Friday, March 31, 2023
Friday, March 31, 2023

నడిసంద్రంలో ఆశాజ్యోతి

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కనక నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రతిపాదించిన ఆఖరి బడ్జెట్‌లో కనీసం ఓట్లు రాబట్టుకునే ఆశతో అయినా ఆరోగ్యం, విద్య లాంటి రంగాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తారన్న ఆశకూడా అడియాసే అయింది. ఈ రెండు కీలక రంగాలనైనా మోదీ సర్కారు పట్టించుకోవడం లేదని రూఢ అయిపోయింది. గత ఏడాది బడ్జెట్‌లో మొత్తం బడ్జెట్‌ రూ.39.45 లక్షల కోట్లు అయితే, అందులో 2.19శాతం ఆరోగ్య రంగానికి కేటాయించారు. అప్పుడు మొత్తం రూ.86,606 కోట్లు కేటాయించారు. ఈ సారి రూ.88,956 కోేట్లు కేటాయించడం ఆరోగ్య రంగానికి నిధులు పెంచినట్టు భ్రమ కలుగుతుంది. ఈ ఏడాది మొత్తం బడ్జెట్‌ 45 లక్షల కోట్లు ఉంటే అందులో 1.97 శాతం మాత్రమే ఆరోగ్య రంగానికి కేటాయించారు. ద్రవ్యోల్బణం పెరిగినా కిందటి సంవత్సరంతో పోలిస్తే 0.22 శాతం తక్కువ నిధులు మాత్రమే దక్కాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌ కు సైతం కేవలం 0.21 శాతం కేటాయింపు మాత్రమే పెరిగింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున కనీసం ఆ మేరకైనా కేటాయింపులు పెరగడం లేదు. మోదీ ప్రభుత్వం ఎంతసేపూ డిజిటలీకరణ గురించే మాట్లాడుతుంది. ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలను పెంచడం గురించి కానీ, డాక్టర్ల నియామకాన్నిగానీ పట్టించుకోలేదు. మౌలిక సదుపాయాలు పెరగనిదే డిజటలీకరణవల్ల మేలు ఎలా కలుగుతుందో తెలియదు. స్థూలజాతీయోత్పత్తిలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు కనీసం 5 శాతం అయినా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక సంవత్సరాలుగా చెప్తూనే ఉంది. కానీ మోదీ ప్రభుత్వం మునుపటి ప్రభుత్వాలకన్నా ఆరోగ్య రంగం మీద తీసుకున్న శ్రద్ధ ఏమీ లేదు. ఆరోగ్యం కోసం ప్రజలు వెచ్చిస్తున్న మొత్తంలో 159 దేశాల జాబితాలో మనం 154వ స్థానంలో ఉన్నాం. ఆ హీన స్థితినుంచి ఎదగడానికి ఆరోగ్యం కోసం మరిన్ని నిధులు అవసరమని మోదీ సర్కారు గ్రహించనే లేదు. అందరికీ వర్తించే ఆరోగ్య బీమాలాంటి సదుపాయాలు ఏమీ లేనందువల్ల పేదలు, ముఖ్యంగా షెడ్యూల్‌ తరగతులవారు, షెడ్యూలు తెగలవారు ఆరోగ్యం కోసం అతి తక్కువ ఖర్చు మాత్రమే పెట్టగలుగుతున్నారు. ముస్లింల కన్నా హిందువుల పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. దీనికీ ముస్లింలలో పేదరికం ఎక్కువ ఉండడమే కారణం. సదుపాయాలలో తేడా కారణంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికన్నా పట్టణవాసులు ఆరోగ్యం కోసం పెట్టగలిగే ఖర్చు కొద్దిగా మెరుగ్గాఉంది. డాక్టర్ల సంఖ్య, వైద్య సిబ్బంది సంఖ్య పెంచకపోవడం అటుంచి ఆరోగ్య కార్యకర్తల, ఆశా కార్యకర్తల, అంగన్‌వాడీ కార్యకర్తలకు సరైన గుర్తింపు కూడా లేదు. కనీసం వారిని ఆరోగ్యరంగంలో పనిచేస్తున్న కార్మికులలా కూడా పరిగణించడం లేదు. పోషకాహారలోపాన్ని సరిదిద్దడానికి మునుపటి సంవత్సరం రూ.37,000 కోట్లు కేటాయిస్తే ఈ సారి వెయ్యి కోట్ల కోతపెట్టి రూ.27,000 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనివల్ల అణగారినవర్గాల వారి పోషకాహారలోపం సరిదిద్దడం నినాద ప్రాయం అవుతుంది. అదే రీతిలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కిందటేడాది కేటాయించిన రూ.89,400 కోట్లే చాలదనుకుంటే ఈ సారి రూ.60,000 కోట్లే దక్కాయి. ఈ పథకానికి తక్కువ డబ్బు కేటాయిస్తే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఈ పథకాన్ని యుపీఏ సర్కారు ప్రారంభించింది కనక మోదీ ప్రభుత్వం ఎప్పుడూ దీన్ని చిన్న చూపే చూస్తోంది. అలాగే గ్రామీణాభివృద్ధికి పోయిన సంవత్సరం రూ.2,43,317 కోట్లు ఇస్తే ఈ సారి అదీ రూ.2,38,204 కు దిగజారింది. దీన్నిబట్టి గ్రామీణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏ పాటిదో రుజువు అవుతోంది. ఉపాధి తగ్గడం అంటే పోషకాహారం తగ్గడమే. అలాంటప్పుడు ఆరోగ్య సూచీలో పెరుగుదల ఆశించలేం. గ్రామీణ ఉపాధిహామీ వల్ల పేదరికం మటుమాయం అవుతుందని కాదు. కనీసం ఏడాదికి వంద రోజుల పని దొరికే అవకాశమైనా ఉండేది. నిధుల కోతతో ఆ ఆశా కురచనవుతుంది.
మరో వేపు మనసు ఉంటే మార్గం ఉంటుందని కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం నిరూపిస్తోంది. 2020-21లో కేరళలో స్థూల జాతీయోత్పత్తి నాసిరకంగా ఉండేది. అది మైనస్‌ 0.8 శాతం ఉండేది. కానీ 2021-22 వచ్చే సరికి అభివృద్ధి రేటు స్థూల జాతీయోత్పత్తిలో 12.01 శాతానికి చేరింది. 2012-13 నుంచి ఇప్పటిదాకా అభివృద్ధిరేటులో పెరుగుదల ఇంతగా ఎప్పుడూ లేదు. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించినప్పుడు కేరళ ప్రభుత్వం కీలక రంగాల అభివృద్ధి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ప్రాథమిక రంగంలో వృద్ధి రేటు 2020-21లో 0.79 శాతం ఉంటే 2021-22 లో అది 4.16 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో వ్యవసాయ రంగాభివృద్ధి సైతం 0.24 శాతం నుంచి 4.64 శాతానికి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటుకన్నా మూడు శాతం ఎక్కువ. చేపలు, రొయ్యల పెంపకం అయితే ఏకంగా 30.1 శాతం పెరిగాయి. పంటల విషయంలో 3.63 శాతం ఎదుగుదల కనిపించింది. 2020-21లో పారిశ్రామిక రంగ అభివృద్ధి మైనస్‌ 2.82 ఉంటే 2021-22 లో అది 3.9 శాతానికి చేరుకుంది. పాఠశాల విద్యారంగంలో కేరళ గణనీయమైన ఎదుగుదల నమోదు చేసింది. గత అయిదేళ్ల కాలంలో ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పనిచేసే పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారిసంఖ్య 8,16,929కి చేరింది. అన్నివర్గాల వారికి సమానా వకాశాలు, ఉచిత ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, ప్రయాణ ఖర్చులు, వసతి గృహ సదుపాయాలు, పిల్లలను విహార యాత్రలకు తీసుకెళ్లడం మొదలైన వాటివల్ల ప్రభుత్వం విద్యారంగాన్ని గణనీయంగా మెరుగుపరచింది. కంటిచూపు లేని బాలలకోసం వినడానికి అవకాశం ఉన్న పుస్తకాలు రూపొందించింది. వినికిడి సమస్య ఉన్న వారికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజారోగ్య రంగంలో అందరికీ ఆరోగ్య సదుపాయాలు సమానంగా, చౌక ధరలకు అందించడం కేరళ ప్రత్యేకత. అందుకే ఆరోగ్య సూచికలు కేరళలో మెరుగ్గా ఉన్నాయి.
శిశుమరణాల సంఖ్య జాతీయ స్థాయిలో సగటున 28 అయితే కేరళలో ఆరు శాతం మాత్రమే. ప్రసవ సమయంలో మరణాలు జాతీయ స్థాయిలో 97అయితే కేరళలో 19మాత్రమే. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన కోసం కేరళ ప్రభుత్వం ఆర్ద్రం మిషన్‌ కార్యక్రమం ప్రారంభించింది. ఇ-హెల్త్‌ పథకం కింద కేరళలో 2,59,55,975 మందికి సంబంధించిన సమాచారం సేకరించి దాన్ని ఎలక్ట్రానిక్‌ రికార్డుల్లో భద్రం చేశారు. 68,34,845 ఇళ్ల నుంచి ఈ సమాచారం సేకరించారు. అభివృద్ధి, పురోగతి కోసం ఉన్నత విద్య ప్రాధాన్యతను కేరళ గుర్తించినట్టుగా మరే రాష్ట్రమూ గుర్తించలేదు. ఉన్నత విద్య పెంపొందితేనే విజ్ఞానాధారిత సమాజం ఏర్పడుతుంది. విద్యా ప్రమాణాలు పెంచడం, పాఠశాలల్లో చేరే వారి సంఖ్య అత్యధికంగా ఉండేట్టు చూడడం, ఉన్నత విద్యారంగంలో అత్యంత ఆధునిక సాంకేతిక సహాయం అందించడంలో వామపక్ష ప్రభుత్వం కేరళను అద్వితీయంగా దిద్దితీర్చింది. నడిసంద్రంలో కేరళ ఆశాజ్యోతిలా వెలిగి పోతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img