Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

దిల్లీ కార్పొరేషన్‌లో కేజ్రీవాల్‌ హవా

ప్రధానమంత్రి మోదీ భాషలో చెప్పాలంటే దిల్లీలో కూడా డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో విజయం సాధించింది. పదిహేనేళ్ల బీజేపీ ఆధిపత్యానికి తెరపడిరది. దిల్లీలోని మూడు పౌర పాలనా వ్యవస్థలను దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌గా మార్చిన తరవాత మొదటిసారి జరిగిన ఎన్నికలలో కేజ్రీవాల్‌ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. మొత్తం 250 స్థానాలలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 134 సీట్లు దక్కితే పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి 104 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్‌ తొమ్మిది సీట్లకే పరిమితమైంది. 2015నుంచి దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇది గణనీయమైన విజయమే. దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ నాయకురాలు షీలాదీక్షిత్‌ బీజేపీని మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి గద్దె దించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు కానీ ఆ పని కేజ్రీవాల్‌ చేయగలిగారు. అలాగే దిల్లీలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించిన షీలాదీక్షిత్‌ను ఓడిరచడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు కాని కేజ్రీవాల్‌ ఆ పని చేయగలిగారు. 2015లో, ఆ తరవాత 2020లో దిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించించి రికార్డు నెలకొల్పారు. కానీ 2019 లోకసభ ఎన్నికలలో దిల్లీలోని మొత్తం ఏడుస్థానాలను బీజేపీ కైవశం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు క్వార్టర్‌ ఫైనల్‌ లాంటివనీ, శాసనసభ ఎన్నికలు సెమీఫైనల్‌ లాంటివనీ, లోకసభ ఎన్నికలు ఫైనల్‌ ఎన్నికలని అంటూ ఉంటారు. కానీ దిల్లీలో చాలా కాలం నుంచి ఈ మాట చెల్లుబాటు కావడంలేదు. లోకసభ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో బీజేపీ గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు మొదటి సారి కార్పొరేషన్‌ ఎన్నికలలో పరాజయం పాలైంది. దిల్లీ ప్రజలు మునిసిపల్‌, శాసనసభ, లోకసభ ఎన్నికలలో భిన్నమైన తీర్పులుచెప్పడం ఆనవాయితీ అయినప్పటికీ కార్పొరేషన్‌ ఎన్నికల లోనూ ఆమ్‌ ఆద్మీ పార్టీని గెలిపించారు. 2017లోనూ అప్పుడు దిల్లీలో ఉన్న మూడు స్థానిక సంస్థలను బీజేపీ కైవశం చేసుకోగలిగినా ఇప్పుడు నిరాశే ఎదురైంది. నిజానికి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఏప్రిల్‌-మే నెలల్లో జరగాల్సి ఉన్నా మూడు స్థానికసంస్థలను ఏకంచేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదావేసింది. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలతో పాటే దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించారు. కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ గుజరాత్‌లోనూ అధికారంకోసం పోటీ పడుతున్నందువల్ల ఆయన గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించకుండా చేయడానికి గత అయిదవ తేదీన కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించారు. మూడు స్థానికసంస్థలను ఏకం చేసి అన్నింటినీ దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో భాగం చేయాలన్న బీజేపీ ఆకాంక్ష అయితే నెరవేరింది కానీ అది బీజేపీకే ప్రతికూలంగా పరిణమించింది. ఆమ్‌ఆద్మీ పార్టీ అవినీతి పంకిలంలో మునిగిపోయిందని రుజువు చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. దిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌ అవినీతి పరుడని, ఆయన తీహార్‌ జైలులో ఉన్నాడని చేసిన ప్రచారమూ బీజేపీకి ఓట్లు రాల్చలేదు. జైన్‌ నివాసం ఉండే షకూర్‌ బస్తీలోని మూడు మునిసిపల్‌ కౌన్సిలర్‌ స్థానాలు మాత్రం బీజేపీకి దక్కాయి. మిగతా చోట్ల బీజేపీ బాగా నష్టపోయింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రభావం కార్పొరేషన్‌ ఎన్నికలలో అంతగా పనిచేయలేదు. పైగా ఆమ్‌ఆద్మీ పార్టీ మీద అవినీతిఆరోపణలు గుప్పించడం వికటించినట్టుంది. బీజేపీ అధికారంలో ఉన్న మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని ఘాజీపూర్‌, జహంగీర్‌పురిలో చెత్త కుప్పలు పేరుకు పోయాయని ఆమ్‌ఆద్మీ పార్టీ చేసిన వాదన ఓటర్ల చెవి కెక్కినట్టు ఉంది. దిల్లీ ప్రభుత్వం ఎటూ కేజ్రీవాల్‌ చేతిలోనే ఉంది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ కూడా దక్కింది కనక బీజేపీ ఏలుబడిలో జరిగా యంటున్న అవకతవకలను, క్రియారాహిత్యాన్ని తొలగించవలసిన బాధ్యత ఆమ్‌ ఆద్మీ పార్టీ మీదే ఉంటుంది. కేజ్రీవాల్‌ మెరుగైన విద్య అందిస్తున్నామని ఎప్పుడూ ప్రచారం చేస్తుంటారు కనక మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాథమిక పాఠశాల పనితీరును మెరుగుచేసి చూపించవలసి ఉంటుంది. కార్పొరేషన్‌ పరిధిలోని రోడ్లు 60 అడుగుల కన్నా వెడల్పు లేవు. మురికి వాడలను తొలగించి అక్కడ నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయ వసతిచూపడం ఆమ్‌ ఆద్మీ పార్టీకి పెద్ద పనే.
దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి నందువల్ల కేజ్రీవాల్‌ ప్రతిష్ఠ పెరిగిన మాట వాస్తవమే. కార్పొరేషన్‌పై ఆధిపత్యం నిలబెట్టుకోవడంకోసం బీజేపీ విపరీతంగా ప్రయత్నించింది. ఏడుగురు బీజేపీ ముఖ్యమంత్రులు, 17 మంది కేంద్రమంత్రులు కార్పొరేషన్‌ ఎన్నికలలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచార ఆర్భాటం ఏదీ బీజేపీని పరాజయం నుంచి కాపాడలేదు. దిల్లీ ముఖ్యమంత్రికి అడు గడుగునా ఆటంకాలు కలిగించడానికి మోదీ సర్కారు చేయని పనేలేదు. దిల్లీని ఒక రాష్ట్రంగా కూడా గుర్తించకుండా దిల్లీప్రభుత్వం అంటే లెఫ్టినెట్‌ గవర్నర్‌ పాలనే అని రాష్ట్రానికి ఉన్న నిర్వచనాన్ని కూడా మార్చేసింది. దిల్లీ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం ప్రతి చిన్న విషయానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి మోదీ ప్రభుత్వం కల్పించింది. లెఫ్టినెట్‌ గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికే అనుకూలంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. పరిపాలనలో దిల్లీ ముఖ్యమంత్రి అధికారాలను కుదించేశారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులను ఇరుకున పెట్టడానికి వేట కుక్కల్లాంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఆదాయపు పన్ను శాఖలను ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలపై కత్తికట్టినట్టు ప్రయోగించారు. అనేక మంది ఆమ్‌ ఆద్మీ నేతలు ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు. 167 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలమీద ఆరోపణలు మోపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించిన 800 మంది అధికారులను రంగంలోకి దింపారు. వీటిలో ఏ కేసు నిలబడలేదని కేజ్రీవాల్‌ అంటున్నారు. కానీ కేంద్రం తీసుకున్న చర్యలన్నీ కేజ్రీవాల్‌ పార్టీకి అనేక అడ్డంకులు తెచ్చిపెట్టాయి. కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించినప్పటికీ 104 సీట్లతో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని కేజ్రీవాల్‌ గుర్తించాలి. నిజానికి ప్రతిపక్షం బలంగా ఉండడం ప్రజాస్యామ్యానికి బలం చేకూరుస్తుంది. ఏమైతేనేం కేజ్రీవాల్‌ విజయమంత్రాన్ని ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుతానికి ఆయనే మోదీకి దీటైన నాయకుడిగా కనిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img