Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

తగ్గుతున్న వినిమయం

కోవిడ్‌19 మహమ్మారి దాదాపు మూడేళ్లపాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను వణికించింది. కోట్లాది మంది ప్రాణాలను హరించింది. ఆదాయాలు పడిపోయి మన దేశంలో పేదరికం మరింత పెరిగింది. ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. కుబేరుల సంఖ్య పెరిగింది. మన దేశంలో 25 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. కోవిడ్‌కాలంలో మూతబడిన లక్షలాది చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పెద్ద పరిశ్రమలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని పరిశ్రమలను విస్తరించడం లేదు. అత్యధిక చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు ఎక్కువగా ఇవ్వడం లేదు. గ్రామీణప్రాంతాల్లో వినిమయం గణనీయంగా పడి పోయింది. ద్రవ్యోల్బణం దాదాపు 6శాతానికి చేరనున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం దాదాపు పదిశాతంఉండగా పట్టణ ప్రాంతాల్లో 7.5 శాతానికి చేరి ఇంకా అధికం కానున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ఏడాదికి పైగా కొనసాగుతుండటం, కరోనా భీతి యింకా తొలగకపోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మాంద్యంలోనే కొనసాగుతోంది. ఎగుమతులు పెరగడం లేదు. దేశీయ పరిశ్రమల ఉత్పత్తులు పెరగడం లేదు. దీంతో మనం అనివార్యంగా దిగుమతులు పెంచుకుంటున్నాము. మళ్లీ అన్నీ వినిమయవస్తువుల ధరలు పెరిగి పోయాయి. నిజ ఆదాయాలు తగ్గిపోయి కొనుగోలు శక్తి, వినిమయం తగ్గుతున్నాయి. దేశంలో అత్యధికుల పరిస్థితి ఇది. అన్ని రకాల రవాణా ఛార్జీలు పెరిగాయి. దిగుమతి చేసుకొనే బొగ్గు వినియోగ విద్యుత్‌ ఉత్పత్తి ప్రయివేటు కంపెనీలు యూనిట్‌ రేటును రు50 దాకా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించిందన్న వార్తలు వినిమయదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 14.5 కిలోల వంటగ్యాస్‌ సిలిండరు ధరను అమాంతం పెంచి వినియోగదారులపై పెద్ద భారం మోపారు. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే గ్యాస్‌ ధర రూ.50 పెంచి వినియోగదారుల నడ్డి విరిచింది. దీనివల్ల వీరి ఆదాయాలు తగ్గుతాయి. వాణిజ్య సిలిండరు ధర ఏకంగా రు.350 పెంచింది. ఫలితంగా హోటళ్లు తదితరాలలో రేట్లు పెరిగి ఆ భారం వినియోగదారులపై పడుతుంది. ఈ ధరలు వెంటనే అమలవుతాయి. విమాన ఇంధన ధరను 4 శాతం తగ్గించి ధనికులకు, ఎగువ మధ్యతరగతికి రాయితీ కల్పించారు. ఇకపై గృహ వినియోగ సిలిండరు ధర రూ.1125.50 చెల్లించవలసిందే. ఇది బుధవారం నుండే అమల్లోకి వచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చేనాటికి 14.5 కిలోల సిలిండరు ధర రూ.404 ఉండగా ఇప్పుడు రూ.1125 కు పెంచింది. ఇదీ మోదీ సాధించిన అభివృద్ధి. ఎన్నికలు ముగిశాక రేట్లు పెంచడం, ఎన్నికలప్పుడు తాయిలాలు ప్రకటించడం మోదీ మార్క్‌ పాలన ప్రత్యేక లక్షణాలు. ఎగువ మధ్యతరగతి ప్రజల వినిమయం మాత్రం పెరిగింది. దేశంలో మధ్యతరగతి జనాభా సంఖ్య పెరిగింది. 202324 బడ్జెట్‌లో వారిపైన ఎటువంటి భారాలు మోపలేదు.
రానున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మధ్యతరగతికి కొంత ఊరట కలిగించారు. ఉదాహరణకు బ్యాంకుల్లో సీనియరు పౌరులు రూ.30 లక్షల వరకు డిపాజిట్లు చేయవచ్చు. అయితే రూ.7 లక్షలకు పైన ఆదాయం గలవారు విధిగా ఆదాయం పన్ను చెల్లించవలసి ఉంటుంది. కోవిడ్‌కు ముందు దిగువ స్థాయిలో గల 20 శాతం కుటుంబాల వద్ద కొనుగోలు చేయగల డబ్బు 6.5 శాతం ఉండగా అది కోవిడ్‌ కాలంలో 3 శాతానికి పడిపోయింది. ఇప్పటికీ ఇది పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడీ డబ్బు 4.5 శాతానికి చేరుకున్నదని 2016`2021 కాలంలో నాటి గణాంకాల ఆధారంగా ప్రైస్‌ ఐసి 360 నివేదిక తెలియచేసింది. దిగువ స్థాయిలో గల 40 శాతం కుటుంబాల కొనుగోలు శక్తి నెమ్మదిగా పెరుగు తోంది. కోవిడ్‌కాలంలో వినిమయం కోసం చేసిన అప్పులను తీర్చడానికి కొంత కేటాయించగలుగుతున్నారు. వీరి నిజ ఆదాయాల పెరుగుదల దేశమంతటా ఒకే విధంగా లేదు. దిగువ తరగతి ప్రజల్లో తక్కువగా, మధ్యతరగతిలో కొంత ఎక్కువగా, ధనిక వర్గంలో అత్యధికంగా ఉంది. ఎందుకంటే కరోనా కాలంలోనూ సంపన్న వర్గాల ఆదాయాలు పెరిగాయేగానీ తరగలేదు. ఆశ్రిత పెట్టుబడిదారీ సంపన్న వర్గాల సేవలో తరిస్తున్న బీజేపీ నాయకత్వంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కరోనాలోనూ 1.45 లక్షల కోట్ల రాయితీలను ఇవ్వడమేగాక, సంపదపై పన్నును 30 శాతం నుండి 20 శాతానికి తగ్గించి సామాన్యులను, నిరుద్యోగులను గాలికి వదిలేసింది. వలస కూలీల జీవితాలనుమోదీ మరింత క్లిష్టం చేశారు. జీడీపీ పెరుగుతోందని, ఇది 6.7 శాతానికి చేరుకుందని, దీని వల్ల కుటుంబ వినియోగం అధికమై వృద్ధి రేటు పెరుగుతుందని కేంద్రం చెప్పే మాటలన్నీ డొల్ల అని ఇంతవరకు మోదీ పాలన అనుభవం ప్రజలకు ఉంది. పైగా మధ్యతరగతి ప్రజల కొనుగోలుకు అవకాశం గల డబ్బు 2023లో రూ.5లక్షలకు చేరుతుందని, ఇది 2030నాటికి రూ.30 లక్షలకు చేరుతుందని మనల్ని ఊరిస్తున్నారు.
మధ్యతరగతి కుటుంబాలు 165 మిలియన్లు లేదా 715 మిలియన్ల జనాభా ఉంటారని అంచనా. వీరి వినిమయం ప్రస్తుతం మొత్తం వినిమయంలో 48 శాతం ఉందని ఇది ఈ దశాబ్ది చివరి నాటికి 70 శాతానికి పెరుగుతుందని, 115 మిలియన్లు దారిద్య్రరేఖ ఎగువకు చేరుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఒక మాదిరి ఆర్థిక వృద్ధిరేటుకు మధ్య సంబంధం ఉంటంది. అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లను పెంచుతున్నప్పటికీ అది తగ్గడంలేదు. ఆర్థిక సరళీ కరణ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు అనుసరించినంత కాలం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థికసంక్షోభాలు తప్పవని కొన్ని సందర్భా లలో ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని 2008లో అమెరికా లోనే చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభం రుజువు చేసింది. మోదీ పాలన పూర్తిగా కార్పొరేట్ల కైవసమయ్యే మార్గంలో పయనిస్తోంది. దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఆరోగ్య రంగం పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో దిగువ ఉన్న 10 శాతం కుటుంబాలు ఆహార వస్తువుల కొనుగోలుకు తక్కువగానే ఖర్చు చేయగలుగుతున్నారు. ఆయా కుటుంబాల ఆదాయాలను అనుసరించి తరతమ భేదాల్లో ఖర్చు చేస్తున్నాయి. రానున్న నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని, ద్రవ్యోల్బణం తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. అయితే గణాంకాలు చెప్పినంత ఆశాజనకంగా వాస్తవ పరిస్థితులు లేనందున వినిమయం పేద వర్గాల్లో పెరగుతుందన్న హామీ లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img