Monday, March 20, 2023
Monday, March 20, 2023

చుక్కాని లేని నావ

దేశంలోకెల్లా అతి పురాతనమైన, స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 2019 ఎన్నికలలో ఘోర పరాజయం తరవాత అప్పటిదాకా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆ తరవాత సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు. ఆ గడువు కూడా పూర్తి అయినా అధ్యక్ష స్థానంలో కొత్త వారిని నియమించనే లేదు. సెప్టెంబర్‌లో ఏ.ఐ.సి.సి. సమావేశం జరుగుతుందని అప్పుడు కొత్త అధ్యక్షులెవరో నిర్ణయం అవుతుందని అంటున్నారు. అంటే ఇంకో ఏడు నెలలు గడవాల్సిందే. ఈ లోగా కాంగ్రెస్‌ అంతకంతకూ బలహీన పడుతూనే ఉంది. కాంగ్రెస్‌ లో కొనసాగుతున్న అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ 23 మంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాసి చాలా కాలమే అయింది. ఈ లోగా సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరే కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోతున్నారు. కొనసాగుతున్న నాయకులలో కూడా అసంతృప్తి స్పష్టంగానే కనిపిస్తోంది. అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్‌ రాజీనామా చేయడం కాంగ్రెస్‌ లో నెలకొన్న గందరగోళ పరిస్థితికి చిహ్నం. అశ్వినీ కుమార్‌ 1991లో అత్యంత పిన్న వయసులో సోలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన వ్యక్తి. అనేక దఫాలు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన కుటుంబానికి జాతీయ పోరాటంలో పాత్ర ఉంది. ఆయన సోనియా గాంధీకి సన్నిహితుడని అంటారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ఆశించారని అది దక్కనందువల్లే కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయారని చెప్పే వారికి కొదవ ఉండదు. అయితే ఆయన లేవనెత్తిన అంశాలు గంప కింద కమ్మేయవలసినవి కాదు. ఆయన అవకాశవాది అని కూడా అనొచ్చు. శక్తిమంతమైన నాయకత్వం, బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న బీజేపీకి ఎదురొడ్డి నిలిచే శక్తి కోల్పోవడమే కాదు ఆ సంకల్పం కూడా కాంగ్రెస్‌ లో పూజ్యం అనడానికి ఒక్కొక్కరే పార్టీ వీడిపోవడానికి ప్రధాన కారణం. ప్రశ్నించే తత్వం ఉన్నవారు ఆ పార్టీలో ఉండలేకపోతున్నారు. జాతీయ ఆకాంక్షలను వ్యక్తం చేసే సామర్థ్యం కాంగ్రెస్‌లో క్రమంగా అడుగంటు తోంది. వరసగా ఒక్కో ఎన్నికలో ఓటమి ఎదురవుతున్నప్పటికీ పరిస్థితిని చక్క దిద్దే పరిస్థితి కాంగ్రెస్‌ లో లేశమాత్రం కూడా లేదు. కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం ఏక పక్షంగా రద్దు చేసినా, జమ్ము-కశ్మీర్‌ ను కేంద్రపాలిత ప్రాంత స్థాయికి దిగజార్చినా సైద్ధాంతికంగా దాన్ని సవాలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. అధినాయకత్వం ఇందిరా గాంధీ కుటుంబం గుప్పెట్లోనే ఉండాలన్న భావన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలో గూడు కట్టు కున్నట్టుంది. ఇతరులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి ఇందిరా గాంధీ వారసులు సిద్ధంగా లేరు. గతంలో కాంగ్రెస్‌ తో కలిసి నడిచిన ఉత్తరప్రదేశ్‌ లోని సమాజ్‌ వాదీ పార్టీ, బిహార్‌లో అంతో ఇంతో అస్తిత్వం నిలబెట్టుకున్న లాలూ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ కూడా కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు తలబరువేనన్న రీతిలోనే వ్యవహరిస్తున్నాయి. అధికారం లేకుండా మనగలిగే లక్షణం కాంగ్రెస్‌ వారికి లేదు. బలమైన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నిర్వర్తించే ఆలోచనే కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. ఎంత బలహీనంగా ఉన్నా ఇప్పటికీ దేశమంతటా అస్తిత్వం ఉన్న ప్రతిపక్షం కాంగ్రెసే. ఆ స్థాయిలో తాను చేయవలసిన పనేమిటో కాంగ్రెస్‌ అధినాయకత్వానికి అంతుపట్టడం లేదు. అసమ్మతిని పరిగణనలోకి తీసుకుని ఇల్లు చక్కదిద్దుకోవాలన్న భావనే కనిపించడం లేదు. వారి అభిప్రాయాలను వినిపించుకోవాలన్న ధ్యాసే లేదు.
తాజాగా కాంగ్రెస్‌ను వీడిన అశ్వినీ కుమార్‌ లాగే పంజాబ్‌కే చిందిన మరో సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మనీష్‌ తివారీ వ్యవహార సరళి కూడా ఆయనలో పేరుకుపోయిన అసంతృప్తికి అద్దం పడ్తోంది. తాను కాంగ్రెస్‌ లో అద్దెకు ఉంటున్న వాడిని కానని, భాగస్వామిని అని తివారీ అంటున్నారు. అదే నోటితో తనను బలవంతంగా బయటకు పంపించాలని ఎవరైనా అనుకుంటే వెళ్లిపోక చేసేదేముంటుంది అని కూడా చెప్తున్నారు. ఆయన తండ్రి వి.ఎన్‌.తివారీని 1984లో అమృత్సర్‌ స్వర్ణ దేవాలయంలో సైనిక చర్య జరగడానికి ముందు తీవ్రవాదులు కాల్చి చంపారు. అందుకే తన కుటుంబానికి, తనకు కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ ఆయన మాటల అంతరార్థాన్ని పరికిస్తే ఆయనలో అసంతృప్తి తీవ్ర స్థాయిలోనే ఉందని రూఢ అవుతోంది. అశ్వినీ కుమార్‌ నిష్క్రమణ పార్టీకి విఘాతమే అంటూనే ఆయన తన గౌరవాన్ని కాపాడుకోవడానికి రాజీనామా చేశారని చెప్పడం చూస్తే మనీశ్‌ తివారీ మనసులో ఏముందో సులభంగానే గ్రహించవచ్చు. అశ్వినీ కుమార్‌ రాజీనామా విషయంలో పార్టీ అధినాయకత్వం ఏ వ్యాఖ్యా చేయకపోయి నప్పటికీ సోనియాకు లేఖ రాసిన 23 మంది నాయకుల బృందం తమ వాదనను మళ్లీ వినిపించే అవకాశం కల్పించింది. ఇలా సీనియర్‌ నాయకులు పార్టీని వీడడం అంటే పార్టీలో అంతా సవ్యంగా లేదనే అని ఈ నేతలు మనసులో మాట దాచుకోకుండా బయటపెడ్తున్నారు. సోనియాకు లేఖ రాసిన 23 మందిలో అశ్వినీ కుమార్‌, మనీశ్‌ తివారీతో పాటు మరో సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ కూడా ఉన్నారు. ఆయనా అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగిసినప్పటినుంచీ ఆయన వాలకం భిన్నంగానే ఉంది.
ఆజాద్‌ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండే వారు. అయిదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారం చేసే కాంగ్రెస్‌ నాయకుల జాబితాలో గులాం నబీ ఆజాద్‌ పేరు లేకపోవడం ఆయనలో తనను విస్మరిస్తున్నారన్న అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్టుగా ఉంది. జాతీయ పోరాటంలో పాల్గొన్న కుటుంబానికి చెందిన అశ్వినీ కుమార్‌ కాంగ్రెస్‌ కు రాజీనామా చేయడం దురదృష్టకరమే కాక, విచారకరం అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హూడా వ్యాఖ్యానించారు. ఆయనా 23 మంది నాయకుల బృందంలోని వారే. ఇప్పటికి నలుగురైదుగురు మాజీ కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా పార్టీని వీడినా అధినాయకత్వం పెదవి విప్పలేదు. అంటే ఆత్మ పరిశీలన, అంతర్మథనానికి కాంగ్రెస్‌ అధినాయకత్వం సిద్ధంగా లేదని అర్థం అవుతూనే ఉంది. సాంకేతికంగా సోనియా గాంధీనే ఇప్పటికీ కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలో ఉండవచ్చు. అయితే ఆమె ఎన్నడూ క్రియాశీలంగా కనిపించరు. రాహుల్‌ గాంధీ అధ్యక్ష స్థానంలో లేకపోయినా కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ స్థానంలో చరణ్‌ జిత్‌ సింగ్‌ చన్నీని నియమించడంలో కీలక పాత్ర పోషింది రాహులు గాంధీనే. పార్టీ పగ్గాలు ఆయన చేతిలో లేకపోయినా నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారంటే అది ఆ కుటుంబ ఆధిపత్యానికి మాత్రమే సంకేతం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img