Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

నడ్డి విరుస్తున్న పేదరికం

మన దేశం పేదది కాదు, ప్రజలే పేదలు అన్న మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ప్రజలు పేదలుగా ఉన్నంత కాలం దేశం పేదది కాకుండా ఎలా పోతుంది అన్న ప్రశ్న ఎవరి మదిలోనైనా మెదలుతుంది. కానీ మన దేశంలోని పరిస్థితినిబట్టి పేద ప్రజలు అపారంగా ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు నూటికి 70 మంది పేదలున్నారని అంచనా. ఆ తరవాత 75 ఏళ్ల తరవాతా 30 శాతం మంది పేదరికంలోనే కునారిల్లిపోతున్నారు. ఓ పదేళ్ల కాలంలో 27 కోట్ల 30 లక్షల మంది పేదరికం నుంచి బయట పడిన మాటా వాస్తవమే. 2011లో దేశంలో నిరుపేదలు జనాభాలో 22.5 శాతం ఉంటే 2019కల్లా వారి సంఖ్య 10.25 శాతానికి తగ్గడం ఆనందదాయక మైందే అనుకోవచ్చు. కానీ కరోనా కష్ట కాలంలో పేదరికంలోకి జారుకున్న మొత్తం ప్రపంచ జనాభాలో మన దేశంలోనే అలాంటి వారు 80 శాతం మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు క్రోడీకరించిన లెక్కల్లో తేలింది. కరోనా కాటేయక ముందు దేశంలో ఆరున్నర కోట్ల మంది నిరుపేదలున్నారనేది మరో అంచనా. కానీ కరోనా మహమ్మారి ప్రభావంవల్ల నిరుపేదల సంఖ్య 10 కోట్ల నుంచి 12 కోట్ల దాకా పెరిగిందనేది వాస్తవం. మొత్తం ప్రపంచంలో ఏడు కోట్ల మంది కరోనా కాటుకు పేదరికంలోకి జారుకుంటే అందులో 5.6 కోట్ల మంది మన దేశవాసులే. దీన్నిబట్టి పేదరికంలో మనదే అగ్రస్థానం అని రూఢ అవుతోంది. కరోనాను అదుపు చేయడంలో అద్భుతాలు సృష్టించామని మోదీ సర్కారు ఎంత బాకా ఊదినప్పటికీ వాస్తవ పరిస్థితి అత్యంత నిరాశాజనకంగానే కాదు, భయానకంగా మారుతోంది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా నిరుపేదలు 8.4 శాతం ఉంటే కరోనా మహమ్మారి కారణంగా నిరుపేదల సంఖ్య 2020లో 9.3 శాతానికి చేరింది. అంటే విశ్వవ్యాప్తంగా పేదరిక నిర్మూలనకు జరుగుతున్న కృషి కరోనా వల్ల మరింత అద్వాన స్థితికి దిగజారింది. ఈ కాలంలో పెరిగిన పేదలు ఏడు కోట్ల మంది. దీనితో ప్రపంచ పేదలు 70 కోట్లకు చేరారు. 2022 నాటి పేదరికం, సంపదలో వాటా: సరిదిద్దే మార్గాలు అని ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదికలో ఈ భయానక వాస్తవాలు వెలికి వచ్చాయి. అయితే భారత్‌లో పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రపంచ బ్యాంకుకు అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. 2011 నుంచి భారత ప్రభుత్వం పేదరికానికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించడం మానేసింది. అందువల్ల ప్రపంచ బ్యాంకు ఇతర మార్గాల ద్వారా అందిన సమాచారం ఆధారంగా కరోనా వల్ల ప్రపంచంలోనూ, భారత్‌ లోనూ పేదరికం ఏ మేరకు పెరిగిందో అంచనా వేయడానికి ప్రపంచ బ్యాంకు ప్రయత్నించింది. అధికారిక సమాచారం అందుబాటులో లేనందువల్ల సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సి.ఎం.ఐ.ఇ. – భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలించే వ్యవస్థ) సేకరించిన సమాచారాన్ని, కన్స్యూమర్‌ పిరమిడ్స్‌ హౌజ్‌ హోల్డ్‌ సర్వే (సి.పి.హెచ్‌.ఎస్‌.) సమాచారాన్ని వినియోగించుకుని కరోనా కారణంగా పేదలైపోయిన ప్రపంచ పేదల్లో భారత్‌లోనే 80 శాతం మంది ఉన్నారని తేల్చింది.
పేదరికానికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిరచడం ఆపేసిన పదకొండేళ్ల కాలంలో ఎనిమిదేళ్ల నుంచి మోదీ సర్కారే అధికారంలో ఉంది. కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో చేశామని, టీకాలు వేయించడంలో ప్రపంచ రికార్డు మనదేనని మోదీ సర్కారు ప్రచార బాకా నిరంతరం కొనసాగుతూనే ఉంది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు కూడా యథాశక్తి పాటు పడుతుంటాయి. సమాచారం అరకొరగా ఉన్నప్పుడు పేదరిక నిర్మూలనకు అనుసరించవల సిన మార్గాలు కూడా కుంచించుకుపోతాయి. పేదరికం మన దేశంలోనూ నెమ్మదిగానైనా తగ్గుతోంది. అయితే కరోనా పేదలనే గట్టిగా కాటేసింది. గ్రామీణ ప్రాంతాలలో పేదరికం తగ్గుముఖం పడ్తోంది. అయితే ఈ తగ్గుదల అంచనాలను ఎందుకూ కొరగాకుండా చేసింది. సహజంగానే కరోనావల్ల పేదల ఆదాయం బాగా తగ్గిపోయింది. మరో వైపరీత్యం ఏమి టంటే కరోనా కాలంలోనూ సంపన్నులు మరింత సంపన్నులు అయి పోవడం మాత్రం ఆగలేదు. పైగా అనూహ్యమైన లాభాలు నొల్లుకున్నారు. అదానీ ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకోవడమే దీనికి నిదర్శనం. 2030కల్లా పేదరికాన్ని నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్య నిర్దేశం చేసింది. ఇక ఎనిమిదేళ్లైనా మిగలలేదు కనక పరిస్థితి ఎంత మాత్రం దానికి అనుగుణంగా కనిపించడం లేదు. పేదరిక విపత్తు నుంచి గట్టెక్కడానికి ప్రపంచ బ్యాంకు కొన్ని సూచనలు కూడా చేసింది. సబ్సిడీల మీద కాకుండా పేదలు నిలదొక్కుకునే రీతిలో ప్రభుత్వ వ్యయం ఉండాలన్నది అందులో ప్రధానమైన సూచన. దీర్ఘకాలిక అభివృద్ధి మీద దృష్టి నిలపాలన్నది రెండవ హితవు. అంటే ప్రభుత్వ వ్యయం దీనికి అనువుగా ఉండాలి. ఎన్నికల్లో విజయం మీద దృష్టితో తాయిలాల మీద ఉన్న ఆసక్తి మరి దేని మీదా ఏ ప్రభుత్వానికీ లేదు కనక దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుందనుకోలేం. ఎడాపెడా తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకున్న మోదీ, ఆ మాటకొస్తే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడానికి కాళ్లీడుస్తున్నాయి. అసలైన అభివృద్ధి ప్రసక్తి వచ్చేటప్పటికి ప్రభుత్వ బొక్కసం ఒట్టి పోతోంది. వస్తు సేవల పన్ను (జి.ఎస్‌. టి.) గురించి ఎన్ని మాటలు చెప్పినా అది పరోక్ష పన్ను కనక, జి.ఎస్‌.టి. సకల వస్తువులకూ వర్తిస్తుంది కనక పేదలపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. పేదల జేబులు ఖాళీ చేయని రీతిలో పన్నులు విధించడం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో కుదిరే పని కాదు. 60 నెలలు అధికారం ఇస్తే మంత్ర దండం ప్రయోగించి సకల సమస్యలు అంతం చేస్తానన్న మోదీ ఇప్పుడు 2047 దాకా ఆగండి అంటున్నారంటే ఆ మాట ఎంత బూటకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసమానతలు విపరీతంగా పెరుగుతున్నా పట్టించు కునే ఓపిక, శ్రద్ధ మోదీ సర్కారులో ఎంత మాత్రం కనిపించడం లేదు. పేదలు, నిరుపేదలను కలిపి లెక్క వేస్తే మన దేశంలో 40 కోట్ల మంది పేదలుగానే మిగిలిపోయారు. ప్రపంచంలో నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. మానవాభివృద్ధిలో మనం 131వ స్థానంలో కడగొట్టున మిగిలాం. అయిదేళ్ల లోపు బాలల్లో ఎదుగూ బొదుగూ లేదు. నిరుద్యోగం వికటాట్టహాసం చేస్తోంది. ఈ లెక్కన మోదీ నమ్మబలుకుతున్నట్టు 2047 నాటికైనా పేదల పరిస్థితి బాగుపడుతుందని నమ్మలేం. అదానీ లాంటి వారు అత్యంత సంపన్నుల్లో అగ్ర స్థానం అందుకోవడం ఖాయం అంటే సునాయాసంగా నమ్మొచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img