Monday, January 30, 2023
Monday, January 30, 2023

న్యాయవ్యవస్థతో రిజిజు కయ్యం

న్యాయవ్యవస్థతో కయ్యం పెట్టుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అసలు కోర్టులకు సెలవులు ఎందుకు అంటున్నారు. కోర్టుల్లో కోట్ల సంఖ్యలో కేసులు పేరుకుపోయి, ప్రజలు న్యాయం కోసం పడిగాపులు పడుతున్న స్థితిలో కోర్టులకు సెలవులు ఎందుకు అన్నది న్యాయశాఖ మంత్రి వాదన. మరో వేపు శీతాకాలం సెలవుల సమయంలో ప్రత్యేక బెంచీలు ఏమీ ఉండవని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ స్పష్టంగానే చెప్పారు. పరస్పర విరుద్ధమైన ఈ రెండు వాదనలలో తాలేది, మేలేది అని నిర్ధారించుకోవాలంటే అసలు కోర్టులకు, ఆ మాటకొస్తే న్యాయమూర్తులకు సెలవుల అవసరం ఏమిటో, ఇతర దేశాలలో పరిస్థితి ఏమిటో తరచి చూడవలసిందే. గత ఆగస్టు రెండవ తేదీనాటికి కేవలం సుప్రీంకోర్టులోనే తెమలని కేసులు 71,411 ఉంటే దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు 59 లక్షలు ఉన్నాయి. ఇలా కేసులు తెమలకుండా ఉండడానికి పూర్తి బాధ్యత న్యాయస్థానాలదేనా, మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే బోలెడు విశేషాలు బయటపడ్తాయి. న్యాయ స్థానాలకు సాధారణంగా వేసవిలోనూ, శీతాకాలంలోనూ సెలవులు ఉంటాయి. ఆ రోజుల్లో కూడా కోర్టులు పనిచేస్తే గుట్టల్లా పేరుకుపోయిన కేసులు కొన్నైనా తగ్గుతాయిగదా అన్న సూచనలో తప్పులేదు. కానీ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనూ ఏ కార్యాలయానికి అయినా, వ్యవస్థకైనా కొన్ని సెలవులు ఉంటాయి. అలాంటప్పుడు కోర్టులు మాత్రమే ఏడాది పొడవునా పని చేయాలనడం సబబేనా అన్న ప్రశ్న రాక మానదు. కోర్టులకు సెలవులు ఉన్నప్పుడు అత్యవసరమైన కేసులు విచారించడానికి కొందరు జడ్జీలు మాత్రం అందుబాటులో ఉంటారు. వివిధ దేశాల్లో కోర్టుల పనితీరులోనూ తేడాలున్నాయి. మన సుప్రీంకోర్టులాగే బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు వారమంతా వాదోపవాదాలు వింటుంది. కానీ ఆస్ట్రేలియా, సింగపూర్‌, అమెరికాలో నిర్దిష్టమైన రోజుల్లో మాత్రమే న్యాయమూర్తులు వాదోపవాదాలు వింటారు. ఆస్ట్రేలియా హైకోర్టులో నెలకు రెండు వారాలు మాత్రమే వాదోపవాదాలు సాగుతాయి. అమెరికాలో అయితే నెలకు అయిదారు రోజులు మాత్రమే వాదనలు వింటారు. సింగపూర్‌ సుప్రీంకోర్టయితే ఏడాదిలో 145 రోజులు మాత్రమే పని చేస్తుంది. అన్ని దేశాలలోనూ న్యాయస్థానాలు ఏడాదిలో సగటున 200 రోజులే పని చేస్తాయి. వారాంతపు సెలవులు, ఇతర సెలవులు, జాతీయ సెలవు దినాలు కలిపితే ఏడాదిలో 160 రోజులపాటు కోర్టులు మూసేసే ఉంటాయి. ఉన్నత న్యాయస్థానాల్లో సెలవులు తగ్గించినా జడ్జీల పదవులు ఉండవలసినంతగా లేకపోవడంవల్ల కేసులు పేరుకుపోతూనే ఉంటాయి. న్యాయమూర్తుల పదవులు భర్తీ కాకపోవడానికి కేంద్ర ప్రభు త్వానిదే బాధ్యత. న్యాయస్థానాలకు సెలవులు ఉండకూడదన్న వాదనను మొట్ట మొదట వ్యతిరేకిస్తున్నది న్యాయవాదులే. సుప్రీంకోర్టు సంవత్స రానికి 365 రోజులు పనిచేస్తే మేలని ఆర్‌.ఎం.లోధా ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్నప్పుడు ప్రతిపాదించారు. కాని న్యాయవాదుల సంఘాలు ఒప్పలేదు. సాధారణంగా కోర్టులు శనివారం పూర్తి స్థాయిలో పని చేయవు. కావాలంటే శనివారాలు కూడా కోర్టులు పని చేసే విధానం ప్రవేశపెట్టొచ్చునని భారత న్యాయవాదుల సంఘం, రాష్ట్రాల న్యాయ వాదుల సంఘాలు సూచించాయి. న్యాయమూర్తుల పని గంటలు పెంచాలన్న సూచనా వచ్చింది. న్యాయమూర్తుల స్థానాలను భర్తీ చేయాలన్న సూచన ఎప్పుడూ ఉండనే ఉంది. అసలు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదనా ఉంది. పేరుకుపోతున్న కేసులను తెమల్చడానికి శనివారాలు కూడా పని చేయడానికి కొన్ని హైకోర్టులు చొరవ చూపాయి. క్రిమినల్‌ కేసులను, జైలు శిక్ష విధించిన సందర్భాలలో దాఖలయ్యే అప్పీళ్లను విచారించడానికి శనివారం కూడా పనిచేయాలని దీపక్‌మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సూచించారు. కక్ష్షిదారుల సదుపాయంకోసం ఆ పని జరుగుతోంది కూడా. న్యాయమూర్తులూ మనుషులే కనక వారికీ సెలవులు అవసర మని ప్రస్తుతం పని చేస్తున్న న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు కూడా అభిప్రాయపడ్తున్నారు. కేసులను పరిష్కరించే విషయంలో న్యాయ మూర్తులు తమకుఉన్న సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకో వాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ సూచించారు. నిజానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విపరీతంగా పనిచేయవలసి వస్తుంది. వారు ప్రతిరోజూ సగటున 70కేసులు విచారించవలసి ఉం టుంది. న్యాయమూర్తులు అయిదేళ్ల పనిని ఒక ఏడాదిలోనే చేస్తున్నారని గౌడ అంటున్నారు. రోజూ కనీసం 70 నుంచి 80 అంశాలను పరిశీలించవలసి ఉంటుంది. ఆ కేసులను ఆకళింపు చేసుకోవడం సులభమేమీ కాదు. కోర్టు పనిచేసే రోజుల్లో న్యాయమూర్తులకు అసలు తీరికే చిక్కదు. కేసులు వినని సమయం లోనూ న్యాయమూర్తులు ఖాళీగా కూర్చోరు. ఈ సమయంలోనే తీర్పులు రాయవలసి వస్తుంది. తీర్పులు రాయడం ఆషామాషీ వ్యవహా రమేం కాదు. కొన్ని సందర్భాలలో చాలా ఎక్కువ సమయం పట్టొచ్చు. న్యాయవాదులు అర్జీ దాఖలుచేసి ఒక్కో కేసులో నాలుగేసి నెలలు వాదిస్తారు. ఆ వాదనలన్నింటినీ క్రోడీకరించ డానికి న్యాయమూర్తులు కంప్యూటర్లు కాదు కదా అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. తీర్పులు రాయడానికి ఆలోచన, కొన్నిసార్లు సంప్రదింపులు అవసరం అవుతాయి. అందుకే విచారణ పూర్తి అయినప్పటికీ కొన్నిసార్లు తీర్పు చెప్పడం వాయిదా వేయక తప్పదు. ఒక న్యాయమూర్తి రోజూ 70 నుంచి 90 కేసులు పరిశీలించవలసినప్పుడు చెప్పే తీర్పులు ప్రజా జీవనాన్ని ప్రభావితం చేస్తాయి కనక హడావుడిగా తీర్పులు రాసేయడం కుదరదు అంటారు న్యాయమూర్తి దీపక్‌ మహేశ్వరి. చేసేపనికి న్యాయం చేయడా నికి సెలవుల్లోనూ న్యాయమూర్తులకు చేతినిండా పని ఉంటుంది. సెల వులు కేవలం ప్రతీకాత్మకమైనవే. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా న్యాయమూర్తులు పనిచేసినా పేరుకుపోతున్న కేసులసంఖ్య గణనీయంగా తగ్గే అవకాశమూ లేదు. ఎందుకంటే అనునిత్యం కొత్త కేసులు దాఖలు అవుతూనే ఉంటాయి. ప్రతి ఏడాదీ కోర్టులకు సెలవులు ప్రకటించడం రద్దు చేసినా తెమలని కేసులు తగ్గే అవకాశం తక్కువ. కీలకం అంతా న్యాయమూర్తుల స్థానాలు భర్తీ చేయకపోవడంలోనే ఉంది. కోర్టుల సెలవులు తగ్గించాలని నాలుగేళ్ల కింద సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యమూ దాఖలైంది. కేసులు పేరుకుపోవడానికి న్యాయ మూర్తుల కొరత ప్రధానమైందే కావచ్చు కానీ ఇంకా అనేక కారణాలు న్నాయి. పదే పదే విచారణ వాయిదా వేయాలని కోరడం లేదా వాయిదా వేయక తప్పని పరిస్థితి ఉండడం, సాక్షులు సమయానికి అందుబాటులో లేకపోవడంవంటి అనేక కారణాలుంటాయి. కేసులు పేరుకుపోతున్న సమస్యను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తనదైన కోణంలోంచి చూస్తున్నారు. న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండడంలో, నియా మకాల్లో ప్రభుత్వం చేయగలిగింది తక్కువ అని ఆయన వాదిస్తున్నారు. ఈ వాదనకు ప్రధాన కారణం మోదీ ప్రభుత్వానికి కొలీజియం వ్యవస్థ మింగుడు పడక పోవడమే. న్యాయమూర్తుల నియామకానికి ఎలాగైనా సరే నూతన విధానాన్ని అమలు చేసి కొలీజియం వ్యవస్థకు గండికొట్టాలన్న ఆలోచనలో మోదీ సర్కారు ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img