిరదని మోదీ, అమిత్‌ షా ఆదేశాల మేరకు పనిచేసే సీబీఐ తెగ సంబర పడిపోతోంది. ఎదురు లేనిది అనుకుంటున్న ఈ సాక్ష్యాధారం దొరకక ముందు కూడా లాలూ యాదవ్‌ను, తేజస్వీ యాదవ్‌ను అరెస్టు చేయవచ్చునన్న సంకేతాలు ఇచ్చింది. 16 కేసుల్లో తమ దగ్గర తిరుగులేని సాక్ష్యం ఉందని సీబీఐ చెప్తోంది కనక మరి లాలూ యాదవ్‌ను, తేజస్విని ఎందుకు అరెస్టు చేయడం లేదో!
సీబీఐలో సమర్థులైన పోలీసు అధికారులు ఉన్నారో లేదో కానీ మోదీ, అమిత్‌ షా అడుగులకు మడుగులొత్తే మేధా సంపత్తిగల పోలీసు అధికారులు మాత్రం ఉన్నారు. ఏ మాటకు ఆ మాట లాలూ మీద పశుగ్రాస కుంభకోణం ఆరోపణలు వచ్చినప్పుడు కూడా సీబీఐ అధికారులు ఎందుకొచ్చిన గొడవ అడ్వాణీతో ఏదో రాజీ కుదుర్చుకోండి అని సలహా ఇచ్చారు. కానీ లాలూ ఈ ఉచిత సలహాను లక్ష్య పెట్టలేదు. లొంగి పోవడానికి ఆయన ససేమిరా అంగీకరించలేదు. దానితో లాలూ రాజకీయ జీవితం నాశనమైంది. ఇప్పుడు తేజస్వీ యాదవ్‌ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. బీజేపీతో ఘర్షణకు దిగకుండా నితీశ్‌కుమార్‌తో తేజస్వీ పార్టీ తెగతెంపులు చేసుకోవాలన్నది మోదీ, షా ద్వయం వ్యూహం. అయితే వీరిద్దరూ ఒక్క అంశాన్ని గ్రహిస్తున్నట్టు లేరు. బీజేపీతో ఏ దశలోనూ కత్తు కలపకుండా రాజకీయాలలో కొనసాగుతున్న పార్టీ రాష్ట్రీయ జనతాదళ్‌ మాత్రమే. ధిక్కారం సహించే తత్వం మోదీకి, అమిత్‌షాకు లేదు కనక లాలూ మీద సీబీఐ కత్తి మళ్లీ వేలాడదీస్తున్నారు. అడ్వాణీ రథ యాత్రను సమస్తిపూర్‌లో నిలవరించినందుకు బీజేపీ లాలూ మీద కసి తీర్చుకుంది. సీబీఐ ఆరోపణలు గుప్పిస్తున్నది లాలూ మీదే అయినా బీజేపీ అసలుగురి ప్రస్తుతం ఆర్‌.జె.డి.ని నడిపిస్తున్న తేజస్వీ యాదవ్‌ మీదే. కళంకితుడిగా నిలబెట్టి ఆయన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలని బీజేపీ అగ్రనాయకద్వయం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తండ్రీ కొడుకులిద్దరూ సీబీఐ దాడులకు వెరువకుండా కోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకోవడానికి సంసిద్ధులై ఉన్నారు.
కొడుకు రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందని భయపడి లాలూ లొంగి పోతారనుకున్న బీజేపీ అంచనా విఫలమైంది. ఈ క్రమంలో సీబీఐ తాబేదారీతత్వం మాత్రం వ్యక్తమైంది. ఈ ఏడాది మే 18న లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కూతుర్లు మీసా భారతి, హేమా యాదవ్‌ మీద రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన పాత కేసులోనే కొన్ని కొత్త సాక్ష్యాధారాలు దొరికాయని సీబీఐ సరికొత్త కేసు దాఖలు చేసింది. నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని తేజస్వీ నాయకత్వంలోని ఆర్‌.జె.డి, వామపక్షాలతో కలిసి మహాఘట్‌ బంధన్‌ ప్రభుత్వం ఏర్పాటుచేయడం బీజేపీ నాయకులకు గొంతు దిగడం లేదు. అందుకే ఆగస్టు 24న బిహార్‌లో మహాఘట్‌ బంధన్‌ ప్రభుత్వం విశ్వాస తీర్మానం నెగ్గడానికి కొద్ది గంటల ముందు సీబీఐ రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుల మీద వరసగా దాడులు చేసింది. మొదట చేసిన దాడుల్లో అయిదు విక్రయపత్రాలు దొరికాయి అని చెప్పిన సీబీఐ ఇప్పుడు తమకు 200 విక్రయపత్రాలు దొరికాయని అంటోంది. నితీశ్‌ నాయకత్వంలోని ప్రభుత్వం పదిలంగా ఉంటే 2024 ఎన్నికలలో బిహార్‌లో తాము తక్కువ స్థానాలతో సర్దుకోవాల్సి వస్తుందన్నది బీజేపీ నాయక ద్వయం భయం. తేజస్వీని అరెస్టు చేయకపోవడం, కోర్టులో కేసు దాఖలు చేయకపోవడం బీజేపీ కుతంత్రాలకు నిదర్శనం. గంగానదిలో మునగకపోతే వైతరిణి దాటక తప్పదని అని భయపెట్టడమే బీజేపీ అగ్రనాయకుల అసలు ప్రణాళిక.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img