Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

నైతిక కమిటీ అనైతికత

లోకసభ నైతిక ప్రమాణాల కమిటీ తొమ్మిదవ తేదీన సమావేశమై తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది. అయితే మహువా మొయిత్రా మీద ఆరోపణలు చేసిన నిశికాంత్‌ దుబేను ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండానే బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకుంది. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి లోకసభలో సభ్యత్వం లేకుండా చేయాలన్న మోదీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే నైతిక ప్రమాణాల కమిటీ నిర్ణయం తీసేసుకుంది. ఇంకా విచిత్రమేమిటంటే ఈ నివేదికను లోకసభ స్పీకర్‌కు అందజేయడానికి ముందే అది అదానీ యాజమాన్యంలోని ఎన్‌.డి.టీవీకి అందింది. అయితే మోదీని, అదానీని ప్రశ్నించే వారి మీద కక్ష తీర్చుకోవడమే ప్రధాన అంశంగా తయారైన ఈ దశలో ఇలాంటి మర్యాదలను పట్టించుకోకపోవడంలో ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు. మొయిత్రాపై సీబీఐ దర్యాప్తు చేయాలని లోక్‌పాల్‌ ఆదేశించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే ప్రకటించడం విచిత్రాతి విచిత్రం. మొయిత్రా మీద వచ్చిన ఆరోపణలపై ‘న్యాయపరమైన, లోతైన, వ్యవస్థాపరమైన, నిర్ణీత కాలావధికి లోబడి సీబీఐ విచారణ చేయాలని నైతిక ప్రమాణాల కమిటీ సిఫార్సు చేసింది’ అని చెప్పారు. అంటే అసలు ఆరోపణల మీద విచారణ జరగక ముందే మొయిత్రాను బహిష్కరించాలని సిఫార్సు చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోకసభలో అదానీ వ్యవహారంలో ప్రశ్నలు అడగడానికి మొయిత్రా డబ్బు తీసుకున్నారన్నది అసలు ఆరోపణ. ఈ ఆరోపణల నిగ్గు తేల్చకుండానే బహిష్కరణ ఉత్తర్వు జారీ అయిపోయింది. నైతిక ప్రమాణాల కమిటీ చైర్మన్‌, లోకసభలో బీజేపీ సభ్యుడు వినోద్‌ కుమార్‌ సోంకర్‌ అధ్యక్షతన గల ఈ కమిటీలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటే నిర్ణయం తీసుకున్న రోజున 11 మంది మాత్రమే హాజరయ్యారు. ఆరుగురు సభ్యులు కమిటీ నిర్ణయానికి అనుకూలంగాను, నలుగురు వ్యతిరేకంగానూ ఓటు వేశారు. మొయిత్రా బహిష్కరణకు అనుకూలంగా సస్పెండ్‌ అయిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రణీత్‌ కౌర్‌ ఓటు వేశారు. నలుగురు ప్రతిపక్ష సభ్యులు కమిటీ నిర్ణయంపై లిఖితపూర్వకంగా అసమ్మతి రికార్డు చేశారు. అదానీకి వ్యతిరేకంగా లోకసభలో ప్రశ్నలు అడగడానికి వ్యాపారవేత్త దర్శన్‌ హీరనందానీ నుంచి మొయిత్రా డబ్బు, బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబే, సుప్రీంకోర్టు న్యాయవాది జై అనంద్‌ దేహద్‌ రాయ్‌ ఆరోపించారు. దర్శన్‌ హీరనందానీ వ్యాపారంలో అదానీకి పోటీదారు అన్న వాదన ఉంది. అదానీతో పోలిస్తే హీరనందానీ చాలా చిన్నవ్యాపారి కింద లెక్క. హీరనందానీని ప్రశ్నించే అవకాశం మొయిత్రాకు ఇవ్వలేదు. మొయిత్రాను బహిష్కరించాలని సిఫార్సు చేయడానికి అతి తక్కువ సమయంలో 500 పేజీల నివేదిక అయితే తయారుచేశారు. ఇంత తక్కువ సమయంలో అన్ని పేజీల నివేదిక సిద్ధం అయిందంటే నైతిక కమిటీ విచారణకు ముందే నివేదిక సిద్ధం చేసేపని మొదలై ఉండాలి. మొయిత్రా తన లోకసభ లాగ్‌ ఇన్‌ ఐ.డి., పాస్‌వర్డ్‌ హీరనందానీకి అందించారని, ఇది సభాహక్కుల ఉల్లంఘనే అని ఆరోపించారు. అయితే పార్లమెంటు సభ్యులు ప్రశ్నలు అడగడానికి వివిధ వర్గాల నుంచి సమాచారం అంది ఉండవచ్చు. సాధారణంగా పార్లమెంటు సభ్యులకు తమ పనిలో సహాయపడే సిబ్బందికి ఈ ఐ.డి.లు, పాస్‌వర్డులు తెలియజేస్తూనే ఉంటారు. అందులో విచిత్రం ఏమీలేదు. హీరనందానీ కార్యాలయం ప్రశ్నలు తయారుచేసి మొయిత్రాకు అందిం చేది. ఇందులోనూ పెద్దగా అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. హీరనందానీకి తన లోకసభ ఐ.డి., పాస్‌వర్డ్‌ అందించిన మాట నిజమే నని మొయిత్రా బాహాటంగానే అంగీకరించారు. మొయిత్రా డబ్బు తీసుకుని లోకసభలో ప్రశ్నలు అడిగారన్నది ఆమె మీద ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ అంశాన్ని నైతిక ప్రమాణాల కమిటీ విచారించి నిగ్గు తేల్చనే లేదు. విచారణ జరిపే బాధ్యతను ప్రభుత్వానికి వదిలేసింది. నిబంధనల ప్రకారం కమిటీ అధ్యక్షుడు మొదట లోకసభ స్పీకర్‌కు నివేదిక పంపించాలి. దాన్ని బయటపెట్టాలో లేదో స్పీకర్‌ నిర్ణయిస్తారు. కమిటీ అధ్యక్షుడు ఈ నివేదికను వచ్చే పార్లమెంటు సమావేశాలలో సభలో ప్రతిపాదించాలి. దాని మీద చర్చ జరగాలి. ఇదేమీ జరగకుండానే నైతిక ప్రమాణాల కమిటీ మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసేసి ఆ విషయం స్పీకర్‌కు నివేదించడానికి ముందే అదానీ యాజ మాన్యంలోని టీవీ చానల్‌కు ఉప్పందించింది. ఇది అక్రమం. అన్యాయం. నిబంధనలకు వ్యతిరేకం. మరీ చెప్పాలంటే సభా హక్కుల ఉల్లంఘనే. సభలో చర్చ జరిగిన తరవాత సదరు వ్యక్తిని బహిష్కరించాలని సభ తీర్మానించాలి. అప్పుడు గానీ బహిష్కరణ సాధ్యం కాదు. కానీ బీజేపీ ఎంపీ అధ్యక్షతన ఉన్న కమిటీ ఈ ప్రక్రియను ఏ మాత్రం పాటించకుండా తమ సిఫార్సును బట్టబయలుచేసి మొయిత్రాను ఇరకాటంలో పెట్టడమే కాక ఆమెను అపఖ్యాతి పాలు చేయడానికి చేయాల్సిందంతా చేసింది. మోదీని ప్రశ్నించే వారిని, ఆయన మిత్రుడు అదానీ పాల్పడే అవకతవకలను లేవనెత్తే వారిని సభలో లేకుండా చేయడానికి మోదీ ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుందని రాహుల్‌ గాంధీ లోకసభ సభ్యతం ఆఘమేఘాల మీద రద్దు చేసినప్పుడే రుజువైంది. ఆ తరవాత సుప్రీంకోర్టు రాహుల్‌ సభ్యత్వ రద్దును తిరగతోడిరది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయి సభ్యత్వం రద్దు అయితే మొయిత్రా కోర్టుకు వెళ్లే అవకాశం ఎటూ ఉంటుంది.
నిష్పక్షపాతంగా ఆ కమిటీ వ్యవహరిస్తే ఆమె మీద ఫిర్యాదు చేసిన వారిని విచారించడానికి ముందే మొయిత్రాను పిలిచి మాట్లాడాలి. అదీ జరగలేదు. కానీ ఫిర్యాదు చేసిన వారిని ముందు పిలిచి మాట్లాడడం నిబంధనలకు విరుద్ధం అని అనేకమంది ఎంపీలు భావిస్తున్నారు. మొయిత్రాను విచారించినప్పుడు సైతం నైతిక కమిటీ సభ్యులు అప్రస్తుత, అవమానకరమైన ప్రశ్నలు అడగడం మరో వైపరీత్యం. ఫిర్యాదుదారును ఆరోపణలకు గురైన వ్యక్తి కన్నా ముందు పిలవడాన్ని కమిటీ సభ్యుల్లో కొందరు అభ్యంతరం పెట్టారు. సభా హక్కుల ఉల్లంఘన కమిటీ విచారణ జరిపే సందర్భాల్లోనూ ఆరోపణలకు గురైన వారిని ముందు విచారిస్తారు. మొయిత్రా విషయంలో మాత్రం మొదటి సమావేశం సమయంలోనే ఫిర్యాదు దారులైన నిశికాంత్‌ దుబేను, న్యాయవాది జై అనంత్‌ దేహాద్‌ రాయ్‌ని పిలిచి మాట్లాడారు. నైతిక కమిటీ అధ్యక్షుడు విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలు, మాట్లాడిన మాటలు ముందే రాసి ఉన్న కాగితాలలోంచే చదివారు. అంటే విచారణ ఫలితం ఎలా ఉన్నా మొయిత్రాను శిక్షించాలన్న సంకల్పం ముందే ఉందనుకోవాలి. నైతిక కమిటీ విచారణ ఇంత అనైతికంగా సాగడం వింతే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img