Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

గుజరాత్‌ కోర్టుల విపరీత ధోరణి?!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారంలోపెట్టిన గుజరాత్‌ నమూనా ఆ రాష్ట్రంలోని న్యాయస్థానాలకు కూడా వర్తిస్తున్నట్టుంది. దీనికి గుజరాత్‌ హైకోర్టూ మినహాయింపు కాదు. ఏ న్యాయమూర్తి అయినా బాధ్యతలు చేపట్టే ముందు భారత రాజ్యాంగానికి నిబద్ధమై పనిచేస్తానని ప్రమాణం చేస్తారు. అంటే న్యాయమూర్తులు రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. ఇందులో ఏ మత ప్రసక్తీ ఉండడానికి వీలులేదు. దేశంలో అత్యధిక సంఖ్యాకుల మాటే చెల్లాలన్న విచిత్రమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన వాతావరణం ఆవరించి ఉన్నప్పుడు న్యాయమూర్తులు తీర్పులు చెప్పేటప్పుడు మతాన్ని ఆధారంగా చేసుకోవడం రాజ్యాంగానికి బద్ధుడనై ఉంటానని చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకోసం ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయస్థానాలే ఆఖరి దిక్కుగా మారిన స్థితిలో న్యాయమూర్తులు రాజ్యాంగానికి బద్ధులై ఉండకపోవడం విషాదకరం. మతం ఆధారంగా తీర్పులు చెప్పడం అంటే పౌరుల ప్రాథమిక హక్కులను ఖాతరు చేయకపోవడమే. న్యాయమూర్తులు మతపరమైన నైతిక సూత్రాలకన్నా ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ నైతికతకే ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ గుజరాత్‌లోని కింది కోర్టులనుంచి మొదలుపెట్టి హైకోర్టు దాకా మతపరమైన అంశాలకు, ప్రభుత్వానికి అనువుగా నడుచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంఘటనలు ఇటీవల బాగా కనిపిస్తున్నాయి. ఒక మైనర్‌ బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతించాలని న్యాయస్థానాలను ఆశ్రయించింది. చివరకు ఈ కేసు గుజరాత్‌ హైకోర్టు దాకా వెళ్లింది. ఆ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సమీర్‌ దవే మనుస్మృతికి అనుగుణంగా నడుచుకోవాలని సలహా ఇచ్చారు. ‘‘మీ అమ్మమ్మను, లేదా ముత్తవ్వను అడగండి. అప్పుడు అమ్మాయిలకు 14-15 ఏళ్లకే పెళ్లిళ్లు అయి పోయేవి. 17వ ఏడు వచ్చేసరికి పిల్లల్ని కనేవారు. అబ్బాయిలకన్నా అమ్మాయిలకే ముందే పరిణతి వస్తుంది. మనుస్మృతి మీరు చదవరు. కానీ చదవండి. ఈ విషయాలు తెలుస్తాయి’’ అని గంభీరమైన ఉపన్యాసం చెప్పారు తప్ప గర్బవిచ్ఛిత్తి చేయించుకోవడానికి వీలు లేదని 2023 జూన్‌ 20న తీర్పు చెప్పారు. ఇదే న్యాయమూర్తి 2023 జూన్‌ 9న మాత్రం మరో కేసులో గర్భ విచ్ఛిత్తికి అనుకూలంగా తీర్పు చెప్పడం ఇంకా విచిత్రం. ఒకే న్యాయమూర్తి ఒకే రకమైన కేసులో భిన్నమైన తీర్పులు ఇవ్వడానికి చిన్న తర్కం లేకపోలేదు. రెండు సందర్భాల్లోనూ గర్భ విచ్ఛిత్తి చేయించుకుంటామని కోరడానికి కారణం వారిద్దరూ 17 ఏళ్ల వాళ్లే. ఇద్దరూ అత్యాచారానికి గురైన వారే. జూన్‌ 20న తీర్పు చెప్పిన సందర్భంలో ఉన్న అమ్మాయికి 30 వారాల గర్భం ఉంటే జూన్‌ 9న తీర్పు చెప్పిన ఉదంతంలో అమ్మాయికి 20 వారాల గర్భం ఉంది. ఆరోగ్య కారణాలవల్ల 30వారాల గర్భ విచ్ఛిత్తికి నిరాకరించి ఉండవచ్చు. కానీ మనుస్మృతిని ఉటంకించడం న్యాయమూర్తి సమీర్‌ దవే భావజాలం ఏమిటో రుజువు అవుతోంది. న్యాయమూర్తి సమీర్‌ దవే ఈ వ్యాఖ్యలు ఆయన తాత్వికతంతధోరణి ఏమిటో తెలిపోతోంది. ఆయన రాజ్యాంగానికి ఏ మాత్రం నిబద్ధుడు కాలేదని తేలిపోయింది. న్యాయమూర్తి దవే లాంటి వారి వ్యాఖ్యలు వింటే మన న్యాయవ్యవస్థ మతపరమైందిగా తయారవుతోందని అనిపిస్తోంది. 30వారాల గర్భంతో ఉన్న వ్యక్తి చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత శనివారం సుప్రీంకోర్టు నాయమూర్తులు బి.వి.నాగరత్న, ఉజ్జల్‌ భూయాన్‌ బెంచి గర్భ విచ్ఛిత్తికి అనుమతించింది. గుజరాత్‌ హైకోర్టు అనుమతి నిరాకరించడంవల్ల విలువైన సమయం వృథా అయిందని ఈ న్యాయమూర్తులు తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. పెళ్లి కాకుండా గర్భిణీ అయితే అది ప్రమాదకరమే కాదు, తీవ్ర మానసికవేదనకు దారితీస్తుందని న్యాయమూర్తులు తేల్చి చెప్పారు. ‘‘భారత సమాజంలో గర్భం ధరించడం నిజానికి ఆ జంటకే కాక, కుటుంబానికి, మిత్రులకు కూడా ఆనందదాయకమైంది. కానీ పెళ్లి కాకుండా, అందులోనూ అత్యాచారానికి గురై గర్భిణీ కావడం విపరీతమైన వ్యధనే మిగులుస్తుందని న్యాయమూర్తులు అన్నారు. అత్యాచారానికి గురి కావడమే బాధాకరమైనప్పుడు, గర్భం దాల్చడం తీవ్రవేదన కల్గిసిస్తుందని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ గర్భం స్వచ్ఛందమైందీ కాదు, తెలిసి జరిగింది కాదు అని న్యాయమూర్తులు చెప్పారు. వైద్యపరంగా గర్భ విచ్ఛిత్తి కోసం మనకు 1971 నాటి చట్టం ఉంది. దీని ప్రకారం సందర్భాన్నిబట్టి గర్భవిచ్ఛిత్తికి అనుమతించవచ్చు. శారీరక, మానసిక ఇబ్బందులు ఉన్నట్టయితే 20వారాలలోపు గర్భం తొలగించుకోవడానికి అనుమతి ఉంటుంది. ఈడురాని అమ్మాయిలు, అత్యాచారానికి గురైన బాలికలు అయితే 20 నుంచి 24 వారాల గర్భం ఉన్నా తొలగించుకోవచ్చు. గర్భస్థ పిండం సవ్యంగా లేకపోతే తల్లి ప్రాణం కాపాడడానికి గర్భ విచ్ఛిత్తి చేయించుకోవచ్చు. అంటే తల్లి ప్రాణం కాపాడడానికే మన చట్టం ప్రాధాన్యత ఇస్తుంది. శబరిమల కేసులో తీర్పు చెప్పినప్పుడు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిశీలించాలి. ‘‘అంబేద్కర్‌ ను చదివితే మనం స్వాతం త్య్రానికి మరో పార్శ్వం చూడాల్సివస్తుంది. స్వాతంత్య్ర పోరాటంతో పాటు సామాజిక అభ్యున్నతికోసం కూడా సమాంతరంగా ఉద్యమం సాగింది. ఇది సమాజంలో అసమానతలను తొలగించడంకోసం కొనసాగిన ఉద్యమం. ఇది చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి ఉద్దేశించిన ఉద్యమం. మౌలికమైన తప్పిదాలను ప్రాథమిక హక్కులను కల్పించడంవల్లే సరిదిద్దగలం. ఈ రెండురకాల ఉద్యమాల ఫలితమే భారత రాజ్యాంగం’’ అని చంద్రచూడ్‌ విడమర్చారు. 1927 డిసెంబర్‌ 25న డా.అంబేద్కర్‌ మను స్మృతిని దగ్ధం చేశారు. ఆ రోజును మనుస్మృతి దహనదినం, స్త్రీ విముక్తి దివస్‌గానూ జరుపుతున్నాం. మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాడకుండా స్త్రీవాదానికి విలువే ఉండదు. మనుస్మృతితో పోరాడడాలంటే మహిళలు స్వయం ప్రతిపత్తికోసం సంఘర్షణకు సిద్ధం కావలసిందే. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి సమీర్‌ దవే ఈ లోతుపాతుల్ని పట్టించుకున్నట్టు లేదు. ఇటీవలికాలంలో గుజరాత్‌లోని కింది కోర్టుల నుంచి హైకోర్టు దాకా భిన్నరీతిలో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి వ్యతిరేకంగా పనిగట్టుకుని గుజరాత్‌లోనే కేసులు దాఖలు చేస్తున్నారు. దీనికి 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో మాట్లాడుతూ ‘‘మోసగాళ్లందరి ఇంటి పేరు మోదీయే ఎందుకుంటుంది’’ అని రాహుల్‌ అన్నందుకు గుజరాత్‌లో కేసు దాఖలు కావడమే దీనికి ప్రబల నిదర్శనం. కింది కోర్టు, సెషన్స్‌ కోర్టు, హైకోర్టు మెట్లెక్కినా ఈ పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట కలగలేదు. చివరకు సుప్రీంకోర్టు ఆయనకు ఉపశమనం కల్పించింది. నిజానికి ఇదీ తాత్కాలికమే. ఆయనను దోషి అని తేల్చడం మీద స్టే విధించింది. రాహుల్‌ గాంధీ అసలు పోరాటం ఇంకా చేయవలసే ఉంది. న్యాయవ్యవస్థను లొంగదీసుకోవడానికి మోదీ చేస్తున్న ప్రయత్నానికి గుజరాత్‌లోని న్యాయస్థానాలు స్వచ్ఛందంగా సహకరిస్తున్నా యేమోనన్న అనుమానం కలుగుతోంది. గుజరాత్‌ కోర్టులు భిన్నంగా వ్యవహరించడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img