Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

చైనా అంటే అంత భయమా!

దక్షిణాఫ్రికాలోని జోహనెస్‌ బర్గ్‌లో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధక్షుడు షీ జిన్‌పింగ్‌ తో గురువారం కొద్దిసేపు ముచ్చటించారట. 2020 జూన్‌ 15-16 అర్ధరాత్రి గల్వాన్‌ ప్రాంతంలో రెండు దేశాల సైన్యాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 20 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయి. ప్రధానమంత్రి మోదీ లాంఛనప్రాయంగా కాకపోయినా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తో సంభాషిస్తున్నప్పటికీ సరిహద్దులో శాంతి నెలకొనడం లేదు. చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి స్థావరాలు ఏర్పరచుకుంటోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా దాచి పెడ్తోంది. అవసరమైతే చైనాతో కన్నెర్ర చేయగల సత్తా భారత్‌కు ఉందని మోదీ చెప్పే మాటలు బీరాలు పలకడానికే పరిమితం అవుతున్నాయి. జోహనెస్‌బర్గ్‌లో రెండు దేశాల అధినేతలు ముచ్చటించుకున్నప్పుడు సరిహద్దులో శాంతి కాపాడాలని అనుకున్నారట. దూసుకొస్తున్నది చైనా అయితే భారత్‌ శాంతిని కాపాడడం ఏమిటో అంతుపట్టదు. రెండు దేశాలు ఘర్షణపడ్తే సేనలను ఉపసంహరించుకుని శాంతిని పునరుద్ధరించే అవసరం వస్తుంది. జోహనెస్‌బర్గ్‌లో మోదీ, జిన్‌పింగ్‌ మధ్య సమావేశం గురించి కూడా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. భారత్‌ కోరిక మేరకు జిన్‌పింగ్‌ ప్రధానమంత్రి మోదీతో ముచ్చటించారని చైనా వాదిస్తోంది. కాదు చైనా కోరిక మేరకే ఈ సంభాషణ జరిగిందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వత్రా చెప్తున్నారు. రెండుదేశాల వాదనలు నిజమయ్యే అవకాశం ఎటూలేదు. చొరవ ఎవరు చూపారన్నది అప్రస్తుతం. సరిహద్దులో చైనా ఆగడాలను ఆపడానికి మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందన్నదే ముఖ్యం. ఆ విషయం గురించి మాత్రం సరైన సమాధానం రావడం లేదు. చైనా విషయానికి వచ్చేటప్పటికి భారత్‌ జంకుతోందన్న అభిప్రాయం కలుగుతోంది. చైనా నుంచి అందుతున్న సమాచారం కూడా సందిగ్ధంగానే ఉంది. రెండు దేశాల నాయకులు నిక్కచ్చిగా, నిష్కపటంగా మాట్లాడుకున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అంటోంది. ఇక్కడ కపటం భారత్‌ వేపున ఎప్పుడూలేదు. అదేమైనా ఉంటే చైనా నుంచే ఉండాలి. మోదీ చైనా అధినేతతో నిక్కచ్చిగా మాట్లాడగలిగిన సాహసంచేసి ఉంటే భారత చైనా సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు త్వరలో ఆగిపోవాలి. కానీ ఆ సూచనే కనిపించడం లేదు. వివిధ దేశాధినేతలతో తనకున్న మైత్రి గురించి మోదీ గొప్పగా చెప్పుకుంటారు. చైనా అధినేతతో కలిసి ఉయ్యాలలూగారు. అంత సాన్నిహిత్యమే ఉంటే సరిహద్దులను కాపాడుకునే విధంగా చైనాతో నిర్మొహమాటంగా మాట్లాడడానికి అడ్డంకి ఏమిటో ప్రధానమంత్రి మోదీ చెప్పరు. విదేశాంగమంత్రిత్వశాఖ అసలే చెప్పదు. అంటే ఏదో దాచిపెడ్తున్నారన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఇది మన బలహీనతనే చాటుతుంది. రెండు దేశాల నాయకుల మధ్య సంభాషణల గురించి చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌ బిన్‌ గురువారం విడుదల చేసిన ప్రకటన కూడా పూర్తిగా దౌత్య పరిభాషలో ఉంది తప్ప వాస్తవ సమాచారం పూజ్యమే. ఇద్దరు నాయకులు లోతుగా మాట్లాడుకున్నారని మాత్రం తెలియజేశారు. అంత లోతుగా సంభాషణ జరిగి ఉంటే సరిహద్దులో చైనా దూకుడుకు కళ్లెంపడే అవకాశం సమీప భవిష్యత్తులోనైనా ఉండాలిగా! ‘‘భారత-చైనా సంబంధాలు రెండు దేశాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. శాంతికి, సుస్థిరతకు, ఈ ప్రాంతమేకాక ప్రపంచ అభివృద్ధికి తోడ్పడాలి’’ అని జిన్‌పింగ్‌ అన్నారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలియజేశారు. ఇవి తేనెపూసిన పలుకులే తప్ప భారత్‌ ఎదుర్కుంటున్న సమస్యకు పరిష్కారంకావు.
గల్వాన్‌ సంఘటన జరిగిన తరవాత కూడా బాలీలో జి20 దేశాల సమావేశంలో కూడా భారత-చైనా అధినేతలు ముచ్చటించుకున్నారు. ఫలితమే అగోచరం. ‘‘సరిహద్దు ప్రాంతాలలో శాంతి, సామరస్యాలు ఉండాలి. వాస్తవాధీనరేఖ దగ్గర శాంతి నెలకొనడం భారత-చైనా దేశాల మధ్య సత్సంబంధాలకు అవసరం’’ అని మోదీ అన్నారట. అసలు సమస్య చైనా వాస్తవాధీన రేఖను అధిగమించడంలోనే ఉంది. చైనా మన దేశంలో చొరబడలేదు అని మోదీ ప్రభుత్వం ఇంతకాలంగా వాదిస్తోంది. ఏ సమస్యా లేకపోతే శాంతి సామరస్యాలు నెలకొనాలని మోదీ ఎందుకు చెప్తున్నట్టు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం భారత ప్రభుత్వం నుంచి రాకపోవడమే అసలు సమస్య. 2020 జూన్‌ లో గల్వాన్‌ సంఘటన జరిగినప్పటి నుంచే రెండు దేశాల మధ్య సంబంధాలకు విఘాతం కలిగింది. ఇది నిజానికి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణే. దశాబ్దాలుగా ఏనాగూ జరగంది గల్వాన్‌లోనే సంఘటన జరిగింది. ఈ ఘర్షణను, ఒక కల్నల్‌తో సహా 20మంది భారత సైనికుల ప్రాణత్యాగాన్ని మోదీ ప్రభుత్వం కప్పిపుచ్చలేక పోయింది. కానీ ఆ తరవాత పరిస్థితిని చక్కదిద్దడానికి చేసింది, చేస్తున్నది ఏమీ కనిపించడంలేదు. అయితే రెండు దేశాల సైనికాధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే 19వసారి కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. ఇది శాంతి వెల్లి విరుస్తోందనడానికి సంకేతమైతేకాదు. ఇందులోనూ ఒక మతలబు ఉంది. అపరిష్కృతంగాఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు పక్షాలూ అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వశాఖ చెప్తోంది. అంటే ఇటీవలి చైనా దూకుడును దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల చాటున దాచేయాలన్న ప్రయత్నం జరుగుతోందనే అనుకోవాలి. సైనిక, దౌత్యస్థాయిలో చర్చలు కొనసాగించవలసిన అవసరం ఉందని కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇదంతా చైనా అంటే మోదీ సర్కారు గుండెల్లో గూడుకట్టుకున్న భయానికే నిదర్శనం. ఇండొనేషియాలో జి20 సమావేశం జరిగినప్పుడు మోదీ, జిన్‌పింగ్‌ గట్టిగా చేతులు కలుపుతున్న వీడియో అప్పుడే బయటికి వచ్చింది. సాధారణంగా చిన్న చిన్న సంఘటనలను కూడా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా చాటిచెప్పే మోదీ ఈ వీడియో గురించి మాత్రం మౌనంగానే ఉన్నారు. అక్టోబర్‌ 2019లో షీ జిన్‌పింగ్‌ మహాబలిపురం వచ్చారు. అది లాంఛన ప్రాయమైన సమావేశం కాకపోవచ్చు. అలాగే 2022 సెప్టెంబర్‌లోనూ రెండుదేశాల అధినేతల మధ్య ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ ఖండ్‌లో చర్చలు జరిగాయి. మోదీ ఇన్నిసార్లు చైనా అధినేతను కలుసుకుంటున్నా అసలు సమస్య మాత్రమే అలాగే కొనసాగుతోంది. జిన్‌పింగ్‌ తో మోదీకి ఉన్న స్నేహం వ్యక్తిగతమైంది కావడానికి వీలులేదు. ఆ స్నేహంవల్ల భారత ప్రజలకు మేలు కలగాలి. ఆ ఛాయలేలేవు. ఏమీ తేల్చని చర్చలు నిష్ప్రయోజనకరమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img