మహాత్మా గాంధీని హతమార్చింది కరడుగట్టిన హిందుత్వ వాది అని విద్యార్థులు తెలుసుకోవడం ప్రస్తుతం అధికారంలో ఉన్న పక్షానికి ఇష్టం లేదు. ఇలాంటి విషయాలు పాఠ్యపుస్తాకాలలో ఉండడం వారికి బొత్తిగా ఇష్టం లేదు. మహాత్మా గాంధీ హిందూ-ముస్లింల ఐక్యత కోసమే ప్రాణత్యాగం చేశారన్న వాస్తవం భావి తరాలకు తెలియడం హిందుత్వ వాద సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నవారికి ససేమిరా గిట్టడం లేదు. గాంధీ హత్య తరవాత అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ 16 నెలలపాటు ఆర్.ఎస్.ఎస్. ను నిషేధించారని విద్యార్థులకు తెలియడమూ వారికి నచ్చడంలేదు. 2002లో గుజరాత్ మారణకాండ తరవాత అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి రాజధర్మం పాటించాలని హితవు చెప్పినట్టు బాలలకు తెలియడం వారికి సహించదు. అలాగే మొగలుల పాలనాకాలంలో వచ్చిన సంస్కరణలను ప్రస్తావించడమూ నచ్చదు. హిందుత్వ వాదాన్ని అమలు చేయడం మీదే ప్రస్తుత పాలకుల దృష్టి ఉంది. శతాబ్దాలుగా ఈ దేశ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన రోడ్లు, నగరాలు, కట్టడాలకు మొగల్ రాజుల పేర్లు ఉండడమూ వారికి ఇష్టం లేదు. అందుకే ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్య పుస్తకాలలో చారిత్రక సత్యాలను విరూపం చేస్తున్నారు. చరిత్రలోని కొన్ని కీలకాంశాలను తొలగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలలోంచి కొన్ని భాగాలను తొలగిస్తున్నారు. కొన్ని కొత్త అధ్యాయాలు చేర్చి తాము ప్రచారం చేస్తున్న సిద్ధాంతానికి అనువుగా పాఠ్య గ్రంథాలను తిరగరాస్తున్నారు. వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలుకూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నచ్చే, వారి భావజాలానికి అనుగుణమైన అంశాలను మాత్రమే ఇక మీదట విద్యార్థులు చదవాలన్నది అసలు లక్ష్యం. అంటే మోదీ హయాంలో చరిత్రను తమకు అనుకూలంగా తిరగరాస్తున్నారు. గాంధీ హిందూ-ముస్లింల ఐక్యతకు పాటుపడడంవల్లే హిందుత్వ వాదులు రెచ్చిపోయి గాంధీని హతమార్చారు అని ఇప్పటిదాకా పాఠ్యపుస్తకాల్లో ఉన్న భాగాలను తొలగిస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాఠ్యపుస్తకాలను మార్చేపని మొదలైంది. కానీ అప్పుడు ఇంత బాహాటంగా పాలక పక్షానికి నచ్చని అంశాలు తొలగించడానికి సాహసించలేదు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటివరకు మూడు సార్లు పాఠ్య పుస్తకాలను తమ భావజాలానికి అనుకూలంగా మార్చేశారు. మొదటిసారి 2017లో 182 పాఠ్య గ్రంథాలలో 1334 చోట్ల ప్రస్తుత పాలకుల సిద్ధాంతానికి అనుకూలంగా మార్పులు జొప్పించారు. ఆ తరవాత 2019లో ప్రకాశ్ జవదేకర్ మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడూ కొన్ని మార్పులు చేశారు. కరోనా కాలంలో చదువు సరిగ్గా సాగలేదు కనక కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు విద్యార్థులపై భారం తగ్గించడానికి పాఠ్య ప్రణాళికలో కొంత భాగాన్ని తొలగిస్తున్నామంటున్నారు. ఆ భాగాలు ఏమిటి అన్నదే అసలు సమస్య. ప్రధానంగా మొగలుల పాలనకు సంబంధించిన అంశాలను తొలగిస్తున్నారు. కానీ తాము పనిగట్టుకుని మొగలుల పాలన గురించిన అంశాలను తొలగించడం లేదని బుకాయిస్తున్నారు. సరే తొలగించారే అనుకుందాం. మరి మొగలుల మీద హిందుత్వ వాదులు దాడులు చేయాలన్న వారి ప్రస్తావనే లేకుండా ఈ దాడి ఎలా సాధ్యం అవుతుంది.
ప్రస్తుతం తొలగించిన పాఠ్యభాగాల్లో మహాత్మా గాంధీ త్యాగం అన్న అంశం కూడా ఉంది. ‘‘గాంధీ భావాలు అందరికీ ఆమోదయోగ్యం కాలేదు. తమ పరిస్థితి దారుణంగా ఉండడానికి గాంధీయే బాధ్యుడని వీరు భావించారు. ముఖ్యంగా పరాయిమతం వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వారికి గాంధీ భావాలతో పొసగలేదు. అలాంటివారు పాకిస్తాన్ ఇస్లామిక దేశంగా ఉన్నట్టే భారత్ హిందూ దేశంగా ఉండాలనుకున్నారు. గాంధీ పాకిస్తాన్‌కు, ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించారు. ఇలాంటి భావాలు ఉన్నవారు దారితప్పారని గాంధీ భావించారు. భారత్‌ను హిందూ దేశంగా మారిస్తే వినాశనం జరుగు తుందన్నది గాంధీ నిశ్చితాభిప్రాయం. ఆయన హిందూ, ముస్లింల ఐక్యత కోరుకున్నారు గనకే ఆయనను అంతమొందించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1948 జనవరి 30న గాంధీని హిందుత్వ వాది అయిన నాథూరాం గోడ్సే మట్టుబెట్టారు.’’ ఇలాంటి భాగాలు పాఠ్యపుస్తకాల్లో ఉండడం కచ్చితంగా ప్రస్తుత పాలకవర్గాలకు మింగుడుపడని అంశమే. గాంధీ హత్య తరవాత దేశ విభజన నేపథ్యంలో పెల్లుబికిన విద్వేషాగ్ని చల్లారింది. దానికి ఆర్.ఎస్.ఎస్. లాంటి సంస్థలను నిషేధించడం కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ ఈ వాస్తవాలను తొలగిస్తే గాంధీ మరణానికి కారణం ఏమిటో భావితరాలకు ఏమని చెప్తారో. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రధానంగా చరిత్ర, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రంలో అంతకు ముందు తమకు కంటగింపుగా ఉన్న భాగాలను తొలగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాథూరాం గోడ్సేకు ఆర్.ఎస్.ఎస్., హిందూ మహాసభతోనూ సన్నిహిత సంబంధం ఉండేది. కానీ ఈ రెండు సంస్థలకు గాంధీని హతమార్చడంలో పాత్ర ఉందని నిరూపించడం సాధ్యంకాలేదు ఈ మాట కూడా 12వ తరగతి ఎన్.సి.ఇ.ఆర్.టి పాఠ్య గ్రంథాల్లో ఉంది. దీని మీదా బీజేపీ ప్రభుత్వ వేటుపడిరది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కనక, తాము చెప్పిందే చరిత్ర అని నమ్మించాలని సంఫ్‌ుపరివార్ దీక్ష బూనింది కనక ఇప్పుడు కూడా గాంధీ అమరుడైన రోజున హిందుత్వ వాదులు ‘‘నాథురాం జిందాబాద్’’ అన్న నినాదాలు చేస్తుంటారు. గోడ్సేకు కొన్ని చోట్ల గుళ్లూ ఏర్పడ్డాయి. 12వ తరగతి రాజనీతిశాస్త్ర పాఠ్య గ్రంథంలో గుజరాత్ మారణకాండ గురించి ఉన్న రెండు పేజీల మీద సంఫ్‌ుపరివార్ కత్తెర పడిరది. రాజకీయాలకోసం మతాన్ని వినియోగించు కోవడం ఘోర పరిస్థితికి దారి తీస్తుంది అని ఉన్న భాగాలనూ తొలగించారు. ఇటీవలే దిల్లీలోని మొగల్ గార్డెన్స్ పేరు అమాంతం అమృత్ ఉద్యాన్‌గా మారిపోయిన క్రమం అందరికీ తెలుసు. పాలకులు మారినప్పుడల్లా చరిత్ర మారదు. కానీ సంఫ్‌ు పరివార్ ఆకాంక్షలు నెరవేర్చ డానికి బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న పనిఇదే. వసుంధరా రాజే సింధియా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించే పాఠ్య భాగాలు చేర్చారు. ఇందులో మోదీ కీర్తిగానం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అశోక్ గెహ్లాత్ అధికారంలోకి వచ్చిన తరవాత వసుంధరా రాజే హయాంలో చేర్చిన మోదీని పొగిడే భాగాలను తీసేశారు. మోదీ రాసిన ఎగ్జాం వారియర్స్ పుస్తకాన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కనక ఇష్టానుసారం మార్పులు చేయడానికి వీలుచిక్కి ఉండవచ్చు. భవిష్యత్తులో మరో ప్రభుత్వంవస్తే చరిత్రను మళ్లీ తిరగ రాస్తుందా. అలా చేస్తూ పోతే చరిత్ర నామరూపాలు లేకుండా పోదా!