Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

నిండా పది నెలలు

దిల్లీ సరిహద్దుల్లో గత సంవత్సరం నవంబర్‌ 26న మొదలైన రైతుల ఆందోళన నేటికి అంటే 2021 సెప్టెంబర్‌ 26 నాటికి పది నెలలు పూర్తి అయింది. ఇంతవరకు రైతుల ఉద్యమస్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. అవసరమైతే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలదాకా ఉద్యమం కొనసాగించడానికి రైతు సంఘాల నాయకులు సిద్ధంగాఉన్నారు. రైతులు కోరుతున్నట్టుగా వివాదా స్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడానికి సిద్ధంగా లేమని కేంద్ర ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. ఈ చట్టాల్లో అవసరమైతే మార్పులు చేయడానికి అభ్యంతరం లేదని మోదీ ప్రభుత్వం పైపై మాటలు చెప్తోంది. కానీ అసలు డిమాండును పట్టించుకోవడం లేదు. ఒక రకంగా ఇది ప్రతిష్ఠంభనే. ప్రతిష్ఠంభనకు కారణం ప్రభుత్వ వైఖరే. గత ఏడాది సెప్టెంబర్‌ ఆఖరులో పార్లమెంటు లోపల ప్రతిపక్షాల, వెలుపల రైతుల ప్రతిఘటనల మధ్య బీజేపీ ప్రభుత్వం తనకు ఉన్న మెజారిటీ ఆసరాగా మూడు వివాదాస్పద చట్టాలకు పార్లమెంటు చేత ఆమోద ముద్ర వేయించుకుంది. హడావుడిగా గత ఏడాది సెప్టెంబర్‌ 27న రాష్ట్రపతి ఈ బిల్లులపై సంతకాలు కూడా చేసేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌ 11 విడతలు చర్చలు జరిపారు. ఇవీ ప్రహసన ప్రాయమే. ఆఖరి దఫా చర్చలు ఈ ఏడాది ఆరంభం జనవరిలో జరిగాయి. ఆ తరవాత ప్రభుత్వం చర్చల ఊసే లేదు. ప్రధానమంత్రి ఈ సమస్యపై నోరు విప్పిన పాపాన పోలేదు. రైతులు ఒక్క ఫోన్‌ చేస్తే చాలు ప్రభుత్వం చర్చలకు సిద్ధం అని ప్రధాని ఓ వాగ్దానం విసిరారు. రైతులు నేరుగా ప్రధానికే లేఖ రాసినా దానికి సమాధానం లేదు. చర్చలకు ఆసక్తి చూపనూ లేదు. ఎండ, వాన, చలి లాంటి ప్రకృతి మార్పులను భరించి రైతులు కొనసాగించిన ఈ ఆందోళనా క్రమంలో ఆరు వందలమందికి పైగా రైతులు వివిధ కారణాలవల్ల ప్రాణాలువదిలారు. వారి కుటుంబాలను పరామర్శించాలన్న ధ్యాసే ప్రధాన మంత్రికి లేదు. గత ఏడాది జనవరి 26వ తేదీన దిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించడానికి న్యాయస్థానం అనుమతించింది. ఆ ర్యాలీలో ప్రభుత్వ ఏజెంట్లు దూరి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడి ఆందోళన మీద వ్యతిరేక భావం సృష్టించాలని ప్రయత్నించారు. ఎర్రకోట వద్ద గత జనవరి 26వ తేదీన జరిగిన సంఘటనలను ప్రభుత్వం ఉద్యమంపై ఏహ్య భావం కలిగించదానికి ఉపయోగించుకుంది. అందువల్ల ట్రాక్టర్ల ర్యాలీకి విఘాతం కలిగించిన వారి వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సార్లు ఛద్మ వేషాల్లో విద్రోహులు చేరి ఉద్యమంపై విముఖత కలిగించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం ఇలాంటి ఆకతాయిల మీద చట్టప్రకారం చర్య తీసుకున్న దాఖలాలే లేవు. జనవరి దుర్ఘటనల నేపథ్యంలో రైతులు పార్లమెంటు ముట్టడి ప్రతిపాదనను వాయిదా వేసుకుని ప్రశాంతంగా గాంధేయ పద్ధతుల్లో మాత్రమే ఆందోళన కొనసాగించాలన్న తమ నిబద్ధత చాటుకున్నారు. ఈ పది నెలల కాలంలో రైతుల ఉద్యమ శిబిరాలను సందర్శించాలన్న ఆలోచనైనా ప్రధానికి రాలేదు. అసలు వారి బాధేమిటో ప్రత్యక్షంగా విని తరవాత పరిష్కారం గురించి ఆలోచించాలన్న ధ్యాస కూడా ఆయనకు లేదు. దీన్నిబట్టి రెండు అంశాలు స్పష్టం అవుతున్నాయి. ఒకటి: ఈ వివాదాస్పద చట్టాలను ఇంతగా వ్యతిరేకించ డానికి రైతులకు బలమైన కారణం ఉంది. రెండు: ఈ చట్టాలను వెనక్కు తీసుకుపోవడానికీ ప్రభుత్వ మొండి వైఖరికీ అంతే బలమైన కారణాలున్నాయి. ఈ చట్టాలు అమలైతే తమ భూమి, పండిరచే పంట తమ చేతుల్లోంచి కార్పొరేట్ల హస్తగతం అవుతుందన్నది రైతుల బాధ. సరిగ్గా ఈ కారణం చేతే ప్రభుత్వం చట్టాలను వెనక్కు తీసుకోవడానికి నిరాకరిస్తోంది. కార్పొరేట్లకు సర్వమూ దోచి పెట్టే విధానాలు అనుసరించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆందోళనా క్రమంలో మొదట్లో కేంద్ర ప్రభుత్వం కూడా లాఠీ చార్జీలు, జలఫిరంగుల ప్రయోగం లాంటి అలవాటైన దమన నీతిని ప్రయోగించడానికి ప్రయత్నించింది. అయితే రైతుల దృఢ సంకల్పం ముందు ఇవేవీ పని చేయలేదని గ్రహించిన కేంద్రం ఈ బలప్రయోగానికి స్వస్తి చెప్పక తప్పలేదు.
అయితే ఆందోళనలో ప్రధాన భాగం పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రైతులున్నారు. మిగతా ప్రాంతాల రైతులెవరూ లేరని దీని అర్థం కాదు. వారూ తగిన సంఖ్యలోనే ఉన్నా ప్రభుత్వం ఇది ప్రధానంగా పంజాబ్‌, హర్యానా రైతుల ఉద్యమమే అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తోంది. ఒక్క హర్యానా ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మాత్రం రైతుల మీద కత్తి కట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా విరుచుకు పడుతున్నారు. ఇటీవల కర్నాల్‌లో మహా పంచాయత్‌ జరిగినప్పుడు హర్యానా పోలీసులు బలప్రయోగానికి దిగారు. నెత్తురోడేట్టు రైతులను చితకబాదారు. ఒక రైతు గుండె ఆగి మరణించాడు. పది నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా నిజానికి రాకపోకలకు ఏ అడ్డంకీ కల్పించడం లేదు. వాహనాలు వెళ్లడానికి మార్గం వదిలి రోడ్డు అంచున మాత్రమే బైఠాయిస్తున్నారు. రైతుల ఆందోళనను అపఖ్యాతి పాలు చేయడమే బీజేపీ లక్ష్యం కనక ఇప్పుడు హర్యానా ముఖ్యమంత్రి రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని బుకాయిస్తున్నారు. మరి దీనికి పది నెలల సమయం ఎందుకుపట్టిందో తెలియదు. ఇంకో వేపు ఈ ఏడాది జనవరిలోనే ఆందోళనను ఓ కొలిక్కి తేవడానికి ఓ కమిటీని నియమించారు. రైతుల ప్రతినిధులతో మాట్లాడి రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు సూచన అయితే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలనే. వివాదాస్పద చట్టాల అమలును కూడా పక్కన పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఏడాదిన్నరపాటు చట్టాల అమలు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించక తప్పలేదు. ఈ కమిటీలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపీందర్‌ సింగ్‌ మాన్‌, షేట్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాట్‌, వ్యవసాయ ఆర్థిక రంగ నిపుణుడు ప్రమోద్‌ జోషీ, మరో వ్యవసాయ ఆర్థిక నిపుణుడు అశోక్‌ గులాటీ ఉన్నారు. భూపీందర్‌ సింగ్‌ మాన్‌ ఈ కమిటీ నుంచి తప్పుకున్నారు. మిగతా ముగ్గురు సభ్యులు 73 మంది రైతు ప్రతినిధులతో మాట్లాడి గత మార్చిలోనే నివేదిక అందజేశారు. ఈ నివేదికలో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ నివేదిక మీద సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం గానీ తీసుకున్న చర్యా లేదు. దీన్నిబట్టి కమిటీ ఏర్పాటు కాలయాపన కోసమేనని మరోసారి రుజువైంది. ఈ కమిటీ సభ్యుల్లో ఒకరైన అశోక్‌ గులాటి వివాదాస్పద చట్టాలను బాహాటంగా సమర్థించిన వ్యక్తే. రైతుల ఆదోళనకు వివిధ రంగాల నుంచి మద్దతు అందుతోంది. వచ్చే సోమవారం జరగనున్న భారత్‌ బంద్‌ లోనూ ఇది ప్రధానాంశమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img