చంద్రయాన్-3 విజయవంతం కావడంతో మన శాస్త్ర పరిశోధనల సత్తా మరోమారు రుజువైంది. 2023 ఆగస్టు 23 విజ్ఞాన శాస్త్రాభివృద్ధి ప్రయోజనాలను అర్థం చేసుకోగలిగిన వారందరికీ పర్వదినం. సరిగా మూడురోజుల కింద అంటే గత ఆదివారం రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలమైనప్పటికీ నిరుత్సాహపడకుండా ఇస్రో శాస్త్రవేత్తలు దృఢ దీక్షతో చంద్రయాన్ లక్ష్యాన్ని ఇసుమంత తేడాలేకుండా సాధించగలిగారు. 2019లో చంద్రయాన్ -2 వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తలను కుంగదీయలేదు. అందులో జరిగిన ప్రతి చిన్న లోపాన్ని కనిపెట్టి వాటన్నింటికీ చంద్రయాన్ -3 లో చోటులేకుండాచేసి తమ శాస్త్రపరిజ్ఞానాన్ని పరీక్షకు పెట్టి విజయం సాధించారు. దేశం సాధించిన ఈ మహత్తర విజయాన్ని కోట్లాది మంది భారతీయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి ఉత్తేజితులయ్యారు. స్ఫూర్తి పొందారు. ప్రత్యక్షప్రసారం కోసం ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. పాఠశాలలు కూడా బుధవారం సాయంత్రం దాకా తెరచి ఉంచి విద్యార్థులకు ఈ అద్భుత ఘట్టాలు చూపించి వారి భవిష్యత్ పథాన్ని నిర్దేశించడానికి ప్రయత్నించాయి. చంద్రుడి మీదికి చేరుకోవడానికి 2019లో చేసిన రెండోప్రయత్నం విఫలంకావడం నిరాశపరచ కుండా విజయానికి అది మరో మెట్టుగా ఉపకరించింది. అభివృద్ధి చెందుతున్న దేశం ఎదుర్కునే ప్రతి అపజయం అంతిమంగా విజయపథానికి చేరువ చేస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు నిరూపించారు. చంద్రయాన్ -3 కార్యక్రమం ద్వారా లాండర్‌ను చంద్రుడి దక్షిణధ్రువం మీద సురక్షితంగా దింపగలిగారు. వచ్చే 14 రోజులు చాలా కీలకమైనవి. ఎందుకంటే చంద్రుడి మీద ఒక రోజు అంటే భూమి మీద 14 రోజులకు సమానం. చంద్రుడి మీద దిగిన ఈ వ్యోమ పరికరానికి విక్రం అని పేరు పెట్టారు. భారత అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టిన విక్రం సారాభాయ్ పేరే లాండర్‌కు కూడా పెట్టారు. ఇక మిగిలిందల్లా ప్రజ్ఞాన్ లోవర్ విడిపోవడమే. అదీ త్వరలో పూర్తి కావచ్చు. ఈసారి చంద్రయాన్ సఫలం కావడం భారత అంతరిక్ష పరిశోధనల్లో అద్వితీయమైన విజయం. ఈ విజయం భారత్‌ను అరుదైన అమెరికా, రష్యా, చైనా సరసన చేర్చింది. భారత్ చంద్రుడి మీదకు చేరుకున్న నాల్గో దేశంగా నిలిచి చరిత్ర సృష్టించింది. జులై 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 ప్రయోగించారు. ఆగస్టు అయిదవ తేదీన ఈ వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి తొలి విజయం సాధించాం. ఆగస్టు 17వ తేదీన ముందుగా నిర్ణయించినట్టే విక్రంలాండర్ ప్రధాన వ్యోమనౌకనుంచి విడిపోయి మరో విజయం నమోదుచేసింది. నిజానికి చంద్రయాన్ -3 ప్రయోగం 2021లో జరగాల్సింది. కానీ కరోనా కారణంగా అనివార్యంగా ఆలస్యమైంది. చంద్రయాన్ -2 పాక్షికంగానే విజయవంతం అయింది. చంద్రుడి మీద దిగిన తరవాత లాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. కానీ మూడోసారి ప్రయోగంలో ఈ వారం ఆరంభంలోనే చంద్రయాన్-3 లాండర్‌తో సంబంధాలు కొనసాగించడంలో శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. చంద్రయాన్ -2 ఇంకా కక్ష్యలో తిరుగుతూనే ఉంది. చంద్రయాన్ -3 సఫలం కావడం అంటే సమాజం ఎదుర్కుంటున్న అసలు సమస్యల పరిష్కారానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో భారత్ ఏ దేశానికీ తీసిపోకూడదు అన్న మన అంతరిక్ష పరిశోధనలకు ఆద్యుడు విక్రం సారాభాయ్ కన్న కల సాకారమైనట్టే. 52 ఏళ్ల కిందట 1969 జులై 21న అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్వర్డ్ కాలిన్స్ చంద్రుడి మీద కాలుమోపి చరిత్ర సృష్టించిన తరవాత చంద్రగ్రహం ఆనుపానులు కనుక్కోవాలన్నా దీక్ష భారత శాస్త్రవేత్తల్లో ఇనుమడిరచింది. 2009లో భారత్ చంద్రయాన్ – 1కి శ్రీకారం చుట్టింది. బుధవారం నిర్ణయాత్మక దశకు చేరుకుంది. చంద్రుడిమీద దిగడానికి మనం ఎంచుకున్న దక్షిణ ధ్రువం చాలా సంక్లిష్టమైంది. అక్కడ నీటి జాడలున్నాయి. చంద్రుడిమీద మంచు జాడలు ఉండొచ్చు. వీటి గురించి పరిశోధించగలిగితే అవి అత్యంత విలువైన వనరులవుతాయి. చంద్రుడిమీద నీటి జాడలున్నట్టు 2009లో మనం చేపట్టిన చంద్రయాన్ -1 ప్రయోగమే తేల్చింది. దీనికి నాసా ఉపకరణం తోడ్పడిరది. చంద్రుడి మీద నీరు ఉందన్న అంశం రూఢ అయితే భవిష్యత్ యాత్రలకు ప్రయోజనం ఉంటుంది. ఆ నీటిని మంచినీటిగా వాడుకోవచ్చు, లేదా పరికరాలను చల్లబరచడానికి, చివరకు ప్రాణ వాయువు ఉత్పత్తి చేయడానికి వాడుకునే అవకాశం ఉండొచ్చు. ఈ విజయం వెనక వందలాది మంది శాస్త్రవేత్తల పరిజ్ఞానం, పరిశోధన, దీక్ష, పట్టుదల ఉంది. అనేక వేలమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విజయానికి కారకులయ్యారు. ఇస్రో అధిపతి సోమనాథ్ నాయకత్వంలో చంద్రయాన్ -3 పథకంలో భాగస్వాములైన డజన్ల కొద్దీ శాస్త్రవేత్తలు ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి అదే సర్వస్వంగా గడిపారు. సరిగ్గా బుధవారం సాయంత్రం ఆరుగంటల నాలుగు నిముషాలకు లాండర్ చంద్రుడి మీద దిగిన తరవాత వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. చివరి 17 నుంచి 20 నిముషాలు భయోత్పాతాన్ని కలిగించేవి అని శాస్త్రవేత్తలే చెప్పినా ప్రయోగం విజయం సాధించడంతో ఆ భయకంపిత ఉద్వేగ భరిత క్షణాలు మటుమాయ మయ్యాయి. ఇది కేవలం భారత విజయంకాదు. విజ్ఞానశాస్త్ర ప్రయోజనా లను గ్రహించిన యావత్ప్రపంచం ఆనందించవలసిన సమయమిది. ఈ విజయం ఇస్రో శాస్త్రవేత్తల్లో నూతన ఉత్సాహం నింపుతుంది. త్వరలో సూర్య గ్రహ పరిశోధనకు ఆదిత్య ఎల్-1 ప్రయోగించడానికి నూతనోత్సాహంతో మన శాస్త్రవేత్తలు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నాలుగేళ్లుగా చేసిన రెండు ప్రయత్నాలలో చంద్రయాన్ -2 పాక్షిక వైఫల్యం నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరుసటి ప్రయత్నంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం సాధించిన విజయం సామాన్యమైంది కాదు. ఇప్పటికే మన అంతరిక్ష పరిశోధనలు అనేక రకాలుగా వాతావరణ పరిశీలనకు, తుపాన్లను ముందే కనిపెట్టడానికి అపారంగా ఉపకరిస్తున్నాయి. మన వాతావరణ పరిశీలక ఉపగ్రహాలవల్ల ఇతర దేశాలు, ముఖ్యంగా బడుగు దేశాలు లబ్ధిపొందుతున్నాయి. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న మన ప్రయత్నాలకు సైతం అమెరికా అడ్డుతగిలిన వాస్తవాన్ని మరిచి పోకూడదు. కానీ మన శాస్త్రవేత్తల దీక్షవల్ల ఇవ్వాళ ఉపగ్రహాలనే కాదు అంతరిక్షంలోకు ఉపగ్రహాలను మొదలైన వాటిని ప్రయోగించడానికి కావలసిన వ్యోమ నౌకలను రూపొందించే సత్తా సంపాదించాం. శాస్త్ర పరిధి భూగ్రహం పరిధి దాటి దశాబ్దాలు గడిచింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఏ దేశానికీ తీసిపోదని ఇప్పటికే అనేకసార్లు మన శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇది నిరంతర పరిశోధనా ఫలితం. విజ్ఞానశాస్త్ర అభివృద్ధి మానవ మేధస్సును మరింత పదునెక్కిస్తోంది. ఇందులో భారత్ సాధిస్తున్న విజయాలు మానవ సమాజానికి తప్పనిసరిగా ఉపయోగపడ్తాయి.