Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

దేశద్రోహ చట్టానికి మోదీ ‘‘రక్ష’’

మోదీ హయాంలో సకల ప్రజాస్వామ్య వ్యవస్థలను అయితే విరూపం చేస్తున్నారు. లేదా ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వాన్న్ని విమర్శించడమో, లేదా మోదీ ప్రభుత్వ అకృత్యాలను ఎండగట్టడమో కూడా దేశద్రోహం అయిపోయింది. 1870లో బ్రిటిష్‌ వలస పాలకుల పాలన కొనసాగుతున్న దశలో దేశద్రోహ చట్టం అమలులోకి వచ్చింది. అది పరాయి పాలన కనక ఆ పాలనను విమర్శించే వారిని దేశద్రోహులుగా పరిగణించడంలో విచిత్రం లేకపోవచ్చు. లోకమాన్య బాల గంగాధర తిలక్‌, మహాత్మా గాంధీపై కూడా దేశ ద్రోహ కేసులు మోపారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత నిజానికి ఇలాంటి కర్కశ చట్టాల అవసరమే లేదు. కానీ గత 75 ఏళ్ల కాలంలోనూ దేశద్రోహ చట్టాన్ని మన శాసనాల నుంచి తొలగించే ప్రయత్నమే జరగలేదు. ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిన బ్రిటన్‌ కూడా తమ చట్టాలనుంచి ఈ అంశాన్ని తొలగించింది. ఇంకా అనేక ప్రజాస్వామ్య దేశాలూ అదే పని చేశాయి. అంతెందుకు ఇటీవల పాకిస్తాన్‌ లోకూడా ఈ చట్టం చెల్లకుండా పోయింది. ప్రభుత్వానికి గిట్టని రచయితలు, సామాజిక కార్యకర్తలు, పౌరహక్కుల కోసం పోరాడే వారు, పత్రికా రచయితల మీద కూడా ఈ చట్టాన్ని ఎడా పెడా ప్రయోగిస్తూనే ఉన్నారు. ఈ చట్టంపై తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో ఒక దశలో లా కమిషన్‌ కూడా ప్రజాస్వామ్య దేశంలో దేశ ద్రోహ చట్టం లాంటి వాటికి స్థానం లేదని చెప్పింది. కానీ తాజాగా కర్నాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్‌ ఏలిన వారి మనసెరిగి దేశద్రోహ చట్టం కొనసాగవలసిందేనని సిఫార్సు చేసింది. ఇది నిరంకుశత్వానికి ప్రతీకగా తయారైన మోదీ ప్రభుత్వానికి బాగా నచ్చింది. లా కమిషన్‌ సిఫార్సు చేసినట్టు ఈ చట్టం కింద శిక్ష మరింత పెంచి ఈ కిరాతక చట్టాన్ని కొనసాగిస్తారట. నిరసనను, అసమ్మతిని, విమర్శను తట్టుకునే స్వభావం లేని మోదీ సర్కారు దేశ ద్రోహ చట్టానికి మరిన్ని కోరలు సమకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఈ శాసనం ఉంది కనక న్యాయస్థానాలు సైతం దీన్ని తొలగించాలని సిఫార్సు చేయడానికి సాహసించడం లేదు. కేదార్‌ నాథ్‌ సింగ్‌ కేసులో అప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను అంగీకరించింది కానీ కేదార్‌ నాథ్‌ సింగ్‌ ను నిర్దోషిగా వదిలేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ చట్టం తీవ్ర విఘాతం కలిగిస్తుందన్న కనీస ప్రజాస్వామ్య దృక్పథం ఏ ప్రభుత్వంలోనూ కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని దుయ్యబట్టిన పార్టీలే తామే అధికారంలోకి వచ్చిన తరవాత దీన్ని యధేచ్ఛగా వినియోగిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు పెడదారి పడ్తున్నాయనో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయనో భావించినప్పుడు విమర్శించడం ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఉండవలసిన హక్కే. కానీ మన దేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ చట్టాన్ని కొనసాగించడమే కాక మరింత కర్కశంగా తయారు చేయాలని లా కమిషన్‌ సిఫార్సు చేయడం రాజును మించిన రాజభక్తి కిందే లెక్క. ఆ సిఫార్సును మోదీ ప్రభుత్వం అమలు చేయాలనుకోవడం నిరంకుశత్వానికి ఆవలి గట్టు. కాంగ్రెస్‌ హయాంలోనూ, ఆ తరవాత కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలోనూ ఈ చట్టాన్ని వినియోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మోదీ హయాంలో ఈ కేసులు మోపడం మితి మీరింది. 2019, 2020లో రికార్డు స్థాయిలో దేశద్రోహ కేసులు మోపారు. 

విచిత్రం ఏమిటంటే నిరసన ప్రదర్శనలు చేసిన వారి మీద, సామాజిక మాధ్యమాలలో సందేశాలు పంపిన వారి మీద, ప్రభుత్వానికో, నిర్దిష్ట చట్టాలకో వ్యతిరేకంగా నినాదాలు చేసినవారి మీద, కడకు వ్యక్తిగతంగా పంపుకున్న సందేశాల మీద కూడా దేశ ద్రోహ చట్టాన్ని ప్రయోగించారు. ఉదాహరణకు ఓ క్రికెట్‌ మ్యాచ్‌ లో పాకిస్తాన్‌ గెలిచినందుకు ముగ్గురు కశ్మీరీ యువకులు గత ఏడాది అక్టోబర్‌ లో అభినందన సందేశాలు పంపితే కూడా ఆగ్రాలో దేశ ద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేశారు. విజయం సాధించింది మనకు కిట్టని దేశమే కావచ్చు. కానీ విజయం సాధించినందుకు సంబరపడడం ఏ రకంగా దేశద్రోహం కిందకు వస్తుందో తెలియదు. ఈ చట్టం వ్యవహారం అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. 2021 జులైలో ఎన్‌.వి.రమణ ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్నప్పుడు ఎడిటర్స్‌ గిల్డ్‌ కేసు దాఖలు చేస్తే సుప్రీంకోర్టు ఈ చట్టం మీద విమర్శలు చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత ఈ చట్టం అవసరమా అని ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే చట్టంచెల్లదని చెప్పలేదు. దీన్ని పునస్సమీక్షించాలని కోరింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని మోదీ ప్రభుత్వం మరో సారి ఈ అంశాన్ని లా కమిషన్‌ కు నివేదించింది. ఆ కమిషనేమో సవరించాలని సూచించడంతో పాటు శిక్ష మరింత పెంచాలని సిఫార్సు చేయడం దారుణం. వెరసి లా కమిషన్‌ ప్రజాస్వామ్య హననానికి మోదీకి మరో ఆయుధం అందించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124 ఎ ను దేశద్రోహ చట్టం అంటారు. దీనికి ఇచ్చిన నిర్వచనమూ స్పష్టంగానే ఉంది. ప్రభుత్వం మీద ద్వేషం పెంచడం, జనాన్ని హింసకు పాల్పడాలని రెచ్చగొట్టడం దేశద్రోహం కింద లెక్క. ఈ పని మాటల్లో కానీ, రాతలో కానీ చేసినా దేశద్రోహమే అవుతుంది. అయితే ఈ నిర్వచనాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమకు అనువుగా మలుచుకుని విచ్చలవిడిగా దేశద్రోహ కేసులు మోపుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం నిరసన తెలియజేసినప్పుడు ఈ చట్టాన్ని బాహాటంగా దుర్వినియోగం చేశారు. ఇలా మోపిన కేసుల్లో జనాన్ని ప్రభుత్వంపై తిరగబడమని కానీ, ప్రభుత్వాన్ని పడదోయమని కానీ, హింసను ప్రేరేపించిన సందర్భాలు కానీ నామ మాత్రంగా కూడా లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే 1948లో దేశద్రోహం అనే మాటను రాజ్యాంగం నుంచి తొలగించారు. రాజ్యాంగ నిర్ణాయక సభలో ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. 19(1)(ఎ) అధికరణం కింద రాజ్యాంగం నిర్నిబంధమైన వాక్‌ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ అప్పుడూ దేశద్రోహ చట్టాన్ని అలాగే ఉంచేశారు. ఈ కేసుల్లో 3.3శాతం సందర్భాలలో మాత్రమే శిక్ష పడు తోంది. ఈ లోగా ప్రభుత్వానికి కిట్టని వారి నోళ్లు నొక్కేస్తున్నారు. వారు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. పౌరసత్వం సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు 3, 754 మంది మీద 25 దేశద్రోహ కేసులు మోపారు. ఇందులో గుర్తించింది 96 మందిని మాత్రమే. మిగతా వారు ఎవరో కూడా ప్రభుత్వానికి తెలియదు. జార్ఖండ్‌ లో పాతాళ్‌ గడి ఉద్యమ సమయంలో 2018లో వందలాది మంది ఆదివాసీలు ఈ చట్టానికి బలయ్యారు. ఇంత కిరాతకమైన చట్టాన్ని రద్దుచేయడానికి బదులు మరింత కఠినతరం చేయాలనుకోవడం కరడుగట్టిన నిరంకుశ లక్షణమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img