Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

నిరాశపరచిన సుప్రీం తీర్పు

చాలాకాలంగా ఎదురు చూస్తున్న పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు సోమవారం వచ్చేసింది. ఈ కేసును విచారించిన అయిదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు పెద్దనోట్ల రద్దు సబబేనని తీర్పు చెప్పారు. ఒక్క న్యాయమూర్తి నాగరత్న మాత్రం పెద్దనోట్ల రద్దులో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. పెద్దనోట్ల రద్దుపై చెలరేగిన వివాదం, జనంపడ్డ కష్టాలు, కేసు విచారణ సందర్భంగా వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు చేసిన వ్యాఖ్యలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుంటే ఈ తీర్పు నిరాశే మిగిల్చింది. ఆరేళ్లకింద ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కేవలం నాలుగు గంటల వ్యవధిమాత్రం ఇచ్చి వెయ్యి, ఐదువందల రూపాయల నోట్లు ఆ రోజు అర్థరాత్రి నుంచి చెల్లవని, అవి చిత్తు కాగితాల కిందే లెక్కఅని హఠాత్తుగా ప్రకటించి జనంనెత్తిన పిడుగు వేశారు. కానీ బ్యాంకుల ముందు గంటల తరబడి బారులు తీరితే తప్ప మార్చుకోవడం సాధ్యంకాలేదు. ఈ క్రమంలో కనీసం వందమంది ప్రాణాలు వదిలారు. న్యాయ మూర్తులు ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, బి.ఆర్‌.గవాయ్‌, ఎ.ఎస్‌.బొపన్న, వి.రామసుబ్రహ్మణ్యం, బి.వి.నాగరత్నమ్మలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగపీఠం ఇచ్చిన మెజారిటీ తీర్పు 2016 నవంబర్‌ 8 నాటి నోట్ల రద్దు సక్రమమేనని తీర్పు చెప్పింది. న్యాయమూర్తి నాగరత్నమ్మ మాత్రం నోట్లరద్దుకు ప్రభుత్వం అనుసరించిన విధానంతో ఏకీభవించకుండా అసమ్మతితీర్పు వెలువరించారు. మెజారిటీ తీర్పును న్యాయమూర్తి గవాయ్‌ వెల్లడిరచారు. ఆర్థికవిధానాల విషయంలో సంయమనం ఉండాలని, అయితే కోర్టు ప్రభుత్వం విజ్ఞతను ప్రశ్నించ బోదని మెజారిటీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులు భావించారు. కొన్ని నిర్దిష్ట లక్ష్యాలు సాధించడం కోసం ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిందని, అయితే ఈ లక్ష్యాలు నెరవేరాయో లేదో అనవసరమని నలుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే చెల్లవని ప్రకటించిన నోట్లను మార్చడానికి ఇచ్చిన 52రోజుల గడువు నిర్హేతుకమైందని చెప్పలేమని కూడా ఈ తీర్పులో పేర్కొన్నారు. అంటే రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బిఐ) చట్టంలోని సెక్షన్‌ 26(2)కు అనుగుణంగానే ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేసిందని నలుగురు న్యాయ మూర్తులు భావించారు. పెద్దనోట్లు రద్దు చేసింది ప్రభుత్వం కనక ఆ నిర్ణయం తీసుకున్న క్రమాన్ని తప్పు పట్టలేమని, ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆరునెలలపాటు కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు మధ్య సంప్రదింపులు జరిగాయని కూడా మెజారిటీ తీర్పులో పేర్కొన్నారు. మెజారిటీ తీర్పు చెప్పిన న్యాయమూర్తులు నిర్ణయం తీసుకోవడానికి అనుసరించిన ప్రక్రియ సవ్యమైందో కాదో పరిశీలించారు తప్ప పెద్ద నోట్లరద్దు వల్ల వచ్చిన పర్యవసానాలు, పరిణామాల గురించి పట్టించుకున్నట్టు లేదు. పెద్దనోట్ల రద్దును సవాలుచేస్తూ మొత్తం 58 పిటిషన్లు దాఖలైనాయి. ఈ నిర్ణయం అనాలోచిత నిర్ణయం కనక దీనిని కొట్టి వేయాలని ఈ పిటిషన్లు పెట్టుకున్న వారు వాదించారు. ఈ నిర్ణయం అమలైన తరవాత ఎలాంటి ఉపశమనం కల్పించడానికి వీలులేనప్పుడు ఈ నిర్ణయాన్ని కాదనడం గడియారాన్ని వెనక్కు తిప్పడమేనని, పగలగొట్టిన కోడి గుడ్డును మళ్లీ అతికించడానికి ప్రయత్నించడం లాంటి వృథాప్రయాసేనని ప్రభుత్వం వాదించింది. 

చెలామణిలోఉన్న కరెన్సీని తగ్గించడం, నగదురహిత ఆర్థికవ్యవస్థను అనుసరించడం, దొంగనోట్లను రూపుమాపడం, నల్ల డబ్బును నియంత్రించడం, తీవ్రవాదులకు నల్లడబ్బు అందకుండాచేసి తీవ్ర వాదానికి అడ్డుకట్ట వేయడం పెద్దనోట్ల రద్దు లక్ష్యాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రకటించింది. ఎన్ని పెద్ద నోట్లు చెలామణిలో ఉండేవో దాదాపు అన్నీ రిజర్వు బ్యాంకుకు చేరాయి కనక నోట్ల చెలామణిని తగ్గించాలన్న లక్ష్యం నెరవేరలేదు. అలాగే నల్లడబ్బు చెలామణిలోంచి మాయంకాలేదు. దొంగనోట్ల చెలామణి ఆగకపోగా నోట్ల రద్దుకన్నా ముందున్న పరిస్థితితో పోలిస్తే 35శాతం దొంగనోట్ల చెలామణి పెరిగింది. ఇవి వందరూపాయల నోట్లేనని తేలింది. 50 రూపాయల దొంగనోట్లు 154.3శాతం పెరిగాయి. పెద్దనోట్ల రద్దు ఆర్థిక విధానాలకు సంబంధించిన నిర్ణయంకనక న్యాయస్థానం చేతులు జోడిరచి, మౌన ప్రేక్షకపాత్ర వహించలేదని, ఇంతకు ముందు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తీవ్రత తీర్పులో ఎక్కడా ప్రతిఫలించలేదు. పెద్దనోట్ల రద్దువల్ల స్థూల జాతీయోత్పత్తికి 1.5శాతం నష్టం కలిగింది. ఈ లెక్కన ఏటా రూ. 2.25లక్షల కోట్ల నష్టం కలిగినట్టే. దాదాపు 15 కోట్ల మంది రోజువారీ వేతనాలు సంపాదించే కార్మికుల బతుకులు ఛిద్రమై పోయాయి. రద్దుచేసిన సమయంలో చేతిలో డబ్బులేక వందలు, వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది ఉపాధి లాగేసినట్టయింది. అసమ్మతితీర్పు వెలువరించిన న్యాయమూర్తి నాగరత్నమ్మ మాత్రం కేవలం ప్రభుత్వ ఉత్తర్వుద్వారా నోట్లు రద్దు చేయడానికి వీలులేదని తేల్చి చెప్పారు. ఇది చట్ట వ్యతిరేకం అని కూడా ఆ న్యాయమూర్తి ప్రకటించారు. రిజర్వు బ్యాంకు ప్రభుత్వ సంకల్పాన్ని లోతుగా తరచి చూడకుండా ఆమోదించినట్టు ఉందని కూడా ఆమె అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేయాలనుకుంది కనక ఆర్‌బిఐ తలూపినట్టుందని న్యాయమూర్తి నాగరత్న స్పష్టంగా చెప్పారు. పెద్దనోట్లను రద్దు చేయడంవల్ల కలిగే పరిణామాల గురించి ఆర్‌బిఐ అసలు ఆలోచించినట్టే లేదని కూడా న్యాయమూర్తి నాగరత్న గట్టిగానే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ సమర్పించిన పత్రాలను బట్టి చూస్తే ‘‘కేంద్ర ప్రభుత్వం కోరుతోంది కనక,’’ అని ఉంది. అంటే ఆర్‌బిఐ సొంత ఆలోచన ఏదీ చేసినట్టు లేదని నాగరత్న తనతీర్పులో పేర్కొన్నారు. పార్లమెంటుచట్టం చేసి ఈ నోట్లు రద్దు చేసి ఉండవలసిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్లమెంటు ప్రమేయం ఉండడమే ప్రజాస్వామ్య లక్షణమని కూడా ఆమె అన్నారు. నిర్ణయం తీసుకున్న తీరు లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వనిర్ణయం వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నది కాదని, ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని, నోట్లరద్దు తరవాత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని ఆమె తన అసమ్మతి తీర్పులో పేర్కొన్నారు. మెజారిటీ తీర్పు కనక ఇది ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవచ్చు. కానీ అనేక సందర్భాలలో అసమ్మతి తీర్పులలో పేర్కొన్న అంశాలే తరవాత చట్టాలైన సందర్భాలున్నాయని మరిచి పోవడానికి వీలులేదు. ఏమైనప్పటికీ సుప్రీం తీర్పు నిరాశే మిగిల్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img