Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

జనాగ్రహ సంకేతం ఈ బంద్‌

వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సుదీర్ఘ కాలంగా రైతులు కొనసాగిస్తున్న ఆందోళన క్రమంలో బంద్‌కు పిలుపు ఇవ్వడం ఇది మొదటి సారి కాదు. సోమవారం బంద్‌ జరపాలని రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సం యుక్త కిసాన్‌ మోర్చా పిలుపు ఇవ్వడానికి ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఇదే రోజున పార్లమెంటులో ప్రతిపక్షాల, రైతుల అభ్యంతరాలను, విమర్శలను పెడచెవినపెట్టి ఆమోదించిన వివాదాస్పద బిల్లులకు రాష్ట్రపతి కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీనికి నిరసనగానే ఈ బంద్‌. సాధారణంగా బంద్‌లు జరిగినప్పుడు కనిపించిన దృశ్యాలు సోమవారం నాటి బంద్‌లో లేకపోవచ్చు. అలాగే బంద్‌ను విఫలం చేయడానికి ప్రభుత్వం అలవాటుగా అనుసరించే లాఠీ ఛార్జీ, జల ఫిరంగుల ప్రయోగం, పోలీసు కాల్పులు లాంటి అణచి వేత చర్యలకు పాల్పడి ఉండకపోవచ్చు. వీధులు రక్తమోడిన సందర్భాలు లేకపోవచ్చు. ఈ బంద్‌ పిలుపు విషయంలో పాశవికంగా వ్యవహరిస్తే విలోమ ఫలితాలు వస్తాయని ప్రభుత్వం గుర్తించినట్టుంది. అందుకే నాయకుల ముందస్తు అరెస్టుల లాంటి చిట్కాలు ప్రయోగించలేదు. కానీ వివాదాస్పద చట్టాల రద్దు రైతులకు మాత్రమే పరిమితమైన సమస్యగా మిగలలేదని ఈ బంద్‌ నిరూపించింది. రైతులు ఇచ్చిన బంద్‌ పిలుపునకు కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, రవాణా రంగ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, వర్తకులు కూడా మద్దతిచ్చారు. రైతుల సమస్య మొత్తం సమాజం సమస్య అని విభిన్న వర్గాల వారు గ్రహించడమే ఇంతటి విస్తృత మద్దతుకు కారణం. వ్యవసాయేతర రంగాల వారు కూడా ఈ బంద్‌లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 15 కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్‌లో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించాయి. సంఘటిత కార్మిక శక్తి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని నిరూపించడానికే బంద్‌ నిర్వహణలో కార్మికులు ముందు వరసలో నిలిచారు. బంద్‌లో ప్రతిపక్షాల పాత్ర నిర్ణాయకంగా కనిపించింది. పది నెలలుగా సాగుతున్న రైతుల ఉద్యమం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే సాగుతున్నా వ్యవసాయదారుల సమస్యలు రాజకీయాలకు అతీతమైనవి కావు. అందువల్ల రాజకీయ పార్టీలు అవసరమైనప్పుడల్లా చేయూతనిస్తూనే ఉన్నాయి. అసోం లాంటి ఒకటి రెండు రాష్ట్రాలలో బంద్‌ ప్రభావం తక్కువగా ఉంది. కానీ జమ్మూలోనూ, శ్రీనగర్‌లోనూ ప్రజలు వీధుల్లోకి వచ్చి బంద్‌కు మద్దతు ప్రకటించారు. సోమవారం నాటి బంద్‌కు అందిన మద్దతు చూస్తే రైతుల ఆందోళనకు ప్రజా మద్దతు బలంగా, విస్తృతంగా, ప్రస్ఫుటంగా ఉండడమే కాకుండా ఇది భౌగోళిక పరిధులను దాటిందని రుజువైంది. రైతులు గత నాలుగైదుగేళ్లుగా వివిధ ప్రాంతాలలో చేసిన ఆందోళనలకు కూడా సమాజంలోని భిన్న వర్గాల వారు మద్దతిచ్చిన తీరు అపూర్వమైందే కాక అపురూపమైంది. ఆ ధోరణి నానాటికీ సంఘటితమవుతోంది. వివిధ వర్గాల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. సోమవారం నాటి బంద్‌ వల్ల పరిశ్రమలు, వర్తక-వాణిజ్య సంస్థలు ఎలాగో మూతపడ్డాయి. రోడ్డు రవాణాకు చాలా చోట్ల అవాంతరం కలిగింది. అయితే జన జీవనాన్ని స్తంభింపచేయడం తమ ఉద్దేశం కాదని రైతులు ముందే ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకుంటే ఈ ఆందోళన ప్రజలను ఇబ్బంది పెట్టని రీతిలో సాగుతోందని సులభంగానే గ్రహించవచ్చు. బంద్‌ను సమర్థించే వారు కొన్ని చోట్ల రైలు పట్టాలపై బైఠాయించినందువల్ల కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని దారి మళ్లించవలసి వచ్చింది.
ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికో, ప్రజల దృష్టికో తీసుకురావాలంటే ప్రజల రోజువారీ జీవితానికి భంగం కలిగించనవసరం లేదని, అత్యవసరమైన పనులు ఆగిపోవలసిన అగత్యం లేదని ఈ బంద్‌ రుజువు చేసింది. రైతుల ఆందోళనలో ఇలాంటి వినూత్న సంప్రదాయాలు నెలకొంటున్నాయి. తమ సమస్యలను పట్టించుకోకుండా మొండికేసిన ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో రైతులు గ్రహిస్తూనే ఉన్నారు. కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. గత ఏప్రిల్‌, మే నెలల్లో అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు రైతులు ప్రభుత్వానికి అర్థమయ్యే ఓట్ల పరిభాషలోనే సమాధానం చెప్పాలని నిర్ణయించారు. ఈ ప్రభుత్వానికి ఓట్ల భాష మాత్రమే అర్థం అవుతుంది కనక బీజేపీకి మినహా ఏ పార్టీకి అయినా ఓటు వేయండి అని ప్రజలకు పిలుపు ఇచ్చింది రైతు నాయకత్వం. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో రైతు నాయకులు పర్యటించి ఈ సందేశం వినిపించారు. వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలలోనూ రైతులు ఇదే వైఖరి అనుసరించే అవకాశం ఉంది. అందులోనూ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాలా కీలకమైనవి కనక ప్రధానంగా ఆ రాష్ట్రంలో రైతులు బీజేపీకి తప్ప ఎవరికైనా ఓటు వేయండి అని చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు రైతు ఉద్యమంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్న వారిలో చాలా మంది ఇంతకు ముందు బీజేపీ సమర్థకులన్నది నిర్వివాదాంశం. కానీ వాళ్లే ఇప్పుడు బీజేపీకి బద్ధ విరోధులుగా కనిపిస్తున్నారు. ఇది రైతుల ఉద్యమాలలో అంతర్లీనంగా ఉన్న రాజకీయ కోణం. ముఖ్యంగా ఉద్యమంలో ప్రస్తుతం ప్రధాన పాత్ర నిర్వహిస్తున్న వారు ముజఫర్‌ నగర్‌ మతకలహాల్లో ముస్లింల మీద దాడుల్లో కీలక పాత్ర పోషించిన వారు. దీనినుంచి 2017లో లబ్ధి పొందింది బీజేపీ. కానీ ఇటీవల జరిగిన మహాపంచాయత్‌లో రైతులు కుల మతాలకు అతీతంగా అనూహ్యమైన ఐక్యత ప్రదర్శించారు. మతతత్వ ఆలోచనా విధానం ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో గ్రహించారు. ఎదిరించాల్సింది, వ్యతిరేకించవలసింది, ఘర్షణ పడవలసింది ఇతర కులాల వారితోనో మతాల వారితోనూ కాదని అధికార పక్షం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలనని రైతులే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల వారు తెలుసుకున్నారు. అందుకే సోమవారం నాటి బంద్‌కు భిన్న వర్గాల మద్దతు సమకూరింది. బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలబడుతున్నాయి. ప్రత్యేకంగా గమనించదగిన విషయమేమిటంటే సాధారణంగా బీజేపీని సమర్థించే ప్రాంతీయ పార్టీలు కూడా ఈ సారి బాహాటంగా బంద్‌కు అండగా నిలవడం. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ, ఒడిస్సాలో నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతా దళ్‌ ప్రభుత్వం కూడా బంద్‌కు బాసటగా నిలిచాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ బంద్‌ ప్రభావాన్ని చూస్తే మోదీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత తీవ్రత తెలుస్తోంది. రైతులు, కార్మికులు, ప్రతిపక్ష పార్టీల మధ్య బంద్‌ సందర్భంగా వ్యక్తమైన రాజకీయ దృక్కోణాన్ని గమనిస్తే మతోన్మాదాన్ని, కులాభిమానాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం ఇక మీద చెల్లదన్న సూచన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బంద్‌ సందర్భంగా వామపక్ష పార్టీలు జనంలో తమకున్న ఆదరణను నిరూపించుకోగలిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img