Friday, February 3, 2023
Friday, February 3, 2023

చిత్తశుద్ధి లేని ప్రజాస్వామ్యం

అన్య మనస్సుతో త్రికరణశుద్ధిలేకుండా చేసే పని ఏదైనా ఫలించదు. పైగా ఒక్కొక్కసారి వికటించే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ, ఒక రాజకీయ పార్టీకైనా ఈ సూత్రం వర్తిస్తుంది. కాంగ్రెస్‌కు ఇది బాగా వర్తిస్తుంది. సోనియాగాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్‌లో చిత్తశుద్ధి లేని ప్రజాస్వామ్యం కొనసాగుతోందని తాజాగా మరోసారి రుజువైంది. వారసత్వ రాజకీయాలను అనుసరిస్తున్న కాంగ్రెస్‌లో ప్రజా స్వామ్యం లేదని, సమస్త వ్యవహారాలు సోనియాగాంధీ కనుసన్న ల్లోనే నడుస్తున్నాయన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వాన్ని సైతం సోనియా వెనుక నుంచి నడిపించారని విమర్శలూ ఉన్నాయి. సంస్థాగత ఎన్నికలు జరపకుండా సోనియానే కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగడంపై అన్ని రాజకీయ పార్టీలు దాడి చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలు జరపాలని సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నా ఎట్టకేలకు అక్టోబరులో జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కర్ణాటకకు చెందిన మపన్న మల్లిఖార్జున ఖడ్గే గెలుపొంది పార్టీ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. 80 ఏళ్ల కురువృద్ధుడైన ఖడ్గేతో పాటు పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అధ్యక్ష పదవికి పోటీ చేయాలని రంగంలోకి దిగారు. అలా ప్రయత్నించిన వారిలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌, కేరళకు చెందిన శశిథరూర్‌ ఉన్నారు. గెహ్లాత్‌ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా ఉండాలని ఆశించారు. ఆయన గాంధీ కుటుంబానికి ఇష్టుడే అయినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని కోరగానే తిరుగుబాటు చేశారు. గెహ్లాత్‌ క్షమాపణ కోరడంతో కాంగ్రెస్‌ సంక్షోభంలో పడే పరిస్థితులు తప్పిపోయాయి. గెహ్లాత్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే దిగ్విజయ్‌సింగ్‌ పోటీ చేయాలన్న తలంపును విరమించుకున్నారు. శశిథరూర్‌ పోటీలో ఉన్నారు. 24 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం, గాంధీ కుటుంబయేతర వ్యక్తి ఎన్నిక కావడం చరిత్రాత్మక సందర్భమే. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఒక అడుగు ముందుకు వేసిందని భావించాలి. అయితే ప్రతి విషయాన్ని గాంధీ కుటుంబీకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఖడ్గే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో చిత్తశుద్ధి లేని ప్రజాస్వామ్యం మాత్రమే ఉందని నిరూపితమైంది. సోనియాగాంధీ అనారోగ్యం వల్ల ఖడ్గేకు ఆ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఎన్నికల్లోపార్టీని గెలిపించలేకపోయారన్న విమర్శల నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టడానికి ససేమిరా అన్నాడు. ఖడ్గే ఎన్నిక జరగక ముందే గాంధీ కుటుంబానికి ఇష్టుడు గనుక ఆయనే గెలుపొందు తాడన్న అభిప్రాయమే సర్వత్రా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వం, అలాగే కేరళలో కాంగ్రెస్‌నాయకులు తొలినుంచి శశిథరూర్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరకు ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసే కార్యక్రమానికి పార్టీ బాధ్యులెవరూ రాలేదు. శశిథరూర్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠాన వర్గమే గాక వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నాయకులు దూరంగానే ఉన్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే వారిని సమంగా చూసినప్పుడే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది. ఇందిరాగాంధీ నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి అధికార అభ్యర్థిగా ప్రకటించి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన వివిగిరిని గెలిపించి పార్టీలో ప్రజా స్వామ్యం లేదని నిరూపించారు. ప్రస్తుతం సోనియాగాంధీ సైతం మల్లి ఖార్జున ఖడ్గే గెలుపు విషయంలో లోపాయికారిగా బాధ్యత వహించి ప్రజాస్వామ్య సూత్రాన్ని ఉల్లంఘించారు.
శశిథరూర్‌ తాను ఓడిపోయిన తర్వాత గెలుపొందిన ఖడ్గేను అభినందించి ఆయనకు అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రకటించారు. అంతవరకు ఉన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌కమిటీని రద్దుచేసి సారధ్య సంఘాన్ని ఖడ్గే ఏర్పాటుచేశారు. అందరినీకలుపుకుని పార్టీని పటిష్ఠం చేయవలసిన ఖడ్గే శశిథరూర్‌ను సారధ్య సంఘంలోకి తీసుకోలేదు. గాంధీ కుటుంబానికి శశిథరూర్‌ను ప్రమోట్‌చేయడం ఇష్టంలేదని తేలిపోయింది. గాంధీ కుటుంబాన్ని సంప్రదించే ఖడ్గే ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారు. శశిథరూర్‌ ఉన్నత విద్యావేత్త, ఐక్యరాజ్య సమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేశారు. అంతేకాదు అంతర్జాతీయ రంగంలో వివిధ పదవులను నిర్వహించారు. 2009 లో కాంగ్రెస్‌లో చేరి కేరళలోని తిరువనంతపురం నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లండన్‌లో జన్మించిన శశిథరూర్‌ ఇక్కడికి వచ్చాడని బయటి వాడంటూ ఆయన అభ్యర్థిత్వాన్ని కేరళ కాంగ్రెస్‌నాయకులు వ్యతిరేకించారు. లోక్‌సభకు గెలిచిన ఆయన యూపీఏ ప్రభుత్వ హయాంలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సహాయమంత్రిగా పనిచేశారు. 2012లో మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ లోనూ సహాయమంత్రిగా పనిచేశారు. మంచివక్తగా పేరు తెచ్చు కున్నారు. అయినప్పటికీ ఆయనను సారధ్య సంఘంలోకి తీసుకోక పోవడమేకాదు గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు జరగుతున్న ఎన్నికల ప్రచారానికి ఏర్పాటుచేసిన కమిటీలోనూ ఆయన పేరులేదు. కాంగ్రెస్‌ ఆయనను కక్షతో వెంటాడుతోందని భావించ డానికి నాయకత్వం అవకాశంఇచ్చింది. ఆయనకు కేరళ కాంగ్రెస్‌ లోనూ చుక్కెదురే.
కేరళ రాష్ట్ర అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసి ముఖ్యమంత్రి కావాలన్న అభిలాషతో శశిథరూర్‌ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శశిథరూర్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు కోరుతున్నారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం శశిథరూర్‌పట్ల ఏమాత్రం సానుకూలంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శశిథరూర్‌ను పార్టీ కార్య కలాపాలకు కావాలని దూరంగాఉంచడం పార్టీకి ఏమాత్రం ప్రయోజనం కల్పించదు. ఇలాంటి వైఖరి పార్టీలో అనేకమంది నాయకులకూ రుచించడం లేదని తెలుస్తోంది. ఖడ్గేతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న శశిథరూర్‌ పైన నాయకత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్యబద్దమైన వాతావరణం కాంగ్రెస్‌లో కనిపించడంలేదన్న భావన ప్రజల్లో వ్యాప్తి అయితే అది పార్టీకే నష్టం కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img