Sunday, June 11, 2023
Sunday, June 11, 2023

దిల్లీపై ఆధిపత్యమే మోదీ లక్ష్యం

సివిల్‌ సర్వీసుకు చెందిన వారి మీద పరిపాలనాధికారం దిల్లీ సర్కారుకు ఉంటుందని ఈ నెల 11వ తేదీన అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచి ఇచ్చిన తీర్పును తిరగతోడుతూ మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలో దిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి వీలైనన్ని తక్కువ అధికారాలు మాత్రమే ఉండాలన్న రాజకీయ ఘర్షణాత్మక వైఖరి మాత్రమే ఉన్నట్టు స్పష్టం అవుతూనే ఉంది. దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీలో అధికారం సంపాదించడానికి బీజేపీ పదే పదే చేసిన ప్రయత్నాలను ఓటర్లు ప్రతి సారీ తిప్పికొట్టారు. తాను అజేయుడినని, తన మాటకు ఎదురు ఉండకూడదని భావించే నరేంద్ర మోదీకి కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారంలో ఉండడం ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. దిల్లీ శాసనసభకు సివిల్‌ సర్వీసు ఉద్యోగుల మీద పరిపాలనా సంబంధ అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తులు ఎం.ఆర్‌.షా, కృష్ణ మురారి, హిమ కోహ్లి, పి.ఎస్‌.నరసింహతో కూడిన బెంచి చెప్పిన తీర్పును అంగీకరించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దిల్లీ శాసనసభ చట్టాలు చేయడానికి వీలులేని శాంతి భద్రతలు, పోలీసులు, భూ వ్యవహారాల మీద తప్ప మిగతా అన్ని అంశాలలో దిల్లీ ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయన్నది అయిదుగురు న్యాయమూర్తుల తీర్పులోని ప్రధానాంశం. దిల్లీ రాష్ట్రం కాని రాష్ట్రం. కొంత కాలం అది కేంద్ర పాలిత ప్రాంతం. తరవాత దానిని దేశ రాజధాని ప్రాంతం అన్నారు. దిల్లీకి ఓ శాసనసభ ఉంది. శాసనసభ ఉన్న మరో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మాత్రమే. శాసనసభ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉన్నప్పుడు సర్వాధికారాలు గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుగ్ధ మోదీ సర్కారు కేవలం దిల్లీ విషయంలోనే కనబరుస్తోంది.
శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటి మీద సకల అధికారాలు చెలాయించాలన్న ఆలోచన కేంద్రానికి లేదు. దిల్లీకి రాష్ట్రపతి లెఫ్టినెంట్‌ గవర్నరును నియమిస్తారు. మోదీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత నియమితులైన లెఫ్టినెంట్‌ గవర్నర్లు అందరూ కేజ్రీవాల్‌ సర్కారుకు ఊపిరాడనివ్వడం లేదు. నిత్య సంఘర్షణలతోనే దిల్లీ ముఖ్యమంత్రికి తెల్లారిపోతోంది. కేజ్రీవాల్‌ ప్రభుత్వం జనరంజకమైన కార్యక్రమాలు కాకుండా ప్రజోపయోగ విధానాలు అనుసరించడంవల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంది. కేజ్రీవాల్‌ రాజకీయాలు ఎలాంటివైనా దిల్లీ ప్రజలకు ఏ రాష్ట్రంలో లేని కొన్ని వెసులుబాట్లు వచ్చాయన్న మాట అంగీకరించవలసిందే. ఈ అంశమే కేజ్రీవాల్‌ కు విజయాల మీద విజయాలు సాధించి పెడ్తోంది. బీజేపీ దిల్లీలో వరస పరాజయాలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరగడం మొదటి సారేం కాదు. ఇంతకు ముందు ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కూడా తీర్పులు వెలువడ్డాయి. ఇద్దరు సభ్యుల బెంచీ, ముగ్గురు సభ్యుల బెంచీ తీర్పులు చెప్పాయి. కానీ ఈ వ్యవహారాన్ని కొలిక్కి రానీయకుండా మోదీ ప్రభుత్వం ప్రతి సారీ మోకాలు అడ్డం పెడ్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగతోడుతూ ఆర్డినెన్సు జారీచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విషయం వాస్తవమే. ఈ అవకాశాన్ని దిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరీకరించడానికి వినియోగించుకోవడమే వైపరీత్యం. ఇతర రాష్ట్రాల లాగా బీజేపీ ఆశచూపే డబ్బు సంచులకు ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసన సభ్యులు లొంగకపోవడం బీజేపీకి ఎంత మాత్రం రుచించడం లేదు. తాజాగా తీర్పు చెప్పింది ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలోని అయిదుగురి బెంచి కనక ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుందనుకుంటే కేంద్రం అడ్డంకులు కల్పిస్తూనే ఉంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆర్డినెన్సులో మరో కీలకాంశం కూడా ఉంది. సుప్రీంకోర్టు తీర్పును వమ్ము చేయడమే కాక వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యవస్థకు మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. అక్కడితో ఆగకుండా జాతీయ రాజధాని సివిల్‌ సర్వీస్‌ అథారిటీ వ్యవస్థను ఆఘమేఘాల మీద ఏర్పరచింది. ఇలాంటి వ్యవస్థ దిల్లీ కోసమే మొట్టమొదటిసారి ఏర్పాటు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారిని సకల విధాల దిగ్బంధం చేయడమే మోదీ సర్కారు ప్రధాన లక్ష్యం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేజ్రీవాల్‌ ప్రభుత్వం అశీస్‌ మోరే అనే కార్యదర్శిని బదిలీచేసింది. మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌కు తన మీద వ్యక్తిగత కక్ష ఉన్నందువల్లే తనను బదిలీ చేశారని సదరు అధికారులు వాదిస్తున్నారు. ఇంతలోనే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దూరిపోయి ఈ బదిలీ రాజ్యాంగ విరుద్ధమైందని, తెంపరి తనమని, వేధింపులకు గురిచేసేదని, నియమ నిబంధనలను ఉల్లంగించేదని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గోదాలో దిగిపోయారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు లోపభూయిష్టమైందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గుర్తించడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ దశలో ఆర్డినెన్సు జారీ చేయడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పును పున:పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం అర్జీ కూడా పెట్టుకున్నందువల్ల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది పెద్ద ప్రశ్న. కేంద్రానికి, దిల్లీ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న ఎడతెగని వివాదాలవల్ల అంతిమంగా నష్ట పోతున్నది దిల్లీ పౌరులే. ఈ బాధ మోదీ సర్కారుకు ఏ కోశానా ఉన్నట్టులేదు. దిల్లీ మీద తమ పెత్తనం కొనసాగాలన్నదే కేంద్రం అంతిమ ఆశయం. అనేక దేశాలలో దేశ రాజకీయ ప్రాంతాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కాని అవి అంగీకృత విధానాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అలా కొనసాగడం మోదీ సర్కారుకు కిట్టకపోవడంలోనే చిక్కంతా ఉంది. ఎన్నికైన ప్రభుత్వానికి పౌరుల విషయంలో నిర్వర్తించవలసిన బాధ్యతలూ ఉంటాయి కనక అధికారవర్గంపై అజమాయిషీ దిల్లీ ప్రభుత్వానికే ఉండాలన్న సుప్రీంకోర్టు మాట కేంద్రానికి బొత్తిగా రుచించడం లేదు.
ఎన్ని కోర్టు తీర్పులు వచ్చినా కేంద్రంతో దిల్లీ ప్రభుత్వానికి ఉన్న వివాదాలు పరిష్కారం కాకపోవడం ఆశ్చర్యకరం. దిల్లీ ప్రభుత్వం విషయంలో మోదీ సర్కారు ఘర్షణ వైఖరి అనుసరిస్తోందే తప్ప సహకరించిన సందర్భాలే లేవు. పరిపాలనా పరమైన సమస్యలను పరిష్కరించిందీ లేదు. దిల్లీ మాత్రమే కాక ఇతర రాష్ట్రాలకు అధికారాలు ఉండడం, సమాఖ్య (ఫెడరల్‌) విధానం అమలు కావడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోంది. దిల్లీ దేశ రాజధాని అయినందువల్ల ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. విశిష్ట పాలనా విధానాలూ అవసరం అవుతాయి. స్థానిక రాజకీయాలది పై చేయి అయితే చివరకు విఘాతం కలిగేది పరిపాలనకే. ఇతరేతర కారణాలవల్ల ఓటర్ల అభిష్టాన్ని తోసిపుచ్చడమే. కేంద్ర ప్రభుత్వానికి విపరీతమైన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయనడం సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీస్తుంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యమే అది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img