Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

న్యాయస్థానాలకు పాలకుల
హెచ్చరికలు ప్రమాదకరం

బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలో నరేంద్రమోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలన్నీ క్రమంగా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నాయి. న్యాయవ్యవస్థ అప్పుడప్పుడు తన ప్రాధాన్యతను ప్రభుత్వానికి గర్తుచేస్తూ హెచ్చ రిస్తోంది. ఎన్నికలకమిషన్‌, రిజర్వుబ్యాంకు ప్రభుత్వానికి అనుకూలం గానే పనిచేస్తున్నాయి. నిఘా, దర్యాప్తు సంస్థలు పాలకపార్టీ ప్రత్యర్థులపై దాడులుచేసి ప్రభుత్వం ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి, ప్రతిపక్ష నాయకులను అప్రతిష్టపాలు చేయడానికి ఉపయోగ పడుతున్నాయి. మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసి క్రమంగా తాము చెప్పినట్లు నడుచుకోవలసిందేనని ప్రత్యక్షంగా హెచ్చరించే దశకు చేరింది. కేంద్ర న్యాయశాఖమంత్రి కిరణ్‌రిజిజు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం పనివిధానాన్ని విమర్శిస్తూ, న్యాయవ్యవస్థను బహిరంగంగా కించపరిచే ప్రయత్నం చేశారు. కార్యవర్గ వ్యవస్థ అయిన ప్రభుత్వ వ్యవహారాల్లోకి జడ్జీలు, న్యాయవిభాగం చొరబడుతున్నా యంటూ ఆరోపించారు. తాము చెప్పినట్లు అత్యున్నత న్యాయస్థానం వినవలసిందేనని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దాదాపు రెండు వారాలకుపైగా న్యాయమూర్తులు, న్యాయస్థానాలపైన మంత్రి అప్పు డప్పుడూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సర్వం తామై నడిపిస్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాల అంగీకారంలేకుండా మంత్రులు ఇలా ఉన్నత న్యాయస్థానాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తారని చెప్తే నమ్మడం కష్టం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత న్యాయశాఖమంత్రి న్యాయస్థానాలపైన విరుచుకుపడటం గతంలో ఏనాడూ జరగలేదు. బాబ్రి మసీదు కూల్చివేత, కశ్మీరు స్వయంప్రతిపత్తిని కల్పించిన 370 అధికరణను రద్దుచేసిన ఆ రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయడంలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తి సహకారం ఉందని ప్రభుత్వం సంతోషించింది. పైగా ప్రధాన న్యాయమూర్తికి రాజ్యసభ సభ్యత్వం కల్పించి న్యాయం చేసింది. అయితే అందరు న్యాయమూర్తులు ఒకేవిధంగా ఉండరు. కొందరు ప్రభుత్వం చేసే తప్పులను గమనించి సరిదిద్దే ప్రయత్నం చేస్తారు.
తాజాగా జైలులోఉండి హౌస్‌అరెస్టుకు అనుమతించాలని కోరిన జర్నలిస్టు, సామాజికకార్యకర్త గౌతం నవలఖాను జైలులో కొనసాగించాలని కోరిన ఎస్‌ఐఏని న్యాయమూర్తులు తీవ్రంగా మందలించడం ద్వారా పాలనావ్యవస్థకు న్యాయవ్యవస్థ అంటే ఏమిటో స్పష్టం చేశారు. 70 ఏళ్లపైబడిన వృద్ధుడు నవలఖా తనను విడుదల చేయమని కోరలేదు. అయినప్పటికీ ఆయన దేశభద్రతకు ప్రమాదకారి అని ఎన్‌ఐఏ ఆరోపించడం విన్న న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్‌, హృషికేశ్‌లు తగిన విధంగా స్పందించారు. దేశానికి ప్రమాదకారులెవరో పరోక్షంగా మితవాద కార్యకర్తలే అని స్పష్టం చేశారు. అవినీతిపరులైన అధికారులు, ఎన్నికల కోసం కోట్లు వసూలు చేస్తున్నవారు దేశభద్రతకు ప్రమాదకారులని న్యాయ మూర్తులు వ్యాఖ్యానించారు.
అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను గుప్పిట పెట్టుకొని, రాష్ట్రాల హక్కులు హరిస్తూ సమాజంలో విద్వేషాన్ని విరజిమ్ముతున్న మతోన్మాదుల దుర్మార్గాలను గురించి అందరికీ తెలుసు. రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై ఏదో ఒక కేసు బనాయించి వారు మావోయిస్టులు, అర్బన్‌ నక్సల్స్‌ అని ముద్రవేసి దీర్ఘకాలం విచారణ లేకుండా జైళ్లలోనే నిర్బంధించడం ఈనాటి పాలకులకు నిత్యకృత్యమైంది. న్యాయశాఖమంత్రి గతంలోనూ ఇదే ధోరణితో మాట్లాడారు. సుప్రీంకోర్టు కొలీజియం 11మందిని న్యాయమూర్తులుగా నియామకానికి ఎంపికచేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసుచేసి దీర్ఘకాలం గడిచినప్పటికీ ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు. బహుశా తమకు అనుకూలంగా పనిచేసే న్యాయమూర్తులను కొలీజియం ఎంపికచేయలేదని ప్రభుత్వం భావించే అవకాశం లేకపోలేదు. ఇది ఎంత మాత్రం సమ్మతమైందికాదని న్యాయమూర్తులు కౌల్‌, ఓక వ్యాఖ్యానించారు. దీనిపైనే న్యాయమంత్రి రిజిజు ప్రభుత్వం చెప్పింది వినాల్సిందేనని వాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిఫారసు చేసిన జాబితాపై స్పందించాలని కోరడంలో ఔచిత్యం ఉంది. న్యాయమూర్తుల నియామకం పారదర్శకంగా ఉండాలని మంత్రి రిజిజు వాదనపైన బీజేపీ నాయకుడు న్యాయశాఖ మాజీ మంత్రి, న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి తీవ్రంగా స్పందించారు. కొలీజియం పారదర్శకంగా లేదంటున్నారు. మోదీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ పారదర్శకతలేనిదని స్వామి వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ రాజ్యాంగ సూత్రాలకులోబడి పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తే అది దాని రాజకీయ ఆధిపత్యానికి ముప్పుగా పరిణమిస్తుంది అని కూడా స్వామి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రాజ్యాంగ అసెంబ్లీలో మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలను ముందే ఊహించి ఆనాడే తీవ్రంగా హెచ్చరించారు. పరిపాలన ఒకరిద్దరి చేతిలోఉంటే అది క్రమంగా నియంతృత్వ పాలనకు దారితీస్తుందని అంబేద్కర్‌ స్పష్టంగా చెప్పారు. దేశంలో మతోన్మాదం హెచ్చరిల్లినప్పుడు మతాలు, కులాల మధ్య చీలికలు వచ్చి అంతిమంగా విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉంటుందని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ ప్రభుత్వ అధీనంలో పనిచేయాలని నరేంద్రమోదీ కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తే ప్రభుత్వం నుంచి ప్రమాదం పొంచి ఉంటుందన్న అంశం న్యాయమంత్రి హెచ్చరికల్లో దాగిఉంది. న్యాయమంత్రి ఇంత బహిరంగంగా తమ వద్ద అంకుశం ఉందని బెదిరించడం న్యాయవ్యవస్థ ప్రభుత్వ చరిత్రలో గతంలో ఏనాడూలేదు. లక్ష్మణరేఖ దాటవద్దని కూడా రిజిజు బెదిరించారు. ఇది దేశ ప్రజలకు విభ్రాంతి గొలిపే విషయం. మంత్రులు చేసే ఇలాంటి హెచ్చరికలు అంతిమంగా దేశ స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. మతోన్మాదులు సర్వవ్యవస్థలను ఆక్రమించుకుంటూ రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికి, బహుళత్వ సమాజానికి ప్రమాదఘంటికలను మోగిస్తున్నట్లు రోజురోజుకీ తేటతెల్లమవుతోంది. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మనుగడను కోరుకునే ప్రజాస్వామిక శక్తులన్నీ అప్రమత్తం కావలసిన తరుణమిది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img