Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

నిరంతరం ఎన్నికల ధ్యాసే

నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీకి హిందుత్వ సిద్ధాంతాన్ని అమలు పరచడం ఎంత ముఖ్యమో, నిరంతరం ఎన్నికలలో విజయాలు సాధించడం అంతకన్నా ఎక్కువ ప్రధానం. మోదీ హయాంలో ఎన్నికల నిత్యాగ్నిహోత్రం కొనసాగుతూ ఉండవలసిందే. రాహుల్‌ గాంధీ ప్రారంభించిన భారత్‌జోడో యాత్ర భారతీయ జనతాపార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తున్నట్టు ఉంది. నరేంద్రమోదీ నిరంతరం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉంటారు. పార్లమెంటుకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకే తడవ ఎన్నికలు నిర్వహించాలని మోదీ చాలాకాలం నుంచి వాదిస్తూనే ఉన్నారు. అది సాధ్యమయ్యే పనికాదని ఆయనకు తెలియకకాదు. కానీ న్యాయశాఖమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ఉమ్మడి ఎన్నికల రాగమే ఆలపిస్తున్నారు. ఈ ఏడాది ఈశాన్య భారతంలో మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, మిజోరంతో పాటు కర్నాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాను రాను ఎన్నికల కమిషన్‌ ఎన్నికల ప్రచార గడువును కుదిస్తూ ఉంది. మోదీ, ఆయన నాయకత్వంలోని బీజేపీ మాత్రం నిరతరం ఎన్నికల ప్రచారంలోనే తలమునకలై ఉంటున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అని చెప్పుకునే బీజేపీ నిర్మాణమే ఎన్నికల మీద దృష్టితోనే సాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల స్థాయికమిటీలు ఆ పార్టీకి తప్ప మరే పార్టీకీ లేవు. బీజేపీ అక్కడితో కూడా ఆగలేదు. ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీకి ఒక్కొక్క కార్యకర్తను బాధ్యుడిని చేసింది. వారిని పన్నా ప్రముఖ్‌ అంటున్నారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర త్వరలో ముగియనుంది. ఈ దశలో మోదీకి కుడి భుజం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల అంతా వివిధ రాష్ట్రాలలో పర్యటించి కార్యకర్తలను, పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడంలోనే ఉంటారట. అమిత్‌షా ఈ నెలలో మొత్తం 11 రాష్ట్రాలలో పర్యటించనున్నారు. తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడంతోపాటు ఎన్నికలు జరగని రాష్ట్రాలలో కూడా అమిత్‌షా పర్యటించనున్నారు. అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పుడే ప్రచారం మొదలు పెడ్తున్నారు. గురువారం అమిత్‌ షా త్రిపురలో ఆరో తేదీన నాగాలాండ్‌, మణిపూర్‌ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. ఏడో తేదీన ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలలో, ఎనిమిదో తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ఉంటారు. అమిత్‌షా 16న ఉత్తరప్రదేశ్‌లో, 17న బెంగాల్‌లో, 28న కర్నాటకలోని హుబ్లీలో పర్యటిస్తారు. 29వ తేదీన హర్యానా పంజాబ్‌ రాష్ట్రాలలో ఆయన పర్యటన ఖరారైంది. మోదీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి అమిత్‌ షా ప్రధాన ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఏయే కుల సమీకరణలు ఉండాలో ఆయనే నిర్ణయిస్తారు.
అమిత్‌ షా పర్యటనలో 2019లో తక్కువ మెజారిటీతో బీజేపీ గెలిచిన లేదా ఓడిపోయిన 160 నియోజకవర్గాలమీద అమిత్‌షా ప్రత్యేక దృష్టి సారిస్తారు. అక్కడి సామాజిక సమీకరణలు ఎలా ఉండాలో నిర్దేశిస్తారు. విజయం సాధించే లక్ష్యంతో వివిధ కులాల మద్దతు సమీకరించడం ఎలాగో అమిత్‌షా నిర్ణయిస్తారు. అమిత్‌షా పర్యటనకు లోక్‌సభ ప్రవాస్‌ అని నామకరణం చేశారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉన్న కర్ణాటకలో గత నెల 30న ఒక విడత అమిత్‌షా పర్యటన ఇప్పటికే ముగిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కనీసం 350 స్థానాలలో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కిందటి నెలలో బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఒడిశాలో ఒక విడత పర్యటన ముగించారు. ఆ రాష్ట్రంలో చాలాకాలంగా బిజూ జనతాదళ్‌ నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతున్నారు.
ఇదివరకు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న బిజూ జనతా దళ్‌ ఇప్పుడు శత్రుపక్షం కాకపోయినా మిత్రపక్షం మాత్రం కాదు. అందువల్ల సొంతంగా బీజేపీ విజయం సాధించే మార్గాలను బీజేపీ అన్వేషిస్తోంది. అమిత్‌షా పర్యటనలో బీజేపీ బలహీనంగాఉన్న లోకసభ నియోజక వర్గాలలో 2024లో విజయం సాధించడం ఎలాగో మార్గాన్వేషణ చేయనున్నారు. ఆయన ఈనెలలో పర్యటన పొడవునా బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. పార్టీ కార్యకర్తలతో చర్చిస్తారు. పార్టీనిర్మాణ పరంగా తీసుకోవలసిన చర్యలపై చర్చించే సమావేశాలలో భాగస్వామి అవుతారు. బీజేపీ బలహీనంగా ఉందనుకుంటున్నా 160 నియోజకవర్గాలలో సగం సీట్లలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా పర్యటిస్తే మిగతా సగం సీట్లలో వ్యవహారాలు అమిత్‌షా చక్కబెడ్తారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా కొన్నిచోట్ల తన ప్రయత్నం తానుచేస్తారు. ఈ ప్రయత్నం అంతా పోలింగ్‌ కేద్రాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, లోపాలు ఉన్నాయనుకుంటే సరిదిద్దడం మీదే కేంద్రీకృతం అవుతుంది. బీజేపీ బలహీనంగా ఉంటుందనుకున్న లోక్‌సభ నియోజక వర్గాలలో ఏంచేయాలో ఒక పథకం రూపొందించడానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీ, కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రాం మేఘ్వాల్‌, ప్రహ్లాద్‌ జోషీతో ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలస్థాయిలో బీజేపీని ఎలా మెరుగు పరచాలో సూచించడం ఈ కమిటీ బాధ్యత. ఈ కమిటీకి వినోద్‌ తావ్డే కన్వీనర్‌గా, సి.టి.రవి సహసమన్వయకర్తగా వ్యవహరిస్తారు. 2019లో కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని రద్దుచేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చారు. అక్కడ ఈ తొమ్మిది రాష్ట్రాలకన్నా ముందే ఎన్నికలు నిర్వహిస్తారో లేదో ఇంకా తేలలేదు. ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రమే కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఇటీవల కాంగ్రెస్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారం సంపాదించినప్పటికీ, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అంత సులభమేమీ కాదు. ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీని నిలవరించడం కాంగ్రెస్‌కు తలకు మించినపనే.
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌కు, సచిన్‌ పైలెట్‌కు మధ్య ఉన్న తగాదాలను కాంగ్రెస్‌ ఇప్పటికీ తీర్చలేకపోయింది. అయితే బీజేపీలోకూడా ముఠా తగాదాలకు లోటులేదు. మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెఖావత్‌కు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పు లాగే ఉండడం బీజేపీకి తలనొప్పే. అమిత్‌షా, నడ్డా విస్తృతంగా పర్యటించడం పూర్తి అయిన తరవాత ఎన్నికల కార్యక్రమం ప్రకటించడానికి ముందు, ఆ తరవాత ప్రధానమంత్రి మోదీ ఎటూ సంపూర్ణంగా ఎన్నికల ప్రచారానికే అంకితమవుతారని చెప్పనక్కర్లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img