Friday, December 2, 2022
Friday, December 2, 2022

నేరస్థులకు జడ్‌ ప్లస్‌ భద్రత

ఎన్నికలలో గెలవడానికి ఎంతటి నీచమైన పని అయినా చేయవచ్చునని నమ్మలేని రీతిలో రుజువు అవుతోంది. ఇద్దరు మహిళలపై అత్యాచారం, రెండు హత్య కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా బాబా అధినేత గుర్మీత్‌ రాం రహీం సింగ్‌కు మూడు వారాలపాటు జైలు అధికారులు సెలవు ప్రకటించారు. ఖైదీలకు అత్యవసర సమయాల్లో పెరోల్‌ ఇవ్వడం ఇలా సెలవు ఇవ్వడం ఆనవాయితీనే. కానీ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌కు హర్యానా ప్రభుత్వం చేసిన మర్యాద ఆ తరవాతే మొదలైంది. ఆయన జైలు బయట ఉన్న మూడు వారాల పాటు జడ్‌ ప్లస్‌ భద్రత ఏర్పాటు చేశారు. స్వాములు, బాబాల చుట్టూ రాజకీయ నాయకులు తిరగడం రివాజే. కానీ తీవ్రమైన కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ సింగ్‌ లాంటి నేరస్థుడికి జైలు వెలుపల ఉన్న కాలంలో జడ్‌ ప్లస్‌ భద్రతా సదుపాయం కల్పించడం ‘‘స్వామి’’ భక్తికి పరాకాష్ఠ. గుర్మీత్‌ హర్యానాలోని జైలులో శిక్ష అనుభవిస్తూ ఉండేవారు. పంజాబ్‌ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగాల్సి ఉండగా సరిగ్గా పదమూడు రోజుల ముందు ఫిబ్రవరి ఏడున జైలులో ఉండనవసరం లేకుండా సెలవు మంజూరైంది. అయితే జైలు నుంచి సెలవు మంజూరు చేయడానికి పంజాబ్‌ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వాదిస్తున్నారు. ఆయనను విడుదల చేసింది హర్యానా జైలు నుంచి కదా పంజాబ్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధం ఏమిటని అమాయకంగా ప్రశ్నించేవారు ఉంటారు. పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో గుర్మీత్‌ సింగ్‌కు భక్త గణం విపరీతంగా ఉంది. వారి ఓట్లు రాబట్టడానికే ఆయనను జైలు నుంచి బయటకు వదిలారని గ్రహించడానికి అపారమైన రాజకీయ పరిజ్ఞానం అవసరమే లేదు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్నందువల్లే జడ్‌ప్లస్‌ భద్రత కల్పించామని హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ సమర్థిస్తుండగా అసలు ఈ విషయమే తనకు తెలియదని ఖట్టర్‌ మంత్రివర్గంలో హోంశాఖ నిర్వహిస్తున్న అనిల్‌ విజ్‌ అనడం మహా విచిత్రం. దీన్నిబట్టి ముఖ్యమంత్రికి, హోం మంత్రికి మధ్య సయోధ్య లేదని అర్థం అవుతోంది. హోం మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే కేంద్ర బీజేపీ నాయకత్వ అజ్ఞానుసారమే ఖట్టర్‌ గుర్మీత్‌కు భద్రతాఏర్పాట్లు చేసి ఉంటారు. హర్యానాలో సి.ఐ.డి. విభాగం ముఖ్యమంత్రి అధీనంలో ఉండగా మిగతా పోలీసు శాఖ అంతా హోం మంత్రి చేతిలో ఉంటుంది. అంటే హర్యానా ప్రభుత్వంలో కుడిచేయి ఏంచేస్తుందో ఎడమచేయికి తెలియదనుకోవాల్సిందే. ముఖ్యమంత్రి, హోం మంత్రి మధ్య సంబంధాలు ఎడమొహం, పెడమొహం గానే ఉన్నాయని ఇద్దరు చెరో రకంగా వ్యాఖ్యానించి విభేదాల గురించి ఎవరికీ అనుమానం లేకుండా చేశారు. ఖైదీలు జైలులో ఉన్నా, సెలవు మీద వెలుపల ఉన్నా వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కూడా ఖట్టర్‌ అనుమానానికి తావు లేకుండా చెప్పారు. ఇంకా విచిత్రం ఏమిటంటే రాం రహీం సింగ్‌ మీద ఉన్న రెండు హత్య కేసుల్లోనూ ఆయన స్వయంగా పాల్గొనలేదని ఖట్టర్‌ వాదిస్తున్నారు. ఈ హత్యలకు కుట్రపన్నారనే ఆయనకు జైలు శిక్ష విధించారని ఖట్టర్‌ భాష్యం చెప్తున్నారు. రాం రహీం సింగ్‌ జైలులో ఏ తప్పూ చేయలేదని కూడా ఖట్టర్‌ కితాబు ఇచ్చారు. ఇద్దరు శిష్యురాండ్ర మీద అత్యాచారం చేసినందుకు గుర్మీత్‌ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిరది. హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిరది. అయితే ఆయన అత్యాచారం కూడా చేయలేదని ఖట్టర్‌ ఎందుకు వెనకేసుకు రాలేదో అంతుబట్టదు. రంజిత్‌ సింగ్‌ అనే వ్యక్తిని హత్య చేసిన ఆరోపణ రుజువు అయినందువల్లే రాం రహీం సింగ్‌కు గత ఏడాది జీవిత ఖైదు పడిరది. పంజాబ్‌లోని భటిండా, సంగ్రూర్‌, పటియాలా, ముక్త్‌ సర్‌లో సదరు బాబాకు భక్తులు అపారంగా ఉన్నారు. ఆయన చలవ ఉంటే ఎన్నికలలో ఉపకరిస్తుందని బీజేపీ ఆలోచన అయి ఉంటుందని ఎంతటి అమాయకులకైనా అర్థం అవుతుంది.
గుర్మీత్‌ సింగ్‌ను జైలు నుంచి బయటకు తీసుకువస్తే ఆయన తన భక్తులను బీజేపీ, అకాలీదళ్‌ అభ్యర్థులకు ఓటు వేయమని చెప్తారన్న ఆశతోనే ఆయనకు జైలు నుంచి సెలవు మంజూరు అయి ఉంటుంది. ఆయన నిర్భయంగా బయట తిరిగి ఓటర్ల మనోభావాలను చక్కదిద్దే పని చేయడానికి అనువుగానే గట్టి భద్రతా ఏర్పాట్లూ చేశారు. ముఖ్యంగా మాల్వా ప్రాంతంలో గుర్మీత్‌ సింగ్‌కు భక్తులు ఎక్కువ మంది ఉన్నారు. మత గురువులు, స్వాములు, బాబాలు పరోక్షంగానే కాక తమ అనుచరగణం రాజకీయాలలో ఎలాంటి దారిలో నడవాలో ఆదేశిస్తూనే ఉంటారు. పంజాబ్‌ లోని 13 వేల గ్రామాలలో ఈ డేరాల ప్రభావం విపరీతంగా ఉంది. స్వాములను, బాబాలను ఆశ్రయించి రాజకీయ ప్రయోజనం పొందడం కేవలం బీజేపీకే పరిమితమైన వ్యవహారం కాదు. కాంగ్రెస్‌ కూడా అదే దారిలో నడుస్తోంది. కేవలం సిక్కు మతానుయాయులకే కాక సూఫీలకు, రవి దాస్‌ అనుచరులకు కూడా ఇలాంటి డేరాలు ఉంటాయి. పంజాబ్‌లో డేరాలు పెరిగిపోవడం కొత్తేమీ కాదు. సిక్కుల డేరాలకు, సూఫీల డేరాలకు షెడ్యూల్డ్‌ కులాల వారి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. డేరాల మీద నమ్మకం ఉన్న వారిని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకులుగా మలచుకుంటాయి. ఈ డేరాలు ఆసుపత్రులు, మత్తు పదార్థాల వినియోగాన్ని మానిపించే కేంద్రాలను ఏర్పాటు చేయడంÑ పాఠశాలలు, సాంకేతిక శిక్షణాకేంద్రాలు, స్థానిక రవాణా వ్యవస్థలను నిర్వహించడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తాయి. వారిలో ఉన్న భక్తి భావాన్ని డేరాల్లాంటివి ఉపయోగించుకుని తాము సమీకరించిన జనాన్ని ఏదో రాజకీయ పార్టీలకు అనువుగా మలుస్తుంటాయి. ప్రవచనాల ద్వారా భక్తులను సమ్మోహపరిచే ఈ బాబాలు అంతిమంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి ఉపకరిస్తారు. వారు ఓటర్లను ప్రభావితం చేయగలరు కనక రాజకీయ నాయకులు బాబాల ప్రాపకం కోసం పాకులాడతారు. నిజానికి ఆధ్యాత్మికకేంద్రాలుగా ఉండవలసిన ఈ ఆశ్రమాలు రాజకీయ నిలయాలుగా ఉంటాయి. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వినియోగించడం కొత్త కాదు కనక భక్తి రాజకీయాలు కలగలిసి అధికార పీఠాలెక్కే వారికి పెద్ద నిచ్చెనలుగా ఉపయోగపడతాయి. ఈ డేరాల అనుయాయుల్లో షెడ్యూల్డ్‌ కులాల వారు ఎక్కువే అయినా వీటి అధిపతులు మాత్రం చాలా వరకు జాట్‌ సిక్కులే అయి ఉంటారు. ఈ డేరాల్లో పని చేసే షెడ్యూల్డ్‌కులాల వారు చేసే పని కిందికులాల వారు చేసే పనులే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img