Monday, June 5, 2023
Monday, June 5, 2023

దూరం అవుతున్న ప్రజాస్వామ్యం

మోదీ అన్న ఇంటి పేరు ఉన్నవారు అందరూ దొంగలు అని అన్నందుకు సూరత్‌ మేజిస్ట్రేట్‌ రెండేళ్లు కఠిన కారాగారశిక్ష విధించిన పర్యవసానంగా లోకసభ సభ్యుడిగా కూడా అర్హత కోల్పోయిన తరవాత శనివారం రాహుల్‌ గాంధీ తన పోరాటం ఆపేది లేదని, సత్యం కోసం, ప్రధానమంత్రి మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. జీవితాంతం జైలులో ఉంచినా ఈ పోరాటం ఆపేది లేదన్నారు. ఆయన కనబరుస్తున్న దీక్ష సరైందే కావచ్చు. రాహుల్‌కు కోర్టు శిక్ష విధించడం సబబేనా కాదా అన్న విషయం ఆయన హైకోర్టుకు వెళ్లినప్పుడు తేలవచ్చు. కానీ మోదీ ప్రభుత్వం రాహుల్‌ గాంధీ మీదే కాక మిగతా ప్రతిపక్షాలన్నింటి మీద కత్తిగట్టినట్టు వ్యవహరిస్తు న్నందుకు, ముఖ్యంగా రాహుల్‌ను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించినందుకు ఇతర దేశాలు భారత్‌లో ప్రజాస్వామ్యం అడుగంటుతోందన్న అభిప్రాయానికి రావడానికి దోహదం చేస్తోంది. మాజీ పాలకులు జీవిత కాలం ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం కొత్తేమీ కాదు. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్న చోట ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అవినీతికి పాల్పడినందుకు కొందరు ప్రసిద్ధ నాయకులు చట్టసభల సభ్యత్వం కోల్పోయిన ఉదంతాలు మన దేశంలోనూ ఉన్నాయి. ఈ జాబితాలో ఇక రాహుల్‌ గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
పదవీచ్యుతుడైన తరవాత పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఎలాంటి పదవిలో ఉండడానికి వీలులేదని 2018లో ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఇప్పుడూ వివాదంలో మునిగి తేలుతున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా అధికారం కోల్పోయారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఆయన ఓడిపోయారు. అయినా ఆయనను ఎన్నికలలో పోటీ చేయడానికి వీలులేదని అనలేదు. అవినీతికి పాల్పడ్డారని ఆరోపించి జుల్ఫికర్‌ అలీ భుట్టోను ఉరితీసిన చరిత్ర పాక్‌కు ఉంది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లోలాగా పాకిస్తాన్‌లో, కొన్నిసార్లు బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్నవారిని గద్దె దించడం కొత్తేమీ కాదు. పాకిస్తాన్‌లో అయితే కనురెప్పవాలేలోపు ప్రభుత్వాలు పతనమైన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ రాహుల్‌ గాంధీని లోకసభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించడానికి చేసిన హడావుడి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని మురిసిపోయే అవకాశాన్ని దెబ్బ తీసింది. రాహుల్‌ గాంధీకి సూరత్‌లోని మేజిస్ట్రేట్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన కొద్ది గంటల్లోనే ఆయనను లోకసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంపై పశ్చిమ దేశాల మీడియా ఆశ్చర్యం వ్యక్తంచేస్తోంది.
ప్రధానమంత్రి మోదీ హయాంలో భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అన్నపేరు మటుమాయం అయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని. భారత్‌ ప్రభ తగ్గిందని బ్లూంబర్గ్‌ వ్యాఖ్యానించింది. అధికారంలో ఉన్న మోదీ నాయకత్వంలోని బీజేపీయే రాహుల్‌ను ఈ రకంగా శిక్షించిందని బ్లూంబర్గ్‌ పేర్కోంది. అంటే మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని భావిస్తున్నట్టే. పరువు నష్టం చట్టం మనకు బ్రిటిష్‌ వలస పాలన వారసత్వంగా వచ్చింది. ముఖ్యంగా క్రిమినల్‌ పరువునష్టానికి ఇంకా అవకాశం ఉండడం మీద దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ నిరంతరం విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి చట్టాలను అనేక దేశాలు ఉపసంహరించాయి. కానీ మన దేశంలో మాత్రం అధికార పార్టీ వారే కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా ఏహ్యమైన ఈ చట్టం ఆధారంగా ప్రత్యర్థుల మీద కేసులు మోపుతూనే ఉన్నాయి. కడకు మీడియా కూడా ఇలాంటి కేసులు ఎదుర్కుంటూనే ఉంది. విమర్శకుల నోరుమూయించడానికి ఈ చట్టాన్ని వాటంగా దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు అని బీబీసీ వ్యాఖ్యానించింది. రాహుల్‌ గాంధీ వ్యవహారంతో నిమిత్తం లేకుండానే మోదీ హయాంలో భారత్‌లో ప్రజాస్వామ్యం కుదుళ్లు కదులు తున్నాయని ఎకానమిస్ట్‌పత్రిక ఇటీవలే వ్యాఖ్యానించింది. పార్లమెంటు పరిశీలనకు, చర్చకు అవకాశం లేకుండానే అనేక బిల్లులు ఆమోదం పొందుతున్న వైనాన్ని ఈ పత్రిక ఎత్తిచూపింది. లోకసభలో ప్రతిపాదించిన బిల్లులను స్థాయీ సంఘానికి నివేదించడం తగ్గిపోతున్న తీరును ఎకానమిస్టు సోదాహరణంగా పేర్కొంది. ఇంతకు ముందు ఇతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 60 నుంచి 70 శాతం బిల్లులను స్థాయీ సంఘాలలో చర్చించే వారు. మోదీ మొదటి విడత అధికారంలోకి వచ్చిన తరవాత అది 27 శాతానికి పడిపోయింది. ఇప్పుడైతే 13 శాతానికి దిగజారింది. బిల్లులను సాకల్యంగా పరిశీలించే స్థాయీసంఘ సమావేశాలకు హాజరయ్యే సభ్యులసంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. గత మూడేళ్ల కాలంలో ఈ కమిటీ సభ్యుల హాజరు 46శాతం మాత్రమే ఉంది. గత సంవత్సరం వర్షాకాల సమావేశాలలో 15 బిల్లులు ఆమోదిస్తే ఒక్క బిల్లుకూడా స్థాయీ సంఘం పరిశీలనకు నోచుకోలేదు. ప్రతిపక్షాలు వాక్‌ఔట్‌ చేయడమో, లేదా సభాపతి ప్రతిపక్షాల వారిని సస్పెండ్‌ చేయడమో జరిగితే చాలా బిల్లులు మూజువాణీ ఓటుతో ఆమోదం పొందు తున్నాయి.
మన పార్లమెంటుస్థాయి తగ్గుతోందనడానికి మరో ఉదాహరణా ఉంది. నేరచరితులు అని ముద్రపడిన రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా కట్టడి చేయడానికి ప్రస్తుత అధికార పక్షం కూడా సుముఖంగా లేదు. కానీ ఇదే అధికార పక్షం రాహుల్‌ గాంధీ అనర్హుడైనందుకు అమితానంద పడ్తోంది. నేర చరిత్రవల్ల కళంకితులైన వారికి ఎన్నికలలో పోటీచేసే అవకాశం లేకుండా చేయాలని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదించినా ప్రస్తుత అధికారపక్షం ఆ ప్రతిపాదనను టోకున తిరస్కరించింది. అంతకన్నా విచిత్రం ఒకటుంది. బీజేపీ మద్దతుదారు, చీటికి మాటికీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడానికి పేరుపడ్డ అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ కళంకితులను జీవితకాలం ఎన్నికలలో పోటీ చేయకుండా చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేస్తే దాన్ని గట్టిగా వ్యతిరేకించింది మోదీ నాయకత్వంలోని బీజేపీనే. ప్రస్తుత లోకసభలో నేరచరిత్ర ఉన్నవారిలో ఎక్కువ మంది బీజేపీకి చెందినవారే. నేర చరితులు పోటీ చేయకుండా చేయడానికి ఇప్పటికి ఉన్న చట్టాలు సరిపోతాయని మోదీ ప్రభుత్వం ఈ పిటిషన్‌ను అడ్డుకుంది. కానీ ఆ చట్టాల ద్వారా పోటీకి అనర్హులైనవారు కేవలం ప్రతిపక్ష నేతలే. కళంకితుడైన ఒక్క బీజేపీ నాయకుడిని కూడా ఇంతవరకు ఈ నిబంధనల కింద పోటీచేయకుండా నిరోధించలేదు. బీజేపీ రాహుల్‌ను వేధించడంవల్ల తమకు మద్దతు పెరుగుతుందని మురిసిపోవడానికే పరిమితం అయితే ఈ ప్రతిజ్ఞలన్నీ నిరర్థకంగానే మిగిలిపోతాయి. అన్నింటికీమించి మన చట్టసభలు సంపన్నుల పంచాయితీలుగా లేదా కచేరీలుగా మారిపోతున్నాయి. ఓట్లు వేసిన ప్రజలకు ప్రజాస్వామ్యం అంతకంతకూ దూరం అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img