కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసేందుకు గత మూడేళ్లుగా మోదీ ప్రభుత్వం చేయని ప్రయత్నాలులేవు. రాష్ట్ర ప్రజానీకం మద్దతుతో కార్మికులు మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్న ఆందోళన ముందు మోదీ ప్రయత్నాలు ఫలించడంలేదు. దానితోపథకం ప్రకారం స్టీల్ ప్లాంట్‌ను మోదీ ప్రభుత్వం నష్టాల్లోకి నెడుతోంది. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడానికి, సొంత గనులు సమకూర్చడానికి వెనుకాడుతోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు మద్దతు అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇంతకు ముందు అధికారంలో ఉన్న జగన్ మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కనీస ప్రయత్నం చేయడంలేదు. విశాఖ స్టీలుప్లాంటు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న కార్మిక సంఘాల, ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవినపెడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కోరుతూ గత 1300 రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ వద్ద కార్మిక సంఘాలు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం వాటాలు విక్రయించాలని 2021 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కార్మికుల, ఉద్యోగుల మనోభావాలను పట్టించుకోకుండా స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరుకు, నిధులు రాకుండా చేసి పరిశ్రమను నష్టాలపాలు చేసి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్లాంట్‌ను నష్టాల్లోకి నెట్టి దానికి అదే మూతపడేటట్లు చేసే కుట్రలో భాగంగా బ్లాస్టు, ఫర్నిసు, ముడి సరుకు సరఫరా చేయకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపు చేస్తామని చెప్పిన మాటలు ఎన్నికల తరువాత నీటిమూటలుగా మారిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడి ప్రైవేటీకరణ ప్రతిపాదన విరమించేలా చేస్తాను 45 రోజులు గడువు ఇవ్వాలని కోరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ ఆ గడువు దాటిపోయినా నోరు మెదపడంలేదు. ప్లాంట్‌ను సందర్శించి ప్రైవేటీకరణ ఉండబోదని చెప్పిన కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి దిల్లీ వెళ్లాక ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారం మొత్తం చూస్తూ కూర్చోవడం తప్ప ప్రైవేటీకరణ ప్రయత్నాలు అడ్డుకునేందుకు చేస్తున్న కృషి శూన్యం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దాగుడుమూతలను నిరసిస్తూ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనీ, సెయిల్ లో విలీనం చేసి, పూర్తి సామర్థ్యం తో నడపాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక, రైతు సమన్వయ సంఘాల సమన్వయ సమితి పిలుపు అందుకని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వామపక్ష పార్టీలు ఈ ఆందోళనకు సంఫీుభావం ప్రకటించాయి. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో విజయవంతం అయింది. ప్రభుత్వం ఎప్పటిలానే నిర్బంధాలు, అరెస్టులు, అణచివేతలకు పాల్పడిరది. నిరసనలో పాల్గొన్న నాయకుల అరెస్టులు, తోపులాటలు షరామాములే. స్టీల్ ప్లాంట్ కార్మికులు జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టడంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖద్వారం కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉద్రిక్తత నెలకొంది. నిరసన కొనసాగిస్తున్న దీక్షా శిబిరం నుంచి కార్మికులంతా బయటకువచ్చి రోడ్డుపై బైఠాయించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన ఉక్కు ఉద్యోగులను దాదాపు 40 మందిని అరెస్టు చేసి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. స్టీల్‌ప్లాంట్‌లో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ అనుబంధ స్టీల్ ప్లాంట్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకులు డి ఆదినారాయణ, కె ఎస్ ఎన్ రావు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్ ప్లాంట్ కార్మికులంతా రాస్తారోకో నిర్వహించారు. వరదలు, భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమౌతూ ప్రజలు అల్లాడుతున్నప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ను సంరక్షించుకోవాలన్న ఉక్కు సంకల్పంతో మంగళవారంనాటి రాస్తారోకోలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుప్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వక్తులకు అప్పగించే ఆలోచన విరమించుకోవాలన్న నినాదాలతో వీధులు మార్మోగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించే, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి స్వంత గనులు కేటాయించకుండా మోదీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.
ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ 120 శాతం రేటింగ్ సామర్ధ్యంతో ప్రసిద్ధి చెందింది. గతంలో లాభాలు ఆర్జించింది. సొంత ఆర్థిక వనరులను ఉపయోగించి ఉత్పత్తి 3.4 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నుల సామర్య్థానికి పెరిగింది. మూలధన పెట్టుబడి, ముడిసరుకు సరైంతగా సమకూర్చకపోవడంతో ప్రస్తుతం 50 శాతం సామర్థ్యంతోనే నడుస్తోంది. ప్లాంటు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా పునరుద్ధరిస్తే వీలైనంత తొందరగా లాభాల్లోకి వస్తుంది. దీనికోసం వెంటనే వర్కింగు కేపిటల్‌ను ఏర్పాటు చేసి, అసరమైన బ్యాంకు రుణాలు తీసుకునేందుకు లెటర్ ఆఫ్ కంఫర్ట్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంటుకు మినహా దేశంలో అన్ని ఉక్కు కర్మాగారాలకు క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, ప్లాంటు నిరంతరం పనిచేయడానికి, వీలైనంత ఎక్కువ బఫర్‌స్టాకును ఉంచుకోవడానికి వీలుగా వెంటనే ఇనుప ఖనిజం గనులను కేటాయించాలి. ప్రజాందోళనను ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం గుర్తించి విశాఖ ఉక్కులో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుని, కంపెనీ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఐఎన్‌ఎల్ మనుగడ, సుస్థిరత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ సెయిల్‌లో విలీనం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణాలు ఇవ్వడం, మూడు సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు ప్రకటించడం, ప్లాంట్ సామర్థ్యం స్థిరీకరించే వరకూ ఆర్థిక సహాయం అందిస్తుండటం, ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడం, కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచడం, క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనుల కేటాయింపు కోసం సెయిల్ లేదా ఎన్‌ఎండీసీ నుంచి ముడి సరుకు సరఫరా చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు మౌనంవీడి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా మోదీపై వత్తిడి తీసుకురావాలి. అవసరమైతే ఈ విషయమై కేంద్రంతో మాట్లాడేందుకు అఖిలపక్ష బృందాన్ని, కార్మిక, రైతుసంఘాల ప్రతినిధులను దిల్లీకి తీసుకువెళ్లాలి. కార్మిక సంఘాలు ఉద్యమిస్తే అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టే చర్యలను విడనాడాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యోచనను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుని, ప్లాంట్‌కు కావాల్సిన అన్నింటిని సమకూర్చే వరకూ కార్మికసంఘాలు ఉక్కుసంకల్పాన్ని ఏమాత్రం సడలించకుండా మొక్కవోని దీక్షతో పోరాటం కొనసాగించాలి.