Friday, March 31, 2023
Friday, March 31, 2023

దిల్లీ కార్పొరేషన్‌లో మోదీకి చెంపదెబ్బ

స్పష్టమైన రాజ్యాంగ నిర్దేశాలు ఉన్నప్పటికీ ప్రతి విషయం మీద రచ్చ చేయడం బీజేపీకి పరిపాటై పోయింది. దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నిక బీజేపీ లేవనెత్తిన రగడ కారణంగా మూడుసార్లు వాయిదాపడిరది. దీనికి ప్రధాన కారణం బీజేపీ అక్రమ పద్ధతుల్లో అధికార పీఠాలు ఎక్కడానికిచేసే కుటిల యత్నాలే. కార్పొరేషన్‌కు లెఫ్టినెంటు గవర్నర్‌ పదిమంది పెద్దలను నామినేట్‌ చేయవచ్చు. వీరికి మేయర్‌ను ఎన్నుకోవడానికే కాక కార్పొరేషన్‌ సమావేశాల్లోనూ ఓటువేసే అధికారం ఉండదు. వీటిని నిరోధించడానికి మేయర్‌ పదవిలోకి వస్తారనుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. నామినేట్‌ అయిన పది మంది పెద్దలకు ఓటువేసే అవకాశం ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ విచారణక్రమంలో వ్యాఖ్యానించారు. దీనితో బీజేపీ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయినా పంతం వీడడం లేదు. దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు గత డిసెంబర్‌ 22న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కార్పొరేషన్‌లో మొత్తం 250 స్థానాలు ఉంటే బీజేపీ 104 సీట్లు మాత్రమే సంపాదించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ 134 సీట్లు సంపాదించి మేయర్‌ స్థానాన్ని కైవశం చేసుకోవడానికి స్పష్టమైన మెజారిటీ సంపాదించింది. అయినా బీజేపీ దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు పది మంది పెద్దలను నామినేట్‌చేసే అవకాశం లేకపోయినా మేయర్‌ స్థానం మీద ఆశలు పెంచుకుంది. ఈ పది మందిని కలిపినా బీజేపీకి దక్కేవి 114 స్థానాలే. మేయర్‌ స్థానానికి జరిగే ఎన్నికలలో దిల్లీ నుంచి ఎన్నికైన ఏడుగురు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఒక బీజేపీ శాసనసభ్యుడు ఓటు వేయవచ్చు. వారంతా బీజేపీ సమర్థకులనుకున్నా దిల్లీ శాసనసభ స్పీకర్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన 13మందిని నామినేట్‌ చేసే అవకాశంఉంది. ఏ రకంగానూ బీజేపీ అత్యాశ నెరవేరే వీలేలేదు. లెఫ్టినెంటు గవర్నర్‌ నామినేట్‌చేసే పదిమంది మేయర్‌ ఎన్నికలలో గానీ, కార్పొరేషన్‌ సమావేశాల్లో గానీ ఓటు వేయడానికి అవకాశం లేదని తెలిసినా బీజేపీ ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇరుకునపెట్టే సంకుచిత బుద్ధిని విడనాడలేదు. అలాగే కార్పొరేషన్‌ మేయర్‌ను ఎన్నుకోవ డానికి జరిగే సమావేశం నిర్వహించడానికి సాధారణంగా అందరికన్నా సీనియర్‌ సభ్యుడికి ఆ బాధ్యత అప్పగించడం ఆనవాయితీ. అయినా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మరో సభ్యుడికి ఆ బాధ్యత అప్పగించడానికి ప్రయత్నించడం కేంద్రం ఆదేశాలమేరకే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షెల్లీ ఒబెరాయ్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ ఇంకా పూర్తికాలేదు. వచ్చే శుక్రవారం విచారణ జరగవలసిఉంది. ఆ విచారణ ఒక లాంఛనమే. ఇలాంటి అంశాలు సుప్రీంకోర్టు ముందు విచారణకు రావడం ఇది మొదటిసారి ఏమీకాదు. అయినా సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించడం ఔదార్యం ప్రదర్శించడమే. రాజ్యాంగ నిర్దేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు అసలు విచారణ కొనసాగించడమే వృథా ప్రయాస. దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చట్టం కూడా గవర్నర్‌ నామినేట్‌ చేసిన పెద్దలు ఓటు వేయడానికి వీలులేదనే చెప్తోంది. లెఫ్టినెంటు గవర్నర్‌ వి.కె.సక్సేనా ఈ ధర్మ సూక్ష్మం తెలియనంత అమాయకుడు ఏమీకాదు. కానీ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాలు పాటించక తప్పదుకదా! చట్టం ప్రకారం, న్యాయబద్ధంగా నడుచుకునే గవర్నర్లు, లెఫ్టినెంటు గవర్నర్లు మృగ్యమై పోతున్న దశలో వ్యర్థ వివాదాలు అనివార్యం అవుతున్నాయి. 

అయిదేళ్ల కాలంలో దిల్లీ మేయర్‌గా మొదటి సంవత్సరం మహిళ మేయర్‌గా ఉండాలి. రెండోసంవత్సరంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. మూడో సంవత్సరంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది. మిగతా రెండు సంవత్సరాలు మళ్లీ ఏవర్గం వారికైనా మేయర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఈసారి మహిళ మేయర్‌ కావలసిఉంది. ఇవన్నీ బీజేపీ అధికారదాహం ముందు బేఖాతరుగానే మిగిలిపోతాయి. గత పదిహేనేళ్ల కాలం నుంచి బీజేపీ అభ్యర్థే దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఉన్నారు. పదేళ్లకింద దిల్లీలో మూడు మునిసిపల్‌ కార్పొరేషన్లు ఉండేవి. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక్కో మేయర్‌ను ఎన్నుకునేవారు. కానీ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లను కలిపి ఒకే కార్పొరేషన్‌గా మార్చింది. ఎన్నికల ఫలితాలు తిరగబడడంతో దిక్కుతోచనిస్థితిలోపడ్డ బీజేపీ ఏదో ఒక మెలిక పెట్టడానికి ప్రయత్నిస్తోంది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ తిరుగులేని అధికారం చెలాయిస్తున్నప్పటికీ, అనేక రాష్ట్రాలలో స్వయంగా అధికారంలో ఉండడమో, సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉండడమో సాధ్యమైనప్పటికి దిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో దాదాపు పాతికేళ్లనుంచి కాలుమోపే అవకాశం కూడా రావడంలేదు.
దేశ రాజధానిలో మోదీ ప్రభావం పనిచేయకపోవడం బీజేపీకి తలవంపుల వ్యవహారంగా తయారైంది. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో చేతిలో ఉన్న దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కూడా బీజేపీ చేజారింది. అక్కడా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధిపత్యం సంపాదించడం బీజేపీకి మరింత అవమానకరం. దిల్లీ శాసనసభకు వరసగా జరిగిన మూడుఎన్నికలలో కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధిస్తోంది. కాంగ్రెస్‌ అతికొద్ది స్థానాలతో సంతృప్తి పడవలసివస్తోంది. అంతకుముందు షీలా దీక్షిత్‌ వరసగా పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్‌ చాలా బలహీనపడిరది. కేజ్రీవాల్‌ విజయరహస్యం ఏమిటో బీజేపీకి స్పష్టంగా తెలుసు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రజల మన్ననలను పొందింది. ఆయన అమలుచేసిన సృజనాత్మక, ప్రజోపయోగ విధానాలను ప్రజలు ఆదరిస్తున్నారు. కేజ్రీవాల్‌ ఏలుబడిలో పాఠశాలలు మెరుగైనాయి. ఉచిత మంచినీరు, విద్యుత్‌ అందుతున్నాయి. అందుకే జనాదరణఉంది. ఈ రకమైన పరిపాలనకు ప్రత్యామ్నాయం చూపడంలో విఫలమైన మోదీ కొత్తవాదన లేవనెత్తారు. ఉచితాలు అనుచితమని కొత్తరాగం ఎత్తుకున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలను దుయ్యబట్టడంతో పాటు మోదీ చేసే ప్రధానమైనపని ఉచితాలు ప్రకటించడమే. తాను ప్రకటించేవి ఉచితాలు కావని, ఇతర పార్టీల వాగ్దానాలు ఉచితాలు లేదా తాయిలాలు అని నమ్మించాలని మోదీచేస్తున్న ప్రచారం దిల్లీలో పారడం లేదు. పైగా సుప్రీంకోర్టు వ్యాఖ్య చెంపదెబ్బ అయికూర్చుంది. పాపం మోదీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img