Monday, June 5, 2023
Monday, June 5, 2023

జనవాణిగా ప్రతిపక్ష ఐక్యత

ప్రత్యర్థి పక్షంతో ఢీకొనే రాజకీయ పక్షాలు ఎదుటి పక్షం బలం చూసి జడుసుకోకుండా తమ బలం మీద విశ్వాసం కలిగి ఉంటేనే ఫలితం ఉంటుంది. దానికి బదులు ప్రతిపక్షంలో ఉన్న అంతర్వైరుధ్యాల గురించి అనునిత్యం ఆలోచిస్తూ కూర్చుంటే విజయానికి దూరంగా ఉండిపోవలసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితినిబట్టి మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడిరచడానికి ప్రతిపక్షాలు ఒకే లక్ష్యంతో ఉమ్మడిగా కృషి చేయడమే కాకుండా సైద్ధాంతిక పటుత్వమూ కనబరచాలి. ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటి కేంద్ర సంస్థల దాడులవల్లే ప్రతిపక్షాలు ఐక్యమవుతున్నాయన్న మోదీ వ్యాఖ్య కేవలం ఆయన వాక్చాతుర్యానికే ప్రతీక కాదు. అది ఆయన వెన్నులో వణుకుకు కూడా నిదర్శనం. మోదీ కాలక్రమంలో బీజేపీని ఎన్నికలలో విజయం సాధించే యంత్రాంగంగా మార్చేశారన్నది ఎంత వాస్తవం అయినా రెండు దఫాల పదవీకాలంలో తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక చర్యలు, పెంచి పోషించిన విద్వేష రాజకీయాలు ప్రజలను జాగరూకం చేస్తూనే ఉన్నాయి. మోదీ వికృత పాలన నుంచి విముక్తం కావాలన్న ఆకాంక్ష ప్రతిపక్షాలకే కాక ప్రజల్లో కూడా ఉంది. అయితే ఈ భావన ఆచరణలోకి రావాలంటే ప్రతిపక్షాలు చారిత్రక బాధ్యత నిర్వర్తించాలి. ప్రతిపక్షాల ఐక్యత కోసం సుదీర్ఘ కాలంగా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చిక్కెక్కడ ఉంది అంటే ప్రతిపక్షాలలోనూ కనీసం రెండు శిబిరాలు ఉన్నాయి. ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్‌ ఉండాలని ఒక వర్గం భావిస్తూ ఉంటే కాంగ్రెస్‌ను మినహాయించాలని మరికొన్ని పార్టీలు అనుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న భిన్న ప్రతిపక్ష పార్టీలకు మోదీని గద్దె దించాలన్న సంకల్పం ఎంత బలంగా ఉన్నప్పటికీ తమ రాష్ట్రాలలో కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి అయినందువల్ల ప్రతిపక్ష ఐక్యతకు విఘాతం కలుగుతోంది. బుధవారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గేను కలుసుకోవడం ప్రతిపక్ష ఐక్యత ఒక అడుగు ముందుకు పడ్తుందన్న ఆశ చిగురించింది. ప్రస్తుతం ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి, అందులో కాంగ్రెస్‌ ప్రధాన భాగస్వామిగా ఉండడం అనివార్యం అని భావిస్తున్న నితీశ్‌ కుమార్‌ చిత్త శుద్ధితో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నితీశ్‌ అనేక సందర్భాలలో పిల్లి మొగ్గలు వేసిన మాట నిజమే. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ. కూటమిలో భాగస్వామి అయి అధికారంలో కొనసాగడమూ వాస్తవమే. కానీ నితీశ్‌ కుమార్‌ మౌలికంగా సోషలిస్టు భావాలున్న వారు. సోషలిస్టులు బీజేపీతో కలిసి నడిచిన సందర్భాలు దశాబ్దాలుగా అనేకం ఉన్నాయి. నితీశ్‌ కుమార్‌ చంచల రాజకీయాలు అలా ఉంచితే ఆయన రాజకీయ చాతుర్యం అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలలో ఆయన ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్‌ ఉండి తీరవలసిందేనని పట్టుబడుతూనే ఉన్నారు. గత ఆగస్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకుని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచీ నితీశ్‌ ప్రతిపక్ష ఐక్యత కోసం చేస్తున్న కృషిలో రుజువర్తన స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.
గత డిసెంబర్‌లో నితీశ్‌ నాయకత్వంలోని జె.డి.(యు) జాతీయ సమితి ప్రతిపక్ష ఐక్యతకోసం కృషిచేసే బాధ్యతను నితీశ్‌కు అప్పగించింది. ప్రతిపక్షాల మధ్య ఉన్న విభేదాల గురించే మాట్లాడకుండా సామ్యం మీద దృష్టి కేంద్రీకరించాలని నితీశ్‌ అంటున్నారు. ఇది సాధ్యం అయితే ప్రజల్లో కూడా ప్రతిపక్షాల మీద విశ్వాసం పెరుగుతుంది. ప్రతిపక్ష ఐక్యతా బాధ్యతను నితీశ్‌ స్వీకరించాలని బుధవారం నాటి సమావేశంలో రాహుల్‌ గాంధీ అన్నారు. అంటే ప్రతిపక్షాలతో కలిసి నడవడానికి కాంగ్రెస్‌ సుముఖంగానే ఉన్నట్టు లెక్క. కాంగ్రెస్‌ కు అనుకూలంగా ఉన్న పార్టీలతో చర్చించే బాధ్యతను ఖడ్గేకు, కాంగ్రెస్‌ అంటే కిట్టని ప్రాంతీయ పార్టీల నాయకులైన మమతా బెనర్జీ, అఖిలేశ్‌ యాదవ్‌, కె.చంద్రశేఖర రావును సంప్రదించే బాధ్యతను నితీశ్‌కు అప్పగించారు. ఇటీవల అదానీని వెనకేసుకొచ్చిన శరద్‌ పవార్‌ తో మాట్లాడే బాధ్యతా నితీశ్‌ కుమార్‌ కే అప్పగించారు. దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి బీజేపీని ఓడిరచి తీరాలన్న దీక్ష కనబరిచి ఉమ్మడిగా పోటీ చేస్తే బీజేపీకి మంచి సవాలు విసరొచ్చు. అలాగే బెంగాల్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు, కాంగ్రెస్‌ మధ్య ఏదో ఒక రకమైన అవగాహన కుదరితే బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చూడొచ్చు. ఈ ప్రయత్నం ఇటీవల సఫలం కాకపోయినా మిగిలిన మార్గం అదే. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాది పార్టీకి, కాంగ్రెస్‌కు శ్రుతి కుదిరితే 20 శాతం ఉన్న మైనారిటీల ఓట్లు చీలకుండా చూడొచ్చు. బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లో అవగాహన కుదిరితే మొత్తం 134 స్థానాలలో ప్రతిపక్షం 70 స్థానాలు సాధించవచ్చు. ఈ అవగాహన లేకనే 2019లో ఈ 134 సీట్లలో 115 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ప్రతిపక్ష కూటమికి నాయకుడెవరు, ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి ఎవరు అన్న చర్చలు ప్రస్తుతానికి అనవసరం. 1996, 2004, 2009 లో ప్రతిపక్షాల నాయకుడు ఎవరు అన్న దానితో నిమిత్తం లేకుండానే ఇప్పుడు ప్రతిపక్షంలోఉన్న పార్టీలు ఎన్నికల బరిలోకి దిగాయి. ప్రజలెదుర్కుంటున్న సమస్యలనుంచి దృష్టి మళ్లించడానికి మోదీ అనుసరించని ఎత్తుగడలే లేవు. ప్రజా సమస్యలను చర్చనీయాంశం చేస్తే ప్రతిపక్షాల మీద నమ్మకం కుదురుతుంది. అలాగే తమకు అంతగా బలంలేని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ అత్యాశ విడనాడాలి. గత రెండు మూడేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలలో ఐక్యతా కాంక్ష ఎంత బలంగా వ్యక్తం అయిందో విభేదాలు కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపించాయి. అయితే రాహుల్‌, ఖడ్గే తో నితీశ్‌ జరిపిన చర్చలు ఇంతకు ముందు జరిగిన ప్రయత్నాలతో పోలిస్తే ఒకడుగు ముందుకు వేసినట్టే. అన్నింటికీ మించి బీజేపీ మీద రాజీ లేని సైద్ధాంతిక పోరాటం సాగించగలగాలి.
ప్రాంతీయ పార్టీలకు సైద్ధాంతిక నిబద్ధత తక్కువ. కానీ లక్ష్యం మీద గురిపెట్టగలిగితే సైద్ధాంతిక ప్రాతిపదికా ఏర్పడవచ్చు. నితీశ్‌ ఈ మధ్య దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులనూ కలుసుకున్నారు. ప్రతిపక్ష కూటమికి సారథి ఎవరు, మోదీ వ్యతిరేక పోరాటంలో ప్రతిపక్ష నేతల పాత్ర ఏమిటి అన్న రెండు ప్రధానాంశాలు నితీశ్‌ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రజాస్వామ్య, సెక్యులర్‌ విధానాల పరిరక్షణ అంశాలు ప్రతిపక్ష కూటమికి తగిన సైద్ధాంతిక పునాది ఏర్పాటు చేయగలవు. ప్రతిపక్ష పార్టీలు మూడు రోజులు సమావేశమై సకల విషయాలు చర్చించి నిర్దిష్ట అభిప్రాయానికి రావాలని, ఎజెండా సిద్ధం చేసుకోవాలని రాహుల్‌ చేసిన సూచన కాంగ్రెస్‌లో కనిపిస్తున్న మార్పుకు చిహ్నం. టూకీగా చెప్పాలంటే ప్రతిపక్ష ఐక్యత జనవాణిగా ఉండాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img