Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

నిర్ణయాల కంటే ఆచరణ ముఖ్యం

దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌ చాలా బలహీనపడిరది. గత వారం జరిగిన కాంగ్రెస్‌ 85 ప్లీనరీ సమావేశంలో చేసిన తీర్మానం, డిక్లరేషన్‌లో పేర్కొన్నఅంశాలు వివిధతరగతుల ప్రజలను ఆకట్టుకునే లాగా ఉన్నాయి. అన్నిటికంటే కాంగ్రెస్‌ను తిరిగి పునరుజ్జీవింప చేసేందుకు కృషి చేయాలన్న ధృడ సంకల్పం ఆ  పార్టీలో మార్పును సూచిస్తోంది. రాహుల్‌గాంధీ జోడోయాత్రకు అనంతర కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.2023 లో ముఖ్యమైన రాష్ట్రాలకు, 2024 లో జరగనున్న ఎన్నికల్లో గెలవడానికి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకొనేందుకు సిద్ధపడాలన్న నిర్ణయం లాంటివి కీలక అంశాలు. కాంగ్రెస్‌ పటిష్ఠత, 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలన్న సంకల్పం ప్రధానమైనవి.  లోక్‌సభ ఎన్నికల్లో భావ సారూప్యత గల పార్టీలతో పొత్తులని పేర్కొన్నారేగాని ఐక్య ఫ్రంట్‌ ఏర్పాటు, ఆచరణాత్మక ఉమ్మడి కార్యాచరణ లాంటి నిర్ణయాలు డిక్లరేషన్‌లో స్పష్టంగాలేవు. తీవ్రంగా బలహీనపడిన పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయవలసి ఉంటుంది. అయితే అందుకు కావలసిన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ముఖ్యం. పార్టీ నుండి వివిధ కారణాలతో చాలామంది సీనియర్‌ నాయకులు బయటికి వెళ్లిపోయారు. ఇంకా చాలామంది కాంగ్రెస్‌ పెద్దలపై వచ్చిన అవినీతిపరులన్న ఆరోపణల కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వెళ్లిపోయిన మంచి అనుభవం ఉన్న నాయకులను తిరిగి పార్టీలోకి రప్పించి ఆయారాష్ట్రాల్లో పార్టీ పరిస్థితులను మెరుగుపరుచుకోవలసి ఉంటుంది. రాహుల్‌ జోడోయాత్రలో తమ పరిస్థితులు బాగా మెరుగయ్యాయన్న నమ్మకం పార్టీ కార్యకర్తల్లో ఏర్పడిన మాట వాస్తవమే. అలాగే జోడోయాత్రలో వివిధవర్గాల ప్రజల్లో సాను కూలత కలిగింది. ఈ సానుకూలతను ఓట్లుగా మార్చుకొనే పరిస్థితులు క్షేత్రస్థాయిలో లేవు. అదే సమయంలో మెజారిటీ ప్రజలను వాగ్దానాలతో మత భావజాలాల్ని దశాబ్దాలుగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూరిపోసిన సంఘ పరివార్‌ కార్యకర్తలు లక్షలాది మంది దేశమంతటా విస్తరించి బలంగా ఉన్నారు. ప్రతి ఎన్నికలో వీరు సర్వశక్తులు ఒడ్డి, అబద్ధాలను ప్రచారం చేస్తూ ఓట్లు వేయించుకోగలుతున్నారు. కాంగ్రెస్‌ కింది స్థాయిలో సుశిక్షణ గల కార్యకర్తలను తయారుచేసుకోవడం సామాన్య మైన విషయం కాదు. రాహుల్‌ జోడో యాత్ర ద్వారా విజ్ఞత గల రాజకీయవేత్తగా మెలగగలిగిన సత్తాను సాధించకోగలిగారు. యాత్రలో ఎంతో అనుభవం గల నాయకుడిగా ఎదిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల ఈర్ష్యా, ద్వేషాలను పెంచి పోషిస్తుండగా తాను ప్రజల్లో ప్రేమను, శాంతిని సాధించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పిన విషయం ప్రజలను ఆకర్షించింది. రాజకీయ యాత్ర కాదని చెప్పినప్పటికీ పార్టీకి సహాయపడు తుందనేది వాస్తవం. రాహుల్‌ ఒక సిద్ధాంత రూపకల్పన మార్గాన్ని వెతుక్కుంటున్నాడు. అయితే ఈ లక్ష్యాన్ని ఏ మేరకు సాధించగలడన్నది చూడాలి. మోదీ సామాజిక విభజన సృష్టించి హిందూ మతం ప్రమాదంలో ఉందన్న భావనను మెజారిటీ ప్రజల్లో కలగజేసి గెలిచాడు. దీన్ని ఢీ కొట్టగలిగిన సైద్ధాంతిక మార్గనిర్ధేశం ఉండాలి. అది మెజారిటీ మత అనుకూల సిద్ధాంతం కాకూడదు. అదే అయితే పార్టీకి దూరమైన కోట్లాది ప్రజలను ఆకట్టుకొనే అవకాశం ఉండదు. బహు భాషల ప్రజలను, బహుళత్వాన్ని, దేశ పౌరులంతా ఒకటేనన్న అభిప్రాయాన్ని ఏర్పరచగల సెక్యులర్‌ మార్గం  మాత్రమే అయి ఉండాలి. అధికారంలో ఉన్న మోదీ గత తొమ్మిదేళ్లుగా అనుసరిస్తున్న దేశ ప్రజలంతా ఒకటి కాదన్న మత మితవాదసిద్ధాంతాన్ని ఢీ కొట్ట గలిగిన సిద్ధాంతమై ఉండాలి. పార్టీకి ఈ లక్ష్యం సాధించగల శక్తి ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. 

మోదీని ఢీకొని విజయం సాధించాలంటే ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రావాలి. ఈ లక్ష్యం సాధించటం అంత తేలికైన విషయం కాదు. ప్రతి పక్షాలను చెల్లాచెదురు చేయగల మాయోపాయాలను, కుట్రపూరిత ఎత్తుగడలను వేయడంలో మోదీ, అమిత్‌షా ఆరితేరారు. ఇప్పటి కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో బిఆర్‌ఎస్‌, ఆంధ్రాలో టి.డి.పి, వై.సి.పి, ధిల్లీలో ఆప్‌, పశ్చిమబెంగాల్‌లో టి.ఎం.సిలు ఉన్నాయి. వీటిలో ఆప్‌, టిఎంసి, బిఆర్‌ఎస్‌లు బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. యుపిలో బిఎస్‌పి, సమాజ్‌వాదీ పార్టీలు కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నాయి. ఇక ముస్లిం మజ్లిస్‌, బిఎస్‌పిలు బీజేపీని వ్యతిరేకిస్తు న్నాయని చెప్పినప్పటికీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండవన్న అభిప్రాయం బలంగా ఉంది. కాంగ్రెస్‌తో కలిసి రావడానికి 16 చిన్నా పెద్ద పార్టీలున్నాయని చెప్తున్నారు. కర్నాటకలో జెడిఎస్‌ నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దేశ వ్యాప్తంగా ఎంతో కొంత బలం గల జాతీయ పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే. వామపక్షాలు బలహీనపడి కొన్ని రాష్ట్రాలకు పరిమితమైన జాతీయపార్టీలు. కాంగ్రెస్‌ ప్రతిపక్షాలన్నిటికీ నాయకత్వం వహించాలని నితీశ్‌కుమార్‌, లాలూప్రసాద్‌, శరద్‌పవార్‌ లాంటి వారు ఇప్పటికే చాలాసార్లు తమ అభిప్రాయం చెప్పారు. మొత్తం ప్రతిపక్షాలు ఒక్కటయితే, విజయం తప్పక సాధ్యమవుతుందని నితీశ్‌ తదితరులు విశ్లేషించారు. నితీశ్‌ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనను అప్రతిష్ట పాలు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ అంతర్గత కలహాలను ముందుగా పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత ప్రతిపక్ష ఫ్రంట్‌ రూపకల్పన లోనూ కాంగ్రెస్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆసలుకే మోసమొస్తుంది. వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బెంగాల్‌లో టిఎంసి అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌, వామపక్షాలతో సర్దుబాట్లకు అంగీకరించదు. చాలా రాష్ట్రాలలో వలె ఆంధ్రలో కాంగ్రెస్‌ బలహీనమైంది. పార్టీని నడిపించగల చాకచక్యంగల నాయకుడు కనిపించడు. తెలంగాణలో అంతర్గత ముఠాలు ఎక్కువ. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందుగా అంతర్గత సమస్యలు పరిస్కరించుకొని ప్రతిపక్షాల ఐక్యతపై స్పష్టత తెచ్చుకోవాలి. ఇతర పార్టీలను ఒప్పించ గల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఇవి ఉన్నాయని నిరూపించుకోవాలి. మొత్తం ప్రతిపక్షాలన్నిటిని ఫ్రంట్‌గా ఏర్పాటుచేసి ప్రజలు విశ్వసించగల ఆచరణాత్మక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొం దించడం అవసరం. అలాగే స్థానిక పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్షాలు సర్దుబాట్లు, త్యాగాలు చేయాలి. అప్పుడు మాత్రమే విజయం సాధ్యం అవుతుంది. ఎవరికి వారు ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకులున్నారు. కాంగ్రెస్‌ భిన్నమైన నిర్ణయం తీసుకొని ఎన్నికల ఫలితాల అనంతరం పొత్తులు అనుకుంటే బీజేపీ ధనరాసులు, మాయో పాయాలు పనిచేస్తాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ఉండగా ప్రతిపక్ష నాయకులపై అవినీతి ఆరోపణలు చేసి కేసులు బనాయించి అప్రతిష్ఠపాలు చేసే యుద్ధాన్ని రానున్న నెలల్లో మరింతగా పెరగవచ్చు. ప్రతిపక్షం ఐక్యతే వీటిని సమర్థంగా ఎదుర్కోగలదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img