Thursday, February 2, 2023
Thursday, February 2, 2023

న్యాయం మిగిలే ఉంది!

సుప్రీంకోర్టు పుణ్యమా అని ఉత్తరాఖండ్‌లో 50,000 మందికి ఊరట కలిగింది. హల్ద్వానీలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 4,000 కుటుంబాలకు చెందిన 50,000 మందిని అక్కడి నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వు అమలును సుప్రీంకోర్టు గురువారం నిలిపివేసింది. రాత్రికి రాత్రి ఇన్ని వేలమందిని నిరాశ్రయులను చేయడం కుదరదు. ఇది మానవీయ సమస్య. దీనికి ఆచరణ యోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వు అమలును నిలిపివేయాలని సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్ర చూడ్‌, న్యాయమూర్తులు ఎస్‌.ఎ.నజీర్‌, పి.ఎస్‌.నరసింహతో కూడిన బెంచి ఈ ఉత్తర్వులు జారీచేసింది. దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వారిని ఒక్క ఉదుటున సాయుధ పోలీసు బలగాలను నియోగించి బలవంతంగా ఎలా ఖాళీ చేయిస్తారని కూడా న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ కేసును మళ్లీ వచ్చే నెల సుప్రీంకోర్టు విచారించవలసి ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల మాట ఎలాఉన్నా ఎముకలు కొరికే చలి ఉన్నప్పుడు ఒక్క సారి నిరాశ్రయులను చేయడం మానవత్వం ఉన్న వారు ఎవరూ సహించలేరు. ఈ భూమి తమదని రైల్వేశాఖ అంటోంది. అక్కడ ఉంటున్న వారందరూ పేదలే. అందులో ముస్లింలే ఎక్కువ. హల్ద్వానీ రైల్వే స్టేషన్‌ పక్కన గఫూర్‌ బస్తీ, ఢోలక్‌ బస్తీ, ఇందిరా నగర్‌ ప్రాంతాలలో దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున ఈ పేదలు ఉంటున్నారు. తమను గూడులేని వారిని చేయకూడదని ఆ పేదలు కొవ్వొత్తుల ప్రదర్శన, బైఠాయింపులు, ప్రార్థనలు కొనసాగిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే అక్కడ ఇళ్లున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 11 ప్రైవేటు పాఠశాలలు, ఒక బ్యాంకు, రెండు నీటి ట్యాంకులు, పది మసీదులు, నాలుగు గుళ్లు, అనేక దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్క రోజులో వెలిసినవి కావని బధిరాంధులకు కూడా అర్థం అవుతుంది. ఇవన్నీ కొన్ని దశాబ్దాలుగా నిర్మితమైనవే. ఆ పరిసరాల్లో అక్రమంగా నదిలోంచి ఇసుక తవ్వేస్తున్నారని 2013లో కోర్టులో కేసు దాఖలైంది.
హైకోర్టు వీరందరినీ ఖాళీ చేయించమని ఉత్తర్వు జారీచేసిన తరవాత గత డిసెంబర్‌ 20న ప్రభుత్వ విభాగం అక్కడినుంచి ఖాళీచేసి వెళ్లిపోవాలని నోటీసు జారీ చేసింది. వచ్చే తొమ్మిదవ తేదీలోగా డబ్బా డవాలు సర్దుకుని ఖాళీ చేయాలని ఆ నోటీసు సారాంశం. దీనితో అక్కడ నివాసం ఉంటున్నవారు ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పిల్లలు, గర్భిణులు, వయసుపై బడ్డవారు మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోక తప్పని పరిస్థితి ఎదురైంది. సుప్రీంకోర్టు ఆదేశం తాత్కాలికంగానైనా వారికి ఉపశమనం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు ఉత్తర్వును గౌరవిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ అంటున్నారు. విచిత్రం ఏమిటంటే వీరిని ఏడురోజుల్లోగా ఖాళీ చేయించాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఫర్మానా జారీచేసింది. ఈ సమస్యకు ఆచరణ సాధ్యమైన పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇక్కడ నివాసం ఉంటున్న వారు జిల్లా కోర్టుల్లో దాదాపు వెయ్యి అర్జీలు పెట్టుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారికి ఆ భూమిని లీజుకు తీసు కున్నారు. కొందరు ప్రభుత్వం వేలంవేస్తే కొనుక్కున్నారు. ఒక వేళ ఇది రైల్వేలకు చెందిన భూమే అనుకున్నా అక్కడ 50 ఏళ్లకు పైగా కాపురం ఉంటున్నవారు ఉన్నారుగా, అలాంటప్పుడు వారికి పునరా వాసం ఏర్పాటు చేయాలిగా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నిలదీశారు. ఇది మానవీయ సమస్య అని ఆయన గుర్తు చేశారు.
నిర్వాసితులు కాబోయే వారి వాదన వినకుండానే ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఖాళీ చేయించమని ఆదేశించడాన్ని మరో న్యాయమూర్తి ఓకా తప్పు పట్టారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో ఇంతకు ముందు కూడా కోర్టు వారిని ఖాళీ చేయించమని ఆదేశించడం మరో వైపరీత్యం. నివాసితులను ఇప్పుడు ఆక్రమణదార్లు అంటున్నారు. ఇది నిజానికి వ్యవసాయేతర భూమి. అది ప్రభుత్వ భూమి. దీనిని ప్రభుత్వం లీజుకు ఇవ్వొచ్చు. అన్నింటికీ మించి ఇది తమ భూమి అని వాదిస్తున్న రైల్వేశాఖ దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ చూపలేదు. రాష్ట్రంలో వచ్చిన సంస్కరణలను, నిర్మాణాలను క్రమబద్ధం చేయడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను పట్టించు కోకుండా హైకోర్టు ఖాళీ చేయించమని ఆదేశించిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
చాలా మంది దగ్గర చట్టబద్ధమైన ఆక్రమణ దార్లన్న పత్రాలు కూడా ఉన్నాయి. ఈశాన్య రైల్వేశాఖ ఒకసారి 78 ఎకరాలు తమదేనని, దాన్ని ఆక్రమించారని, మరోసారి 29 ఎకరాలు ఆక్రమించారని అంటోంది. ఈ ఆక్రమణ వివాదం 2007లోనే బయటకు వచ్చింది. తమకు చెందిన 29 ఎకరాలలో 10 ఎకరాలలో ఖాళీ చేయించామని ఈశాన్య రైల్వే ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు తెలియజేసింది. ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయించమని ఆదేశించాలని అభ్యర్థించింది. ఆ తర్వాత చాలాకాలం ఈ విషయంలో ఏ కదలికా లేదు.
హైకోర్టు ఉత్తర్వుతో ఇప్పుడు మళ్లీ అలజడి మొదలైంది. గతంలో అక్కడి నిర్వాసితులను ఖాళీ చేయించాలని కోర్టు ఆదేశించినప్పుడు రైల్వేభూమి ఇది అని కచ్చితంగా చెప్పే అవకాశంలేదని ప్రభుత్వం చెప్పింది. పైగా కొంతమంది చట్టబద్ధంగానే అక్కడ భూమి కొన్నారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని వాదించడం ఈ కథలో మరో మలుపు. 2017లో కూడా హైకోర్టు అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశించింది. అప్పుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2014లో ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైనప్పుడూ అక్కడి నిర్వాసితులు ఆక్రమణదార్లని అననేలేదు. ఈ ప్రాంతంలో 1947 స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచే ఉన్న కట్టడాలు కూడా ఉన్నాయి. మధ్యలో ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక ఎస్టేట్‌ అధికారిని నియమించారు. ఆయన ఏ ఆధారం చూపకుండానే ఇది ఈశాన్య రైల్వే స్థలం అని తేల్చేశారు. మరీ విచిత్రం ఏమిటంటే ముందు 29 ఎకరాలలో ఆక్రమణదార్లు అన్నప్పటికీ ఇప్పుడు 78 ఎకరాలలో ఆక్రమణదార్లు ఉన్నారంటున్నారు. వివిధ స్థాయిల్లోని కోర్టుల్లో ఈ సమస్య పరిష్కారం కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ సుప్రీంకోర్టు మానవీయ దృక్పథంతో పేదలను ఆదుకున్నందుకు అభినందించాల్సిందే. న్యాయం ఇంకా మిగిలే ఉందనుకోవాలి. ఆక్రమణదార్లు అంటున్న ఈ ప్రాంతంలో ఇంత వరకు బీజేపీ ఒక్క సారి కూడా గెలవకపోవడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img