Friday, March 24, 2023
Friday, March 24, 2023

చర్చలంటే భయమేల

ప్రజాస్వామ్య అత్యున్నత వేదిక పార్లమెంటు. ఇక్కడ సమస్యలు చర్చించి తమకు ప్రయోజనకరమైన నిర్ణయాలు, చట్టాలు చేస్తారని ప్రజలు ఆశిస్తారు. నియంతృత్వం, సైనిక ప్రభుత్వాలు మాత్రమే చర్చలులేకుండా తమ ఇష్టానుసారం వ్యవహరిస్తాయి. మన పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం సమస్యలపై సమగ్రంగా చర్చించడానికి ఇష్టపడదు. దాదాపు గతతొమ్మిది సంవత్సరాలుగా సాగేతంతు ఇదే. కీలకమైన నిర్ణయాలు లేదా శాసనాలు చేయడానికి చర్చలు దాదాపు ఉండటంలేదు. ప్రతిపక్షాలను అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. తాజాగా ఆశ్రిత పెట్టుబడిదారుడు, కార్పొరేట్‌ దిగ్గజం గౌతం అదాని గ్రూపు పాల్పడిన అక్రమాలు, అవకతవకలు, మోసాలు వెలుగులోకి రావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అదాని గ్రూపు షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దకుబేరుల్లో రెండవ పెద్ద సంపన్నుడిగా అమెరికా పత్రిక పోర్బ్స్‌ గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించింది. అయితే సంపన్నుడు కావడానికి వెనుక పెద్ద కుంభకోణమే జరిగింది. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థల వద్ద వేలాదికోట్ల రూపాయల రుణాలు తీసుకొని స్టాక్‌మార్కెట్‌లో పెట్టడం, దొంగ కంపెనీలను సృష్టించడం, లెక్కల్లో మోసాలకు పాల్పడి దొరికిపోయాడు. అమెరికా ఆర్థిక దర్యాప్తుసంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక అదాని గూడుపుఠాణిని బట్టబయలుచేసింది. ప్రత్యక్షంగా వేలకోట్లు అదాని గ్రూపుకు రుణాలిచ్చి ఎల్‌ఐసి, ఎస్‌బీఐ తదితరసంస్థలు వేలకోట్ల రూపాయలు సష్టపోయియి. వీటిలో తమ కష్టార్జితాన్ని దాచుకున్న ప్రజలు అపారంగా నష్టపోయారు. రుణాలు అంటే అవన్నీ షేర్ల రూపంలో పెట్టిన పెట్టుబడులే. అదాని అక్రమాలు షేరుమార్కెట్లను కుదిపేశాయి. అదానీ గ్రూపు షేర్లమార్కెట్‌ విలువ ఇంతవరకు 120 బిలియన్‌ డాలర్లు పడిపోయాయి. ఈ పతనం కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూపులాంటి అక్రమాలపై చర్చించ డానికి బీజేపీ ప్రభుత్వం అనుమతించకుండా ప్రజాస్వామ్యవ్యవస్థనే ఖాతరు చేయడంలేదు. సామాన్యప్రజలంటే వారు ఈ దేశస్థులు కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇంతటి తీవ్రమైన కుంభకోణంపై పార్లమెంటుకు చర్చించే సమయంలేదా? ఏ చర్చలు సమగ్రంగా జరగకుండా వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాచేయడం బీజేపీ ప్రభుత్వానికి బాగా అలవాటైంది. చర్చలకు అవకాశం ఇవ్వక పోవడమేగాక అదానీ గ్రూపుకు అర్థికమంత్రికి దన్నుగా నిలవడం ప్రధాని నరేంద్ర మోదీకి, అదానీకి మధ్య ‘బంధం’ ఎంతగా పెనవేసుకు పోయిందనేది స్పష్టమవుతోంది. మన ఆర్థికమార్కెట్‌ చాలా పటిష్టంగా ఉందని, రుణాలిచ్చిన సంస్థల ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉన్నాయని మన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పరోక్షంగా అదానీకి అండగా నిలిచారు. జమ్మూ`కశ్మీర్‌కు రాష్ట్రహోదాను రద్దుచేయడానికి 370వ అధికరణను రద్దుచేయడానికి, అలాగే పెద్దనోట్ల రద్దుకు, వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మూడు దుష్టసాగు చట్టాలు చేయడానికి గానీ మోదీ ప్రభుత్వం చర్చలకు అవకాశం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంది.

అదానీ గ్రూపు అక్రమాలపై ప్రపంచం గగ్గోలు పెట్టినప్పటికీ మోదీ ఎప్పటిలాగా మౌనం వీడలేదు. ప్రభుత్వమేకాకుండా తమ చర్యలను సమర్థించుకొనేందుకు ఆర్థిక సంస్థలు తంటాలు పడుతున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా పటిష్టంగా, సుస్థిరంగా ఉందని రిజర్వుబ్యాంకు వ్యాఖ్యానించింది.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడాకార్పొరేట్లు దాదాపు 12లక్షల కోట్లరూపాయలు ఎగవేయగా వారి అప్పులన్నీ రద్దుచేసిన ప్రభుత్వం ప్రజలకు తీవ్ర ద్రోహం చేసింది. రుణాలన్నిటినీ వసూలు చేయకుండా రద్దుచేయడం ద్వారా ఆర్థికవ్యవస్థను కుదేలు పరిచింది. అదాని లాంటి బడా సంస్థలు అక్రమాలకు పాల్పడి ప్రజలను కోలుకోనివిధంగా నష్టపరచినప్పటికీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవు. కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలు మాత్రమే ఇంత వరకు మోదీ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. అదాని గ్రూపునకు అమెరికా స్టాక్‌మార్కెట్‌లోనూ చోటులేకుండా చేశారు. డోజోన్స్‌ సుస్థిర సూచీనుంచి అదాని ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లను తొలగించారు. తాజా పరిణామాలు భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉంటాయి. మనభారీ కంపెనీల వ్యాపార లావాదేవీలపై విశ్వాసం సన్నగిల్లుతుంది.
ఈ నేపధ్యంలో అదానీ గ్రూపు మార్కెట్‌ నుంచి నిధులు సేకరించడం కూడా కష్టమవుతుందని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసు వ్యాఖ్యానించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆధారంగా అదానీ గ్రూపుపై మదుపరుల విశ్వాసంపూర్తిగా సన్నగిల్లిందని గతవారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. కార్పొరేట్ల అక్రమాలపై లోతుగా చర్చించి దోష నిర్ధారణ చేయవలసిన పాలకులు అక్రమాలకు పాల్పడిన వారినే సమర్థిస్తున్న స్థితిలో ప్రజలే మేల్కొని అప్రమత్తం కావాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img