Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

దళితులకు ఉపకరించని మాయావతి వైఖరి

చాలా కాలానికి బహుజన సమాజ్‌ పార్టీ (బి.ఎస్‌.పి.) నాయకురాలు మాయావతి దీర్ఘ రాజకీయ నిద్ర నుంచి మేల్కొన్నట్టున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆమె హడావుడి అంతగా కనిపించలేదు. ఇప్పుడు ఆమె హఠాత్తుగా వచ్చే పార్లమెంటు ఎన్నికలలో, శాసనసభ ఎన్నికలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణలో కూడా బీఎస్పీ ఒంటరిగానే పోటీచేస్తుందని మాయావతి ప్రకటించారు. ఈ రాష్ట్రాలలో దళితుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ వారు ఎన్నడూ బీఎస్పీ మద్దతుదార్లు కారు. ఈ రాష్ట్రాలలోని దళితులు తమ ఆకాంక్షలను గుర్తించే ప్రాంతీయ పార్టీలకే మద్దతు ఇస్తున్నారు. ఆమె ఒంటరిగా పోటీ చేయాలన్న సంకల్పంతో ఇతర పార్టీలు తాము చెప్పినట్టు నడుచుకోవాలనే ఉద్దేశమే ఉంది కానీ దళితోద్ధరణకు ప్రయత్నిస్తున్నట్టుగా లేదు. బీఎస్పీని ప్రారంభించినప్పుడు కాన్షీ రాం నిర్దేశించిన లక్ష్యాలు ఇప్పుడు మాయావతి నాయకత్వంలోని బీఎస్పీలో కలికానిక్కూడా కనిపించడం లేదు. దళితుల హక్కుల పరిరక్షణకు మాయావతి గట్టిగా పోరాడిన సందర్భమే లేదు. ఆ మాటకొస్తే దోపిడీకి గురవుతున్న దళితుల ఆకాంక్షలకు అనుగుణంగా మాయావతి వ్యవహరించిన దాఖలాలే తక్కువ. అందుకే దళితులు ఆమెకు దూరం అవుతున్నారు. అగ్రవర్ణాల అణచివేత ధోరణిని ఎదిరించడానికి ఆమె ప్రయత్నించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. దళిత్‌ పాంథర్స్‌ పార్టీలాగా మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ విప్లవకర పోరాటాలు నేపథ్యంలోంచి ఎదిగింది కాదు. కాన్షీ రాం వెనుకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటుచేసినా, బీఎస్పీలో చేరినవారిలో అత్యధికులు ఈ సమాఖ్యలో పనిచేసినవారే అయినా ఆ ఉద్యమ ఛాయలు మాయావతి హయాంలో మాయమైపోయాయి. మాయావతి దృష్టి ఎంతసేపూ ఎన్నికల్లో విజయం సాధించి నాలుగు సీట్లు సంపాదించడం మీద ఉంది తప్పితే దళితుల వాణిగా నిలవడానికి ఆమె విధానాలు ఎన్నడూ ప్రతీకగా లేవు. 2019 లోకసభ ఎన్నికల సమయంలో ఆమె అఖిలేశ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పది లోక్‌సభ స్థానాలు సంపాదించారు. అప్పుడు సమాజ్‌వాదీ పార్టీకి దక్కింది కేవలం అయిదు సీట్లే. అయినా సమాజ్‌వాదీ పార్టీ తమ ఓట్లను బీఎస్పీకి బదలాయించలేదని ఆరోపించి మాయావతి ఈ పొత్తును రద్దు చేసుకున్నారు. ఒకప్పుడు ఆమె కాంగ్రెస్‌తోనూ కత్తు కలిపారు. మాయావతి తనకు అనువైనప్పుడు బీజేపీతో చేయి కలిపారు. బీజేపీతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సందర్భమూ ఉంది. అనువు కాదనుకున్నప్పుడు వ్యతిరేకించారు. అందుకే మాయావతి తమ వాణి వినిపిస్తుందన్న నమ్మకం దళితులు కోల్పోయారు. మాయావతి అనుసరించిన ఈ వైఖరివల్లే దళితులు బీజేపీని సమర్థించిన ఉదంతాలూ ఉన్నాయి. మాయావతి ఊగిసలాట ధోరణి అనుసరించడమే దళితులు ఆమెకు దూరం కావడానికి ప్రధాన కారణం. అదీగాక ఆమె ఎప్పుడూ దళితులందరికీ ప్రతినిధిగా వ్యవహరించలేదు. కేవలం జాతవుల నాయకురాలిగానే మిగిలిపోయారు. ఈ కారణంగా దళితులు ఆత్మరక్షణ కోసం బీజేపీకి వత్తాసుపలకడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 

దళితులకు మాయావతి అండ అవసరమైన సందర్భంలో ఆమె బీజేపీనే సమర్థించారు. దీనితో దళితులు సందిగ్ధావస్థలో పడిపోవలసి వచ్చింది. ఆమె వీధుల్లోకి వచ్చి దళితులకు అండగా నిలిచి అగ్రవర్ణాలవారిని ఎదిరించకపోవడంవల్ల అధికార పక్షంతో ఉండడమే మేలు అని దళితులు భావించడం సహజమైన పరిణామమే. ఉత్తరప్రదేశ్‌లో దళితుల తరఫున పోరాడుతున్నది భీమ్‌ ఆర్మీ పార్టీ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌(రావణ్‌) మాత్రమే. మాయావతికి ఆయన పొడే గిట్టదు. దళితులను ఇప్పటికీ అంటరానివారిగానే పరిగణిస్తున్నారు. ఈ వైఖరిని ఎదిరిస్తున్నది రావణ్‌ మాత్రమే. షహరాన్‌ పూర్‌లో దళితులమీద హింసాత్మక దాడులు జరిగినప్పుడు 2017లో రావణ్‌ నాయకత్వంలోని భీమ్‌ ఆర్మీ పార్టీ దిల్లీలో ప్రదర్శనచేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. దళితులమీద దాడి జరిగినప్పుడల్లా భీమ్‌ఆర్మీపార్టీ వారిని పరామర్శిస్తోంది. సామాజిక మాధ్యమాలలో ఈ దుర్నీతికి వ్యతిరేకంగా గొంతెత్తుతోంది. ఈ రకంగా బీఎస్పీకిఉన్న మద్దతును కొంతమేరకు భీమ్‌ఆర్మీ పార్టీ సంపాదించగలిగింది. బీమ్‌ ఆర్మీ పార్టీ దళితులకు సంబంధించిన అంశాలు లేవనెత్తడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తోంది. బీఎస్పీకి ఉన్న ఓట్లశాతం తగ్గలేదని మాయవతి మద్దతుదార్లు ఆత్మసంతృప్తి ధోరణిలో మాట్లాడుతున్నా వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. అగ్రవర్ణాలవారు దళితులకు అండగా నిలుస్తారని ఊహించలేం కనక రావణ్‌కు మద్దతుఇవ్వక తప్పని పరిస్థితి ఉంది. అయితే ఆయనకు ధనబలం దండిగా ఉన్న పార్టీలను, ముఖ్యంగా బీజేపీని ఎదిరించే శక్తి తక్కువ. తమ తరఫున గట్టిగా నిలబడిపోరాడే నాయకుడు రావణ్‌ అన్నది వాస్తవమే అయినా, ఆయన పార్టీ అంత బలమైంది కాకపోవడంతో దళితులు బీజేపీ వైపు చూడవలసి వస్తోంది. ఇది బీజేపీ కులసమీకరణ రాజకీయాల్లో భాగం. గత అయిదేళ్ల కాలంలో బీఎస్పీ ఇతర పార్టీలతో చేతులు కలపడానికి అనేక ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం. అయితే పెద్ద ఫలితం ఏమీ కనిపించలేదు. అగ్రవర్ణాలకు, రాజకీయంగా బలంగా ఉన్న పార్టీల పంచనచేరడంవల్ల తమకు కలిగే మేలేమీలేదని దళితులు గ్రహిస్తూనే ఉన్నారు. దళితుల ప్రయోజనాలు కాపాడతామని చెప్పే మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ నుంచి దళితులు ఆశించేది కేవలం ఆమెకు అధికారం దక్కడమే కాదు. తమకు ఆ పార్టీ అండగా ఉంటుందన్న విశ్వాసం కలిగించడంలో మాయావతి విఫలం అవుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలలో యాదవులకు, దళితులకు లేదా ఠాకూర్లకు దళితులకు మధ్య ఘర్షణలు మామూలు అయిన స్థితిలో మాయావతి తమ పక్షాన నిలబడడం లేదన్న అసంతృప్తి దళితులలో పెరుగుతోంది. తమ మీద దాడిచేసే వర్గాలతో దళితులు రాజకీయంగానూ, సైద్ధాంతికంగానూ కలిసి నడవడం సాధ్యమయ్యే పనికాదు. దళితులకు కావలసింది తమ తరఫున నిలబడే నాయకులు. మాయావతిలో ఆ లక్షణం అంతరించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రజావ్యతిరేకవైఖరి అనుసరిస్తున్న మోదీని ఓడిరచాలంటే ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలన్న అభిప్రాయం సర్వత్రాఉంది. ఒంటరిగా పోటీ చేయాలన్న మాయావతి వైఖరివల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకే ప్రయోజనం కలగవచ్చు. ఒకప్పుడు బీఎస్పీకి 17 నుంచి 19 శాతం ఓట్లు ఉండేవి. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలలో బీఎస్పీ ఓట్లు 11శాతానికి తగ్గాయి. ఒక్క సీటు మాత్రమే దక్కింది. మునుపటి మద్దతు బీఎస్పీకి తిరిగి వస్తుందనుకోవడం అత్యాశే. అంటే ఒంటరిగా పోటీ చేయడంవల్ల బీఎస్పీకి కలిగే మేలూ ఏమీ ఉండకపోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img