Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

తాబేలును తిరగేసి కొట్టడమే

నల్ల ధనాన్ని వెలికి తీయడంకోసం పెద్ద నోట్లను రద్దు చేసిన వాళ్లు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేసి ఆ ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకోనూగలరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం నాడు ప్రకటించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌ లైన్‌ (ఎన్‌.ఎం.పి.) పథకం సరిగ్గా ఇలాంటిదే. ప్రభుత్వ అధీనంలో చాలా ఆస్తులు ఉంటాయి. అందులో ఆశ్చర్యం లేదు. వాటిని సంపూర్ణంగా వినియోగించుకుంటే ఫలితం ఉంటుంది. అది కుదరనప్పుడు ఆ ఆస్తులున్నా ప్రయోజనం ఉండదు. అందుకని ప్రభుత్వ ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకోవడానికి ఈ కొత్త పథకం ప్రారంభించారు. వాటిని లాభసాటిగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఇందులో రోడ్లు, రైల్వేలు మొదలుకొని సర్వమూ ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. వీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోలేనప్పుడు అవి నిరర్థకంగా మిగిలిపోతాయి. వీటిని ఉపయోగపెట్టు కోలేకపోవడం ప్రభుత్వ బలహీనత. దీనిని కప్పిపుచ్చుకోవడానికి వీటిని ప్రైవేటు రంగానికి అప్పగించి డబ్బు సమకూర్చుకుంటారట. ఆ మొత్తం ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రైల్వే స్టేషన్లు, స్టేడియంలు మొదలైన వాటితో పాటు వీటిని ప్రైవేటుకు అప్పగించి నగదు రూపంలోకి మార్చు కోవాలనేది ప్రభుత్వ ఆలోచన.
1991 నుంచి మన దేశంలో ప్రైవేటీకరణ బండి జోరుగా సాగుతోంది. ప్రైవేటీకరణ మార్గాన్ని అనుసరించడానికి ఓ పథకం ప్రకారం ప్రభుత్వ రంగాన్ని భ్రష్టు పట్టించారు. పరిశ్రమలు, ఇతర సంస్థలు, వ్యవస్థలు లాభసాటిగా నడిపే సామర్థ్యం ప్రభుత్వానికన్నా ప్రైవేటు రంగ సామర్థ్యమే ఎక్కువ అన్న ప్రచారం దండిగా చేశారు. మన దేశంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, గత 74 ఏళ్ల కాలంలో కనీసం 13 ఏళ్లు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొదలైన వాటికీ ప్రైవేటీకరణ మీద ఎక్కడలేని మక్కువ. ప్రభుత్వ రంగం నీరుగారిపోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని ప్రైవేటీకరణ మంత్రజపం చేస్తున్న ఏ రాజకీయ పార్టీ కూడా అంగీకరించదు. ఒక్క వామపక్షాలు మాత్రమే ఇప్పటికైనా ప్రభుత్వరంగ ప్రాధాన్యత, అవసరాన్ని గురించి మాట్లాడుతున్నాయి. పీవీ నరసింహా రావు, మన్మోహన్‌ సింగ్‌ ద్వయం ఆర్థిక సంస్కరణలకు బీజం వేశారని అంటారు. నిజానికి ప్రైవేటీకరణ రాజీవ్‌ గాంధీ హయాంలోనే ప్రారంభమైంది. మొదట టెలిఫోన్‌ రంగంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తరవాత సకల రంగాలనూ ఆవహించింది. ఈ దేశంలో ప్రభుత్వ రంగానికి పునాదులు వేసి ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. అయితే అది ఇప్పుడు చరిత్ర పుటల్లో నిక్షిప్తమైన అంశం మాత్రమే. కాంగ్రెస్‌, బీజేపీల్లో ఏది ప్రతిపక్షంలో ఉన్నా ఆర్థిక సంస్కరణలను కుంటుపరుస్తున్నారని అధికారంలో ఉన్న పార్టీలను తప్పుపడ్తుంటాయి. వెరసి రెండిరటి లక్ష్యమూ ప్రైవేటీకరణే. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి మునుపటి ప్రాధాన్యం ఉండాలని కోరుకునే పాలక పక్షాలే లేవు. ఆర్థిక సంస్కరణలను మరింత తీవ్రంగా అమలు చేయాలన్నదే అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్న పార్టీలన్నింటి వాదన. మొత్తం ఆర్థిక వ్యవస్థను ప్రైవేటు రంగం గుప్పెట్లో ఉంచడమే ప్రస్తుత రీతి. అయితే ప్రభుత్వ రంగ సంస్థలను పనిగట్టుకుని నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే దశ దాటి మోదీ ప్రభుత్వం ఆస్తుల ఆధారంగా డబ్బు సంపాదించాలని భావిస్తోంది. ఈ పథకం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది నెలల కిందే సూచన ప్రాయంగా చెప్పారు. ప్రభుత్వం చేతిలో డబ్బు ఆడడం లేదు. ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థ డీలా పడిపోతున్నందువల్ల వాటి నుంచి ప్రభుత్వానికి అందే సొమ్ము అందడం లేదు. రిజర్వు బ్యాంకు మెడలు వంచి లక్షల కోట్లు మోదీ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు అదీ చాలడం లేదు. అందువల్ల ఆస్తులను ప్రైవేటు పరం చేసి నగదు సంపాదించాలని సంకల్పించింది. అంటే ప్రైవేటు రంగం ప్రభుత్వ ఆస్తులను నిర్వహిస్తుంది. వాటిని మెరుగుపరుస్తుందన్న ఆశా ఉంది. అయితే ఈ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించడానికి ఏ పద్ధతి అనుసరిస్తారో ఇంకా స్పష్టంగా తెలియదు. వేలం వేస్తారో, వచ్చే ఆదాయంలో వాటా అడుగుతారో తెలియదు.
నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పథకం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం అన్న భావనలో కొత్త కోణానికి వీలు కల్పిస్తుంది. అయితే ప్రైవేటు రంగం ఈ పథకాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో అన్న అంశం మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను వినియోగించుకునే అవకాశాన్ని ప్రైవేటుకు ఇస్తాం తప్ప వాటిని విక్రయించబోమని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అంటే నిర్ణీత గడువు కోసం ప్రైవేటుకు అప్పగించే సూచన కనిపిస్తోంది. ఈ పథకం కనక సఫలమైతే రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఇదే మార్గం అనుసరించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఆస్తులతో పోలిస్తే వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల చేతిలో ఉన్న ఆస్తులు, సంపూర్ణంగా వినియోగించుకోలేని ఆస్తుల విలువ ఎక్కువే ఉంటుంది. ఇందులో ఓ చిక్కు ముడి కూడా లేకపోలేదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే వాతావరణం కనిపించకపోతే ప్రైవేటు రంగం కూడా ఈ ఆస్తులను నిర్వహించడానికి అంత ఆసక్తి కనబరచక పోవచ్చు. ఈ పథకం ద్వారా వచ్చే రూ. ఆరు లక్షల కోట్లను మళ్లీ వివిధ రంగాలలో మౌలిక సదుపాయాలను కల్పించడానికే వినియోగిస్తామని నిర్మలా సీతారామన్‌ అంటున్నారు. మళ్లీ స్థూల జాతీయోత్పత్తి పది శాతం దరిదాపులకు చేరేట్టు చూడడమే లక్ష్యం అని కూడా ఆమె అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోతే ఈ పథకం ఎంత ఆకర్షణీయమైంది అయినా ప్రైవేటు రంగం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడకపోవచ్చు. అంటే పరిస్థితి పెళ్లి అయితే కాని పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితేనే గానీ పెళ్లి కాదు అన్న నానుడిని గుర్తు చేస్తోంది. ప్రభుత్వానికి వ్యాపారం చేయవలసిన పని లేదు అని మోదీ పదే పదే చెప్తుంటారు. అటల్‌ బిహారీ వాజపేయి సైతం ఇదే మాట అనే వారు. కానీ ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేయదలుచుకున్నది ప్రభుత్వ ఆస్తుల మీద వ్యాపారం చేయడమే.
తాబేలును చంపాలంటే డిప్ప మీద కొడితే లాభం లేదు. తిరగేసి కొట్టాల్సిందే. మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో తమ వైఫల్యం నుంచి బయట పడడానికి తాబేలును తిరగేసి కొట్టాలనుకుంటోంది. విధానాలకు రూపకల్పన చేసే అవకాశం ఉన్న ప్రభుత్వానికే ప్రభుత్వ రంగ సంస్థలను లాభసాటిగా నడపడం అసాధ్యమైనప్పుడు వనరులున్నా విధానాల రూపకల్పన ప్రైవేటు రంగం చేతిలో ఉండదుగా! కానీ ప్రైవేటీకరణకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వాలు దీనికీ మార్గం కనిపెట్టాయి. అదే ప్రైవేటు రంగానికి అనుకూలమైన విధానాలు రూపొందించడం. నిర్మలా సీతా రామన్‌ పథకం ఆంతర్యం అదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img