Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

తెరతీయక ముందే ముగిసిన నాటకం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే పాలన రెండున్నరేళ్ల లోనే ముగిసింది. గవర్నర్‌ ఆదేశించినట్టుగా గురువారం శాసనసభా వేదిక మీద విశ్వాస ప్రకటన జరగక ముందే ముఖ్యమంత్రి బుధ వారం రాత్రే రాజీనామా చేశారు. ఏక్‌నాథ్‌ షిందే కొత్త ముఖ్య మంత్రి అయిపోయారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో ఎలాగైనా సరే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ పథకం సఫలమైంది. దీనికి శివసేన తిరుగు బాటుదారు నాయకుడు ఏక్‌నాథ్‌ షిందే దాదాపు 50 మంది శాసన సభ్యుల మద్దతుతో రంగం సిద్ధం చేశారు. ఆయనను ముందుంచి బీజేపీ ఆడిరచిన నాటకం రక్తి కట్టింది. ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం అయిదేళ్లు మనగలుగుతుందన్న భరోసా ముందు నుంచే ఎవరికీ లేదు. 2019 ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకి మెజారిటీ రాలేదు. 106 సీట్లతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ, శివసేన పార్టీలకు హిందుత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉన్నప్పటికీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శ్రుతి కుదరలేదు. అందుకే నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ చాకచక్యంవల్ల కాంగ్రెస్‌, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్‌ కలిసి మహా వికాస్‌ అగాధీ పేర కూటమికట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగాయి. అసలు ఈ మూడు పార్టీల కలయికే ఆ పార్టీల స్వభావానికి పూర్తిగా భిన్నమైంది. అధికారం కోసం ఏకమయ్యాయి. కేంద్రంలోనే కాక అన్ని రాష్ట్రాలలోనూ తమ ప్రభుత్వాలే ఉండాలన్నది బీజేపీ పంతం. రాష్ట్రాలలో మెజారిటీ సంపాదించగలిగిన చోట ఎటూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మెజారిటీ లేని చోట్ల కూడా సామదానభేద దండోపాయాలకే పరిమితం కాకుండా అపారమైన ధన రాశులను గుమ్మ రించి అధికారం సంపాదించే కళలో బీజేపీ అనితరసాధ్యమైన కౌశలం ప్రద ర్శిస్తోంది. ఈ పద్ధతిలోనే పూర్తి మెజారిటీ లేకపోయినా కర్నాటక, మధ్య ప్రదేశ్‌, గోవాలో బీజేపీ అధికారం చెలాయించగలుగుతోంది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలో మహా వికాస్‌ అగాధీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఆ సర్కారును ఎలా పడగొట్టాలన్న కుతంత్రాలు బీజేపీ పన్నుతూనే ఉంది. చివరకు బుధవారం సఫలమైంది. శివసేనలో తిరుగుబాటు రెచ్చ గొట్టి అధికార నిచ్చెనలో ఉద్ధవ్‌ ఠాక్రే తరవాతి స్థానంలో ఉన్న ఏక్‌ నాథ్‌్‌ షిందేను ప్రేరేపించి కాగల కార్యం సాధించింది. ఈ తిరుగుబాటు సందర్భంగా ఏక్‌ నాథ్‌ షిందే శివసేన, కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ కలయిక అపవిత్రమైందని అంటూనే ఉన్నారు. ఈ మాట వెనక దురుద్దే శాలు ఏమైనప్పటికీ ఆ మాట నిజమే. ఎంతకాదన్నా కాంగ్రెస్‌, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలకు సెక్యులర్‌ స్వభావం ఉంది. ఆ ధోరణి బొత్తిగా లేని శివసేనను కలిపి కూటమి ఏర్పాటు చేయడంలో శరద్‌ పవార్‌ వ్యూహం ఫలించి రెండున్నరేళ్లు ప్రభుత్వం కొనసాగింది. ఈ క్రమంలో శివసేన మతతత్వ ధోరణి మందగించింది. ప్రజాస్వామ్య ప్రక్రియను విశ్వసించడం మొదలైంది. ఇది శివసేన అసలు స్వరూపం కాదనీ, బాలాసాహెబ్‌ ఠాక్రే నెలకొల్పిన శివసేన ఇది కాదని ఏక్‌ నాథ్‌ షిందే కొత్త రాగం ఎత్తుకున్నారు. సరే కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ కూటమిని రద్దు చేసుకుంటాం అని ఉద్ధవ్‌ ఠాక్రే ఆహ్వానించినా ఏక్‌ నాథ్‌ షిందే శిబిరం వెనుదిరగలేదు. చిచ్చు పెట్టడం మేరకే షిందే స్వతంత్రంగా వ్యవహరించారేమోగానీ ఆ తరవాత ఆడిస్తున్నది బీజేపీ కనక వెనక్కు తగ్గలేకపోయారు. బీజేపీ ఆడిరచిన నాటకంలో షిందే పావు మాత్రమే. మన ప్రజాస్వామ్యం తలలు లెక్కించ డానికి పరిమితమై పోయినందువల్ల ఆ తలల పిలకలు ఎవరి చేతిలో ఉన్నా యన్నది ప్రధానం. అత్యధిక సంఖ్యాక శాసనసభ్యులు షిందే పక్షాన చేరడంతో ప్రభుత్వ పతనంతో కథ ముగియలేదు. శివసేనపై ఇక ముందు ఆధిపత్యం ఎవరిది అన్న ప్రశ్న ఇప్పుడే మొదలైంది. ఉద్ధవ్‌ ఠాక్రే చేతిలో శివసేన మిగులుతుందా అన్న అనుమానం బలపడుతోంది. షిందే తాను ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశంతో తిరుగుబాటు చేయలేదు. అయినా పదవి ఆయననే వరించింది. తిరుగుబాటు ఫలితాలను బీజేపీకి తాకట్టు పెట్టారు. షిందేకు కావలసింది శివసేన, ఆ పార్టీ ఆస్తులు, సాధన సంపత్తి మీద పెత్తనం. సామాన్య కార్యకర్తల మద్దతు ఇప్పటికీ ఉద్ధవ్‌ ఠాక్రేకే ఉందని ఇటీవల ముంబైతో సహా అనేక చోట్ల జరిగిన ప్రదర్శనలు నిరూపించాయి. ఈ ప్రజాబలాన్ని ఉద్ధవ్‌ ఎంత కాలం నిలబెట్టుకోగలరు, మళ్లీ పార్టీని బలో పేతం చేయగలరా అన్నది అసలు ప్రశ్న. ఆయన అధికారం కోల్పోవడం కన్నా శివసేన భవిష్యత్తే ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. బాలాసాహెబ్‌ నుంచి అప్పనంగా శివసేన నాయకత్వం ఉద్ధవ్‌ ఠాక్రేకు సంక్రమించింది తప్ప తండ్రికి ఉన్న వ్యూహ రచనా నైపుణ్యం, ప్రజలను గుప్పెట్లో పెట్టుకో గలిగిన శక్తి, అవసరమైనప్పుడు వారిని రెచ్చగొట్టగలిగిన సామర్థ్యం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేవు. ఠాక్రే సర్కారు కొనసాగడమో, పతనం కావడానికో పరిమిత మైన వ్యవహారం కాదిది. షిందే వర్గం కనక శివసేన మీద ఆధిపత్యం చెలా యిస్తే శివసేన ప్రధాన కార్యాలయం, నిధులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లలో ఉన్న శివసేన ఆస్తులు మొదలైనవన్నీ షిందే వర్గానికి దక్కుతాయి. మాదే అసలైన శివసేన అని షిందే ఇప్పటికే వాదిస్తున్నారు. ఎవరిదో అంతి మంగా తేల్చాల్సింది ఎన్నికల కమిషన్‌. శివసేన షిందే వర్గానికి దక్కినా ఆయన, ఆయన మద్దతుదార్లు బీజేపీ ఆడిరచినట్టల్లా ఆడిన వారే కనక చివరిసారి పాచిక వేసే అవకాశం బీజేపీ గుప్పెట్లోనే ఉంటుంది.
ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే కుమారుడే అయి ఉండొచ్చు. బాలాసాహెబ్‌ ఠాక్రేకు రాజకీయాలకు తోడు కార్టూన్లు వేయడం, రచనలు చేయడం లాంటి కళాదృష్టి ఉండేది. ఉద్ధవ్‌ ఠాక్రేకూ ఫొటోలు తీయడంలో అభినివేశం ఉంది. కానీ తండ్రికి ఉన్న సాహసం కానీ, వ్యూహరచనా నైపుణ్యం కానీ ఉద్ధవ్‌కు అబ్బనే లేదు. 2019లో జరిగిన మాహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తరవాతి పరిణామాల కారణంగా ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి అయ్యారు తప్ప రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఆయనకు బొత్తిగా లేవు. మహారాష్ట్ర వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదనడం హాస్యా స్పదం. తిరుగుబాటుదారు శాసనసభ్యులను మొదట గుజరాత్‌లోని సూరత్‌ తీసుకెళ్లారు. అక్కడి నుంచి అసోం తీసుకెళ్లారు. ఆ తరవాత 29వ తేదీకల్లా గోవా వచ్చారు. ఈ మూడురాష్ట్రాలూ బీజేపీ పాలనలోనే ఉన్నాయి. అసోం ముఖ్యమంత్రి తిరుగుబాటుదారు ఎమ్మెల్యే లకు వసతి తదితర వ్యవహారాలను స్వయంగా పరిశీలించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తిరుగుబాటుదార్లకు సకల విధ సదుపాయాలు కలగజేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ముంబై చేరిన ఎమ్మెల్యేల వెంట అసోం మంత్రి ఉన్నారు. ఇవన్నీ బీజేపీ వాదనలోని డొల్లతనాన్ని రుజువు చేస్తున్నాయి. అసోం ప్రభుత్వ బస్సులే వినియోగించారు. బీజేపీ ఆడే లేదా ఆడిరచే నాటకాలకు రంగస్థలం అక్కర్లేదు. తెర తీయకముందే నాటకం ముగించే సత్తా ఆ పార్టీకి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img