భారత మల్లయోధుల సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కొందరు మహిళా యోధులను లైంగికంగా వేధించాడని అనేకమంది క్రీడాకారులు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్ 23 నుంచి నిరసన తెలియజేస్తున్నారు. వారి నిరసన సంపూర్ణంగా శాంతియుతంగానే కొనసాగుతోంది. కానీ బుధవారం అర్థ రాత్రి దిల్లీ పోలీసులు నిరసన తెలియజేస్తున్న వారి మీద తమ ప్రతాపం చూపించారు. కొందరు క్రీడాకారులకు గాయాలుకూడా అయ్యాయి. ఒక క్రీడాకారిణి స్పృహ తప్పి పడిపోయారు. నిరసన తెలియజేస్తున్న వారి కోసం ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు సోమ్‌నాథ్ భారతి మంచాలు తెప్పించడం పోలీసులకు రుచించలేదు. అనుమతి లేకుండా మంచాలు, పరుపులు తెప్పించకూడదని మాత్రమే తాము నివారించామని పోలీసులు అంటున్నారు. జంతర్ మంతర్ నిరసన తెలియజేయడానికి ఉద్దేశించిన ప్రాంతం. అలాంటప్పుడు నిరసన తెలియజేసే వారు కూర్చుని నిరసన తెలియజేస్తారా, నిలబడి తెలియజేస్తారా అని చర్చించడం వృధా. ఇందులో పోలీసులు అభ్యంతర పెట్టదగింది అంతకన్నా లేదు. పోలీసులు తమను తోసేశారని నిరసన తెలియజేస్తున్న క్రీడాకారులు అంటున్నారు. ఆ మాత్రం బలప్రయోగం చేయడం పోలీసుల సహజ స్వభావం అయిపోయింది. లాఠీ ఎత్తితే తప్ప వారి నోట మాట పెకలని పరిస్థితి ఉంది. అన్నింటికన్నా మించి అధికారంలో ఉన్న వారికి సంతృప్తి కలిగే రీతిలో వ్యవహరించడం పోలీసుల స్వభావంగా మారిపోయింది. రాజకీయ ప్రయోజనాలకు పోలీసు బలగాలను దుర్వినియోగం చేయడం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. తమ దురుసు ప్రవర్తనను సమర్థించుకోవడానికి పోలీసులు ఎన్ని కథలైనా అల్లగలరు. ‘‘ఆం ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు సోం నాథ్ భారతి క్రీడాకారులు నిరసన తెలియజేస్తున్న చోటికి కొన్ని మడత మంచాలు తీసుకొచ్చారు. దీనికి అనుమతి లేదు. పోలీసులు అభ్యంతర పెట్టినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో స్వల్ప ఘర్షణ జరిగింది. మరో ఇద్దరితో పాటు సోమ్‌నాథ్ భారతిని అదుపులోకి తీసుకున్నాం’’ అని దిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ ప్రణవ్ పాయల్ అంటున్నారు. ఇది పోలీసుల దాష్టీకాన్ని సమర్థించుకోవడానికి పకడ్బందీగా అల్లిన కట్టుకథే. నిరసన తెలియజేస్తున్న వారు గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ లోనే ఉన్నారు. అలాంటప్పుడు వారు విశ్రాంతి తీసుకోవడానికి మంచాలు తెప్పించడం అక్రమం ఎలా అవుతుందో, దానికి అనుమతి అవసరం ఏమిటో అర్థం కాదు. కొంత మంది మల్ల యోధులు వర్షం కురుస్తున్నందువల్ల కొయ్య మంచాలపై పడుకుని ఉన్నప్పుడు పోలీసులు వచ్చి తమను కర్రలతో బాదారని నిరసనకారులకు నాయకత్వం వహిస్తున్న వారిలో ఒకరైన బజరంగ్ పునియా అన్నారు. పోలీసులు తమ మీద దాడి చేసినప్పుడు ఒక్క మహిళా పోలీసు కూడా లేరని ప్రఖ్యాత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ కన్నీళ్ల పర్యంతమై చెప్పారు. ఒకరికి తల మీద గాయాలయ్యాయని కూడా ఫొగాట్ అన్నారు. పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించి తమను తోసేశారని కూడా నిరసన తెలియజేస్తున్న వారు ఆరోపించారు.
మరో వేపు పౌరులు తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పునియా విజ్ఞప్తి చేశారు. రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికైత్ బుధవారం నిరసన శిబిరాన్ని సందర్శించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిరసనకు మద్దతిస్తూనే ఉన్నారు. అనేక మంది రైతులు ట్రాక్టర్లు తీసుకుని జంతర్ మంతర్ రావడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు షరా మామూలుగా వారిని దిల్లీ సరిహద్దుల్లోనే ఆపేశారు.రగడ జరగడానికి ముందు ఒక పోలీసు మరుగుదొడ్లోకి వెళ్లి మద్యం సేవించాడని నిరసన ప్రదర్శన చేస్తున్న గోపాల్ తివారీ తెలియజేశారు. ఆ పోలీసుకు వైద్య పరీక్ష చేయించాలని క్రీడాకారులు కోరారు. కానీ పోలీసులు క్రీడాకారులను బెదిరించి మద్యం సేవించాడన్న ఆరోపణ ఉన్న పోలీసును అక్కడినుంచి తీసుకెళ్లి పోయారు. ఆ పోలీసు మద్యం సేవించకపోతే అక్కడి నుంచి తీసుకెళ్లవలసిన అవసరం ఏముంటుంది! గమనించవలసిన విషయం ఏమిటంటే వర్షం వల్ల ఆ ప్రాంతం అంతా బురదగా తయారైనందువల్లే క్రీడాకారులు మంచాలు తెప్పించుకున్నారు. ఇందులో మహాపాచారం ఏముందో అంతుబట్టదు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య వాదోపవాదాలు కొనసాగుతుండగానే కొంత మంది పోలీసులు మడత మంచం ఎత్తి రాహుల్ యాదవ్ అనే క్రీడాకారుడి తల మీద బాదారు. కాలితో తన్నారు. కర్రలతో చితగ్గొట్టారు. ఆయనకు తల మీద, కాలికి గాయాలైనాయి. ఇదంతా పోలీసులు దాష్టీకానికి దిగినట్టు నిరూపిస్తూనే ఉంది. ఈ గొడవ గురించి తెలిసిన దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతీ మలీవాల్ జంతర్ మంతర్ వస్తే పోలీసులు ఆమెను కూడా నిర్బంధించారు. మరీ విచిత్రం ఏమిటంటే బ్రిజ్ భూషణ్‌శరణ్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినా సుప్రీంకోర్టు కలగ జేసుకునే దాకా ఆయన మీద ఎఫ్.ఐ.ఆర్. కూడా దాఖలు చేయలేదు. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఒక మైనర్ అమ్మాయి కూడా ఉంది. అలాంటి ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే ఆరోపణకు గురైన వ్యక్తిని అరెస్టు చేయాలి. ఇంతవరకు ఆయనను అరెస్టే చేయలేదు. ఆయన బీజేపీ ఎంపీ కావడం, పైగా బాహుబలి కావడం కూడా ఆయనను వెనకేసుకు రావడానికి కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను క్రీడాకారిణులను లైంగికంగా వేధించాననడానికి ఆధారాలు చూపించాలని బ్రిజ్ భూషణ్ సవాలు విసురుతున్నారు. లైంగిక వేధిపులకు పాల్పడే వారు సాక్షులను పక్కన పెట్టుకుని ఆ పని చేయరుగా! కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెల్లడి కావచ్చు. కానీ చట్టం పరిధిలో పని చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేని వ్యవహారం. పైగా దిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదుపాజ్ఞల్లో పని చేయాలిగా! బ్రిజ్ భూషణ్ మీద అనేక కేసులున్నాయి. ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారన్న కీర్తీ ఉంది. పైగా బహుబలి అన్న పేరుంది. అలాంటి వ్యక్తిని ఢీకొనడం సామాన్యమైన విషయం కాదు. బ్రిజ్ భూషణ్ ఆగడాలు భరించనలవి గానివిగా తయారైనందువల్లే మహిళా క్రీడాకారులు నిరసనకు దిగాల్సి వచ్చింది. బ్రిజ్ భూషణ్ పై ఎట్టకేలకు ఎఫ్.ఐ.ఆర్. నమోదైనందువల్ల సుప్రీంకోర్టు ఈ కేసును మూసి వేసింది. అయినా నిరసన కొనసాగించాలని క్రీడాకారులు నిర్ణయించారు. బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనంత కాలం క్రీడాకారుల ఆగ్రహం చల్లారదు. బ్రిజ్ భూషణ్ మీద దర్యాప్తును సుప్రీంకోర్టు ఆజమాయిషీ చేయాలన్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ తో కూడిన బెంచి నిరాకరించింది. ఎఫ్.ఐ.ఆర్. దాఖలు, క్రీడాకారులకు భద్రత కల్పించాలన్న రెండు అభ్యర్థనలను ఆమోదించాం కనక పర్యవేక్షణ ప్రస్తుత కేసు పరిధిలోకి రాదన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. కావచ్చు. భద్రత కల్పించాలన్న ఆదేశం అమలుకాలేదనడానికి బుధవారం రాత్రి జరిగిన ఉదంతమే రుజువు చేస్తోంది. కనీసం నిరసననైనా భరించలేని మోదీ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎలా అన్నదే ప్రస్తుతం అసలు ప్రశ్న.