Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

గీత దాటుతున్న గవర్నర్‌

రాజ్యాంగాన్ని ఖరారు చేస్తున్నప్పుడు అనేక అంశాల మీద లోతైన చర్చలే జరిగాయి. గవర్నర్ల వ్యవస్థ అవసరమా కాదా అన్న అంశం మీదా వాదోపవాదాలు జరిగాయి. చివరకు గవర్నర్ల వ్యవస్థ ఉండాలని అనుకున్నారు. దేశమంతటా ఒకే రాజకీయ పార్టీ పెత్తనం కొనసాగినప్పుడు గవర్నర్లుగా ఉన్న వారు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణపడ్డ సందర్భాలు చాలా తక్కువ. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒకటైతే రాష్ట్రాల్లో భిన్న పార్టీలు అధికారంలో ఉంటే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అనుసంధాన కర్తలుగా ఉండవలసిన గవర్నర్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడం బాగా పెరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదీ చేసినా అడ్డు తగిలే గవర్నర్లు తయారయ్యారు. మహా రాష్ట్ర గవర్నర్‌ కోషియారీ, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి తమ రాజ్యాంగ బాధ్యతలను అటకెక్కించి కేవలం కేంద్ర ప్రభుత్వానికి బంట్లుగా పని చేస్తున్నారు. జగ్దీప్‌ ధన్కర్‌ బెంగాల్‌ గవర్నరుగా ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీయేతర పార్టీలే అంటే ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నాయి. అందువల్ల ఈ రాష్ట్రాల గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వత్తాసుదార్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగినా బాగుండేది అలా కాకుండా తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషిస్తున్నారు. గవర్నర్లుగా ఎవరిని నియమించాలన్న సంప్రదాయాలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తుంగలో తొక్కుతూనే వచ్చాయి. రాజకీయంగా తమకు అనుకూలమైన వారినే నియమిస్తున్నారు. మరీ చెప్పాలంటే క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వారిని లేదా ఉన్నతాధికారులుగా ఉన్నప్పుడు తమకు అనుకూలంగా వ్యవహరించిన వారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ ధోరణి మరీ పెచ్చరిల్లిపోయింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. తో సన్నిహిత సంభంధం ఉన్న వారిని గవర్నర్లుగా నియమిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏరికోరి సంఫ్‌ు పరివార్‌తో సన్నిహిత సంబంధం ఉన్న వారిని నియమిస్తున్నారు. ఉన్నతాధికారుల్లో కూడా అలాంటి వారిని వెతికి గవర్నర్‌ పదవి కట్టబెడ్తూ వారి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. సంపూర్ణమైన రాష్ట్ర స్థాయి లేని దిల్లీలాంటి చోట లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఇష్టారాజ్యం చెలాయించడాన్ని అర్థం చేసుకోవచ్చు. అక్కడ సకలాధి కారాలు గవర్నర్లకు పనిగట్టుకుని కట్టబెట్టారు. కానీ పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలలో, ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లుగా ఉన్న వారూ విలోమ పాత్రే పోషిస్తున్నారు. నిరపేక్షంగా ఉండవలసిన గవర్నర్లను తమ చెప్పు చేతుల్లో పని చేసే వారి స్థాయికి దిగజార్చడమే దీనికి ప్రధాన కారణం. గవర్నర్‌ పదవులను ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గూఢ చార సమాచారం సేకరించే స్థాయికి దిగజార్చారు. ఇలా వ్యవహరిస్తున్న గవర్నర్లలో చాలా మంది కేవలం రాజకీయ నాయకులు కారు. వారికి తగిన అనుభవం ఉంది. వారిలో పాండిత్యం ఉన్న వారూ ఉన్నారు. లేదా సుదీర్ఘ కాలం ఉన్నతాధికారులుగా పని చేసిన వారూ ఉన్నారు. అయినా వారి ప్రవర్తన పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి నమ్మిన బంట్లుగా ఉండడానికే పరిమితం అవుతోంది. ఇది గవర్నర్ల స్థాయిని దిగజార్చడమే కాదు, అసలు ఆ వ్యవస్థే అనవసరం అన్నీ వాదనలు సబబేనన్న దశకు చేరుకున్నాయి. 

తాజాగా తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మరోసారి వివాదాస్పద పాత్ర పోషిస్తున్నారు. చాలా స్వల్ప వ్యవధిలో ఆయన రెండు సందర్భాలలో వివాదాలకు తెర లేపారు. మొదటిది, శాసన సభ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగం చదవడానికి బదులు తన సొంత అభిప్రాయాలు చేర్చి చదివారు. ప్రతి ఏడాది శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యే రోజున గవర్నర్లు చట్ట సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. ఈ ప్రసంగం గవర్నర్‌ అభిప్రాయ వ్యక్తీకరణ కాదు. అది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాల వ్యక్తీకరణే. అందుకే ఆ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేస్తుంది. దాన్ని చదవడమే గవర్నర్‌ చేయవలసిన పని. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగం కూడా ఇదే రీతిలో ఉంటుంది. రాష్ట్రపతి పదవిలో లేదా గవర్నర్‌ పదవిలో హేమా హేమీలు ఉన్నా వారు ఈ సంప్రదాయానికి కట్టుబడే తమ బాధ్యత నిర్వర్తించారు. అక్కడక్కడా కొన్ని మినహాయింపులు ఉండొచ్చు. కానీ తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిలాగా బాహాటంగా సంప్రదాయాన్ని ఉల్లంఘించిన వారు తక్కువే కనిపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగానికి తన అభిప్రాయాలు జోడిరచి గవర్నర్‌ రవి శాసనసభలో ప్రసంగించి నందుకు సహజంగానే తమిళనాడు ప్రభుత్వం ఇబ్బంది పడవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ గవర్నర్‌ ప్రవర్తనను తప్పు పడ్తూ ఒక తీర్మానం ప్రవేశ పెట్టవలసి వచ్చింది. గవర్నర్‌ సకల సంప్రదాయాలనూ విస్మరించి విసవిసా శాసనసభలోంచి వెళ్లిపోయారు. అంటే ఆయన ఒక రకంగా నిరసనగా వాక్‌ అవుట్‌ చేశారు. గవర్నర్‌ రవి సృష్టించిన రెండో వివాదం ఇంతకన్నా తీవ్రమైంది. తమిళనాడు పేరును తమిజగంగా మార్చేయాలని గవర్నర్‌ రవి ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు అంటే తమిళుల జాతి అని అర్థం. తమిజగం అంటే తమిళ ప్రజల నెలవు. ఈ రెండో పేరు వాడాలని గవర్నర్‌ దీక్షబూనినట్టు వ్యవహరిస్తున్నారు. తమిళనాడు పేరు తమిజగంగా మార్చేయాలని గవర్నర్‌ సంకల్పం. ఈ అధికారం ఆయనకు లేకపోయినా ఆ పని చేయాలనుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆయనకు ప్రేరణ కూడా ఉంది. బీజేపీ కూడా తమిజగం అనే అంటుంది. సంక్రాంతి పండగ సందర్భంగా గవర్నర్‌ కార్యాలయం నుంచి ఓ ఆహ్వానం వెలువడిరది. అందులో పనిగట్టుకుని తమిళనాడు అని కాకుండా తమిజగం అన్న మాట వాడారు. కిందటిసారి తమిళ సంవత్సరాది సందర్భంగా పంపిన ఆహ్వాన పత్రికలో కూడా తమిళనాడు అనే ఉంది. ఈ సారి మాత్రం అది తమిజగం అయిపోయింది. పైగా ఈ ఆహ్వాన పత్రికపై తమిళనాడు ప్రభుత్వ చిహ్నం లేదు. తమిళనాడు ప్రభుత్వ చిహ్నం అంటే శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్‌ దేవాలయం చిత్రం ఉండాలి. భారత ప్రభుత్వ చిహ్నం మాత్రం ఉంది. తమిళనాడు బదులు తమిజగం అనడం అంటే గవర్నర్‌ రవి ఆర్‌.ఎస్‌.ఎస్‌.-బీజేపీ ఎజెండాను అమలు చేయడమే. ఇది అత్యంత ప్రమాదకరమైన వైఖరి. ‘‘దేశాని కంతటికీ వర్తించేదాన్ని తమిళనాడు కాదంటుంది. అది వారికి అలవాటై పోయింది. ఇలాంటి సిద్ధాంతాలు బోలెడు వచ్చాయి. ఇవన్నీ అసత్యాలే, కట్టు కథలే. వీటిని పటాపంచెలు చేయాలి’’అనేంత సాహసి గవర్నర్‌ రవి. ఇలాంటి గవర్నర్లు నెలకొల్పుతున్న అవాంఛిత సంప్రదాయాలు ఇలాగే కొనసాగితే గవర్నర్ల వ్యవస్థను ఎవరూ రద్దు చేయనక్కర్లేదు. ఈ అధికప్రసంగాలే ఆ వ్యవస్థ అంతరించేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img