ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు రెండు దశలు పూర్తి అయి మూడోదశ పోలింగ్ వచ్చే ఆదివారం జరగనుంది. ఆదివారం తరవాత కూడా ఇంకా నాలుగు దశలు మిగిలే ఉంటాయి. అయినా యోగీ ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ ఓటమి పాలవు తుందేమోనన్న అనుమానాలు సర్వత్రా వ్యాపించాయి. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ రాజ్భర్ పార్టీని, జయంత్ చౌదరీ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌తో సహా ఇంకా అనేక చిన్నా చితక వర్గాలను కూడదీసి ఐక్య సంఘటన ఏర్పాటు చేసి బీజేపీకి పెద్ద సవాలు విసురుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ కేవలం యాదవులు, ముస్లింలకు పరిమితమైన పార్టీ అన్న నిందను అఖిలేశ్ విజయవంతంగా తొలగించుకున్నారు. ఇతర వెనుకబడిన వర్గాల వారిని సమీకరించారు. బీజేపీని ఓడిరచే సత్తా ఈ ప్రతిపక్ష కూటమికి ఉందా అన్న ప్రశ్నలు ఉన్నప్పటికీ బీజేపీఓటమి ఖాయం అన్న అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి చాలా కీలకమైన అంశం. అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. అయిదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి కనక మోదీ ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా ప్రచారం చేసే అవకాశం వచ్చి ఉండకపోవచ్చు. అయితే ఎన్నికల కార్యక్రమం ప్రకటించకముందే మోదీ ఉత్తరప్రదేశ్ లో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలో కరోనా ఆంక్షలు తక్కువ కావడం కూడా మోదీ పర్యటనలు ఎక్కువగా జరగడానికి తోడ్పడి ఉండవచ్చు. అనేక ప్రారంభోత్సవాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధాం కారిడార్ ప్రారంభించారు. అయితే ఈ సారి ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదల మాత్రం బీజేపీ లోనూ, ఆ పార్టీకి మాతృసంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్.లోనూ విపరీతంగా కనిపిస్తోంది. ఆర్.ఎస్.ఎస్. ఉత్తర ప్రదేశ్ అంతటా వేలు లక్షల సంఖ్యలో కార్యకర్తలను మోహరించి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. 2014 లోక సభ ఎన్నికల్లో, 2017 శాసన సభ ఎన్నికలలో, 2019 లోకసభ ఎన్నికలలో నరేంద్ర మోదీకి ఉన్న జనాకర్షక శక్తి, హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపే దూకుడు మనస్తత్వం బీజేపీ విజయానికి కారణమయ్యాయి. నిజానికి 2017 శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. ఆర్.ఎస్.ఎస్. ఒత్తిడి కారణంగానే పగ్గాలు యోగీ ఆదిత్యనాథ్‌కు అప్పగించారన్నది బహిరంగ రహస్యమే. ఈసారి యోగీ ఆదిత్యనాథ్‌నే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించేసింది. అయినా బీజేపీ విజయం కష్టమే అనుకోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. కానీ బీజేపీని గద్దెదించాలని ఓటర్లు కనక భావిస్తే అఖిలేశ్ నాయకత్వంలోని కూటమికే అవకాశాలున్నాయన్న నిర్ధారణకు రాకతప్పదు. దాదాపు గత మూడుదశాబ్దాల నుంచి ఉత్తరప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ కూడా వరసగా రెండవ సారి అధికారంలోకి రాలేదు. యోగీ ఓటమి ఎదుర్కోక తప్పదు అనే వారికి దీన్ని కూడా బలమైన కారణంగా చూపుతున్నారు.
చిక్కేమిటంటే ఇవన్నీ గణాంకాలు, కుల సమీకరణల్లో వచ్చిన మార్పుల ఆధారంగా వేసే అంచనాలే. అయినా యోగీ విజయం మీద విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇంకా అయిదు దశల పోలింగు మిగిలే ఉంది కనక పరిస్థితి మారనూ వచ్చు. అఖిలేశ్‌యాదవ్‌కు అధికారం అప్పగిస్తే యు.పి.లో మళ్లీ గూండాలు రాజ్యమేలుతారని యోగీ హెచ్చరిస్తున్నారు. మతతత్వ రాజకీయాలను సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. యోగీ అసలు సమస్య ఏమిటంటే అయిదేళ్లకాలంలో తన ప్రభుత్వం నికరంగా సాధించిం దేమిటో చెప్పుకుని దాని ఆధారంగా రెండోసారీ ఓటర్ల మద్దతు సమకూర్చు కోవడానికి అనువైన అంశాలు ఏమీ కనిపించడంలేదు. ప్రజలకు సమస్యలు లేవని కాదు. తమ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయం వేపు చూడడం ప్రజల హక్కు. తాము ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ చేశామని యోగీ చెప్పుకోవచ్చు. వీటన్నింటి పస ఏమిటో జనానికి ఎవరూ చెప్పక్కర్లేదు. ఉత్తరప్రదేశ్ లో నిరుద్యోగం తాండవిస్తోంది. నిరుద్యోగం ఒక్క ఉత్తరప్రదేశ్ సమస్య కాదన్న మాట నిజమే కానీ అక్కడ కనీసం 35 లక్షల మంది నిరుద్యోగులున్నారని అంచనా. రెండేళ్లకింద 13 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు అది రెండున్నర రెట్లు అయింది. భారం అంతా యోగీ మోయవలసి వస్తోంది. తన పాలనలోని సుగుణాలను యోగీ ఎంతగా టముకు వేసుకున్నా ప్రతికూల అంశాలు అంతకన్నా బలీయంగా ఉన్నాయి. ఏడాదికి పైగా సాగిన రైతుఉద్యమంలో ఉత్తరప్రదేశ్ రైతులపాత్ర గణనీయ మైందే. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నప్పటికీ ప్రధాని స్వయంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరనందువల్ల రైతులలో అసంతృప్తి గూడుకట్టుకుంది. తమను తీవ్రవాదులని, ఖాలిస్థానీలని బీజేపీ నిందించిన విషయం ఇంకా రైతులను వేధిస్తూనే ఉంది. సుప్రీంకోర్టు రైతుల వ్యవహారంపై కమిటీ వేసినా ఆ కమిటీ ఏం తేల్చిందో తెలియదు. రైతు ఉద్యమం నీరుగారిపోతోందనుకున్న దశలో ఘాజీపూర్ సరిహద్దులో రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్‌తికైత్ నాకు ఆత్మహత్య తప్ప శరణ్యంలేదని కంట తడి పెట్టడం రైతుల ఐక్యతను బలోపేతంచేసింది. అంతకు ముందు 2013లో ముజఫ్ఫర్‌నగర్‌లో మత కలహాలలో జాట్లు నిర్వహించిన పాత్రను మరిచిపోయి ముస్లింలతో ఐక్యతకోసం పాటుపడ్డారు. తికైత్ రెండు నిముషాలు పెట్టుకున్న కన్నీళ్లు హిందువులను ముస్లింలను ఐక్యం చేయడమే కాక బీజేపీ మీద వ్యతిరేకభావం పెరిగింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి కమిటీ ఏర్పాటుచేస్తామన్న వాగ్దానంఏమైందో ఎవరికీ అంతు బట్టడంలేదు. అజయ్‌మిశ్రా కుమారుడు లఖింపూర్‌ఖేరీలో ప్రవర్తించిన తీరు రైతుల మనసులను తీవ్రంగా గాయపరిచింది. ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది. గోవును మాంసంకోసం వినియోగించుకోవడాన్ని నిషేధించినా గత మూడు నాలుగేళ్లలో తగినన్ని గోశాలలు నిర్మించక పోవడంతో పశువులు పంటలను పాడు చేయడం రైతులకు ఎదురవుతున్న పెద్ద సమస్యే. కరోనా విజృంభించిన సమయంలో అంత్యక్రియలు కూడా సాధ్యం కానందువల్ల శవాలను గంగానదిలో పడవేయవలసిన దుస్థితిని జనం ఎలా మరచి పోగలరు. ఎన్నికల ప్రచారక్రమంలొ యోగీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడానికి తోడు ముస్లింలను కించ పరచడానికి అబ్బాజాన్, కబ్రస్థాన్, పైజామా, టోపీ, 80 శాతానికి 20 శాతానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు లాంటి మాటలు ముస్లింలనే కాక హిందువులలో కూడా పునరాలోచనకు దారి తీశాయి. మతతత్వంవల్ల ఒరిగేదేమీ లేదు అని జనం గ్రహించారు. ముస్లింలు, యాదవుల మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర వెనుకబడిన వర్గాలను సమీకరించడానికి అఖిలేశ్ చేసిన ప్రయత్నం ప్రజలకు ఆశా దీపంగా కనిపించినా ఆశ్చర్యం లేదు.