Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

గిరిజనుల జీవన పోరాటం

తమ జీవితాలకు ఆధారమైన నేల చెక్క అమాంతం బడా పెట్టుబడిదారైన దాల్మియాకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఆదివాసీలకు మిగిలింది చావో రేవో తేల్చుకోవలసిన పోరాటమే. దాల్మియా సిమెంట్‌ కంపెనీకి ఒరిస్సా ప్రభుత్వం అయిదు పంచాయతీల కిందకు వచ్చే 750 ఎకరాల భూమిని కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడానికి అయిదేళ్లుగా గిరిజనులు అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. చివరకు ‘‘జన సంఘటన్‌ ఫోరం ఫర్‌ గ్రామ సభ’’ పేరున అలందా, కెస్రమల్‌, రaంగర్‌ పూర్‌, కుకుడ పంచాయతీలకు చెందిన అయిదువేల మంది గిరిజనులు నాలుగు రోజులపాటు వంద కిలోమీటర్లు పాదయాత్ర చేసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ రాత్రి వాళ్లు చలికి వణుకుతూ ఆకాశమే దుప్పటిగా ఉండిపోవలసి వచ్చింది. కలెక్టర్‌ కార్యాలయం నుంచి కలెక్టరే కాదు ఒక్క ఉద్యోగి అయినా బయటకు వచ్చి మీ సమస్య ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు. ఈ భూమి గనక దాల్మియాకు అప్పగిస్తే 57 గ్రామాలలోని 60 వేల మంది గిరిజనులు నిరాశ్రయులవుతారు. జీవనాధారం కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోతారు. వారి అస్తిత్వమే మాయం అవుతుంది. గిరిజనులకు తామునమ్ముకున్ననేల కేవలం జీవనాధారమే కాదు. అది వారి శరీరాల్లో అంతర్భాగం. వారిజీవితాలు ఆ భూమితోనే ముడివడి ఉంటాయి. వారిబతుకు, అస్తిత్వం,సంస్కృతి, భాష అన్నీ ఆ నేల చెక్కమీద ఆధారపడినవే.
సామాన్య ప్రజల ఆవాసాలను లెక్క చేయకుండా, తరతరాలుగా వారు నివసిస్తున్న ప్రాంతం మొదలైన వాటి నుంచి కూకటి వేళ్లతో సహా పెకలించి ఇదే ఆధునిక అభివృద్ధి, ఉపాధి కల్పనా పథకం అని బూటకపు ప్రచారం దేశంలోని చాలా ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. ఈ ఉద్యమంమొదలై అయిదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. హామీలు తప్ప పరిష్కారం కనుచూపుమేరలో కూడా లేదు. దాల్మియా-ఒ.సొ.ఎల్‌. కంపెనీ తన సున్నపు రాయి తవ్వకాలను విస్తరించాలను కుంటోంది. దీనికోసం 2,150 ఎకరాల భూమి కట్టబెట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. మొదటి దశ విస్తరణ పూర్తి కావాలంటే ఆ కంపెనీకి మరో 750 ఎకరాల భూమి అవసరం. నాల్గు రోజుల పాదయాత్ర తరవాత ఈ గిరిజనులు అక్టోబర్‌ 21 ఉదయం పది గంటలకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వారు కోరిందల్లా అధికారులు బయటకొచ్చి తమ విజ్ఞాపనపత్రం అందుకోవాలనే. వారి మరో కోరిక అక్రమంగా జరుగుతున్న ఈ భూసేకరణ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని మాత్రమే. కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఒక్క అధికారి అయినా వీరి మొర ఆలకించడానికి బయటకు రాలేదు. కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందించడానికి గిరిజనులు కొంతమంది ప్రతినిధులను పంపాలని సూచించారు. గిరిజనుల నిరసనలు ఉధృతమైనప్పుడు కలెక్టర్‌ ఇంటిని, ఆఫీసును కూడా నాలుగు వేపుల నుంచి అధికారులు దిగ్బంధించారు. నిరసన చేస్తున్న వారి ఒత్తిడిని భరించలేక అక్టోబర్‌ 21 రాత్రి ఏడు గంటలకు బయటకు వచ్చి మరుసటి రోజు తనతో చర్చించడానికి 25 మంది ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలని చెప్పారు. విధిలేక ఈ గిరిజనులు ఆ రాత్రంతా ఆరుబయటే గడపవలసి వచ్చింది. మరుసటి రోజు 25 మందిని ఎంపిక చేసిన గిరిజన ప్రతినిధులను కలుసుకున్నారు. విజ్ఞాపన పత్రం స్వీకరించారు. ఈ విజ్ఞాపన పత్రాన్ని ఒరిస్సా ముఖ్యమంత్రికి, గవర్నరుకు, రాష్ట్రపతికి పంపిస్తానని లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. వారి దగ్గరి నుంచి సమాధానం వచ్చే దాకా భూసేకరణ నిలిపి వేస్తామని భరోసా కూడా ఇచ్చారు. అక్రమ భూసేకరణ నిలిపివేసే దాకా వంద, రెండు వందల మంది గిరిజనులు కలెక్టర్‌ ఆఫీసు ఎదుట నిరసన తెలియ జేయడానికి చోటు కేటాయించాలని, మంచి నీళ్లు, తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఏర్పాట్లు పది రోజుల్లోగా చేస్తానని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మిగతా గిరిజనులు స్వస్థలాలకు వెళ్లడానికి బస్సులు కూడా ఏర్పాటు చేశారు.
అక్రమంగా, బలవంతంగా దాల్మియాల కోసం భూసేకరణ తతంగం చాలా ఏళ్ల నుంచే కొనసాగుతోంది. 2020 జనవరి 26న భూసేకరణను గిరిజనులు నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. చావనైనా చస్తాం కానీ ఒక్క అంగుళంనేల అయినావదలం అని తెగేసిచెప్పారు. ఈ భూమి సేకరించి నందువల్ల సామాజిక ప్రభావం ఎలా ఉంటుంది, అసలు ఈ భూమి విలువ ఎంత, భూసేకరణకు చట్ట ప్రకారం నోటీసు జారీ చేయడం లాంటి బాదరబందీలు ఏవీ లేకుండానే నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం భూసేకరణకు ఉపక్రమించింది. ఈ భూసేకరణకు చట్టబద్ధంగా ఉండ వలసిన గ్రామసభ అనుమతికూడా లేదు. 25లక్షల రూపాయలు ఇస్తామనిప్రభుత్వం ప్రజలకు ఆశగొల్పుతోంది. గిరిజనులు అంగీ కరించారని నమ్మించడానికి నకిలీ సంతకాలు సేకరిస్తోంది. అందుకే గిరిజనులు పాదయాత్ర చేపట్టవలసివచ్చింది. ప్రభుత్వంకనక అక్రమ భూసేకరణ ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరంచేస్తామని గిరిజనులు అంటున్నారు. దాల్మియా కంపెనీ సుదర్‌ గఢ్‌కు వచ్చినప్పటి నుంచీ గిరిజనులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమానికి ఓ విశిష్టత ఉంది. ఇది ఏ రాజకీయ పార్టీతో, ప్రత్యేక బృందంతో సంబంధం లేనిది. మహిళలు, యువత, విద్యార్థులు, ఆదివాసీలు ఉమ్మడిగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. దాల్మియా కంపెనీ తోక ముడవాల్సిందేనంటున్నారు. రెండు వారాల తరవాత కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శిబిరం వేస్తామని కూడా గిరిజనులు తెలియజేశారు. గిరిజనులను నిర్వాసితులను చేసి, వారి జీవనోపాధిని హరించి పారిశ్రామికీకరణ పేర ప్రభుత్వం భూములులాక్కుని తమకుఇష్టులైన గుత్త పెట్టుబడి దార్లకు అప్పగించడం కొత్తకాదు. అలాగే గిరిజనులు సంఘటితమై సుదీర్ఘ పోరాటాలకు సంసిద్ధులు కావడమూ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన పోరాటరూపం ఏమీకాదు. ఈ పెనుగులాట దశాబ్దాలుగా కొనసాగుతున్నదే.
భూసేకరణ న్యాయబద్ధంగా జరగడం, భూమి కోల్పోయిన వారికి తగిన పునరావాసం కల్పించడం లాంటి కనీస మానవీయ వైఖరిని ప్రభుత్వాలు ప్రదర్శించకపోవడం ఆశ్చర్యకరం. ఆందోళనకు దిగే ప్రజలను ప్రభుత్వం శత్రువులుగా పరిగణించడం, వారిమీద కేసులు మోపి కోర్టులచుట్టూతిప్పడం పరిపాటి అయిపోయింది. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ అమానుషవైఖరి కారణంగానే శాంతియుతంగా ప్రారంభమైన ఇలాంటి ఆందోళనలు రక్తసిక్తం అవుతున్నాయి. గిరిజనుల తరఫున పోరాడే వామపక్ష వాదులను ఆ ప్రాంతాలనుంచి ప్రభుత్వం తరిమివేయగలిగింది. బూటకపు ఎన్‌కౌంటర్లపేర అనేకమందిని హత మార్చింది. కానీ సమస్యను మానవీయకోణంనుంచి ఏనాడూ పరిశీలించ లేదు. భూమికోసం పోరాడడాన్ని తిరుగుబాటుగా భావించిందే తప్ప అది వారి జీవన పొరాటం అని గ్రహించనేలేదు. మౌలిక సమస్యలను పరిష్కరించే లక్షణం ప్రభుత్వాలకు కొరవడినంతకాలం ఇలాంటి ఉద్యమాలు అనివార్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img