Monday, March 20, 2023
Monday, March 20, 2023

నిరంతర రాజకీయకక్ష

బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వపాలనలో  దర్యాప్తు సంస్థలు నిరంతరం ప్రతిపక్ష నాయకులను మాత్రమే ‘‘అవినీతి పరుల’’ పేరుతో అరెస్టులుచేసి వేధింపులు కొన సాగిస్తూనే ఉన్నాయి. ఆదివారం దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను సీబీఐ ‘మద్యం కుంభకోణం’ పేరుతో అరెస్టు చేసింది. దిల్లీలో ఆప్‌ పార్టీ అధికారంలోకి వచ్చిననాటి నుండి బీజేపీకి కంటగింపుగా ఉంది. దీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని అనేక విధాలుగా మోదీ ప్రభుత్వం వేధిస్తూనే ఉంది. సిసోడియా మద్యం వ్యాపారంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల ప్రచారం కొనసాగుతూనే ఉంది. సిసోడియాకి గతంలో అవినీతిపరుడన్న పేరులేదు. ఆరోపణ నిరూపితమైతే శిక్షపడినా మనకు నిమిత్తంలేదు. అవినీతి వ్యతిరేక పోరాటంలో సిసోడియా, అన్నాహజారే, కేజ్రీవాల్‌ తర్వాత ప్రముఖపాత్ర వహించారు. అవినీతి వ్యతిరేకపోరు జరిపిన వాళ్లపైనే ఆరోపణలువస్తే పోరాటపటిమ తగ్గుతుంది. మరోపోరాటానికి అనుకూల అవకాశాలు తగ్గుతాయి. దిల్లీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేసి, ఆప్‌కి ప్రజలను దూరం చేయడానికి మోదీ చేయని ప్రయత్నంలేదు. మద్యం కుంభకోణం వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత తదితర అనేకులున్నారన్న ప్రచారం కొనసాగిస్తూ ఎన్నికల్లో లబ్దిపొందే ప్రయత్నమూ ఆగలేదు. దిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ కంటే ఆప్‌ ఎక్కువసీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేయర్‌ ఎన్నిక నిర్వహించకుండా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నరు ద్వారా ముప్పుతిప్పలు పెట్టిన మోదీ ప్రభుత్వం  ఒత్తిడితోనే సీబీఐ అరెస్టు చేసిందనేది వాస్తవంకాదని చెప్పగలరా? ఇది వాస్తవమైనా రుజువు కాకపోవచ్చు. క్రూరమైన, వికృతమైన ఆలోచనకు ప్రతి రూపమే ఇలాంటి ఘటనలు. సీబీఐ కస్టడీకి అనుమతిస్తే సిసోడియా నుంచి నిజాలను కక్కిస్తామని సీబీఐ అంటోంది. రాజకీయ శక్తుల ప్రాబల్యానికి సీబీఐ, ఈడీ లాంటి రాజ్యాంగ సంస్థలు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయి చాలాకాలమైంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వ సేవలో తరిస్తున్నాయి. ఈ ఏడాదికి చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరగ నున్నందున మరెంతమంది ప్రతిపక్ష నాయకులను అవినీతి ఆరోపణల పేరుతో సీబీఐ, ఈడీలు అరెస్టుచేసి జైలుపాలు చేస్తారో తెలియదు. కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అవినీతి పరుడని ముద్ర పడిన తర్వాతకూడా మోదీ ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించడం దేనికి సంకేతం. ఆయన అవినీతిని సమర్థిస్తున్నట్లే కదా! ‘‘కర్ణాటక కమిషన్ల’’ ప్రభుత్వం అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆ రాష్ట్రం ‘ఘన విజయాలు’ సాధించిందని గొప్పలకు పోవడం మోదీ ప్రత్యేక లక్షణం. డబుల్‌ ఇంజన్ల ప్రభుత్వం గొప్పదని చేప్పే డొల్ల మాటలను నమ్మడం వల్లనే దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. మరోవేపు కుబేరుల సంఖ్యను పెంచుతూ, ఇంకోవేపు పేదరికాన్ని, నిరుద్యోగాన్ని గరిష్టస్థాయికి తీసుకొని వెళుతున్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రచారయంత్రాంగం అబద్దాలను సృష్టించి ప్రజలపై రుద్దుతోంది. తాజాగా సిసోడియాను అరెస్టు చేయించడం ‘అదానీ గేట్‌’ (అవినీతి కుంభకోణం) ప్రజల దృష్టిని మళ్లించడానికే నన్నది వాస్తవం. ఈ కుంభకోణంలో చిక్కుకున్న తన స్నేహితుడన్న పేరుపొందిన అదానీని కాపాడే విషయంలో మోదీ, ఇతర బీజేపీ నాయకులు సతమతమవుతున్నారు.

సీబీఐ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియా పేరు పెట్టారు. మొదట సిసోడియాను గత అక్టోబరు 17న ప్రశ్నించారు. ఆ తర్వాత నవంబరు 25న చార్జిషీటు దాఖలు చేశారు. అయితే మొదట ఛార్జిషీటులో ఆయనపేరు లేదని సీబీఐ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు నిందితుల జాబితాలో మొదటిపేరుగా నమోదైంది. ఈ వ్యవహారంపై సందేహాలున్నాయి. ఐపీసీ సెక్షన్‌లు 120బి, 477ఎ కింద, అలాగే అవినీతి నిరోధక చట్టంలో వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఎక్సైజ్‌ విధానమే ప్రభుత్వాలకు అధిక ఆదాయం కల్పిస్తుంది.
మద్యం విధానం రూపకల్పనలో అవినీతి జరిగిందన్న ప్రచారం జరిగింది. సామాజిక కార్యకర్త 94ఏళ్ల పండు ముదుసలి స్టాన్‌ స్వామిపైన తీవ్ర ఆరోపణలుచేసి కేసుపెట్టారు. జైలులో వివిధ రకాలుగా వేధించి చివరకి జైలులోనే ప్రాణాలు విడిచే పరిస్థితులు కల్పించారు. మానవత్వంలేని అత్యంత క్రూర ఆలోచనలున్నవారే ఇలా వ్యవహరిస్తారు. సిసోడియా విద్యాశాఖమంత్రిగా మంచి పాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు. జర్నలిస్టుగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన సిసోడియాను అప్రతిష్టపాలుచేయడం నేటి కేంద్రపాలకుల లక్ష్యంకావచ్చు. అంతేకాదు, తుచ్చమైన రాజకీయా లకు ప్రతీకలుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. దిల్లీ ప్రభుత్వం ప్రజలకు అనేక మేళ్లు చేసింది. కుటుంబాలకు దేశ అభివృద్ధికి దోహదంచేసే విద్య, వైద్యం ఉచితంగా కల్పిస్తున్నారు. సీనియరు పౌరులకు ఉచిత యాత్రా సౌకర్యం, విద్యార్థినులకు ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణం, నీటి సరఫరాలాంటి ప్రయోజనాలు అందించి ప్రజాదరణ పొందుతున్న ఆప్‌ మళ్లీ మళ్లీ ఎన్నికల్లో గెలుపొందుతోంది. బీజేపీ ప్రభుత్వానికి ఇదే కంటకమైంది. సర్వరంగాల్లోనూ విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఆప్‌ ప్రభుత్వాన్ని అసూయ, ద్వేషాలతో వేధిస్తున్నది. అవినీతిని నిర్మూలిస్తా మని రోజూ వల్లెవేస్తున్న మోదీ ప్రభుత్వం ఈ చెడును మరింత ఎక్కువ చేసేలా వ్యవహరిస్తోంది. నల్లధన కుబేరులు, కార్పొరేట్లు వేలు, లక్షల కోట్లు బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని ఎగవేస్తే ఆ మొత్తాలను రద్దు చేశారు. తమను ఎన్నుకున్న ప్రజలు శ్రమచేసి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును హరించినవారిని వదిలేస్తున్న పాలకులు దుర్మార్గంగా ఉన్నప్పటికీ చెల్లుబాటవుతోంది. ప్రజాస్వామ్యాన్ని దిగజార్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. సమాజంలో విలువలను దిగ జార్చారు. అవినీతిపరులే పాలకులైతే ప్రజలు తమను తాము కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇలాంటి అవకాశం ఎన్నికల్లోనే ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img