Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

తాలిబన్ల విజయం కాదు అమెరికా ఓటమి

అఫ్గాన్‌ ప్రజల భవిష్యత్తును నట్టేట వదిలేసి 20 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరవాత అమెరికా సేనలు వెనుదిరిగింది విజయ గర్వంతో కాదు. ఘోర పరాజయాన్ని మూటగట్టుకు వెళ్లింది. రెండు దశాబ్దాలకు పైగా వియత్నాం మీద యుద్ధం చేసిన అమెరికాను ఆ చిన్న దేశం అంతిమంగా ఓడిరచింది. అమెరికాకు ఓటమి కొత్తేమీ కాదు. అఫ్గానిస్థాన్‌ ప్రజలు ఓటమి పాలు కాకూడదు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తగుదునమ్మా అని ఎక్కడికి సేనలను పంపించినా అక్కడ ప్రజాస్వామ్యం నెలకొనలేదు. మతతత్వ వాదులు అధికారంలోకి వచ్చారు. ఇరాన్‌ రాజు షా మహమ్మద్‌ రెజా పెహల్వీని తొలగించినప్పుడు, సద్దాం హుసేన్‌ను తొలగించి అక్కడ ప్రజాస్వామ్యానికి అంటుకడ్తామని అమెరికా పాలకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా కడకు అక్కడ నెలకొన్నది మతోన్మాద ప్రభుత్వాలే. ప్రజాస్వామ్యాన్ని అమెరికా ఎగుమతి సరుకుగా భావిస్తుంది. కానీ వాస్తవానికి ఇదంతా తమ ఆయుధ తయారీ కంపెనీలు నిర్వ్యాపారంగా మిగిలిపోకుండా చూడడానికే. అఫ్గాన్‌లో తాజాగా ప్రభుత్వం అంటూ ఇంకా ఏర్పడలేదు. తుపాకీ నీడన తాలిబన్ల ఆధిపత్యం మాత్రమే కొనసాగుతోంది. సక్రమంగానో, అక్రమంగానో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినా అంతర్జాతీయ సమాజం దాన్ని గుర్తించడానికి తొందరపడకపోవచ్చు. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు విమానాశ్రయాలకు చేరుకుని ఎలాగైనా అక్కడి నుంచి ఎక్కడికో ఒక చోటికి వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నం హృదయవిదారక దృశ్యాలనే మిగిల్చింది. దీన్నిబట్టి ప్రజలు ఏ స్థాయిలో భయభ్రాంతులైపోయారో అర్థం చేసుకోవచ్చు.
విజయం సాధించామని చెప్పుకుంటున్న తాలిబన్ల వాదనలు ఒక వేపు, పరాజయ భారంతో తల దించుకుని వెళ్లిపోయిన అమెరికా సేనలు ఒక వేపు ఉండగా మరో వేపు తాలిబన్లను ఎదిరిస్తున్న నిరసనకారులు కాబూల్‌తో పాటు అనేక నగరాల్లో దర్శనమిస్తున్నారు. అంటే తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించు కోవడం ఇష్టం లేని వర్గాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జనం ఎర్ర తివాచీలు పరిచి తాలిబన్లకు స్వాగతం పలకడం లేదు. నిరసన తెలియజేస్తున్న మూకల మీద తాలిబన్లుజరిపిన కాల్పుల్లో అనేకమంది మరణించా రంటున్నారు. నికరంగా ఈ లెక్కలు తేలడానికి కొంత సమయం పట్టొచ్చు. నలుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జాతీయ జెండాలు చేతబూని జనం తాలిబన్లను ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘మా దేశం, మా పతాకం’’ అని నినదిస్తున్నారు. యాదృచ్ఛికమే కావచ్చు కాని 1919 ఆగస్టు19న అఫ్గాన్‌ స్వతంత్రదేశంగా అవతరించింది. బ్రిటన్‌ నుంచి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవాలని దీక్ష బూనినవారే ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తాలిబన్లను వ్యతిరేకిస్తున్న వారు తాలిబన్ల శ్వేత పతాకాన్ని చించేస్తున్నారు. ఆదివారం నాడు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు తాము ఉదారవాదులమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాము శాంతినే కోరుకుంటున్నామని, మునుపటి శత్రువుల మీద పగ సాధించే ఉద్దేశం తమకు లేదని, మహిళల హక్కులను గౌరవిస్తామనీ అంటున్నారు. అయితే అది ఇస్లామిక్‌ చట్టాలకు అనుగుణంగా ఉంటుందంటున్నారు. ఇది ఎంత హీనంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1996 నుంచి 2001 దాకా అధికారం చెలాయించిన తాలిబన్లు మహిళలపట్ల ఎంత కర్కశంగా వ్యవహరించారో గ్రహించిన వారే నిరసనలకు దిగి ఉంటారు. అప్పుడు తాలిబన్లు మహిళల మీద అనేక ఆంక్షలు విధించారు. అనేకమందిని నడివీధుల్లో ఉరి తీసి భయోత్పాతం సృష్టించారు. బమియాన్‌తో సహా అనేక చోట్ల బుద్ధుడి విగ్రహాలను పేల్చేశారు. అసాదాబాద్‌, జలాలాబాద్‌, కోస్త్‌ లాంటి నగరాల్లో ఈ నిరసనలు ప్రధానంగా జరిగినట్టు కనిపిస్తోంది. మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా తాలిబన్లను వ్యతిరేకించే వారిని సమీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అఫ్గాన్లు ఒక్కొక్క నగరాన్నే స్వాధీనం చేసుకోవడం చూసి అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పలాయనం చిత్తగించారు. కానీ ఆయన హయాంలో మొదటి ఉపాధ్యక్షుడిగా ఉన్న సలేప్‌ా మాత్రం తాను అఫ్గానిస్థాన్‌లోనే ఉన్నానని తానే తాత్కాలిక అధ్యక్షుడిననీ అంటున్నారు. ఇంకో వేపున తాలిబన్లను ప్రతిఘటించడానికి పేరుపడ్డ పంజ్‌ షేర్‌ లోయలో జాతీయ ప్రతిఘటన ఫ్రంట్‌ నాయకుడు అమద్‌ మసూద్‌ తాలిబన్లను నిలవరించడానికి తోడ్పడాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణ భీతితో విమానాశ్రయాలకు చేరుకుంటున్న జనాన్ని తాలిబన్లు నిరోధిస్తున్నారు. తొక్కిసలాటలూ జరుగుతున్నాయి. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల వారు తమ దేశ పౌరులను స్వదేశాలకు తరలించడానికి నానా యాతన పడ్తున్నారు.
అమెరికా కురిపించిన బాంబు దాడుల్లో గత ఇరవై ఏళ్లుగా లెక్కలేనంత మంది మరణించారు. అష్రాఫ్‌ ఘని ప్రభుత్వానికి ఎన్నడూ ప్రజల మద్దతు లేదు. పైగా పచ్చి అవినీతికర ప్రభుత్వం అన్న పేరు మాత్రం ఉంది. తీవ్రవాదంపై దాడి పేరుతో అమెరికా తాలిబన్ల మీద, ఒసామా బిన్‌ లాదెన్‌ మీద యుద్ధం చేస్తున్నామన్న వాదనలు పచ్చి బూటకం అని ఎప్పుడో రుజువైంది. సోవియట్‌ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లకు, వారి సంతతిగానే ఎదిగిన తాలిబన్లకు సకలవిధ సహాయం అందించింది అమెరికా అని మరిచిపోకూడదు. సి.ఐ.ఎ. పాత్రనూ విస్మరించలేం. పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐ.ఎస్‌.ఐ. అయితే మొదట ముజాహిదీన్లకు, తరవాత తాలిబన్లకు కన్న తల్లి లాంటిదే. అల్‌ కాయదాను తుద ముట్టించామని అమెరికా ప్రచారంలోని డొల్లతనం దాచినా దాగదు. రాజధాని కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరవాత ప్రశాంతత నెలకొనక పోవడం ఆశ్చర్యకరమూ కాదు. ఈ పరిణామాలన్నిటినీ చూస్తూ అమెరికా, దానికి వత్తాసుదార్లయిన పశ్చిమ దేశాలు వల్లించే ప్రజాస్వామ్య పాఠాలకు చిల్లిగవ్వంత విలువైనా లేదు. భారత ప్రభుత్వం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. గుడ్డిగా అమెరికా చేసిందల్లా సమర్థించినందువల్ల ఇప్పుడు భారత్‌ ఏకాకిగా మిగిలిపోయింది. ఆది నుంచి అఫ్గాన్‌తో ఉన్న మైత్రిని మళ్లీ సంపాదించడానికి ఎంత సమయం పడ్తుందో చెప్పలేం. అఫ్గానిస్థాన్‌ తీవ్రవాదులకు నెలవుగా మారకూడదని, ఇస్లామిక్‌ స్టేట్‌, అల్‌ కాయదా లాంటి తీవ్రవాద సంస్థలకు ఆలవాలం కాకూడదని ఐక్య రాజ్య సమితి గత ఆరో తేదీన నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆకాక్షించింది. అఫ్గాన్‌ ప్రజలు శాంతియుత జీవనం గడపడానికి అనువైన పరిస్థితులు కల్పించడానికి భారత్‌ ప్రాంతీయంగా పలుకుబడిగల దేశాలతో కలిసి కృషి చేయాలి. మోదీ సర్కారు సంకుచితమైన పాక్‌ వ్యతిరేక, చైనా వ్యతిరేక వైఖరి అనుసరించడంవల్ల ఒరిగేదేమీ ఉండదు. అఫ్గానిస్థాన్‌ సుస్థిరతే మనకూ ప్రశాంతత చేకూరుస్తుందని గ్రహించగలగాలి. మోదీప్రభుత్వం విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోగలుగుతుందన్నది అనుమానమే. తాలిబన్ల ప్రభావంవల్ల దక్షిణాసియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదం విజృంభించడం మన దేశం మీద దుష్ప్రభావం చూపక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img