Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

చేతులు కాలే దాకా…

మోదీ ప్రభుత్వానికి చేతలకన్నా ప్రచారార్భాటమే ఎక్కువ. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసిన తరవాత భారత్‌ తటస్థ వైఖరి అనుసరించడం సరైందే. వరసగా రెండు సార్లు ఐక్య రాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం మీద ఓటింగ్‌ జరిగినప్పుడు గైరుహాజరై విజ్ఞతతోనే వ్యవహరించింది. భద్రతా మండలి తీర్మానాన్ని సహజంగానే రష్యా వీటోచేసింది. భారత్‌, రష్యా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ గైరుహాజరయ్యాయి. రష్యా అధినేత పుతిన్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ప్రధాన మంత్రి మోదీతో మాట్లాడి నప్పటికీ ప్రభుత్వం తొందరపడి ఏదో ఒక వేపు మొగ్గకుండా మంచి పనే చేసింది. రష్యా మీద అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యాతో మళ్లీ వాణిజ్య లావాదేవీలలో మనం రూపాయలలో చెల్లించే మార్గాలను అన్వేషిస్తోంది. సోవియట్‌ యూనియన్‌ ఉన్నప్పుడు కూడా మనం రష్యాకు ఏం చెల్లించవలసి ఉన్నా రూపాయలలోనే చెల్లించే వాళ్లం. రూపాయి ద్వారా రష్యాతో వాణిజ్యం నిర్వహించడం అంటే మనం ఎంత చెల్లించినా ఆ మొత్తం మళ్లీ మనదేశంలో పెట్టుబడి పెట్టాల్సిందే తప్ప రష్యాకు తరలించుకు పోవడానికి అవకాశం ఉండదు. ఇది పూర్తిగా మనకు అనుకూలమైన అంశం. ఇక్కడి దాకా కథ బాగానే ఉంది. కానీ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18,000 మంది భారతీయ విద్యార్థులను అక్కడి నుంచి స్వదేశం పిలిపించ డానికి మాత్రం మోదీ సర్కారు మీన మేషాలు లెక్కిస్తూ కూర్చుంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఈ ప్రయత్నం చేయవలసింది. ఉక్రెయిన్‌ గగనతలం మీంచి విమానాలు ప్రయాణించడానికి అవకాశం ఉన్నప్పుడే ఈ పని చేస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది. రష్యాకు ఉక్రెయిన్‌కు మధ్య యుద్ధం హఠాత్పరిణామం ఏమీ కాదు. కొద్ది నెలలుగా నిప్పు రాజుకుంటూనే ఉంది. ఆ సంకేతాలను గ్రహించడంలో భారత ప్రభుత్వం విఫలమైంది. యుద్ధమే అనివార్యమైతే ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటో కూడా ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉండాలి. అదీ కనిపించలేదు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తీసుకు రావడానికి చాలా ఆలస్యంగా ఏర్పాట్లు మొదలు పెట్టింది మోదీ ప్రభుత్వం. అయితే సకల విషయాల్లోనూ మోదీకి ఎన్నికల చిత్రమే కనిపిస్తూ ఉంటుందేమో. మన విద్యార్థులను వెనక్కు తీసుకొచ్చే కార్యక్రమానికి ‘‘ఆపరేషన్‌ గంగ’’ అని పేరుపెట్టడంలోనే ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలలో లబ్ధిపొందాలన్న ఆశ ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడి చేసిన తరవాత సోమవారం నాటికి గానీ ప్రధానమంత్రి మోదీలో ఉండవలసిన ఆత్రుత కనిపించలేదు. సోమవారం నాడే ఆయన ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను రొమేనియా, మాల్దోవాకుÑ న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజుజును స్లొవేకియాకుÑ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దిప్‌ సింగ్‌ పురీని హంగరీకిÑ మరో మంత్రి, మాజీ సైనిక దళాధిపతి జనరల్‌ వి.కె.సింగ్‌ ను పోలెండ్‌కు పంపించారు. ఉక్రెయిన్లో చిక్కుకు పోయిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాల సరిహద్దులకు చేరుకుంటున్నారు. పోలెండ్‌లో అయితే మన విద్యార్థుల మీద అక్కడి భద్రతా దళాలు దాడులు కూడా చేశాయి. ప్రభుత్వం ముందే మేల్కొని ఉంటే ఈ పరిస్థితే వచ్చి ఉండేది కాదు. మన విద్యార్థులు ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి పొరుగు దేశాల్లోకి ప్రవేశించడానికి నానా యాతన పడవలసి వస్తోంది. వారి కష్టాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తరవాత గానీ మోదీ సర్కారులో చలనం కనిపించలేదు.
ఉక్రెయిన్‌లో పరిస్థితి నేపథ్యంలో భారత విద్యార్థులకు ఇచ్చిన సలహాను వారు పట్టించుకోలేదని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం ఇచ్చామంటున్న సలహాలకు వాస్తవ పరిస్థితులకు పొంతన ఉన్నట్టు లేదు. అనేక మంది విద్యార్థులు సరిహద్దులు దాటడానికి తాము విపరీతంగా కష్టపడవలసి వచ్చిందనీ, సరిహద్దుల దగ్గరకు చేరిన విద్యార్థులకు సహాయ పడడానికి దౌత్య సిబ్బంది అందుబాటులో లేరని కూడా అంటున్నారు. తిండి తిప్పలు లేకుండా దొరికిన వాహనాల్లో ప్రయాణించి అవసరమైనప్పుడు పది పన్నెండు మైళ్లు నడిచి ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకున్న విద్యార్థులు కూడా ఉన్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే విద్యార్థులను తరలించి తామేదో ఘనకార్యం చేసినట్టు మోదీ సర్కారు టముకు వేసుకుంటోంది. సందర్భం ఏదైనా ఈ ప్రభుత్వానికి దృష్టంతా ప్రచారం మీదే ఉంటుంది. అందులో మోదీ కీర్తిగానం ప్రధానాంశం. ఉక్రెయిన్‌ నుంచి ఓ విమానంలో వచ్చిన విద్యార్థుల విమానం ఆగినప్పుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆ విమానంలోకి ఎక్కి మోదీ సర్కారు మిమ్మల్ని సురక్షితంగా తీసుకు రావడానికి ఏర్పాట్లుచేసిందనీ, మోదీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఉపన్యాసం లంకించారు. మన విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత. అది గొప్పగా చాటింపు వేసి చెప్పుకోవలసిన విషయం ఏమీ కాదు. చేయవలసిన పని చేసినా అంతా తమ ఘనతేనని ప్రచారం చేసుకోవడం మోదీ సర్కారుకే చెల్లింది. అక్కడితో ఆగకుండా ఇతరదేశాల వారు తమ పౌరులను స్వదేశం తీసుకెళ్లలేక పోతున్నారని కూడా మోదీసర్కారు చెప్తోంది. అక్కడికి ఇతర దేశాల వైఫల్యం మన విజయమైనట్టు? ఇప్పటికీ దాదాపు 16,000 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లోనే చిక్కుకుపోయి ఉన్నారు.
మైనస్‌ 12 డిగ్రీల నుంచి మైనస్‌ అయిదు డిగ్రీల వాతావరణంలో విద్యార్థులు అతి కష్టం మీద ఉక్రెయిన్‌ సరిహద్దు దాటవలసి వస్తోంది. రష్యా క్షిపణుల దాడిలో ఖర్కీవ్‌లో కర్నాటకకు చెందిన విద్యార్థి నవీన్‌ మృతి చెందడం విషాదమే. అయితే ఆయన కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి ప్రధానమంత్రి మోదీ తన ప్రచార నైపుణ్యాన్ని ప్రదర్శించకుండా ఆగలేకపోయారు. విదేశాలలో చిక్కుకున్న వారిని రప్పించడంలో మన దేశానికి ఎప్పటి నుంచో అనుభవంలో ఉంది. ఇరాక్‌ కువైత్‌ మీద దాడి చేసినప్పుడు దాదాపు లక్షా 70 వేల మందిని వెనక్కు తీసుకు రాగలిగాం. అలాంటప్పుడు మంగళవారం సాయంత్రందాకా కేవలం 9విమానాలలోనే మన విద్యార్థులను తీసుకు రావడం మహత్కార్యం అయినట్టు గొప్పలు చెప్పుకోవడం ప్రచారం కోసం తప్ప మరెందుకూ కొరగాదు. సోమవారం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరిగినచర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. మరోసారి చర్చలు ఉంటాయని రష్యా ప్రకటించింది. రష్యా దాడులు మాత్రం ఆపనేలేదు. ఉక్రెయిన్‌ ప్రతిఘటన సైతం కొనసాగుతూనే ఉంది. పైగా మాతో ఉన్నట్టు రుజువు చేసుకోండి అని యూరప్‌ సమాజ దేశాలను హెచ్చరించే స్థాయిలో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్స్కీ మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్‌సరిహద్దు డాన్‌బాస్‌ దాటి దాదాపు లక్షా27వేలమంది ఉక్రేనియన్లు రష్యాకు వెళ్లారంటే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో గ్రహించ వచ్చు. ఈ గ్రహింపు మోదీ సర్కారుకు లేకపోవడం విచిత్రంగా ఉంది. చేతులు కాలే దాకా ఊరుకోవడం ప్రభుత్వ అసమర్థతకే నిదర్శనం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img