రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ లేనట్టు ప్రధాన మంత్రి మోదీ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన రాహుల్ మీద కక్ష తీర్చుకోవాలంటే న్యాయస్థానాల దగ్గర నుంచి, పార్లమెంట్ సెక్రటేరియట్ వరకు అన్నీ విపరీతమైన వేగంతో పనిచేస్తాయి. 2019లో కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ’’ ఇలా దొంగలందరి ఇంటి పేర్లు మోదీ అనే ఎందుకు ఉంటుంది అన్నందుకు సూరత్‌లోని ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్.హెచ్.వర్మ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించారు. ఏ కేసులో అయినా జైలుశిక్షపడితే నేరస్థుడి కిందే లెక్క కనక, రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యుడు గనక ఆ సభ్యత్వం రద్దవుతుంది. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి పనిగట్టుకుని తనకు ప్రత్యర్థిగా భావిస్తున్నారు గనక లోక్‌సభ సెక్రటేరియట్ సూరత్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువడిన మర్నాడే లోక్‌సభ సభ్యునిగా అనర్హుడిగా ప్రకటించింది. ఈ తీర్పు చెప్పిన మేజిస్ట్రేట్ వర్మ దోషిగా తేలిన రాహుల్ హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి అనువుగా శిక్ష అమలు కాకుండా 30 రోజులు గడువిచ్చారు. అంటే శిక్ష అమలుపై స్టే విధించారు. కానీ నేరనిర్ధారణ మీద స్టే విధించలేదు. పరువునష్టం కేసుల్లో, ముఖ్యంగా నేరపూరిత పరువునష్టం కేసుల్లో అత్యధికంగా రెండేళ్లు మాత్రమే శిక్ష విధించవచ్చు. ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వర్మ సరిగ్గా అదే పనిచేశారు. ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వర్మ ఇచ్చిన తీర్పు తప్పా..ఒప్పా అన్న విషయం ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిస్తేనేగాని తేలదు. కానీ దిల్లీలో నివసించే వ్యక్తి ఎక్కడో కర్ణాటకలోని కోలార్‌లో, అదీ ఎన్నికల ప్రచార సమయంలో చేసిన ప్రసంగంలో మోదీ ఇంటి పేరు ఉన్న వారందరూ దొంగలుగా ఎందుకుంటారు అని ప్రశ్నిస్తే గుజరాత్‌లో ఉన్న ఓ వ్యక్తి కేసు దాఖలుచేస్తే సదరు మేజిస్ట్రేటుకు దాన్ని విచారించే అధికార పరిధి ఉందా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇవన్నీ చట్టంలో, న్యాయంలో ఇమిడి ఉన్న ధర్మ సూక్ష్మాలు. ఇవి ఎప్పుడో ఒకప్పుడు తేలుతాయి. అంతకు మించిన వ్యవహారం ఏమిటంటే రాహుల్ గాంధీ ‘‘నరేంద్ర మోదీతో పాటు నీరవ్ మోదీ, లలిత్ మోదీ’’ లాంటి వారి పేర్లు ఏకరువు పెట్టి ఈ ఇంటి పేరున్నవారు అందరూ దొంగలుగా ఎందుకుంటారు అనడం పరువు నష్టం కిందకు వస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఒక కులాన్నో, వర్గాన్నో, మతాన్నో, ఒక వృత్తిలో ఉన్న వారినో కట్టగట్టి పరువుకు భంగం కలిగించే మాట అంటే అది సామూహిక వ్యవహారం కనక ఆ సమూహానికి చెందిన వ్యక్తి తన పరువుకు భంగం కలిగిందని వాదించడం సబబేనా, ఈ అంశంపై కోర్టు విచారణ చేపట్టవచ్చునా అన్న ప్రశ్నలూ చర్చలో ఉన్నాయి. ఒక సమూహాన్ని ఉద్దేశించి అమర్యాదకరంగా మాట్లాడినప్పుడు ఆ సమూహానికి చెందిన ఒక వ్యక్తి ఆ మాటలవల్ల తన పరువుకు నష్టం కల్గిందని వాదించడం కుదరదని అంటున్న న్యాయకోవిదులూ ఉన్నారు. కానీ సూరత్‌లో విచారణ పూర్తి అయింది. రాహుల్ గాంధీని దోషిగా తేల్చారు. ఇందులోనూ ఓ మతలబు ఉంది. ఈ కేసు దాఖలు చేసిన పూర్ణేశ్ మోదీ మాజీ మంత్రి. ప్రస్తుతం శాసనసభ్యుడు. కానీ సమూహాన్ని ఉద్దేశించి పరువుకు నష్టం కలిగించే మాటలు అన్నప్పుడు ఆ సమూహంలోని ఒక వ్యక్తి తన పరువుకు భంగం కల్గిందని వాదించడం కుదరదనుకున్నప్పుడు ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ కేసును విచారణకు చేపట్టనే కూడదు. చేపట్టారంటే కారణం ఏదో ఉంటుంది. అది సహేతుకమైందో కాదో హై కోర్టులో, అక్కడా కుదరకపోతే సుప్రీంకోర్టులో తేలుతుంది. మరో విచిత్రం ఏంటంటే రాహుల్‌పై కేసుదాఖలు చేసిన పూర్ణేశ్ మోదీ ఈ కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. ఆ తరవాత ఇటీవలే ఆయన ఈ స్టే తొలగించాలని కోరారు. హైకోర్టు అలాగే విచారణకు అనుమతించింది. ఆఘమేఘాలమీద విచారణ పూర్తిఅయింది. ఇందులోనూ ఏదో మర్మం ఉందేమో!
న్యాయపరమైన ఈ మీమాంస ఎలా ఉన్నా ఒకకేసులో నేరం చేసినట్టు రుజువైతే వెంటనే శాసనసభ సభ్యత్వమో, పార్లమెంటు సభ్యత్వమో రద్దయిన ప్రముఖులు లెక్కలేనంతమంది ఉన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, బీహార్ మాజీ ముఖ్య మంత్రి లాలూప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్, కుల్దీప్ సింగ్ సెనెగర్ లాంటి ప్రముఖులు నేరస్థులని తేలిన వెంటనే వారి శాసనసభ్యత్వమో, పార్లమెంటు సభ్యత్వమో కోల్పో యారు. ఈ దృష్టితో చూస్తే రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడుగా ప్రకటించడంలో తప్పేముంది, లేదా ఆశ్చర్య పోవలసింది ఏముంది అని అనుకోవచ్చు. కానీ నేరం రుజువైన తర్వాత చట్టసభల సభ్యులుగా ఉండడానికి అర్హత కోల్పోయినవారి గురించి పెద్ద చర్చ జరగలేదు. కానీ రాహుల్ గాంధీ మీద మోదీ ప్రభుత్వం కక్షగట్టినట్టు ప్రవర్తిస్తోందిగనక ఇప్పుడు ఈ అంశం విస్తృతంగా చర్చనీయాంశం అయింది. చట్టరీత్యా, లేదా కోర్టు తీర్పు రీత్యా రాహుల్ నేరస్థుడా కాదా అన్న విషయం మీదికన్నా రాహుల్ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించు కుంటున్నారన్న అభిప్రాయమే సర్వత్రావుంది. నిజానికి రాహుల్ గాంధీ ఏ దృష్టితో చూసినా మోదీకి సరితూగే నాయకుడు కాకపోవచ్చు. కానీ ఒక మేరకు రాహుల్‌కు విదూషకుడి లక్షణా లున్నాయని బీజేపీ నేతల అంచనా. అందుకే రాహుల్ గాంధీ లాంటి వారు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటేనే తనకు మేలు అని మోదీ ఎప్పటినుంచో భావిస్తున్నారు. ఇప్పుడు పరువునష్టం కేసులో శిక్ష పడిరది కనక, ఆ శిక్ష ఆధారంగా లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది కనక వివిధ స్థాయిల్లో ఉన్న మోదీ అనుయాయులు చెకచెకా కదిలి కాగలకార్యం సాధించిపెట్టారు. రాహుల్ వ్యవహారంలో చట్టాన్నీ తెగలాగారు. ప్రతి అంశాన్ని రాజకీయకక్ష సాధించడానికి సాధనంగా మలుచుకున్నారు. నిజానికి రాహుల్ గాంధీ అనర్హతను తేల్చాల్సింది రాష్ట్రపతి అని, అంతకు ముందు రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ అభిప్రాయం తెలుసుకోవాలని నియమ నిబంధనలు ఏకరువుపెడ్తున్న వారికి కొదవలేదు. కానీ మోదీ హయాంలో ఆయన ఉద్దేశం, లక్ష్యమే ప్రధానం. చట్టంపేర సంకుచిత రాజకీయాలకు ధర్మం బలైంది.