Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

చక్రం తిప్పుతున్న బీజేపీ

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు తన పార్టీ అసలు స్వరూపాన్ని బయట పెట్టారు. మాజీ ముఖ్యమత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే మీద విరుచుకు పడ్డారు. ఉద్ధవ్‌ ఠాక్రే కళ్ల ఎదురుగా నుంచే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లాం చూడండి అని కడుపులో ఉన్న మాట బయట పెట్టారు. ఎన్నికలలో ప్రజల తీర్పును అంగీకరించే అలవాటు మోదీ హయాంలో బీజేపీకి ఎప్పుడూ లేదు. అనేక రాష్ట్రాలలో మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎరవేసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ప్రజాస్వామ్య వ్యతిరేక లక్షణాన్ని నరనరాన జీర్ణించుకున్న బీజేపీ తత్వం ఏమిటో దేవేంద్ర ఫడ్నవీస్‌ మాటల్లో స్పష్టం అవుతోంది. మీకే కాదు మీ ‘‘అబ్బకు కూడా భయపడం’’ అని తెగేసి చెప్పారు. ఇలాంటి భాష మర్యాదకరమైంది కాదని కూడా ఆయన గ్రహించలేదు. తమ ప్రభుత్వాన్ని పడగొడితేె ముంబై మొత్తం దగ్ధమవుతుంది అని ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు అన్నమాటను ప్రస్తావిస్తూ దగ్ధం కాకపోగా ఎక్కడా ఒక్క అగ్గి పుల్ల కూడా వెలగలేదు అని ఫడ్నవీస్‌ అన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే నాయ కత్వంలోని శివసేన వర్గాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విసిరిన సవాలును అమలుచేసే పనిలో ఫడ్నవీస్‌ తలమునకలై ఉన్నారని ఆయన దూకుడు వైఖరే నిరూపిస్తోంది. మహారాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడిన తరవాత ఫడ్నవీస్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఏ మేరకు కుళ్లబొడవగలుగుతుందో నిరూపించే ప్రయత్నం చేశారు. శ్రీ సిద్ధి వినాయక ట్రస్ట్‌లో జరిగిన అవకతవకలపై విచారణ త్వరలో పూర్తవుతుందని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గాన్ని భయపెట్టడానికీ ప్రయ త్నించారు. తదుపరి శాసనసభ సమావేశం ఫిబ్రవరి 27న ప్రారంభంఅయ్యే సూచనలు ఉన్నాయి. శివసేనలోని ఉద్ధవ్‌, షిండే వర్గాలమధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఈ జగడం బుధవారం బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో వికృత రూపంలో వెల్లడైంది. శివసేన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి శివసేనలోని రెండువర్గాలు పోటీ పడ్డప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కలగజేసుకుంటే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు. శివసేన పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండువర్గాలు భీకర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించిన శివసేన చీలికవర్గం నాయకుడు ఏక్‌నాథ్‌ షిండేవి దిష్టి కళ్లు, ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యాలయాన్నే స్వాధీనం చేసుకుంటారు జాగ్రత అని ఉద్ధవ్‌ ఠాక్రే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ను హెచ్చరించారంటే వీరి వైరం ఎంతదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నాగపూర్‌లోని ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ స్మృతి మందిరాన్ని సందర్శించారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ సిద్ధాంతవేత్త ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ స్మృతి కేంద్రంవద్ద కూడా షిండే, ఫడ్నవీస్‌ నివాళులు అర్పించారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఉద్ధవ్‌ ఠాక్రే ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నాయకులు ఆర్‌.ఎస్‌.ఎస్‌ పదాధికారులతో కూడా సమావేశమయ్యారు. ఏ వ్యవస్థనూ నిర్మించలేనివారు ఉన్న వ్యవస్థను దొడ్డిదారిలో చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపణ.
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభలో మిగతా అన్ని పార్టీలకన్నా ఎక్కువగా బీజేపీకి 106మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌.సి.పి)తో కూడిన మహావికాస్‌ అగాఢీ ప్రభుత్వం గత జులైలో పతనమైంది. ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి ఏక్‌నాథ్‌షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వర్గంలో ఇప్పుడు 40 మంది ఉన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలో 17మంది మాత్రమే మిగిలారు. మరి ఫడ్నవీస్‌ చెప్తున్నట్టు 50మంది సభ్యులను ఎలా లాక్కెళ్లారో తెలియదు. ఉద్ధవ్‌ఠాక్రే నాయకత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఏక్‌నాథ్‌ షిండే లక్ష్యం కనక బీజేపీకి 106 సీట్లు ఉన్నప్పటికీ షిండేనే ముఖ్యమంత్రి అయిపోయారు. దీన్నిబట్టి బీజేపీ వెనకనుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్న విమర్శ ఆ రోజుల్లోనే వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కాస్త కుదుటబడిన తరవాత బీజేపీ నాయకుడు ఫడ్నవీస్‌ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి హెచ్చరికలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి కావడానికి ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలలో శిబిరాలు ఏర్పాటు చేయడంలాంటి విద్యలన్నీ షిండే ప్రదర్శించారు. ఇప్పుడు శాసనసభ్యుల బలంరీత్యా చూస్తే ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని వర్గం ఘోరమైన మైనారిటీలో పడిపోయింది. ఆ వర్గాన్ని ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ వర్గం అంటున్నారు. షిండే నాయకత్వంలోని వర్గాన్ని బాలాసాహెబ్‌ శివసేన అంటున్నారు. వెరసి బాలా సాహెబ్‌ ఠాక్రే వారసత్వం ఎవరిది అని జగడం నడుస్తోంది. ఈ తంపులు పెట్టింది బీజేపీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉమ్మడి శివసేన ఎన్నికల చిహ్నమైన విల్లంబుల గుర్తుకోసం రెండువర్గాలూ తలపడ్తున్నాయి. శివసేన శాసనసభ శీతాకాల సమావేశాలు నాగపూర్‌లో జరిగాయి. ఆ సందర్భంగానే షిండే, ఫడ్నవీస్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకులతో భేటీ అయ్యారు. ముంబైలోని బృహన్ముంబై కార్యాలయం మీద ఆధిపత్యంకోసం షిండే వర్గం తీవ్రప్రయత్నం చేస్తోంది. బీజేపీ షిండేకు దన్నుగాఉంది. ముంబైని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. శివసేనలోని రెండువర్గాల ఆధిపత్య పోరాటంలో కర్నాటకకు, మహారాష్ట్రకు మధ్య ఉన్న తగాదాలను కూడా పరస్పరారోపణలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ గొడవలో మహారాష్ట్ర గవర్నర్‌ బి.ఎస్‌.కోషియార్‌ రాజీనామా చేయాలని కూడా ఉద్ధవ్‌ ఠాక్రే గట్టిగా కోరుతున్నారు. కోషియారీ మహారాష్ట్ర ప్రజలకు ఆదరణీయులైన నాయకులను అవమానిం చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్ధవ్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో దేవాలయాలను తెరిపించాలని కోరి గవర్నర్‌ కోషియారీ వివాదాలకు తెరలేపారు. ఛత్రపతి శివాజీని, సావిత్రీబాయి ఫూలేను, మహాత్మాఫూలేను కించపరుస్తూ మాట్లాడిన కోషియారీకి గవర్నర్‌గా కొనసాగే హక్కు లేదని ఉద్ధవ్‌ ఠాక్రే అంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర మధ్య రగులుతున్న వివాదం కూడా శివసేనవర్గాల మధ్య వైరానికి ఆజ్యం పోయడం బాధాకరం. కర్నాటకలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. మహారాష్ట్రలోనూ బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామే. అయినా రెండు రాష్ట్రాల మధ్య వివాదం తారస్థాయికి చేరడం సైతం బీజేపీ రాజకీయ పన్నాగంలో భాగమే అనుకోవాలి. ఏమైనప్పటికీ బీజేపీ ఇప్పటిదాకా తెరవెనక ఉండి నాటకం నడిపిస్తే ఫడ్నవీస్‌ ప్రకటనతో ఇప్పుడు బాహాటంగానే షిండేను తోలుబొమ్మనుచేసి బీజేపీ చక్రం తిప్పుతోందని రూఢ అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img