Monday, August 15, 2022
Monday, August 15, 2022

గోవాలో ప్రజాస్వామ్య మరణం వాయిదా

మెజారిటీలేని చోట పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంతో బీజేపీ సంతృప్తి పడదు. అధికారంలో ఉన్న చోట కూడా బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను చాకచక్యంగా వినియోగించుకోవడంలో ఆ పార్టీ అపారమైన నైపుణ్యం సాధించింది. గోవాలో వరసగా మూడవసారి బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం ప్రమోద్‌ సావంత్‌ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. 40 మంది సభ్యులున్న శాసనసభలో బీజేపీకి 20 మంది సభ్యులున్నారు. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీకి చెందిన ఇద్దరు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. సామదానభేద దండోపాయాలు ఉపయోగించి అధికారంలో కొనసాగడం, మెజారిటీ కొరవడితే ఫిరాయింపులను ప్రోత్సహించి మెజారిటీ సంపాదించడం మాత్రమే బీజేపీ లక్ష్యం కాదు. అసలు ప్రతిపక్షమే ఉండకూడదన్నది ఆ పార్టీ ఆంతర్యం. అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను అస్థిరీకరించడంలో బీజేపీ నైపుణ్యం అపారమైందని ఇటీవలే మహారాష్ట్రలో రుజువైంది. గోవా శాసనసభలో 11 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యులు ఉంటే అందులో తొమ్మిది మంది బీజేపీలోకి ఫిరాయించడానికి సిద్ధంగా ఉనారన్న వార్తలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌, మైఖేల్‌ లోబోను ఫిరాయింపుల చట్టానికి అనుగుణంగా అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ శాసనసభ స్పీకర్‌ ను అభ్యర్థించింది. ఇలాంటి సందర్భాలలో స్పీకరు అందునా అధికార బీజేపీ సమర్థకుడైన స్పీకర్‌ తక్షణం స్పందించి చర్య తీసుకునే అవకాశం ఎటూ లేదు. లోబో, కామత్‌ తో పాటు మరో ఆరుగురు పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా ఫిరాయించాలంటే ఎనిమిది మంది ఒకే సారి ఫిరాయించాలి. గత రెండు రోజులుగా ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూనే ఉన్నాయి. అయితే ఎనిమిది మంది సభ్యులు ఫిరాయించడానికి సిద్ధంగా లేనందువల్ల ఫిరాయింపుల పర్వం తాత్కాలికంగా ఆగింది. అయితే సమీప భవిష్యత్తులో ఈ ఫిరాయింపు ప్రక్రియ పూర్తి కావచ్చు. కాంగ్రెస్‌శిబిరంలో అలజడి కనిపించగానే అధిష్ఠానవర్గం సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ముకుల్‌ వాస్నిక్‌ను సోనియాగాంధీ గోవాకు పంపించారు. సోమవారం ఉదయం కాంగ్రెస్‌ శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేస్తే 11 మందిలో ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. మైకేల్‌ లోబో, దిగంబర్‌ కామత్‌ తో పాటు లోబో భార్య డెలిలా లోబో, కేదార్‌ నాయక్‌ హాజరు కాలేదు. అంటే కాంగ్రెస్‌ లో సోమవారం నాటికి నికరంగా మిగిలింది ఏడుగురే. తాము పార్టీ ఫిరాయించాలని అసలు ప్రయత్నించనే లేదని దిగంబర్‌ కామత్‌, లోబో వాదిస్తున్నారు. ఇందులో నిజం లేదని అందరికీ తెలుసు. తాను పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నిస్తున్నానన్న ఆరోపణలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని కామత్‌ అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి స్థానం నుంచి లోబోను కాంగ్రెస్‌ ఇప్పటికే తప్పించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు లోబో బీజేపీని వదిలి కాంగ్రెస్‌ లో చేరారు. సరిగ్గా మూడేళ్ల కిందట 15 మంది కాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. ఎన్నికలు జరగడానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థుల చేత పార్టీ ఫిరాయించబోమని అన్ని పార్టీలు ప్రమాణం చేయించాయి. అభ్యర్థులు గుళ్లు, దర్గాలు, చర్చీల్లోకి వెళ్లి ప్రమాణాలు కూడా చేశారు. కానీ బీజేపీ ఆశచూపే డబ్బు సంచుల ముందు ప్రమాణాలు ఎందుకు కొరగావు. ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్న ఒక్కో శాసనసభ్యుడికి 40 కోట్ల రూపాయలు ఇస్తామని బీజేపీ ఆశచూపుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దిగంబర్‌ కామత్‌ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటిమీద విచారణకూడా జరుగుతోంది. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ గంగలో ముణగడం ఒక్కటే మార్గం అన్న సూత్రాన్ని కామత్‌ అనుసరించాలనుకుంటారు. లోబో అధికార దాహంవల్ల బీజేపీలో చేరాలనుకుంటున్నారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. లోబో అంతకు ముందు బీజేపీ హయాంలో మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను విజయ పథంలో నడిపించినప్పటికీ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వనందుకు కామత్‌ గుర్రుగా ఉన్నారు. లోబో, కామత్‌ కలిసి ఫిరాయింపు కుట్ర పన్నుతున్నారన్నది కాంగ్రెస్‌ అనుమానం. గోవా శాసనసభ డిప్యూటీస్పీకర్‌ ఎన్నిక జరగవలసి ఉండిరది. కానీ అది వాయిదా వేశారు. ఫిరాయింపుదార్లలో ఎవరికో ఆ పదవి ఇవ్వడానికే వాయిదా వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట, లేదా జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల మీద సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదయపు పన్ను శాఖ ను ప్రయోగించడం బీజేపీ ఒక విధానంగా అమలు చేస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఫిరాయిస్తారనుకున్న అయిదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. అయితే ఫిరాయింపుల గురించి తనకు తెలియదనీ శాసనసభ సమావేశాలకు ముందు ఎమ్మెల్యేలు తననుకలుసుకోవడం మామూలేనని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఫిరాయింపులను ప్రస్తుతానికైనా కాంగ్రెస్‌ నిరోధించగలగడం ఆశ్చర్యకరమే. గోవా మొదటి నుంచి అస్థిర రాజకీయాలకు ప్రతీతి. అధికారపార్టీ ప్రతి పక్షాలను బలహీన పరచడంలో ఆశ్చర్యం లేదు. కానీ కాంగ్రెస్‌ బలహీన స్థితి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న సూచనేలేదు. గోవా శాసన సభ్యుల్లో అందరికీ అక్కడ భూబకాసురలేనన్న పేరుంది. కొత్తగా ఎన్నికైనవారే దీనికి మినహాయింపుకావచ్చు. ఖనిజాల తవ్వకంలో కుంభకోణాలూ కొత్త కాదు. సమస్య ఏమిటంటే ఒక్క కాంగ్రెసే కాదు ప్రతిపక్షాలన్నీ బీజేపీ నుంచి తమను తాము కాపాడు కోవడానికి ప్రయత్నించడం తప్పదు. డబ్బుప్రభావం విపరీతంగా పెరుగుతున్నస్థితిలో ఫిరాయింపులు సహజమైపోయాయి. సిద్ధాంత ప్రాతి పదిక ఉన్న పార్టీలను వెతికి పట్టుకోవలసిన స్థితిలో ఉన్నాం. అందువల్ల ప్రతిపక్షంలో ఉన్నవారూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న తాపత్రయంలో డబ్బుసంపాదనవేటలో పడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీకి ఉన్న శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసినవే. ఏమైనా ప్రతిపక్షాలను చీల్చవలసినఅవసరం బీజేపీకి లేకుండానే తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీలో చేరడానికి ప్రతిపక్షాల ప్రజా ప్రతినిధులు సదా సిద్ధంగాఉన్నారు. అయితే ప్రతిపక్షాలు లేకుండా చేయడం అన్న బీజేపీ లక్ష్యాన్ని నిరాకరించడమూ కుదరదు. ప్రజాస్వామ్య విలువలు నానాటికీ అనేకపార్టీలలో లుప్తమవుతున్న వేళ ఇలాంటి పరిణామాలు ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించవు. దిగంబర్‌ కామత్‌ తో సహా శాసనసభ్యులు అందరూ భూములు, ఆస్తులసంపాదనలో నిమగ్న మయ్యారు. గోవా పత్రికలు తిరగేస్తే భూబకాసురల ప్రభావం ఎంత ఉందో, అందులో రాజకీయ నాయకుల కీలక పాత్ర ఏమిటో అర్థం అవుతుంది. మొదటిసారి ఎన్నికైన ముగ్గురినిమాత్రమే ఇందులో నుంచి మినహాయించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img