భారత్, కెనడా దేశాల మధ్య అనేక సామ్యాలు ఉన్నట్టే వివిధ అంశాలపై మధ్యమధ్యలో విభేదాలకూ కొదవలేదు. ఇటీవల దిల్లీలో అట్టహాసంగా జరిగిన జి20 సమావేశాలకు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో హాజరయ్యారు. ఇద్దరికీమధ్య సంక్షిప్తంగా ముఖాముఖి చర్చలూ జరిగాయి. ఈ మాటామంతీలో కూడా ఇద్దరు నాయకులు ఎడముఖం పెడముఖంగా ఉండడం అంతర్జాతీయ సమాజం సైతం గమనించింది. జి20 సమావేశాలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడకపోవడం లేదా మాట్లాడడానికి అవకాశం లేకపోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రధానమంత్రి మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహిస్తారనుకున్నారు. ఈ ఉమ్మడి విలేకరుల సమా వేశం జరగకపోవడానికి పత్రికలవారి ఎదుటకు రావడానికి మోదీ ఎన్నడూ సిద్ధంగా ఉండరు అన్నది ఒక కారణం. కానీ రెండో కారణం కూడా ఉంది.
భారత్, కెనడా మధ్య సంబంధాలలో తలెత్తిన ఉద్రిక్తత బైడెన్ దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడితే కచ్చితంగా ప్రస్తావనకు వచ్చేది. అందుకే బైడెన్ కూడా హనోయ్ వెళ్లి అక్కడ భారత్ మీద పరోక్షంగా దెప్పి పొడిచారు. అంటే భారత్, కెనడా దేశాల మధ్య సఖ్యత లేకపోవడం అమెరికా లాంటి దేశాల మీద కూడా ప్రభావం చూపించింది. ఈ పరిణామాలన్నింటికీ కెనడాలో ఉంటున్న సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో హత్యకు గురికావడమే. నిజ్జర్ ఖాలిస్తానీల మద్దతుదారు. 1980లలో పంజాబ్‌లో ఖలిస్తానీ ఉద్యమం ఉధృతంగా సాగినప్పుడు ఆ తీవ్రవాదులకు కెనడా నుంచి సహాయం అందుతోందన్న ఆరోపణలు విరివిగా వినిపించేవి. నిజ్జర్ సిక్కులకు స్వాతంత్య్రం కావాలని వాదించే వ్యక్తి. నిజ్జర్ హత్యకు భారత్ కారణం అని కెనడా ప్రధానమంత్రి బాహాటంగానే ప్రకటించారు. ఈ ఆరోపణ చేయడానికి వెనక తమదగ్గర ‘‘విశ్వసనీయమైన సమాచారం’’ ఉందని ట్రూడో అంటున్నారు. ఈ వాదనను భారత్ అంగీకరించక పోవడంలో ఆశ్చర్యంలేదు. అమెరికా సైతం కెనడా వాదననే సమర్థిస్తోంది. అమెరికాకు సన్నిహితంగా మెలగాలని బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. జస్వంత్ సింగ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు పొరుగూరికి వెళ్లివచ్చినంత తరచుగా అమెరికా సందర్శించేవారు. భారత్‌ను దూరం చేసుకోవడం అమెరికా లక్ష్యం కాకపోవచ్చు. కానీ కెనడా, భారత్ మధ్య ఏ దేశానికి సన్నిహితంగా ఉండాలన్న ప్రశ్న ఎదురైనప్పుడు అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా కెనడాకే దన్నుగా నిలబడతారు. సిక్కు సంస్థలు నిజ్జర్‌ను మానవ హక్కుల కోసం నిలబడే వ్యక్తిగా భావిస్తాయి.
భారత ప్రభుత్వం మాత్రం ఆయనను నేరస్థుడిగానే పరిగణిస్తుంది. కానీ కెనడా జనాభాలో రెండు శాతం మంది సిక్కులున్నారు. మొత్తం జనాభాలో వీరిది స్వల్పమైన సంఖ్యే కావచ్చు. కానీ కెనడాలో ఉండే సిక్కులు సాధారణంగా కెనడా ప్రభుత్వాన్ని సమర్థిస్తారు. కెనడా ప్రభుత్వం కూడా సిక్కులను ఓటు బ్యాంకుగా వినియోగిస్తుంది. పంజాబ్ తరవాత సిక్కులు అధిక సంఖ్యలో నివసించేది కెనడాలోనే. కెనడాలో ఉండే సిక్కులు ప్రవాసం వెళ్లినవారు కావచ్చు కానీ వారికి మాతృదేశమైన భారత్‌తో పేగు బంధం ఉంది. అందువల్ల వారి సంక్షేమంకూడా భారత్ గమనంలో ఉంచుకోవాలి. కానీ నిజ్జర్ వ్యవహారం ఈ అవకాశాన్ని దెబ్బతీసింది. ట్రూడో భారత్ సందర్శించి వెళ్లిన తరవాత రెండు దేశాల సంబంధాలు మరింత దిగజారాయి. రెండు దేశాలూ దౌత్య వేత్తలను బహిష్కరించాయి. ఇది బెడిసిన సంబంధాలకే నిదర్శనం. ప్రస్తుతం కెనడాతో మన సంబంధాలు ఈ సంకట స్థితిలోనే ఉన్నాయి.
గత 50 ఏళ్ల నుంచి భారత్-కెనడా సంబంధాలు తూగుటూయల మీదే ఉన్నాయి. ఈ సంబంధాలలో నిలకడలేదు. అమెరికా-రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగిన దశలో రెండు దేశాలకు కొంత సాన్నిహిత్యం ఏర్పడిరది. రెండూ కామన్వెల్త్ దేశాలే. ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను చూడాలి. భిన్న దేశాల మధ్య సంబంధాలు, అంతర్జాతీయ అభివృద్ధి లాంటి అంశాలలో రెండు దేశాల విధానాల మధ్య సామ్యంఉంది. చేరువ కావడానికి ఇదే ప్రధానం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కొరియా, హంగరీ, వియత్నాం దేశాల విషయంలో రెండుదేశాల వైఖరిలో పొంతన కుదరలేదు. భారత్ 1998లో రెండోసారి అణుపాటవ పరీక్ష నిర్వహించడాన్ని కెనడా తప్పుపట్టింది. ఉన్న వాణిజ్య సంబంధాలూ అంతంత మాత్రమే. ఉక్రెయిన్ విషయంలో రెండు దేశాల వైఖరుల మధ్య పొంతనేలేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ మాటమాత్రంగా వ్యతిరేకిస్తోంది తప్ప, ఉక్రెయిన్ పక్షాన నిలబడడంలేదు. కానీ కెనడా మాత్రం ఉక్రెయిన్‌కు సకల విధ సహాయాలు అందిస్తూనే ఉంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెంపొందించుకోవాలని ఇటీవల చేస్తున్న ప్రయత్నాలకు నిజ్జర్ హత్యోదంతం గండికొట్టింది. నిజ్జర్ విషయంలో భిన్నవైఖరులు అనుసరించిన నేపథ్యంలో అమెరికా కెనడానే సమర్థిస్తోంది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ తనప్రయోజనాలను కాపాడగలిగినంత కాలమే అమెరికా భారత్‌తో సఖ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం చైనాను కట్టడిచేయడానికే భారత్‌కు మద్దతు ఇస్తున్నట్టు భ్రమ కల్పిస్తోంది. దక్షిణాసియాకు సంబంధించి భౌగోళిక, రాజకీయ సమీకరణల్లో భారత్ మద్దతు అమెరికాకు అవసరమే కానీ కెనడాతో పోలిస్తే, భారత్‌తో సంబంధాలను తేల్చుకోవాల్సిన స్థితివస్తే అమెరికా తప్పకుండా కెనడా పక్షమే వహిస్తుంది. కెనడాతో సంబంధాల విషయంలో వైషమ్యాలు పొటమరించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య శక్తికి పరీక్షే. జి20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించి తానే విశ్వగురువును అనుకుంటున్న మోదీకి కెనడాతో సంబంధాలు మెరుగుపరచుకోవడం సులభ సాధ్యమైన వ్యవహారంగా కనిపించడంలేదు.
అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ దేశాలు కెనడాకే అండగా నిలబడుతున్నాయి. మన దౌత్యనీతి దృష్టితో చూస్తే అమెరికాతో మన సంబంధాల స్థాయి ఏమిటన్నది అత్యంత ప్రధానమైన అంశం. పశ్చిమ దేశాలతో మన సంబంధాలకు, అమెరికాతో సత్సం బంధాలు చాలా కీలకం. ఈ స్థితిలో అంతర్జాతీయంగా భారత్‌కు గౌరవం పెరిగిందని ప్రచారం చేసుకుంటున్న మోదీ తన దౌత్యశక్తికి ఏ మేరకు పదును పెట్టగలరు, ఎన్ని దేశాల మద్దతు సమీకరించగలరు అన్నది వేచి చూడవలసిన అంశమే. మోదీ కనక భారత్ ప్రయోజనాలను నెరవేర్చేరీతిలో విదేశాంగనీతిని మలచకపోతే, కెనడా వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడి మద్దతు సంపాదించలేకపోతే మోదీ విఫలమైనట్టే లెక్క. కెనడాలో సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు కనక వారి సంక్షేమం, మన ప్రయోజనాల పరిరక్షణ మోదీకి కత్తిమీద సామే.