Friday, February 3, 2023
Friday, February 3, 2023

తాలిబన్ల గుప్పెట్లో అఫ్గానిస్థాన్‌

ఇరవై ఏళ్ల కింద అమెరికాలోని రెండు మహా హార్మ్యాల మీద తీవ్రవాదులు దాడి చేసిన తరవాత తీవ్రవాదాన్ని తుదముట్టించే నెపంతో అఫ్గానిస్థాన్‌లో ప్రవేశించిన అమెరికా ఇటీవలే సేనలను ఉపసంహరించడం మొదలు పెట్టింది. అంతకు ముందు పదేళ్ల పాటు మునిపటి సోవియట్‌ యూనియన్‌ అఫ్గానిస్థాన్‌లో జోక్యం చేసుకున్నప్పటి నుంచి దాన్ని ఖండిరచిన అమెరికా చివరకు తానూ అఫ్ఘానిస్థాన్‌కు తన సేనలను పంపి అదే పని చేసింది. అయితే ఒబామా అధికారంలోకి రాక ముందే తాను అధికారంలోకి వస్తే అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరిస్తానని వాగ్దానంచేశారు. అయితే అది ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి గట్టి నిర్ణయంతో తప్ప సాధ్యం కాలేదు. దీని వెనక అమెరికా దీనావస్థ అంతకన్నా బలమైన కారణం. అమెరికా విదేశాంగ నీతి సంపూర్ణంగా విఫలమైంది. అయితే సోవియట్‌ సేనలు వెళ్లిపోయిన తరవాత అఫ్గానిస్థాన్‌లో పరిస్థితి మెరుగు పడనట్టే ఇప్పుడు అమెరికా సేనల ఉపసంహరణ తరవాత సైతం ప్రశాంతత ఏర్పడనే లేదు. అమెరికా దన్నుతో కొనసాగుతున్న అఫ్గాన్‌ ప్రభుత్వం చేష్టలుడిగిపోయింది. తాలిబన్లు వీర విహారం చేస్తున్నారు. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. మళ్లీ కరడుగట్టిన మతోన్మాదుల పాలన కొనసాగే ప్రమాదం ముంచుకొస్తోంది. ఒక్కొక్క నగరమూ తాలిబన్ల వశం అవుతూ ఉంటే అఫ్గాన్‌ సైన్యం తలదాచుకోవడానికి చోటు వెతుక్కుంటోంది. తాజాగా అఫ్గానిస్థాన్‌లో రెండవ పెద్ద నగరమైన కాంధహార్‌, హెరాట్‌, లష్కర్‌ గాప్‌ా నగరాలు కూడా తాలిబన్ల వశం అయినాయి. దేశమంతా తాలిబన్ల వశం కావడానికి మరి కొద్ది రోజులు మాత్రమే పట్టొచ్చు. తాలిబన్ల ఆగడాలకు తాళలేక భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్‌ దేశాలతో పాటు అనేక దేశాలు తమ దౌత్య సిబ్బందిని వెనక్కు పిలిపించుకుంటున్నాయి. అమెరికా దౌత్య సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్లడానికి మూడు వేల మంది సైనికులను పంపుతామని పెంటగన్‌ ప్రకటిస్తే 600 మందిని పంపుతామని బ్రిటన్‌ అంటోంది. అఫ్గానిస్థాన్‌లో ఇప్పుడు వినిపిస్తున్నది కేవలం తాలిబన్ల తుపాకుల మోతలే. ప్రజల బతుకు దుర్భరం అయిపోతోంది. ప్రజలు నగరాలు విడిచి వెళ్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం ప్రభుత్వం ఏదో ఒక రీతిలో తాలిబన్లను సంప్రదించి, బతిమాలి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఏ మూల సురక్షితమైందో చెప్పే అవకాశమే లేదు. మానవ మహా విపత్తు పొంచి ఉందని, ప్రజలు ఆకలికి అలమటించే పరిస్థితి ఎదురుకాక తప్పదని ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ హెచ్చరిస్తోంది. పశ్చిమ దేశాల వారు సైన్యాలను పంపి తమ దౌత్య సిబ్బందిని కాపాడే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. అనేక నగరాల్లో ప్రేతకళ తాండవిస్తోంది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్నామంటున్న కాంధహార్‌ ఆర్థిక కార్యకలాపాలకు నెలవు. అదీ తాలిబన్ల వశం అయినందువల్ల అఫ్గాన్‌ ఆర్థిక పరిస్థితి మరింత చితికిపోవడం ఖాయం. మహా మానవ విపత్తు అంచున అఫ్గానిస్థాన్‌ ఉంది. రాజధాని కాబూల్‌ కాకుండా ఉత్తరాన ఉన్న మజార్‌-ఎ-షరీఫ్‌, పాకిస్తాన్‌ సరిహద్దులో ఉన్న జలాలాబాద్‌ మాత్రం ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఆ నగరాలూ తాలిబన్ల గుప్పెట్లోకి రావడానికి మరెంతో సమయం పట్టేట్టు లేదు. ప్రభుత్వ భద్రతా దళాలవారు తాలిబన్లను ఎదిరించే పరిస్థితే కనిపించడం లేదు. ఈ అల్లకల్లోల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని తాలిబన్లను తమ అదు పాజ్ఞల్లో ఉంచుకుని అఫ్గానిస్థాన్‌పై పట్టు బిగించాలని పాకిస్తాన్‌ చూస్తోంది. తాలిబన్లు సైనికంగా పట్టు సంపాదించాలన్న సంకల్పంతో ఉన్నారు కనక పౌరులకు మహా విపత్తు తప్పేట్టు లేదు. సంప్రదింపుల ద్వారా తాలిబన్‌ శ్రేణులను దారికి తెచ్చే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు.
అఫ్గానిస్థాన్‌ పరిణామాలు భారత్‌ను ప్రభావితం చేయక తప్పదు. ఒక వేపు అఫ్గానిస్థాన్లో తాలిబన్‌ లాంటి మతోన్మాద, తీవ్రవాద ముఠాలకు మద్దతిచ్చి వారిని, లేదా వారి దగ్గర శిక్షణ లేదా ప్రేరణ పొందిన వారిని భారత్‌లో అల్లకల్లోలం రేపడానికి పాకిస్తాన్‌ గతంలోనూ ప్రయత్నించింది. పాకిస్తాన్‌లో పౌర ప్రభుత్వాలు ఉన్నా, సైనిక పాలన ఉన్నా తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం, పనిలో పనిగా భారత్‌లో చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. తాలిబన్ల పట్టు ఏ మేరకు బిగిస్తే భారత్‌కు అదే స్థాయిలో ముప్పు తప్పదు. ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడిరచాలని దీక్షబూనిన తాలిబన్లు ఆగస్టు ఆరో తేదీ నుంచి ఒక నగరం తరవాత మరో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ పోతున్నారు. ఈ నెలాఖరులోగా సేనలను వెనక్కు పిలిపించే పని పూర్తి చేయాలని అమెరికా అధ్యక్షుడు పట్టుదలతో ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అఫ్గాన్‌లో జోక్యంవల్ల అమెరికా భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. బైడెన్‌ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా ఉపసంహరణ ఆగే అవకాశం లేదు. పరిస్థితిని చక్కదిద్దడానికి అమెరికా రెండు దశాబ్దాలుగా కొనసాగించిన తప్పును మరింత కాలం పొడిగించే అవకాశమూ లేదు. అఫ్గాన్‌లో జోక్యం చేసుకున్నప్పటి నుంచి అమెరికా ఒక ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టడమే కాక వేలాదిమంది సైనికుల ప్రాణాలను బలిపెట్టక తప్పలేదు. చివరకు తీవ్రవాదం అంతం అన్న అమెరికా పంతం ఫలించనే లేదు. తన గడ్డ మీద ఒక్క రోజైనా యుద్ధం చేయని అమెరికా సైన్యాలను పంపిన చోటల్లా విషాదమే మిగిలింది. అమెరికా దుశ్చర్యలకు వియత్నాంలో మాత్రం తగిన శాస్తి జరిగింది. ఇరాన్‌, ఇరాక్‌తో పాటు అమెరికా తంపుల మారి వ్యవహారం బీభత్సాన్నే మిగిల్చింది. అఫ్గానిస్థాన్‌లో తీవ్రవాదాన్ని తుదముట్టించే సంకల్పం నెరవేరకుండానే వెనుదిరగవలసి వచ్చింది. ఇరాన్‌, ఇరాక్‌ లాంటి దేశాలకు ప్రజాస్వామ్యాన్ని ఎగుమతి చేయాలనుకున్న అమెరికా పాలకుల ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. అమెరికా జోక్యం చేసుకున్న చోటల్లా మతోన్మాద శక్తులే అధికారంలోకి వచ్చాయి. సద్దాం హుసేన్‌ను గద్దె దించడానికి అమెరికా సృష్టించిన అల్లకల్లోలం అపార ప్రాణ నష్టానికే కాదు మానవ నాగరికతకు పుట్టినిల్లు లాంటి ఇరాక్‌ను చిందరవందర చేసింది. తాలిబన్లు తమ జైత్ర యాత్రతో పాటు గతంలోలాగే కరకు ఇస్లాం నిబంధనలను అమలు చేస్తున్నారు. మహిళలు తీవ్రవాదులను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడ్తున్నారు. ఇది పూర్తిగా లైంగిక వేధింపే. తాము విజయం సాధిస్తే ప్రభుత్వ అధికారులు, సైనికులు, ప్రజలు భయపడవలసింది ఏమీ లేదనీ చాలా ఉదారంగా వ్యవహరిస్తామని తాలిబన్లు నొక్కి చెప్పారు. వాస్తవ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. లొంగి పోతున్న అఫ్గాన్‌ సైనికులను కూడా తాలిబన్లు కాల్చి చంపుతున్నారు. నిష్కారణంగా ప్రజల మీద విరుచుకుపడి భయ భ్రాంతులను చేస్తున్నారు. తాలిబన్ల కరకు నిబంధనలు, అఘాయిత్యాలు, అణచివేతలు ఎంత తీవ్రంగా ఉంటాయో గతానుభవం రుజువు చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img