వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం బుధవారం పొద్దుపోయాక సూచాయగా ప్రకటించింది. ఓ రకంగా ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానే ఎజెండాను వెల్లడిరచినట్లు భావించవచ్చు. ఈ సమావేశం జరగడానికి ఒక్క రోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ దయతలిచి తెలియజేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 18 నుంచి 22 దాకా అయిదు రోజులపాటు జరుగుతాయని ఆయన ఆగస్టు 31న ప్రకటించారు. ఆ తరవాత ప్రభుత్వం వైపు నుంచి ఏ సమాచారమూ లేదు. ఇప్పటివరకు తెలిసింది ఏమిటంటే మొదటి రోజు సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరుగుతాయని, మిగతా నాలుగు రోజులు కొత్త పార్లమెంటు భవనంలో జరుగుతాయని మాత్రమే. ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చనీయాంశాలు ఏమిటి అని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఇంతకుముందు ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ ప్రత్యేక సమావేశాలలో చర్చించవలసిన అంశాలేమిటో చెప్పాలని కోరారు. తమ దృష్టిలో చర్చించవలసిన తొమ్మిది అంశాలను ఆమె తెలియజేశారు. దానికి ఇప్పటిదాకా సమాధానం లేదు. పార్లమెంటు కేవలం ప్రభుత్వ పక్షానిదే కాదు. ప్రతిపక్షాలకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ఉంది. పార్లమెంటు ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే డబ్బుతో నడుస్తుంది కనక ప్రభుత్వం ప్రజలకూ జవాబుదారుగా ఉండాలి. ప్రతిపక్షాలతో మాట మాత్రంగానైనా చెప్పకుండా మోదీ సర్కారు ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. 17వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశంలో వివరాలు చెప్పొచ్చులే అన్నది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. కానీ మోదీ హయాంలో అన్నీ ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి. ప్రతిపక్షాలు ఎంత అరిచి గీపెట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించదు. పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించినా మోదీ పట్టించుకోలేదు. హాజరైతే కావచ్చు లేదా మిన్నకుండండి అన్న ధోరణిలోనే వ్యవహారాలు సాగుతున్నాయి. ఇంతకన్నా అప్రజాస్వామిక వ్యవహారం ఏమీ ఉండదు. విదేశాలకు వెళ్లినప్పుడు ప్రధానమంత్రి మోదీ ప్రజాస్వామ్యం గురించి, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి బాకా ఊదుతుంటారు. కానీ స్వదేశంలో మాత్రం, చివరకు పార్లమెంటు నిర్వహణలోనూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తారు. ప్రతిపక్షాల మాటను ఆయన ఏ మాత్రం పట్టించుకోరు. భావప్రకటనా స్వేచ్ఛ ఊసే రానివ్వరు. సర్వాధికారాలతో పాటు భావప్రకటనా స్వేచ్ఛ తనకొక్కడికే ఉందనుకుంటారు. ఇటీవల జి20 శిఖరాగ్ర సభకు అమెరికా అధ్యక్షుడు హాజరైనప్పుడూ సంప్రదాయికంగా వస్తున్న విలేకరుల సమావేశం నిర్వహించడానికి మోదీ అంగీకరించలేదు. బైడెన్‌తో పాటు వచ్చిన అమెరికా పత్రికా రచయితలతో తాను ముచ్చటించలేదు, బైడెన్‌ను మాట్లాడనివ్వలేదు. ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహిస్తే విదేశీ పత్రికా రచయితలతో పాటు భారత పత్రికా విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుందన్న భయం మోదీని నిరంతరం పీడిస్తూ ఉంటుంది. ఇక్కడ విలేకరులతో మాట్లాడడానికి అవకాశం రానందువల్ల బైడెన్ వియత్నాంలో భారత్ గురించి, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలైన అంశాలను లేవనెత్తవలసి వచ్చింది. బైడెన్ విలేకరులతో మాట్లాడేట్టు చేయడానికి అమెరికా కనీసం ఆరుసార్లు ప్రయత్నించి విఫలమైంది. అయినా మోదీ మంకుతనమే గెలిచింది. ప్రతిపక్షాలంటే ఆయనకు తెలిసిందల్లా అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్, సీబీఐ లాంటి వ్యవస్థల చేత దాడులు చేయించడమే. ఆయన లక్ష్యం కేవలం కాంగ్రెస్ ముక్త్ భారత్ మాత్రమే కాదు. ఆయనకు కావలసింది ప్రతిపక్షమే లేని పార్లమెంటు. పార్లమెంటు అంటే నాలుగు గోడలు, పైన ఓ కప్పు కాదు. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కట్టిన మహత్తర భవనం కాదు. 2014లో మొదటిసారి పార్లమెంటు భవనంలో ప్రవేశించేటప్పుడు ఆ భవనం మెట్ల దగ్గర సాష్టాంగపడడమే ప్రజాస్వామ్యం కాదు. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులను సభనుంచి సస్పెండ్ చేసి తమకు కావలసిన బిల్లులను ఏకపక్షంగా ఆమోదింప చేసుకున్నారు. ప్రతిపక్షానికి ఎజెండా ఏమిటో తెలియజేస్తే ప్రపంచం తలకిందులైపోతుందన్న భయం మోదీని పీడిస్తున్నట్టు ఉంది. ప్రతిపక్షం పార్లమెంటు సమావేశాల కోసం సిద్ధం అయ్యే అవకాశం ఆయన ఇవ్వరు. ప్రతిపక్షాలు ఈ సమావేశాలలో ఉమ్మడి వ్యూహాన్ని ఎక్కడ ఖరారు చేస్తాయోనన్న భయం మోదీకి ఉండొచ్చు.
18వ తేదీన జరిగే సమావేశాలలో పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు చెప్తారన్న వార్త వచ్చింది. కేవలం దానికోసమే అయితే అయిదు రోజులు ఎందుకో? అంటే అధికార పక్షానికి కొన్ని బిల్లులు ఆమోదింప చేయడంలాంటి ఎజెండా ఉంది. ఆ ఎజెండా ప్రతిపక్షాలకు చెప్పకపోవడం, తమకు లోకసభలో సంపూర్ణమైన మెజారిటీ ఉంది కనక చెప్పనవసరం లేదన్న అభిప్రాయం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమే. అందుకే ప్రత్యేక సమావేశాలలో ఏం చర్చిస్తారు అన్న విషయంలో అనేక ఊహాగానాలు కొనసాగాయి. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11న ముగిశాయి. నవంబర్‌లో శీతాకాల సమావేశాలు జరగవలసి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం హయాంలోనే అవి జరుగుతాయి. అలాంటప్పుడు ఎజెండా రహస్యంగా ఉంచడం హాస్యాస్పదమే కాదు ప్రజాస్వామ్యం అంటే లెక్కచేయని తత్వానికే నిదర్శనం. ఇండియా కాదు భారత్ అన్న ప్రతిపాదనను పార్లమెంటులో ఆమోదింప చేసుకోవడం, మహిళా రిజర్వేషన్ల బిల్లు బూజు దులిపి గట్టెక్కించడం లాంటివి జరగొచ్చు నన్నవి కూడా ఊహాగానాల్లో భాగమే. దీన్ని రహస్యంగా ఉంచవలసిన అవసరమేముంది కనక! పార్లమెంటరీ సమావేశంలో ఉమ్మడి బాధ్యత ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలకు చోటు ఉండకూడదు. కానీ ఈ ప్రత్యేక సమావేశాలలో ఏం జరుగుతుందో కనీసం మంత్రివర్గానికైనా తెలుసునా అన్న అనుమానం కలగక మానదు. పెద్దనోట్ల రద్దు అంశం మోదీ కనీసం అప్పటి ఆర్థిక మంత్రికైనా తెలియకుండా ప్రకటించేశారు కనక మోదీ నడవడిక ఎంత మాత్రం ఆశ్చర్యం కలిగించదు. ఇలాంటి స్థితిలో ప్రతిపక్షాలకు ఎజెండా తెలియజేయాలనుకోవడం కూడా అత్యాశే కావొచ్చు. ఈ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ ఉండదని మాత్రం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. అడిగిన ప్రశ్నలకే జవాబివ్వని ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నోత్తరాల సమయం లేకపోతే ఏం మునిగిపోతుంది? మెజారిటీ ఎటువైపుఉన్నా తీసుకున్న నిర్ణయాలకు ప్రతిపక్షం కూడా కట్టుబడి ఉండాలికదా! మోదీ మనసులో ఏముందో మహా అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలిసే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే ఇష్టానుసారం సకల వ్యవహారాలను నడుపుతున్నది మోదీ, అమిత్ షానే! ఇదంతా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నిరంకుశంగా పరిపాలించడానికే.