Friday, August 19, 2022
Friday, August 19, 2022

ధనమార్గ పాలన

ప్రజాస్వామ్యం వ్యవస్థల్లో న్యాయమార్గ పాలనకు ఆదరణ ఉంటుందని, ఉండాలని ఆశిస్తాం. కానీ ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాల్లో న్యాయమార్గ పాలన స్థానాన్ని ధన మార్గ పాలన ఆక్రమిస్తోంది. అంటే చట్టబద్ధమైన పాలన కొనసాగడానికి బదులు డబ్బెవరి గుప్పెట్లో ఉంటే పరిపాలనా వారి గుప్పెట్లోనే ఉంటోంది. లేదా పరిపాలనాధికారం ఉన్న వారు సంపన్నుల గుప్పెట్లో బందీలైపోతున్నారు. ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనాల స్థానాన్ని మార్కెట్‌ ఆక్రమించినప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్య వ్యవస్థ, ప్రభుత్వం, న్యాయ మార్గ పాలన మొదలైనవన్నీ డబ్బుకు లోకం దాసోహం అన్న రీతిలోనే ఉంటాయి. అధికారంలో ఉండే పెట్టుబడిదారి అనుకూల పార్టీలు నియతంగా జరిగే ఎన్నికలలో ప్రజాభీష్టానుసారం మారడమే ప్రజాస్వామ్యం అన్న భావన ప్రజలకు కలిగించేట్టు సంపన్న వర్గాల వారు అనేక రీతుల్లో ప్రయత్నిస్తారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రభుత్వాలు మారడమే ప్రజాస్వామ్యం అన్న భ్రమ ప్రజలకు కల్పిస్తుంటారు. ఈ భ్రమలో ఉన్న ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు తమకు నచ్చని ప్రభుత్వాన్ని గద్దె దించే అధికారం తమకు ఉందని మురిసి పోతుంటారు. అధికారం అంతిమంగా సంపన్న వర్గం చేతుల్లోనే ఉంటుందని సామాన్య ప్రజలే కాదు రాజకీయ పార్టీలు కూడా గుర్తించలేని స్థితిలో పడిపోతాం. కోటీశ్వరులు రాజకీయ పార్టీలకు అపారంగా నిధులు సమకూర్చడం వారి దయా గుణానికి ప్రతీక కాదు. అది తాము గెలిపించదలచుకున్న రాజకీయ పార్టీలో పెట్టే పెట్టుబడి. పెట్టుబడి పెట్టిన ఆసామీ ఎవరైనా లాభాపేక్షతోనే ఆ పని చేస్తారు. ధనబలం మాత్రమే రాజకీయాలను శాసించడం లేదు. గొప్ప ప్రజాస్వామ్య దేశాలు అనుకునే అమెరికాలాంటి చోట కూడా అధ్యక్ష ఎన్నికల్లో ధనబలం వికృత రూపంలో బహిర్గతం అవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షులుగా ఎన్నికయ్యే వారు ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఉంటారు. అంతకు ముందు వారికి రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండదు. వారి తరఫున డబ్బు వెదజల్లే వారు ఉంటే చాలు. ఇలా డబ్బు వెదజల్లే వారి లక్ష్యాలు ఒకే రకంగా ఉండకపోవచ్చు. వారిలోనూ ఆధిపత్య పోరు ఉండొచ్చు. ఎవరి ఆధిపత్యం ఎక్కువ ఉంటే వారు ప్రోత్సహించిన అభ్యర్థే అమెరికాలో అధ్యక్షుడు అయి పోతూ ఉంటాడు. మన దేశంలోనూ దాదాపు అదే పరిస్థితి. సంపన్నుల వర్గ స్వభావంలో తేడా ఉండదు కాని స్వప్రయోజనాలే వారిని నడిపిస్తాయి. పాలకవర్గాలను ఏ పక్షం బాగా ఆశ్రయించగలిగితే ఆ పక్షానిదే పెత్తనం అవుతుంది. ఉదాహరణకు మన దేశంలో ఒకప్పుడు అంబానీలు వెనక ఉండి కాంగ్రెస్‌ రాజకీయాలను నడిపించారు. కాంగ్రెస్‌ మీద ఆదరణ తగ్గుతోందని భావించినప్పుడు చడీచప్పుడూ లేకుండా అంబానీలు బీజేపీ పంచన చేరిపోయారు. అంతే రాజకీయ సమీకరణలూ మారిపోయాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. కు అధికారం దక్కింది. మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత క్రమంగా ఆర్థిక రంగంలో అదానీ పాత్ర పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో సైతం అంబానీలకన్నా అదానీ ఆధిపత్యమే ఎక్కువ. ప్రపంచ కుబేరుల్లో బిల్‌ గేట్స్‌ను వెనక్కు నెట్టేసే స్థాయికి అదానీ చేరడానికి కారణం మోదీ అండ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్నే ఆర్థిక పరిభాషలో ఆశ్రిత పక్షపాత ఆర్థిక విధానం అంటారు. ఈ ఆశ్రిత అన్న మాట రాజకీయాలకూ వర్తిస్తుంది. మోదీ, అదానీ పరస్పరాశ్రితులని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
వ్యాపార వర్గాల వారు రాజకీయ పార్టీలకు పెట్టుబడులు ఎందుకు సమకూరుస్తారో గ్రహిస్తే అధికార పక్షాలు ఎలాంటి ఆర్థిక విధానాలు అనుసరిస్తాయో సులువుగా అర్థం అవుతుంది. ప్రభుత్వ రంగంలోని థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాలతో సహా బొగ్గు వినియోగించే సకల సంస్థలూ నిర్బంధంగా దిగుమతి చేసుకున్న బొగ్గు కనీసం పది శాతం వాడాలన్న నిబంధన ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది. బొగ్గు దిగుమతి, ఓడ రేవులు మొదలైనవి అదానీ గుప్పెట్లో ఉన్నాయి. అదానీల రుణం తీర్చుకోవడానికి అనువైన విధానాలను బీజేపీ రూపొందిస్తుంది. ధన ప్రభావంతో ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతాయి. అందుకే మైనారిటీల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం, మైనారిటీల ప్రయోజనాలకూ పూచీ పడడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత అన్న అంశాన్ని చాపకిందకు తోసేస్తుంటారు. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహిస్తే పౌరహక్కుల కోసం పాటుపడే, 2002 నాటి మారణకాండ దోషులకు శిక్ష పడేట్టు చేయడానికి దీక్షాబద్ధురాలైన తీస్తా సెతల్వాడ్‌ను ఎందుకు జైలులో పెడ్తారో అర్థం అవుతుంది. మతాల మధ్య చిచ్చు రేపే వ్యాఖ్యలు చేసే బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న నూపుర్‌ శర్మ ఎందుకు అరెస్టు కారో, జుబేర్‌ను కటకటాల వెనక్కు ఎందుకు తోస్తారో అర్థం అవుతుంది. నూపుర్‌ శర్మను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తుంది కానీ చట్ట ప్రకారం ఆమె మీద చర్య తీసుకోదు. కానీ ప్రభుత్వాన్ని నిలదీసే, లేదా వాస్తవాన్ని ప్రజల దృష్టికి తెచ్చే జుబేర్‌ లాంటి వారికి బెయిలు రావడం ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం అవుతాయి. ప్రస్తుత ప్రభుత్వాలు పరిపాలించడంతో సంతృప్తి పడవు. ప్రజల అభిరుచులు ఎలా ఉండాలో, ఎలాంటి భావాలు ఉండాలో, ఆలోచనలు ఏ రీతిలో సాగాలో కూడా నిర్దేశిస్తాయి. ఈ పద్ధతి ద్వారానే రాజకీయ వ్యవస్థ పెట్టుబడిదార్లకు ఊడిగం చేసేట్టు మార్చడానికి అనువైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రభుత్వాలే నెత్తికెత్తుకుంటాయి. ప్రజలు తాము దుర్భర జీవితం గడుపుతున్నామన్న నొప్పి తెలియకుండా ఉచితాలు వెదజల్లుతుంటారు. ఇది ప్రజా చైతన్యాన్ని నిద్రాణంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. చివరకు దోపిడీకి గురవుతూ హక్కులు కోల్పోతున్న ప్రజలే దేశం కోసం ఈ మాత్రం త్యాగం చేయక తప్పదు అన్న పాలక పక్ష బాణీని బహిరంగంగా కచేరీలు పెట్టి ఆలపించే స్థితికి దిగజారతారు. ఈ స్థితిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడడం అంటే అది కచ్చితంగా పెట్టుబడిదారీ విధాన వ్యతిరేక పోరాట రూపం తీసుకుంటేనే ప్రయోజనం. లేకపోతే ఏ పోరాటమైనా తాటాకు మంటలా ఉవ్వెత్తిన ఎగసిపడి చప్పున చల్లారి పోతుంది. కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేయడాన్ని నివారించే దిశలో ప్రజా పోరాటాలు రూపాంతరం చెందితే తప్ప ప్రజాస్వామ్యానికి రక్షణ ఉండదు. సమానత్వం, పౌర హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సెక్యులరిజం, శాస్త్రీయ దృక్పథం లాంటి మాటలన్నీ రాజ్యాంగం పుటల్లో భద్రంగా ఉంటాయి తప్ప ఆచరణలోకి రావు. అన్ని స్థాయిల్లో పెట్టుబడిదారీ వ్యతిరేక స్వరూపం సంతరించుకున్నప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సఫలమవుతుంది. అంతవరకు నినాద ప్రాయంగా మిగిలిపోతుంది. తమ మనుగడ కోసం ప్రజలు ప్రజాస్వామ్యాన్ని సంస్కరించే విధానం ఏమిటో నిర్ణయించుకోగలగాలి. పెట్టుబడిదారీ విధానంపై తిరగబడగలగాలి. ప్రజా పోరాటాలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కుదరదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img